ap7am logo

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ విద్యా సంస్థలు... అడ్మిషన్ల విధానం

Sun, Nov 27, 2016, 09:05 AM
Related Image

మన దేశంలో ఇంటర్ తర్వాత ఎక్కువ శాతం మంది విద్యార్థులు అడుగులు వేస్తోంది ఇంజనీరింగ్ విద్య వైపే. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ/ఐఐటీలు దేశంలోనే ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యా సంస్థలు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థల్లోనూ ఇవి ముందుంటాయి. ఐఐటీలో చదివితే ఇక ఆ విద్యార్థి భవిష్యత్తు బంగారమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. వార్షికంగా లక్షలాది రూపాయల ప్యాకేజీలను ఇచ్చి ఐఐటీ పట్టభద్రులను ఎగరేసుకుపోవడానికి దేశ, విదేశీ కంపెనీలు ఏటా పోటీ పడుతుంటాయి. ఐఐటీ విద్యా విధానానికి ఎంతో గుర్తింపు ఉందనడానికి ఇవే నిదర్శనాలు. వీటితోపాటు, నిట్, ఇతర ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల విధానం చూద్దాం.

ఇంజనీరింగ్, టెక్నాలజీలో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీలను ఐఐటీలు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) అందిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ కోర్సులకు ఎంతో గుర్తింపు ఉంది. వృత్తిపరమైన నైపుణ్యం విషయంలో ఐఐటీయన్లు ముందుంటారనే నమ్మకం కూడా ఉంది. దేశ, విదేశాల్లో ఐఐటీ పట్టభద్రులు ఎంతో మంది కీలక స్థానాల్లో తమ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. 

ఐఐటీ కేంద్రాలు

దేశవ్యాప్తంగా 23 ఐఐటీ కేంద్రాలున్నాయి. ఏటా ఒక్కో ఐఐటీ విద్యా సంస్థ ప్రవేశ పరీక్ష బాధ్యతను చూస్తుంటుంది. అన్ని ఐఐటీ కేంద్రాల్లో సుమారు 9,600కు పైనే సీట్లున్నాయి.

నాలుగేళ్ల బీటెక్, బీఫార్మసీ, ఐదేళ్ల బీఆర్క్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, ఎంటెక్ కోర్సులో ప్రవేశాలకు వీలుగా ఏటా రెండు దశలు (మెయిన్స్, అడ్వాన్స్ డ్) పరీక్ష జరుగుతుంది. ప్రపంచంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఇది కూడా ఒకటని పేరుంది. 2017 నుంచి విదేశీ విద్యార్థులకు కూడా ఐఐటీ వంటి అత్యున్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించేందుకు వీలుగా ఈ పరీక్షను అంతర్జాతీయంగా నిర్వహించనున్నారు. విదేశీ విద్యార్థులను నేరుగా అడ్వాన్స్ డ్ కోర్సుకు అనుమతించనుండడం విశేషం.

representation image

అర్హత పరీక్ష

ఐఐటీలో ఉన్న సీట్లు.... వీటిలో ప్రవేశం కోసం ఏటా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) జరుగుతుంది. ఇది రెండు దశలుగా ఉంటుంది. ముందు ఐఐటీ మెయిన్ రాసి అందులో సత్తా చాటిన మొదటి లక్షన్నర మందిని ఐఐటీ అడ్వాన్స్ డ్ పరీక్షకు అనుమతిస్తారు. అడ్వాన్స్ డ్ లో వారు సాధించిన ర్యాంకు, టాప్ 20 పర్సంటైల్ లో ఉన్న వారిని ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకుంటారు. అంతకుముందు రాసిన పరీక్షల మార్కులు ఇక్కడ పరిగణనలోకి రావు. అవి కేవలం మెయిన్స్ పరీక్షకే పరిమితం.  

ప్రవేశాలు 

జేఈఈ రాస్తే ఐఐటీ, నిట్ సంస్థలతోపాటు బనారస్ హిందూ యూనివర్సిటీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ధన్ భాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ విద్యా సంస్థల్లోనూ ప్రవేశాలు పొందడానికి అర్హత లభిస్తుంది. అలాగే, ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెంట్రల్ ఫుట్ వేర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (సీఎఫ్టీఐ)లలో అడ్మిషన్ పొందవచ్చు. కేంద్ర నిధులతో నడిచే అన్ని సాంకేతిక విద్యా సంస్థలు, రాష్ట్రాల నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కూడా జేఈఈ చెల్లుబాటు అవుతుంది.

2017 మెయిన్ అర్హతల వివరాలు

12వ తరగతి పాసైన వారు, 12వ తరగతి పరీక్షలు రాస్తున్నవారు జేఈఈ మెయిన్ లో పాల్గొనేందుకు అర్హులు. జేఈఈ మెయిన్ కు సంబంధించి అఖిల భారత స్థాయిలో ర్యాంకులకు అభ్యర్థుల ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదు. అడ్మిషన్ పొందేందుకు 12వ తరగతిలో 75 శాతం మార్కులు తెచ్చుకుని ఉండాలి. లేదా 12వ తరగతి పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్ కలిగి ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే 12వ తరగతిలో 65 శాతం మార్కులు కలిగి ఉన్నా అడ్మిషన్ కు అర్హులే.

గరిష్టంగా 23 ఏళ్లు దాటరాదు. 12వ తరగతిలో కనీసం ఐదు సబ్జెక్టులను అయినా చదివి ఉండాలి. మూడు సార్లు మాత్రమే జేఈఈ రాసేందుకు అర్హత ఉంటుంది. బీఈ, బీటెక్ లో ప్రవేశం పొందాలనుకునేవారు ఇంటర్ లో ఏదేనీ ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్, ఫిజిక్స్, మేథమేటిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి. అలాగే, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ, టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్ట్ లలో ఒకదాన్ని చదవాలి. అలాగే, ఐదో సబ్జెక్ట్ కింద ఏదేనీ ఇతర సబ్జెక్ట్ చదివి ఉండాలి. 

బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సులో ప్రవేశం కోరుకునే వారు ఇంటర్ లో మ్యాథమేటిక్స్ తో పాటు మరో నాలుగు సబ్జెక్టులను చదివి ఉండాలి. స్టేట్ బోర్డ్, సెంట్రల్ బోర్డ్ గుర్తింపు ఉన్న 12వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. సీబీఎస్ఈ, ఐఎస్సీఈ ఇందుకు ఉదాహరణలు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నిర్వహించే రెండేళ్ల జాయింట్ సర్వీసెస్ వింగ్ పరీక్ష రాసిన వారు కూడా ఉత్తీర్ణులే. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నిర్వహించే సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ లో ఐదు సబ్జెక్టులు చదివి ఉన్నా సరిపోతుంది. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) గుర్తింపు ఉన్న 10 2 కోర్సు చేసిన వారు కూడా జేఈఈ రాసుకోవచ్చు. 

మెయిన్ వర్సెస్ అడ్వాన్స్ డ్

మెయిన్ లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 బీఈ, బీటెక్ లో ప్రవేశాలకు ఉద్దేశించినది. పేపర్ 2 కేవలం బీఆర్క్, బీ ప్లానింగ్ లో ప్రవేశాల కోసం రాయాల్సినది. మెయిన్స్ లో క్వాలిఫై అయిన వారు మాత్రమే అడ్వాన్స్ డ్ రాసేందుకు అర్హులు. అడ్వాన్స్ డ్ పరీక్ష రెండు పేపర్లుగా మూడు గంటల పాటు జరుగుతుంది.

జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ లో ఉత్తీర్ణత సాధించి అడ్వాన్స్ డ్ లో పాస్ కాని వారు ఐఐఐటీ, సీఎఫ్టీఐలలో ప్రవేశాలకు అర్హులే. ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలు పొందాలంటే కచ్చితంగా అడ్వాన్స్ డ్ లోనూ పాసవ్వాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ లో ఎక్కువ స్కోర్ చేసి తర్వాత అడ్వాన్స్ డ్ లోనూ ఉత్తీర్ణత సాధిస్తే ఐఐటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ లో సీటు దాదాపుగా ఖాయం అయినట్టే. ఐఐఎస్ఆర్, ఆర్జీఐపీటీ వంటి ఇతర ప్రముఖ విద్యా సంస్థలు సైతం జేఈఈ అడ్వాన్స్ డ్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కాకపోతే ఐఐటీ కౌన్సిలింగ్ లో ఇవి పాల్గొనవు.  

ఏటా నవంబర్ మూడో వారంలో జేఈఈ మెయిన్స్ కు దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. ఏప్రిల్ మొదటి వారంలో పరీక్ష జరుగుతుంది. ఫలితాలు మే మొదటి వారంలో విడుదల అవుతాయి. జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షకు మె మొదటి వారంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష జూన్ నెలలో జరుగుతుంది. ఏటా లక్షల సంఖ్యలో ఈ పరీక్షలకు పోటీ పడుతుంటారు. 

representation image

ఐఐఐటీ

ఐటీ రంగానికి మానవ వనరుల కొరతను తీర్చేందుకు ఏర్పడినవే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యా సంస్థలు. వీటిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తొలి ఐఐఐటీకి హైదరాబాద్ వేదికగా నిలిచింది. ఇంకా బెంగళూరు, గ్వాలియర్, అలహాబాద్, కాంచీపురం, కేరళ, భువనేశ్వర్, జబల్ పూర్, పుణె, ఢిల్లీ తదితర చోట్ల తర్వాత ఏర్పాటయ్యాయి. 

ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఈఈఈ)

అండగ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో సీబీఎస్ఈ నిర్వహించే పరీక్ష ఇది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న 30 నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) సెంటర్లు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష అర్హతగా పనిచేస్తుంది. అఖిల భారత స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో అభ్యర్థులకు ర్యాంకులు కేటాయిస్తారు. అయితే, 2013 నుంచి దీన్ని తొలగించి దీని స్థానంలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)ని అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి నిట్, ట్రిపుల్ ఐటీలకు కూడా జేఈఈ తప్పనిసరి అయింది. 

బిట్స్

పైన చెప్పుకున్న విద్యా సంస్థలతో పాటు ఇంజనీరింగ్ విద్యకు ప్రఖ్యాతిగాంచిన ఇతర విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి. వాటిలో బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) కూడా ఒకటి. బిట్స్ క్యాంపస్ లు పిలానీ, గోవా, హైదరాబాద్ లో ఉన్నాయి. వీటితో ఇంజీనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు గాను బిట్ శాట్ పరీక్ష ఏటా జరుగుతుంది. జేఈఈవలే ఇది కూడా చాలా కఠినమైన పరీక్షే అని చెబుతారు. పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది. బిట్ శాట్ రాసే వారు దేశంలోని ఏదేనీ గుర్తింపు ఉన్న బోర్డు నుంచి 10 2 చదివి ఉండాలి. ఫిజిక్స్, మేథమేటిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో  75 శాతం మార్కులు సంపాదించి ఉండాలి. దీనికి అదనంగా ప్రతీ సబ్జెక్టు పరంగా చూస్తే 60 శాతం మార్కులు ఉండాలి. ఇంగ్లిష్ లో నైపుణ్యం కూడా ఇక్కడ చాలా కీలకం. 

పరీక్షా విధానం

ఆన్ లైన్ లో మూడు గంటల పాటు జరుగుతుంది. అబ్జెక్టివ్ లేదా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతీ సరైన సమాధానానికి మూడు మార్కులు కలుస్తాయి. ప్రతీ తప్పుడు సమాధానానికి ఒక మార్కు తగ్గిపోతుంది. పార్ట్ 1లో ఫిజిక్స్ 40 మార్కులకు, పార్ట్ 2లో కెమిస్ట్రీ 40 మార్కులకు, పార్ట్ 3లో ఇంగ్లిష్ ప్రొఫీషియన్సీ 15 మార్కులకు, లాజికల్ రీజనింగ్ 10 మార్కులకు, పార్ట్4 కింద మేథమేటిక్స్ 45 మార్కులకు మొత్తం 150 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

వీఐటీ

తమిళనాడులో ఉన్న వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) కూడా ఇంజనీరింగ్ విద్య పరంగా పేరొందినది. ఈ సంస్థ ఏటా ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహిస్తుటుంది. గుర్తింపు ఉన్న ఇంటర్ బోర్డు నుంచి 10 2 లేదా ప్రీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అందించే హై స్కూల్ సర్టిఫికెట్ లేదా ఇంటర్నేషనల్ బకాలరేట్ డిప్లోమా లేదా అడ్వాన్స్ డ్ లెవల్ జనరల్ సర్టిఫికెట్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ రాసిన వారు వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోర్సులకు అర్హులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్/బయాలజీలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలు అయితే 50 మార్కులున్నా సరిపోతుంది. వీఐటీఈఈఈలో అభ్యర్థులు 160 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. రెండున్నర గంటల పాటు జరుగుతుంది. తప్పుడు జవాబులకు నెగటివ్ మార్కులు లేవు. 

మణిపాల్ యూనివర్సిటీ

మణిపాల్ యూనివర్సిటీ తన గుర్తింపు ఉన్న అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు ఏటా ఎంయూ సెట్ నిర్వహిస్తోంది. దీన్ని రాయాలంటే అభ్యర్థులు 10 2 రాసి ఉండాలి. ఇంటర్నేషనల్ బకాలరేట్ లేదా అమెరికన్ 12వ గ్రేడ్ లేదా ఫిజిక్స్, మ్యాథమేటిక్స్, ఏదేనీ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ లలో 50 శాతం మార్కులు సంపాదించుకోవాలి. ఫిజిక్స్, మ్యాథమేటిక్స్, ఇంగ్లిష్ తప్పనిసరిగా చదివి ఉండాలి. కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయాలజీ అన్నవి ఆప్షనల్ సబ్జెక్టులు. రెండున్నర గంటల పాటు పరీక్ష జరుగుతుంది. 200 ప్రశ్నలు ఉంటాయి. అందులో ఫిజిక్స్ కు 50, కెమిస్ట్రీకి 50, మ్యాథమేటిక్స్ కు 70 మార్కులు, ఇంగ్లిష్ అండ్ జనరల్ ఆప్టిట్యూడ్ విభాగం నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. 

ఎస్ఆర్ఎం (శ్రీ రామస్వామి మెమరియల్ ) యూనివర్సిటీ

ఇది డీమ్డ్ యూనివర్సిటీ. తమిళనాడులో ఉంది. ఎస్ఆర్ఎంకు చెందిన క్యాంపస్ లలోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా ఎస్ఆర్ఎంఈఈఈ పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు 10 2 పాసై ఉండాలి. లేదా దీనికి సమాంతరంగా ఉన్న ఏదేనీ ఇతర కోర్సులను అయినా పూర్తి చేసి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులలో కనీసం 70 శాతం మార్కులు ఉండాలి.

పరీక్ష నాలుగు భాగాలుగా జరుగుతుంది. మొత్తం నాలుగు పార్ట్ లు, ఒక్కో పార్ట్ లో 35 మార్కులకు ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులలో ప్రతీ తప్పు జవాబుకు 1 మార్కు మైనస్ చేస్తారు. బయాలజీలో తప్పుడు సమాధానానికి 0.7 శాతం మైనస్ ఉంటుంది.

ఏఐటీఈ

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్స్ ఏటా రెండు రకాల పరీక్షలు నిర్వహిస్తుంటుంది. డిప్లొమా మెంబర్ కు పదో తరగతి చదివిన వారు, అసోసియేట్ మెంబర్ కు 10 2 చదివని వారు అర్హులు. అసోసియేట్ మెంబర్ పరీక్షకు ఇంటర్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులను చదివి ఉండాలి. ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ తదితర సబ్జెక్టులు చదివిన వారు కూడా అర్హులే. లేదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్స్ లో డిప్లోమా చేసిన వారు కూడా అర్హులే. అసోసియేట్ మెంబర్ షిప్ కు అర్హత పొందిన వారు సెక్షన్ ఏ, సెక్షన్ బీ పరీక్షలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండేళ్ల పాటు ప్రాక్టికల్ ట్రెయినింగ్ కూడా పూర్తి చేసుకుంటే వారికి ఇంజనీరింగ్ డిగ్రీకి సమానమైన ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ డిగ్రీని ప్రదానం చేస్తారు. 

ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా

ఏరో నాటికల్ ఇంజీనీరింగ్ విద్యకు పేరొందిన సంస్థ. ఈ సంస్థ ఏటా అసోసియేట్ మెంబర్ షిప్ ఎగ్జామ్ ను రెండు సార్లు నిర్వహిస్తుంటుంది. ఈ పరీక్షల్లో సెక్షన్ ఏ, సెక్షన్ బీ అని ఉంటాయి. వీటిలో ఉత్తీర్ణత సాధిస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఏరోనాటికల్ ఇంజీనీరింగ్ కు సమాన స్థాయి అర్హత లభిస్తుంది. దీనికి ప్రభుత్వ గుర్తింపు ఉంది. 10 2 ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టులను ప్రతీ దానిలో కనీసం 50 శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి. కోర్సునకు సంబంధించి ఇతర వివరాలను http://www.aerosocietyindia.in/ సైట్ నుంచి పొందవచ్చు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy