ఇన్వెస్ట్ మెంట్... తెలిస్తే ధనవంతులే!

Mon, Nov 28, 2016, 08:15 AM
Related Image

నా సంపాదనలో చెప్పుకోతగ్గంత సేవ్ చేస్తున్నాను తెలుసా...? అని కొందరు గొప్పగా చెప్పడం వినే ఉంటారు. నిజానికి సేవింగ్ చేయడం మంచి పనే. కానీ గొప్ప పని మాత్రం కాదు. ఆ సేవింగ్స్ ను ఇన్వెస్ట్ మెంట్స్ గా మలిచినప్పుడే అది గొప్ప పని అవుతుంది. సేవింగ్స్ అయినా, ఇన్వెస్ట్ మెంట్స్ అయినా అన్నీ ఒకటే అని కొందరనుకుంటారు. కానీ ఈ రెండింటికీ మధ్య స్పష్టమైన తేడా ఉంది. అది తెలుసుకుంటేనే సంపద సృష్టి సాధ్యమవుతుంది.

ఉదాహరణకు రఘుకి గత నెల రూ.50వేల వేతనం వచ్చిందనుకోండి. కుటుంబ అవసరాలకు పోను అతడు ఓ రూ.20వేలు మిగిలిస్తే అది సేవింగ్స్ అవుతుంది. అలా కాకుండా ఆ రూ.20వేలను రఘు మ్యుచువల్ ఫండ్స్ లేదా బంగారం లేదా బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్లు వంటి రాబడినిచ్చే వాటిని కొనుగోలు చేస్తే అది ఇన్వెస్ట్ మెంట్ అవుతుంది. సేవింగ్స్ లో ధన వృద్ధి ఉండదు. ఇన్వెస్ట్ మెంట్ లో ధన వృద్ధి ఉంటుంది. అంటే మన దగ్గర మిగిలి ఉన్న ధనాన్ని మరింతగా పెంచుకునేందుకు ఇన్వెస్ట్ మెంట్ ఓ సాధనం అని తెలుసుకోవాలి.

representation image

నిజానికి మన దేశంలో చాలా మంది గొప్ప పొదుపరులు (సేవింగ్స్ చేసేవారు). కానీ, అదే సమయంలో గొప్ప మదుపరులు (ఇన్వెస్ట్ మెంట్) మాత్రం కాదు. అందుకే చక్కని అవగాహనతో ఇన్వెస్ట్ మెంట్ చేయడం ద్వారా సంపదను పోగేసుకోవాలనుకునే వారు కొన్ని ముఖ్యమైన అంశాలను తప్పకుండా తెలుసుకోవాలి.

ఓపిక

ప్రశాంతత, స్థిరమైన మనసు కలిగి ఉండాలి. అస్తమానం తాను కొనుగోలు చేసిన ఇన్వెస్ట్ మెంట్ సాధనాల వైపు, పోర్ట్ ఫోలియో వైపు చూస్తూ ఉండరాదు. ఈ రోజు ఎంత లాభం వచ్చింది? పెట్టుబడుల విలువ ఎంత పెరిగింది? అని రోజూ లెక్కలు వేసుకోరాదు. ఉదాహరణకు  ఏదేనీ మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడి పెట్టారనుకుందాం. మార్కెట్లు పడిపోతున్నాయనో, అమెరికాలో ఉగ్రదాడి జరిగిందనో ఇన్వెస్ట్ మెంట్ విలువ తరిగిపోతుందన్న భయంతోనే అమ్మేసుకోకూడదు. దేనికైనా ప్రశాంతత అవసరం. పెట్టుబడి పెట్టే ముందే తగిన ప్రణాళిక వేసుకుని అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలి.

కొంత నష్టం వచ్చినా ఫర్వాలేదు. అసలు పెట్టుబడి అంతా కరిగిపోతుందేమోనన్న భయంతో నష్టాలకు అమ్ముకోవడం చాలా మంది చేసే పని. కానీ, స్వల్ప కాలిక దృష్టితో పెట్టుబడులతో పెద్దగా రాబడులు రావు. పైగా నష్టపోయే అవకాశాలుంటాయని తెలుసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం... దేశంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లలో కేవలం 40 శాతం మందే రెండేళ్లకు మించి తమ పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. అంటే మిగిలిన 60 శాతం మంది ఇన్వెస్టర్లు ఆ లోపే తమ పథకాల్ని మార్చేయడం, పెట్టుబడులను వెనక్కి తీసేసుకోవడం చేస్తున్నారు. ఇన్వెస్టర్లలో దీర్ఘకాలిక దృక్పథం లోపించింది అనడానికి ఇది చాలు.

ఫ్రెండ్స్ ను ఫాలో అవ్వద్దు

వార్తల ఆధారంగా పెట్టుబడులు పెట్టరాదు, అమ్ముకోరాదు. పెట్టుబడులను ఏడాదికోసారి సమీక్షించుకోవాలి. అంతేకానీ ప్రతీ రోజూ రాత్రి కూర్చుని లెక్కలేసుకుంటే వచ్చేది నష్టమే. పెట్టుబడుల విషయంలో ఎప్పుడూ పక్కవారినో, స్నేహితులనో అనుసరించడం సరైనది కాదనే చెప్పుకోవాలి. వ్యక్తికీ, వ్యక్తికీ ఇన్వెస్ట్ మెంట్ అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. మీ వేతనం, ఇన్వెస్ట్ మెంట్ మొత్తం, రిస్క్, ఎంత కాలం పెట్టుబడులు కొనసాగించగలరు, రాబడి ఎంత కోరుకుంటున్నారు ఇలా ఎన్నో అంశాలను బట్టి ఇన్వెస్ట్ మెంట్ సాధనాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే పక్కవారిని చూసి కాపీ కొట్టే ఇన్వెస్ట్ మెంట్స్ విధానం అందరికీ నప్పదు. ఇన్వెస్ట్ మెంట్స్ విషయంలో అవసరమనుకుంటే ఫైనాన్షియల్ ప్లానర్ల సాయం తీసుకోవాలి. 

representation image

సరళంగా ఉండాలి

ఇన్వెస్ట్ మెంట్స్ ఎప్పుడూ కలగాపులగంలా ఉండకూడదు. చాలా సరళంగా ఉండాలి. అప్పుడే ఎందులో పెట్టుబడి పెడుతున్నాం, ఎంత రాబడి వస్తుందన్నది చాలా సులభంగా అర్థమవుతుంది. ఉదాహరణకు అభిరామ్ నెల సంపాదన రూ.60వేలు. నెలకు రూ.30వేల వరకు పొదుపు చేస్తున్నాడు. వీటిని వృథాగా బ్యాంకు ఖాతాలో ఉంచకూడదన్న ఆలోచనతో పెట్టుబడులకు మళ్లించడం మొదలు పెట్టాడు.

 రెండు వేల రూపాయల చొప్పున ఓ పది మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. జీవిత బీమా పాలసీలు ఓ నాలుగు తీసుకుని వాటి కోసం నెల నెల రూ.5వేలు చెల్లిస్తున్నాడు. అప్పటికే అతడికి శాలరీ ఖాతా, పర్సనల్ సేవింగ్స్ ఖాతా, పెట్టుబడుల కోసం ఒక ఖాతా చొప్పున మూడు బ్యాంకు ఖాతాలున్నాయి. వీటికి తోడు పీపీఎఫ్, ఆర్డీ, షేర్లలో నేరుగా పెట్టుబడికి ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు కూడా ఉన్నాయి. 

ఇక అభిరామ్ స్నేహితుడు చందు కూడా నెలకు రూ.20వేలు పొదుపు చేసి మదుపు చేయడం మొదలు పెట్టాడు. ఫైనాన్షియల్ ప్లానర్ ను కలిసి ఫీజు చెల్లించి ఎందులో ఎంతెంత పెట్టుబడి పెట్టాలి వంటి విషయాలను తెలుసుకున్నాడు. అభిరామ్ మాదిరిగా చందుకు కూడా నాలుగు బ్యాంకు ఖాతాలున్నాయి. దీంతో ముందుగా రెండు ఖాతాలను క్లోజ్ చేసేశాడు. ఒకటి బ్యాలన్స్ డ్ ఫండ్, మరొకటి స్మాల్ క్యాప్ ఫండ్, ఒకటి ట్యాక్స్ సేవింగ్ ఫండ్ ఒక్కోదానిలో నెలకు రూ.5వేల చొప్పున ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్నాడు. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుని వాటి కోసం నెలకు రూ.2వేలు చెల్లిస్తున్నాడు. మిగిలిన మూడు వేలను పెన్షన్ ఫండ్ కోసం కేటాయించాడు.

ఈ రెండు ఉదాహరణల్లో చందు ఇన్వెస్ట్ మెంట్ విధానమే చాలా సరళంగా ఉంది. వాటి పనితీరును సమీక్షించుకోవడం చాలా సులభం. పైగా బ్యాంకు ఖాతాలు అనేవి ఒకటి రెండు మించి అనవసరం. మరికొందరు క్రెడిట్ కార్డులు కూడా ఒకటికి మించి ఎక్కువ వాడేస్తుంటారు. దీనివల్ల చేస్తున్న ఖర్చు, పొదుపు, మదుపులపై అవగాహన తగ్గుతుంది. అది రాబడులపై ప్రభావం చూపుతుంది. వారానికి ఓ గంట సమయం వెచ్చించడం ద్వారా మీ పెట్టుబడుల తీరుపై అప్ టు డేట్ సమాచారాన్ని కలిగి ఉంటారు. సంపద సృష్టికి సూపర్ బ్రెయిన్ అవసరం లేదు. బేసిక్స్ అంటే కనీస అంశాలు తెలిసి ఉంటే చాలన్నది నిపుణుల సూచన. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy