ap7am logo

డీమోనటైజేషన్... బొమ్మా... బొరుసు

Sat, Nov 26, 2016, 07:54 PM
Related Image

ఇప్పుడు యావత్ భారతాన్ని కుదుపుతున్న ఏకైక అంశం డీమోనటైజేషన్. రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో బడాబాబుల సంగతేమోగానీ సామాన్యులకు మాత్రం కష్టాలు వచ్చి పడ్డాయి. కానీ, ఇవన్నీ నరేంద్రమోదీ సర్కారుకు తెలియనివి కావా...? అంటే తెలుసు. తెలిసీ, లాభ, నష్టాలపై మేధోమధనం చేసి మరీ ఆచరణలోకి తీసుకురావడం వెనుక బలమైన వ్యూహమే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విశ్లేషకులు, వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం...

డీమోనటైజేషన్ అంటే నోట్లకు ఉన్న చట్టబద్ధమైన గుర్తింపును రద్ధు చేయడం. దాంతో అవి పనికిరాని చెత్త కాగితాలుగా మారిపోతాయి. మార్కెట్లో చలామణిలో ఉన్న నకిలీ నోట్లు, బ్లాక్ మనీ పనికిరాకుండా పోతుంది. నిజానికి స్వాతంత్ర్యం తర్వాత భారత దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో సాహసోపేత నిర్ణయం తీసుకోలేదన్నది నిపుణుల మాట. వాస్తవానికి వ్యవస్థలో ఉన్న నల్లధనాన్ని, అవినీతిని నిర్మూలించేందుకు ప్రతి పదేళ్లకోసారి నోట్ల రద్దు లేదా నోట్లను మార్చే ప్రక్రియ చేపట్టాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే స్వయంగా చెప్పారు.  representative image

ఈ చర్యతో మన దేశం నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారుతుందా...? అంటే సమాధానం కోసం వేచి చూడాల్సిందే. నిజానికి నోట్ల రద్దు నిర్ణయం వెనుక మోదీ సర్కారు ఉద్దేశ్యాలు ప్రధానంగా రెండు కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి,  దేశంలో నల్ల కుబేరులకు ముకుతాడు వేయడం; ఉగ్రవాదం, నక్సలిజం, సంఘ విద్రోహ శక్తుల కార్యకలాపాలకు చేయూతగా నిలుస్తున్న నల్లధనానికి చెక్ పెట్టడం, ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారిన నకిలీ కరెన్సీని చిత్తుకాగితాలుగా మార్చడం... ఒక విధంగా ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా నడుస్తున్న మరో ప్రమాదకర ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడం. 

మరొకటి ఏమిటంటే, నగదు లావాదేవీలు తగ్గించి, డిజిటల్  చెల్లింపులకు మారేలా చేయడం. దాంతో ప్రతీ రూపాయి లెక్కల్లోకి రావడం వల్ల పన్ను ఆదాయాలు పెరిగి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని కేంద్ర సర్కారు ఆశించింది. అయితే, మనదేశంలో 90 శాతం లావాదేవీలు నగదు రూపంలో జరుగుతున్నవే. వీటి నుంచి డిజిటల్ వ్యవస్థకు మారడం అంటే అది వెంటనే సాధ్యపడేది కాదు. డిజిటల్ చెల్లింపుల వల్ల కలిగే లాభాలపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే డిజిటల్ చెల్లింపులపై రాయితీలను ఇవ్వాలి. 

రాజకీయ పార్టీలకూ దెబ్బే

నోట్ల రద్దుతో రాజకీయ పార్టీలకు విరాళాలు మరింత పారదర్శకంగా మారతాయి. దాంతో వ్యయ నియంత్రణకు అవి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. పార్టీలకు విరాళాలు ఇచ్చే వారి వివరాలూ వెలుగులోకి వస్తాయి. వారు సైతం పన్ను వ్యవస్థల కళ్లు గప్పేందుకు అవకాశం ఉండదు. మన దేశంలో నగదు ఆధారిత లావాదేవీలే ఎక్కువగా ఉండడంతో అవినీతి ఎక్కువైపోయి  అది నల్లధనంగా మారుతోంది. అందుకే డిజిటల్ చెల్లింపులను పెంచితే నల్లధనానికి బ్రేకులు వేయవచ్చన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.

representative image

దుకాణాల్లో స్వైపింగ్ యంత్రాలు

వ్యాపారస్థులు డిజిటల్ రూపంలో నగదు స్వీకరించే ఏర్పాట్లను పెంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో పీఓఎస్ (క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులకు వీలు కల్పించేవి) టెర్మినల్స్ కలిగి ఉన్న దుకాణాలు, ఆస్పత్రులు చాలా తక్కువగానే ఉన్నాయి. కనుక అన్ని దుకాణాలు, సేవల కేంద్రాలు, ఇతర నగదు చలామణి ఉన్న చోట్ల పీఓఎస్ మెషిన్లు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన యూపీఐ యాప్ ఆధారిత చెల్లింపులు, వ్యాలెట్ చెల్లింపులను ప్రోత్సహించడం అత్యావశ్యకం. అందుకే ప్రధాని మోదీ సైతం డిజిటల్ చెల్లింపులకు మళ్లాలని పిలుపునిచ్చారు.

లెక్కల్లోకి రాని ఆదాయం వెలుగులోకి

కాగిత రూపంలో నగదు చలామణి ఎక్కువగా ఉంటే ప్రభుత్వానికి, ఆర్థిక వ్యవస్థకు కొన్ని సమస్యలు ఉంటాయి. నోట్ల ముద్రణ కోసం ఏటా ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేయక తప్పదు. నకిలీ నోట్లు మార్కెట్లోకి ప్రవేశించడం వల్ల అసలైన నగదు విలువ తగ్గిపోతుంది. డిజిటల్ రూపంలోనే చెల్లింపులు జరపడం వల్ల ప్రతీ స్కూల్, కాలేజీ, కోచింగ్ ఇనిస్టిట్యూట్లు, ఇతర విద్యా కేంద్రాలకు వచ్చే ఆదాయం బయటపడుతుంది. పన్నులు చెల్లించక తప్పదు. ఫీజులు అధికంగా వసూలు చేసినట్టు తేలితే చట్టపరమైన చర్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2022 నాటికి అందరికీ ఇల్లు సౌకర్యం కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం మాఫియా కారణంగా కొండెక్కి కూచున్న రియల్టీ ధరలు కిందకు దిగిరావడం వల్ల అందుబాటు ధరల్లో లభించేందుకు అవకాశం ఉంది. 

నిజానికి మోదీ నల్లధన నిర్మూలనకు హామీ ఇచ్చి అధికారం సొంతం చేసుకున్న వ్యక్తి. అందుకే అధికారం చేపట్టిన తర్వాత నుంచి నల్లధనంపై పోరు సాగిస్తూనే ఉన్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  ఇటీవల స్వదేశంలోని నల్లధనం స్వచ్చంద వెల్లడికి కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కనుక ఈ విషయంలో సర్కారు చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదన్నది కొందరి అభిప్రాయంగా ఉంది. 

representative image

కొన్ని రంగాలపై తీవ్ర ప్రభావం

ఇక నోట్ల రద్దు నిర్ణయం, నల్లధనంపై పోరుతో రియల్టీ, బంగారం, వజ్రాభరణాల మార్కెట్ పై తీవ్ర ప్రభావమే పడుతుంది. నగదుపై జరిగే కొనుగోళ్లు చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గిపోతాయంటున్నారు. గృహోపకరణాలు, కంప్యూటర్లు, మొబైల్స్, ట్యాబ్లెట్లు, ఆభరణాల కొనుగోళ్లు తగ్గుతాయని, కొంత కాలం పాటు కేంద్ర ప్రభుత్వ ఆదాయాలు క్షీణించి దేశ వృద్ధి రేటు పడిపోతుందంటున్నారు. దీర్ఘకాలంలో మాత్రం వ్యవస్థలో ఉన్న నల్లధనం తగ్గి, లెక్కల్లో  చూపే ఆదాయం పెరిగి ప్రభుత్వ ఆదాయాలు పెరుగుతాయన్నది ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే, కేంద్ర సర్కారు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించడానికి ముందు పెద్ద ఎత్తున తక్కువ విలువ కలిగి నోట్లను... అంటే రూ.100, రూ.50, రూ.20, రూ.10లను మార్కెట్లోకి తెచ్చి ఉంటే నగదుకు కొరత ఏర్పడే పరిస్థితి ఇలా ఉండేది కాదని నిపుణుల విశ్లేషణ. 

పేదల పరిస్థితి ఏంటి

దేశంలో సగం మంది జనాభాకు వ్యక్తిగతంగా బ్యాంకు ఖాతాలు లేవు. ఆధార్ వంటి ప్రామాణిక గుర్తింపు పత్రాలు లేని వారు సైతం చాలా మంది ఉన్నారు. దేశంలో 13 కోట్ల మందికి మొబైల్ వ్యాలెట్లు ఉన్నాయి. 60 కోట్ల డెబిట్ కార్డులు చలామణిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందరికీ కార్డుల సౌకర్యం అందించడం, లేదా యూపీఐ యాప్ వంటి ప్రత్యామ్నాయాల ద్వారా డిజిటల్ చెల్లింపులకు వీలు కల్పించే చర్యలను ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. అదే సమయంలో ప్రతీ దుకాణంలో విధిగా పీఓఎస్ మెషిన్ ఉండాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. నిర్ణీత విలువ మేర చేసే లావాదేవీలకు తప్పనిసరిగా డిజిటల్ రూపంలోనే చెల్లింపులను స్వీకరించాలనే నిబంధన అవసరం. 

ప్రభుత్వం మదిలో మరిన్ని అస్త్రాలు

బడా బాబులు, నల్లధనం కలిగిన వారు దాన్ని నగదు రూపంలో ఎందుకు ఉంచుకుంటారన్నది సామాన్యుల ప్రశ్న. అక్రమ మార్గాల్లో ధనాన్ని కూడబెట్టిన వారు దాన్ని బినామీల పేరుపై ఆస్తులు, బంగారం, బ్యాంకు డిపాజిట్లు, ఇళ్లు, స్థలాల రూపంలో ఉంచుకుంటారన్నది వారి సందేహంగా ఉంది. ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల బ్లాక్ మనీ కలిగిన వారికి జరిగే నష్టం ఏముంది? అన్నది సామాన్యులు వేసే ప్రశ్న. కానీ, ప్రభుత్వం వద్ద ఈ విషయంలోనూ వ్యూహాలు ఉన్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత డీమోనటైజేషన్ ముగిసిన తర్వాత బినామీ ఆస్తులపై కేంద్ర సర్కారు తదుపరి చర్యలు ఉంటాయని, అలాగే భారీగా బంగారం పోగేసిన వారిపైనా, నల్లధనం ఆసాముల నుంచి కల్పితంగా రుణాలు తీసుకున్న వారిపైనా తన అస్త్రాలు ఎక్కుపెడుతుందని, కలుగులో దాగి ఉన్న ప్రతీ ఎలుకనూ బయటకు రప్పిస్తుందంటున్నారు.

మరిన్ని చర్యలు అవసరం...

ఒక అంచనా ప్రకారం మొత్తం నల్లధనంలో కేవలం 6 శాతమే నగదు రూపంలో ఉండగా, మిగిలినది అంతా కూడా బంగారం, ఆస్తులు, బినామీల రూపంలో, నష్టాలను ఎదుర్కొంటున్న నకిలీ కంపెనీల రూపంలో ఉన్నట్టు చెబుతారు. లెక్కల్లోకి రాని నల్లధనంపై చర్యలకే పరిమితం కాకుండా ఖరీదైన మెటల్స్, అమెరికా డాలర్లు, బిట్ కాయిన్లపై కూడా చర్యలు అవసరం అంటున్నారు. నిజానికి దేశంలో ఒక్క శాతం మందే పన్ను చెల్లిస్తున్నారు. మరి మిగిలిన వారి సంగతి ఏంటి...? పన్ను చెల్లించాల్సిన వారి సంఖ్య ఇంతకు పది రెట్లు ఉండాలి. మరి మిగిలిన వారిని కూడా వ్యవస్థలో భాగం చేసేందుకు ప్రభుత్వం సైతం ప్రస్తుతమున్న పన్నుల వ్యవస్థను మార్చాలని, పన్ను రేట్లను తగ్గించాలన్నది నిపుణుల సూచనగా ఉంది. 

1946లో, 1978లో డీమోనటైజేషన్ ఎలా జరిగింది...?

1946 జనవరి 12న రిజర్వ్ బ్యాంకు డీమోనటైజేషన్ నిర్ణయాన్ని వెలువరించింది. అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం కూడా ముగిసింది. నోట్ల మార్పిడికి చాలా తక్కువ వ్యవధినే ఇచ్చింది. మార్కెట్లో ఉన్న రూ.143 కోట్లలో రూ.134 కోట్లను సేకరించగలిగింది. ఆ సమయంలో కేవలం రూ.9 కోట్లనే మార్చుకోలేదు. సాధారణ జీవనానికి కూడా పెద్ద ఇబ్బందేమీ కలగలేదు. 1946 డీమోనటైజేషన్ సందర్భంగా 1938లో తీసుకొచ్చిన రూ.1,000, రూ.10,000 నోట్లను అప్పటి బ్రిటిష్ పాలకులు రద్దు చేశారు. అయితే, 1954లో రూ.1,000, రూ.10,000 నోట్లతోపాటు కొత్తగా రూ.5,000 నోటును అప్పటి ప్రభుత్వం చలామణిలోకి తీసుకొచ్చింది.  

అధిక విలువ కలిగిన నోట్లను వ్యవస్థలోంచి వెనక్కి తీసుకోవాలంటూ వాంచూ కమిటీ 1960లో సూచించింది. ఈ సూచన 1978లో మొరార్జీ దేశాయ్ సారధ్యంలోని జనతా పార్టీ అధికారంలో ఉండగా కార్యరూపం దాల్చింది. భారత కరెన్సీ విలువ దారుణంగా దిగజారిపోవడంతో వాంచూ కమిటీ ఈ సూచన చేసింది. 1950, 1960వ దశకాల్లో దేశ వాణిజ్య లోటు భారీగా పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం 7 శాతాన్ని మించింది. దీంతో ఇందిరాగాంధీ సర్కారు భారత రూపాయి విలువను డాలర్ తో 4.75 నుంచి రూ.7.50కి తగ్గించింది. దీంతో వాణిజ్య లోటు 100 కోట్లకు తగ్గిపోయింది. కానీ 1975లో ఇందిరాగాంధీ సర్కారు అత్యవసర పరిస్థితి విధించడంతో పరిస్థితులు మారిపోయాయి. ఆర్థిక స్థిరత్వం దెబ్బతిన్నది. దీంతో డీమోనటైజేషన్ కు దారి తీసింది.

1978లో మొరార్జీ దేశాయ్ సారధ్యంలో జనతాపార్టీ ప్రభుత్వ హయాంలో డీమోనటైజేషన్ ప్రకటించారు. కానీ ఈ కార్యక్రమం సక్సెస్ అవలేదు. ఎందుకంటే ప్రభుత్వం నోట్ల రద్దును ప్రకటించవచ్చన్న సంకేతాలు ముందుగానే నల్లబాబులకు అందాయి. వాంచూ కమిటీ సిఫారసుల మేరకు డీమోనటైజేషన్ ఎలా అమలు చేయాలన్న అంశంపై కొంత కాలంపాటు చర్చలు జరగడంతో నల్లధనం కలిగిన వారు జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది.

అప్పటికీ... ఇప్పటికీ...

ప్రస్తుతం కార్డుల ద్వారా ఏటీఎం యంత్రాల నుంచి సులభంగా నగదును విత్ డ్రా చేసుకోగలిగే సౌకర్యం ఉంది. కానీ, గతంలో రెండు సార్లు రద్దు చేసిన సమయాల్లో ప్రజలు బ్యాంకులనే ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఏటీఎంలు లేవు. దేశంలో తొలి ఏటీఎం మెషిన్ 1987లో అందుబాటులోకి వచ్చింది. ఆ రోజుల్లో కనీసం ఇంటర్నెట్ కూడా లేదు. ఇప్పుడంటే ఆన్ లైన్ బ్యాంకింగ్ వచ్చి లావాదేవీలను సులభం చేసింది. దీంతో ప్రత్యక్ష నగదుపై అంతగా అధారపడాల్సిన అవసరం లేని రోజులు. అలాగే, ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయాన్ని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లే సమాచార సాధనాలు ఎన్నో ఉన్నాయి. గతంలో ఆల్ ఇండియా రేడియో ఒక్కటే ఉండేది.  

డీమోనటైజేషన్ ఇతర దేశాల్లోనూ...

పాకిస్తాన్: 2015 జూన్ లో పాకిస్తాన్ రూ.5, రూ.500 నోట్లను రద్దు  చేసింది. మార్చుకోవడానికి ఏడాదిన్నర సమయం ఇచ్చింది. అది ఈ ఏడాది డిసెంబర్ 1తో ముగిసిపోనుంది. కానీ, పాక్ సర్కారు ఏ ఉద్దేశ్యంతో దీన్ని అమల్లోకి తెచ్చిందో గానీ, ఏడాదిన్నర సమయం ఇవ్వడం వల్ల నల్లధనం ఏ మాత్రం తగ్గే అవకాశం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇంత సుదీర్ఘ సమయంలో నల్లధనాన్ని సులభంగా సక్రమ ధనంగా మార్చుకోవడానికి ఎన్నో మార్గాలను వెతుక్కోవచ్చు.

కాంగో (జైరే): ఈ దేశ నియంత పాలకుడు మొబుటు డీమోనటైజేషన్ ను 1990లో ప్రకటించాడు. 1970లో స్వాతంత్ర్యం  రాగా, విదేశీ నిధులకు కటకట ఏర్పడింది. దీంతో ఆర్థిక అస్థిరతకు దారితీసింది. ఫలితంగా డీమోనటైజేషన్ నిర్ణయాన్ని తీసుకురాగా అది విజయవంతం కాలేదు. ఆర్థిక సమస్యల నుంచి 2000 సంవత్సరానికి గానీ ఆ దేశం కోలుకోలేదు.

జింబాబ్వే: 2010లో డీమోనటైజేషన్ నిర్ణయాన్ని ప్రకటించింది. వంద ట్రిలియన్ జింబాబ్వే డాలర్ల నోట్లను ఆ దేశం ముద్రించింది. వీటి విలువ కేవలం 40 సెంట్లు మాత్రమే. కానీ, డీమోనటైజేషన్ విఫలం అయింది. దీంతో తన దేశ కరెన్సీ స్థానంలో అమరికా డాలర్ ను అమల్లోకి తెచ్చింది.

యూఎస్ఏ: దేశంలో ఉన్న నల్లధనం ఏరివేతకు వీలుగా అమెరికాలో 1969లో అప్పటి అధ్యక్షుడు రిచర్జ్ నిక్సన్ డీమోనటైజేషన్ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. ఇది విజయవంతమైంది.

ఆస్ట్రేలియా: 1996లో డీమోనటైజేషన్ నిర్ణయాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది. నల్లధనం నివారణతోపాటు నోట్లను అధిక భద్రతా సదుపాయాలతో తీసుకువచ్చేందుకు డీమోనటైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇదే సమయంలో పేపర్ నోట్ల స్థానంలో దీర్ఘకాలం పాటు మన్నే పాలీమర్ ఆధారిత నోట్లను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం విజయవంతం అయింది. వ్యాపార అనుకూల దేశంగా ఆస్ట్రేలియాను మార్చింది.

ఉత్తరకొరియా: టూ జీరోయెస్ నోట్లను వ్యవస్థ నుంచి రద్దు చేసింది. నల్లధనాన్ని నిర్మూలించి ఆర్థిక రంగాన్ని కట్టుదిట్టం చేసేందుకు ఈ నిర్ణయాన్ని అమలు చేసింది. అయితే, ఈ కార్యక్రమం విజయం సాధించలేదు. ద్రవ్యోల్బణం పెరిగిపోయి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. దీంతో నియంత పాలకుడైన కిమ్ జాంగ్ ఇల్ ప్రజలకు క్షమాపణ చెప్పారు.

నైజీరియా: 1984లో ముహమ్మద్ బుహారి ఆధ్వర్యంలోని సర్కారు నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకుంది. ఆర్థిక వ్యవస్థ మెరుగునకు తీసుకున్న ఈ నిర్ణయం ఆచరణలో విఫలమైంది. 1985-86 కాలంలో బుహారి అధికారాన్ని కూడా కోల్పోయారు.

మన దగ్గర విజయవంతrepresentative imageమే..!

డీమోనటైజేషన్ ను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు చేపట్టినప్పటికీ అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలే విజయం సాధించగలిగాయి. ఆఫ్రికా దేశాలు మాత్రం బొక్కబోర్లా పడ్డాయి. అయితే, సొంత కాళ్లపై ఆర్థికంగా బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ డీమోనటైజేషన్ లో విఫలమయ్యే అవకాశాలు తక్కువే అంటున్నారు విశ్లేషకులు. స్వల్ప కాలంలో వినియోగం తగ్గి, ఆర్థిక వృద్ధి క్షీణిస్తుందని, దీర్ఘకాలానికి మాత్రం మంచి లాభాలే సమకూరుతాయని రేటింగ్ సంస్థలు సైతం ఘంటా పథంగా చెబుతున్నాయి. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy