ap7am logo

ఈ ఒక్కటి ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీసినట్టే!

Mon, Dec 19, 2016, 04:22 PM
Related Image

మలబద్ధకం... వైద్య పరిభాషలో కాన్ స్టిపేషన్ గా పేర్కొనే ఈ సమస్య ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. తినే ఆహారం, జీవన విధానం సరిగా లేకపోవడం, కొన్ని రకాల మందులు ఇలా ఎన్నో కారణాలు కాన్ స్టిపేషన్ కు దారితీస్తాయి. దీన్ని అదుపు చేసి నియంత్రణలో పెట్టుకోవడంలో విఫలమైతే జీవితాంతం వేదన తప్పదు.

కాన్ స్టిపేషన్ ఆరోగ్యానికి ప్రమాదకరం. కొలరెక్టల్ (పెద్దపేగు, పురీష నాళం) సమస్యలకు దారి తీస్తుంది. పైల్స్ తో మొదలై కొలరెక్టల్ కేన్సర్ గా మారి ప్రాణాంతకం అవుతుంది. పెద్ద పేగు నిర్ణీత బరువు మేర వ్యర్థ పదార్థాలను (మలం) మోసే శక్తిని కలిగి ఉంటుంది. మలబద్దకం బారిన పడిన వారిలో మలం (స్టూల్) విసర్జన సాఫీగా జరగకపోవడంతో ఎక్కువ మలం పెద్ద పేగులో ఉండిపోతుంది. స్టూల్ సైజు కూడా పెద్దగా ఉండడం వల్ల పెద్ద పేగు సాగుతుంది. దీంతో మలాశయం పొర ఇరిటేట్ అవుతుంది. ఫలితంగా మలవిసర్జన ద్వారానికి ముప్పు ఏర్పడుతుంది.

పేగులో ఉండే సహజ బ్యాక్టీరియా చనిపోవడం వల్ల కూడా కాన్ స్టిపేషన్ సమస్య రావచ్చు. నిజానికి ఈ సహజ బ్యాక్టీరియా చాలా కీలక చర్యలకు తన సహకారం అందిస్తుంటుంది. ముఖ్యంగా పెద్దపేగు వాపునకు గురికాకుండా కాపాడుతుంటుంది. వ్యాధి నిరోధక వ్యసస్థను అదుపులో ఉంచుతుంది. మలాన్ని తేమతో, మెత్తగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చర్యలన్నీ మలబద్దకం కారణంగా నిలిచిపోతాయి. ఫలితంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

representation image

స్త్రీలలో మరింత సమస్య

మలబద్దకం స్త్రీలలో మూత్రాశయ, జననేంద్రియ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే పెద్ద పేగు, పునరుత్పాదక అవయవం పక్కపక్కనే ఉంటాయి. మలబద్దకం వల్ల గర్భాశయంపై ఒత్తిడి పెరిగిపోతుంది. మానసిక చిరాకు, ఒత్తిడికి దారి తీస్తుంది. మలబద్దకం ఎక్కువకాలం పాటు కొనసాగితే గుండె రక్తనాళములు, ఎండోక్రైన్, రోగ నిరోధక వ్యవస్థలపై ప్రభావం పడుతుంది. అందుకే మలబద్దకం విషయంలో నిర్లక్ష్యం ఏ మాత్రం పనికిరాదు. ఈ సమస్యను లేకుండా చూసుకోవడం సాధ్యమే. ఇందుకు ఎన్నోరకాల మందులు అందుబాటులో ఉన్నాయి.

దీర్ఘకాల కాన్ స్టిపేషన్ సమస్య జీవన విధానానికి సంబంధించినది. తలనొప్పికి పెయిన్ రిలీవర్ టాబ్లెట్ వేసుకున్నట్టో, కడుపులో మంటకు యాంటాసిడ్ వేసుకున్నట్టు మలబద్దకం ఓ టాబ్లెట్  తో తగ్గిపోయేది కాదు. ఈ సమస్య నుంచి బయట పడడానికి ఆహార పరంగా, జీవన విధానం పరంగా మార్పులు అవసరం. రోజువారీ బవెల్ మూవ్ మెంట్ కు విఘాతం కలిగితే సైకలాజికల్ కాన్ స్టిపేషన్ కు దారి తీస్తుంది. పెరిగిపోయిన ఒత్తిడి, దూర ప్రయాణాలు, రాత్రి డ్యూటీలు వంటి పనులతో మలబద్దకం సమస్యకు దారితీస్తాయి. అందుకే అసలు ఈ సమస్య వెనుకనున్న కారణాన్ని కనుక్కోవాలి. 

ఇదీ అసలు ప్రక్రియ

గొంతు భాగం నుంచి మలవిసర్జన ద్వారం వరకూ ఒకటే ట్యూబ్ ఉంటుంది. ఇదే జీర్ణకోశము. తీసుకున్న ఆహారం ఈ ట్యూబులోంచి ప్రయాణం సాగిస్తుంది. ఇందులో జీర్ణకోశ రసాలు, బ్యాక్టీరియా ఉంటాయి. నోటి నుంచి ప్రారంభమైన జీర్ణప్రక్రియ జీర్ణ వ్యవస్థలో జీర్ణరసాలు, బ్యాక్టీరియా సాయంతో జీర్ణమై అందులోని శక్తి, పోషకాలను గ్రహించిన తర్వాత వ్యర్థ భాగం పెద్ద పేగులోకి చేరుతుంది. దీని తర్వాత పురీష నాళం నుంచి మలవిసర్జన జరుగుతుంది.

పేగులో బ్యాక్టీరియా ఎంత మేర ఉంది, ఏ విధమైన బ్యాక్టీరియా ఉందన్న అంశం మలబద్ధకాన్ని నిర్ణయిస్తుంది. ఈ బ్యాక్టీరియా తిన్న ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అలాగే కేలరీల వినియోగం, అలెర్జీ సమస్య పెరగడం, తరగడం, స్థూలకాయం ఇతర అంశాలు బ్యాక్టీరియాపై ఆధారపడి ఉంటాయి. పెద్ద పేగు మెదడు నుంచి వచ్చే ఒత్తిడి చర్యలకు స్పందిస్తుందని, అలాగే పేగు నుంచి వచ్చే సంకేతాలకు మెదడు సైతం స్పందించి బాధతో కూడిన స్పందనలు కలిగిస్తుందని పరిశోధనల్లో తేలింది.  అంటే పేగు ఆరోగ్యమే శరీరంలోని ఇతర అవయవాల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని తెలుస్తోంది. 

ఎవరికి.. ఎందుకు...?

హైపో థైరాయిడిజం (థైరాయిడ్ హార్మోన్ లోపం) కూడా మలబద్దకానికి  కారణమవుతుంది. ఒత్తిడి తగ్గేందుకు వాడే యాంటీ డిప్రసెంట్ మందులు, యాంటాసిడ్స్, బీపీ మందులు, ఐరన్ సప్లిమెంట్లు, ఇబూప్రోఫెన్, యాస్పిరిన్ మందుల వల్ల కూడా మలబద్ధకం సమస్య ఏర్పడవచ్చు. శరీరానికి తగినంత నీరు అందకపోయినా డీహైడ్రేషన్ పరిస్థితి వల్ల మలవిసర్జన సాఫీగా జరగదు. ట్యూమర్లు, ఇన్ ఫ్లమ్మేషన్, ఆనల్ ఫిషర్, పార్కిన్ సన్స్ వ్యాధి, వెన్నుపూసకు గాయాలు, మెదడుకు గాయాలు, స్ట్రోక్, మల్టిపుల్ స్కెలెరోసిస్, హార్మోన్ సమస్యలు, మధుమేహం వంటి సమస్యల్లోనూ ఇది ఎదురుకావచ్చు. 

గర్భిణుల్లోనూ ఈ సమస్య ఎదురు కావచ్చు. ఎందుకంటే లోపల ఎదుగుతున్న బేబీ బరువు పేగుపై పడడం వల్ల మూమెంట్ తగ్గుతుంది. వృద్ధుల్లో శరీరంలో చురుకుదనం తగ్గడం, జీర్ణక్రియల వేగం మందగించడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. వీటన్నింటి కంటే కూడా ప్రధానంగా మలబద్ధక సమస్య ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. పీచు (ఫైబర్) తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల సమస్యకు దారితీస్తుంది. ప్రాసెస్డ్ ఫుడ్ ఇటువంటిదే. అమెరికాలో 15 శాతం ప్రజానీకం కాన్ స్టిపేషన్ తో బాధపడుతున్నారు.   representation image

మల బద్ధకానికి.. శారీరక ఆరోగ్యానికీ లింక్

దీర్ఘకాలంగా మలబద్ధకం సమస్య ఉంటే మలాశయ కేన్సర్, పెద్ద పేగు కేన్సర్, గ్యాస్ట్రిక్ కేన్సర్ వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారం, నీరు తగినంత తీసుకుంటూ శారీరక కదలికలు చురుగ్గా ఉండేవారు మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే నిర్లక్ష్యం చేయరాదు. ఇతరత్రా అనారోగ్యాలు ఏమైనా ఉన్నాయేమో వైద్యులను సంప్రదించి నిర్ధారణ చేసుకోవాలి.

ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయడం ఏ మాత్రం మంచిది కాదు. పెద్ద పేగులో స్టూల్ ఎక్కువ మొత్తంలో ఉండిపోవడం వల్ల వెజైనాలోకి రెక్టల్ జారిపోతుంది. దీంతో మూత్రాశయంలోని మూత్రం అంతా బయటకు వెళ్లదు. ఇలా మిగిలిన మూత్రం వెనుకకు మూత్రపిండాల్లోకి వెళుతుంటుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా పెరిగిపోతుంది.

జీవన విధానంలో మార్పులు

దీర్ఘకాలంగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారు తమ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి రావచ్చు. మొట్టమొదటగా తగినంత నీరు తాగడం చాలా అవసరం. స్టూల్ పేగులోంచి సాఫీగా వెళ్లేందుకు తగినంత నీరు అవసరం. అందుకే నీరు తగినంత తాగాలి. విసర్జించే మలం డార్క్ ఎల్లో రంగులో ఉంటే శరీరంలో చాలినంత నీరు లేదని అర్థం చేసుకోవాలి. ఎండుగడ్డి రంగులో (లైట్ ఎల్లో రంగు)లో ఉంటే తగినంత నీరు తాగుతున్నారని అర్థం. ఇక మలం రంగులేకుండా ఉంటే నీరు మరీ ఎక్కువగా తాగుతున్నారని అర్థం చేసుకోవాలి.

representation image

తిన్న ఆహారం సరిగా జీర్ణమై, వ్యర్థాలు సరిగ్గా విసర్జితం కావడానికి పీచు చాలా కీలకం. అందుకే తీసుకునే ఆహారంలో ఇది ఉండేలా చూసుకోవాలి. స్టూల్ లో ఉండే ఫైబర్ తగినంత నీరును గ్రహిస్తుంది. దాంతో అది మెత్తగా ఉండేలా చూస్తుంది. దీని వల్ల డెలివరీ సులభంగా జరిగిపోతుంది. ఒకవేళ పీచు తగినంత ఉన్న ఆహారాన్ని తీసుకుని నీరు తగినంత తీసుకోకపోయినా ఇదే పరిస్థితి ఎదురవుతుంది.

ప్రతీ రోజూ ఆహారంలో 20 నుంచి 30 గ్రాముల ఫైబర్ ఉండాలన్నది వైద్యుల సూచన. 32 నుంచి 35 గ్రాములు తీసుకున్నా మంచిదే. అలాగని మరీ అతిగా కూడా తీసుకోవడం సరైనది కాదు. సహజసిద్ధమైన సిలియం అనే పీచు పదార్థం పేగు ఆరోగ్యానికి ఎంతో అవసరం. రక్తంలో షుగర్ నియంత్రణకు కూడా ఈ సిలియం తోడ్పడుతుంది. హార్ట్ ఎటాక్, స్ట్రోక్, గాల్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ ముప్పును తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఇది సాయం చేస్తుంది. కూరగాయలను తగినంత తీసుకుంటే వీటి ద్వారా పీచు పదార్థం సమృద్ధిగా అందుతుంది. ఒకవేళ ఆహారం ద్వారా నిర్ణీత మొత్తం పీచు ఆ రోజు లభించకుంటే ఆర్గానిక్ రూపంలో హోల్ హస్క్ సిలియంను తీసుకోవచ్చు. 

రోజువారీ శారీరక వ్యాయాంతో ఈ సమస్యను నివారించుకోవచ్చు. శారీరక క్రియలు జీర్ణకోశాన్ని ప్రేరేపించడం వల్ల బవెల్ మూవ్ మెంట్ మెరుగుపడుతుంది. మలం వస్తున్నప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపుకోవద్దు. వెంటనే డిశ్చార్జ్ చేయడం ద్వారానే ఆరోగ్యంగా ఉండగలరని తెలుసుకోవాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఇంట్లోనే సహజసిద్ధమైన ఆహారం తీసుకోవాలి.

వెస్ట్రనా, ఇండియనా...?

మోడ్రన్ టాయిలెట్ల కంటే సంప్రదాయ టాయిలెట్లే మంచివనే వాదన ఉంది. ఇందులో వాస్తవం లేకపోలేదు. అయితే, ఈ రెండు రకాల బేసిన్లలో మలవిసర్జన సాఫీగా జరిగేందుకు అందరికీ ఒకటే తోడ్పడుతుందని చెప్పలేం. ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అది వాడుకోవడం మంచిది.

వైద్య సాయం

చాలా రోజులుగా మలబద్ధకం సమస్య వేధిస్తుంటే వైద్యులను సంప్రదించాలి. ఇతరత్రా ఏదైనా సమస్య నివారణ కోసం మందులు వాడుతున్నట్టయితే వాటి గురించి తెలియజేయాలి. మలబద్ధకం సమస్యకు హైపో థైరాయిడిజం సమస్య కారణం అయి ఉండవచ్చు. ఎందుకంటే పేగులకు తగినంత మూమెంట్ కు ఈ హర్మోన్ తోడ్పతుంది. కొంత మంది మలబద్ధకం సమస్యకు ఫార్మసీ స్టోర్స్ నుంచి లాక్సాటివ్స్ తెచ్చుకుని వాడుతుంటారు. కానీ దినికి బదులు వైద్యుల సూచనతోనే వాటిని వాడాలి. ఎక్కువ మొత్తంలో ఈ లాక్సాటివ్ ను తీసుకుంటే నీరు తగ్గిపోయి ఎలక్ట్రోలైట్స్ కూడా లోపించవచ్చు. ఫలితంగా కిడ్నీ, గుండె వైఫల్యాలు ఎదురవుతాయి. మెగ్నీషియం కూడా మలవిసర్జన సాఫీగా జరిగేందుకు ఉపయోగపడుతుంది. అయితే రోజుకు 310 గ్రాములకు మించి తీసుకోరాదు. దీర్ఘకాల మలబద్ధకం వల్ల రెక్టల్ దెబ్బతినిపోతే సర్జరీ చేయాల్సి వస్తుంది. 

representation image

ఈ పండ్లతోనూ సమస్యే

అజీర్ణానికి, గ్యాస్ట్రిక్ సమస్యకు అరటిపండు మంచిగా పనిచేస్తుందని చెప్పడం వినే ఉంటారు. కానీ సరిగా పండని దాన్ని తింటే మలబద్ధకం ఏర్పడవచ్చు. అరటిపండులో ఉండే స్టార్చ్ జీర్ణం కావడం నిదానంగా జరుగుతుంది. ఇక సరిగా పండని ఆకుపచ్చని కాయలో స్టార్చ్ అధికంగా ఉండడం వల్ల ఇది మరింత నిదానం అవుతుంది.

యాపిల్ ను పొట్టుతో సహా తింటే జీర్ణం కష్టమవుతుంది. ఇది మలవిసర్జనపై ప్రభావం చూపిస్తుంది. అందుకే యాపిల్ ను పొట్టు తీసి తినాలి. అదీ పరిమితంగానే ఒకటి బదులు రెండు మూడు కాయలు తినడం కూడా సమస్యే. యాపిల్ లో పీచు ఎక్కువగా ఉండదు. కేవలం మలం సాఫీగా విసర్జన కావడానికి తోడ్పడుతుంది. ఇదే కాదు, ఏ పండైనా పొట్టు తీసి తినడమే మంచిదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. బొప్పాయి, ఆరెంజ్, స్ట్రాబెర్రీస్, రాస్ బెర్రీస్, అవకాడో, జామ వంటివి మలబద్దకం సమస్య తగ్గడానికి ఉపకరిస్తాయి. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Advertisements