ap7am logo

గ్యాస్ సిలిండర్ కూ ఎక్స్ పయిరీ డేట్ ఉంది.. గ్యాస్ కనెక్షన్ పై పూర్తి సమాచారం ఇదిగో!

Sat, Nov 12, 2016, 10:33 PM
Related Image

వంట గ్యాస్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే క్షేమంగా ఉంటాం. చాలా మందికి అసలు వంట గ్యాస్ సిలిండర్ నిర్వహణ, సిలిండర్ కు సంబంధించిన కొన్ని విషయాలు అసలే తెలియవు. అయినా వాడేస్తుంటారు. ముఖ్యంగా ప్రతీ వంట గ్యాస్ సిలిండర్ పై ఎక్స్ పయిరీ తేదీ ఉంటుందన్న విషయం తెలిసిన వారు అతి కొద్ది మందే. ఈ గడువు దాటిన తర్వాత మీ ఇంటికి చేరే సిలిండర్లలో లీకేజీలు ఏర్పడవచ్చు. ప్రమాదం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

representataive imageతస్మాస్ జాగ్రత్త...

నిజానికి వంటగ్యాస్ పై ఎక్స్ పయిరీ తేదీ విషయం పౌర సరఫరాల శాఖ అధికారుల్లోనూ అందరికీ తెలియదు. ప్రతీ 100 సిలిండర్లలో సుమారు పది లోపు సిలిండర్లు గడువు దాటిన తర్వాతే కస్టమర్లకు సరఫరా అవుతున్నట్టు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తెలుస్తోంది. ప్రతీ సిలిండర్ పై భాగంలో పట్టుకునేందుకు గుండ్రటి హ్యాండిల్ వలే ఉంటుంది. దానికి, సిలిండర్ కు సపోర్టెడ్ గా మూడు ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లపై లోపలి వైపు అంకెలు వేసి ఉండడాన్ని గమనించవచ్చు. ఈ మూడింటిలో ఒక దానిపై ఆ సిలిండర్ ఎక్స్ పయిరీ తేదీ కూడా ఉంటుంది. దీనిపై సంవత్సరం, నెల వివరాలు ఉంటాయి.

నిజానికి ఇది ఎక్స్ పయిరీ తేదీ కాదు. ఆ సిలిండర్ ను ఆ గడువు వరకే వాడుకోవచ్చన్న సూచనగా పరిగణించాలి. అంటే సిలిండర్ తిరిగి పరీక్షలకు వెళ్లాల్సి ఉన్న గడువు ఇది. ప్రతీ సిలిండర్ ను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోపు భద్రతా ప్రమాణాల దృష్ట్యా తనిఖీ చేస్తుంటారు. ఇలా చేయాలని కూడా చట్టం నిర్దేశిస్తోంది. వంటగ్యాస్ సిలిండర్ పై ఉన్న గడువు దీన్నే సూచిస్తుంది. ఎలా అంటే సంవత్సరం, నెల... ఆ సంవత్సరం, ఆ నెలలో ఆ సిలిండర్ ను పరీక్షించాల్సి ఉందని అర్థం. పరీక్షా సమయంలో లోపాలను గుర్తిస్తే సరిచేసిన తర్వాత భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) నుంచి ధ్రువీకరణ సర్టిఫికెట్ ను పొందాలి. ఈ సిలిండర్ వాడేందుకు అనువైన ప్రమాణాల మేరకు ఉందని ఈ ధ్రువీకరణ అన్నమాట. ఆ తర్వాతే సంబంధిత సిలిండర్ పంపిణీకి అందుబాటులోకి వస్తుంది. సిలిండర్ల టెస్టింగ్ సేవలను కాంట్రాక్టర్ల ద్వారా గ్యాస్ కంపెనీలు పొందుతుంటాయి.

పరీక్షలో పాస్ అయితే...?

ఇలా చట్ట ప్రకారం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత మరో ఐదేళ్ల పాటు ఆ సిలిండర్ వాడేందుకు భద్రత దృష్ట్యా సురక్షితమైనదని అర్థం. ఇలా పరీక్షలు పూర్తి చేసుకున్న సిలిండర్ పై మళ్లీ తిరిగి ఎప్పుడు పరీక్షలకు వెళ్లాల్సి ఉందో... ఆ సంవత్సరం, నెల వివరాలను ముద్రిస్తారు. అదే కొత్త సిలిండర్ అయితే, ఇలా చట్టబద్ధమైన పరీక్షల గడువు 10 ఏళ్ల తర్వాత ఉంటుంది సాధారణంగా ప్రత్యేకమైన ఉక్కుతో సిలిండర్ లోపల సురక్షితమైన కోటింగ్ తో బీఐఎస్ ప్రమాణాల మేరకు తయారు చేస్తుంటారు. వాటికి చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ ప్లోజివ్స్, బీఐఎస్ అనుమతులు కూడా తీసుకుంటారు.  

రెండోసారి సిలిండర్ లో లోపాలు కనిపిస్తే...?

ఒకసారి లోపాలు కనిపించి వాటిని సరిచేసి బీఐఎస్ ధ్రువీకరణ తీసుకున్న సిలిండర్ లో మరోసారి పరీక్షల సమయంలో లోపాలు కనిపిస్తే దాని కథ అంతటితో సమాప్తం. అంటే దాన్ని గ్యాస్ కంపెనీలు వినియోగంలోకి పంపకుండా తుక్కు కింద పక్కన పెట్టేయాల్సి ఉంటుంది.  

representataive image

ఎక్స్ పయిరీ గడువు ఎలా తెలుసుకోవడం...

ఫలానా సంవత్సరం, ఫలానా నెలలో సిలిండర్ పరీక్షలకు వెళ్లాల్సి ఉందన్న సంకేతాన్ని సిలిండర్ పై గుర్తించడం చాలా సులభం. సిలిండర్ పై ఉన్న మెటల్ ప్లేట్లలో ఒకదానిపై లోపలివైపు ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు మీ ఇంట్లో సిలిండర్ పై A 17 అని ఉందనుకోండి. కచ్చితంగా అదే ఎక్స్ పయిరీ తేదీ. A (జనవరి నుంచి మార్చి వరకు). అంటే ఆ సిలిండర్ ఆ సంవత్సరం మొదటి త్రైమాసికం చివరితో గడువు తీరిపోతుందని అర్థం. మార్చి తర్వాత తిరిగి పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాతే పంపిణీకి రావాల్సి ఉంటుంది. B(ఏప్రిల్ - జూన్) అంటే జూన్ వరకు గడువు ఉన్నట్టు. C (జూలై - సెప్టెంబర్), D (అక్టోబర్ - డిసెంబర్).

ఆ గడువు దాటితే వాడరాదా...?

ప్రతీ సిలిండర్ పై ఉన్న గడువు తర్వాత మరో మూడు నెలలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అంటే కస్టమర్ దగ్గరకు వెళ్లిన సిలిండర్ తిరిగి డీలర్ వద్దకు చేరి అక్కడి నుంచి గ్యాస్ రీఫిల్లింగ్ స్టేషన్ కు చేరుకునేందుకు వీలుగా ఈ గ్రేస్ పీరియడ్. అంతేకానీ, కస్టమర్లు వాడుకునేందుకు కాదు. అంటే A 2017 గడువుతో ఉన్న సిలిండర్ ను మార్చి నెల తర్వాత గ్యాస్ డీలర్ మీకు పంపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని స్వీకరించవద్దు. దానికి బదులు గడువు ఉన్న మరో సిలిండర్ ఇవ్వాలని డిమాండ్ చేయాలి. ఆ మేరకు వినియోగదారుడికి పూర్తి హక్కులు ఉన్నాయి.

ఇలా చేస్తే ఎలా తెలుస్తుంది...?

కస్టమర్లలో అవగాహన తక్కువే కనుక గ్యాస్ కంపెనీలు గడువు తీరిన వెంటనే అన్ని సిలిండర్లను విధిగా పరీక్షలకు పంపడం లేదు. వెసులుబాటును బట్టి పంపిస్తుంటారు. అవగాహన పెరిగి ప్రశ్నించడం ఎక్కువైతే అప్పుడు గడువు దాటిన సిలిండర్లను మార్కెట్లోకి పంపించేందుకు గ్యాస్ కంపెనీలు సాహసం చేయలేవు. ప్రస్తుతం అవగాహన తక్కువే కనుక ఇలా చేస్తున్నారు. అయితే, కొంత మంది డీలర్లు ఈ ఎక్స్ పయిరీ తేదీని పెయింట్ తో మార్చుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కనుక అవగాహన ద్వారానే దీనికి చెక్ పెట్టడం సాధ్యం అవుతుంది.

ఐవోసీ ఏమంటోంది...?

నిజానికి పాడయ్యే ఉత్పత్తులకే ఎక్స్ పయిరీ తేదీ ఉంటుంది కానీ సిలిండర్లకు కాదన్నది ఐవోసీ వాదన. ఉదాహరణకు ఆహార ఉత్పత్తి అయితే నిర్ణీత గడువు లోపల వాడుకోవాల్సి ఉంటుందని, సిలిండర్ విషయానికొస్తే చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. ఉష్ణోగ్రత, లోపల గ్యాస్ ఒత్తిడి, వాతావరణంలో మార్పుల ప్రభావం, వినియోగం, లోడ్ ఇవన్నీ కూడా ఎల్పీజీ సిలిండర్ మన్నికపై ప్రభావం చూపిస్తాయని ఐవోసీ వివరించింది.

తనిఖీ చేయాల్సిందే...

ప్రతీసారీ ఫిల్లింగ్ కోసం వచ్చిన ఖాళీ సిలిండర్ ను ప్లాంట్ లో అధికారులు విధిగా తనిఖీ చేయాలి. దాని వల్ల ఏవైనా లోపాలున్నాయేమో తెలుస్తుంది. అందులో భాగంగా తదుపరి చట్టబద్ధమైన పరీక్షలు నిర్వహించాల్సిన తేదీ, సంవత్సరాన్ని కూడా చూస్తారు. కనుక దాదాపుగా ఎక్స్ పయిరీ తేదీ దాటిన తర్వాత సిలిండర్లు పంపిణీకి రావడం చాలా తక్కువగానే ఉంటుంది.

డీలర్లు సైతం పరిశీలించాలి...

డీలర్లకు కూడా ఈ విషయంలో కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. కస్టమర్లకు అందించే ప్రతీ సిలిండర్ ను విధిగా స్టాట్యూటరీ టెస్టింగ్ తేదీని పరిశీలించి ఇవ్వాలి. ఒకవేళ గడువు దాటినది అయితే, దానికి బదులు మరొక దాన్ని కస్టమర్ కు డెలివరీ చేయాలి. గడువు దాటిన సిలిండర్ ను టెస్టింగ్ కు వీలుగా తిరిగి కంపెనీకి పంపించాల్సి ఉంటుంది.

కొంత మంది కస్టమర్ల గ్యాస్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. ఆరు నెలలకు గానీ ఓ సిలిండర్ తీసుకోరు. ఇలాంటి వారి దగ్గర గడువుకు చివర్లో వచ్చిన సిలిండర్ గడువు తీరిపోయి ఉండవచ్చు. ఇలాంటి వాటిని తిరిగి కంపెనీలను చేరిన తర్వాత పరీక్షలకు పంపిస్తుంటారు.

ఇది మన బాధ్యత

సాధారణంగా భద్రత దృష్ట్యా ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, సహచర ఉద్యోగులు అందరితోనూ పంచుకోవడం వల్ల వారికి మేలు చేసిన వారవుతారు.

భద్రత కోసం ఈ విషయాలు

గ్యాస్ రబ్బర్ ట్యూబ్: ఎల్పీజీ సిలిండర్ కు, గ్యాస్ స్టవ్ కు మధ్య అనుసంధానంగా రబ్బర్ ట్యూబు ఉంటుంది. నూతన గ్యాస్ కనెక్షన్ లో భాగంగా కొత్త స్టవ్, రెగ్యులేటర్, ట్యూబ్, లైటర్ అన్నీ వస్తాయి. వీటిలో సిలిండర్ నుంచి గ్యాస్ స్టవ్ కు గ్యాస్ ను తీసుకుని పోయే ట్యూబ్ చాలా కీలకమైనది. ప్రమాదాలకు ఎక్కువ ఆస్కారం ఉండేది ఇది. పైగా రబ్బర్ తో తయారైనది కనుక దెబ్బతినే అవకాశాలు కూడా ఎక్కువే. అందుకే ఈ ట్యూబ్ ను ఎప్పటికప్పుడు నెర్రులు బారిందేమో పరీక్షించుకోవాలి. ప్రతీ రెండేళ్లకోసారి గ్యాస్ ట్యూబ్ ను విధిగా మార్చుకోవాలి. కనీసం ఒకటిన్నర మీటర్ల పొడవు ఉండాలి. రెండోసారి తీసుకునే ట్యూబ్ ను గ్యాస్ డీలర్ నుంచే తీసుకోవడం మంచిది. అది కూడా ఐఎస్ఐ మార్కుదా, కాదా? అన్న విషయాన్ని పరిశీలించుకోవాలి. ఐఎస్ఐ మార్కు లేకుంటే తీసుకోవద్దు. అసలు ప్రతీ ఆరు నెలలకోసారి ట్యూబ్ మార్చుకోవడం అత్యంత సురక్షితం.  

representataive image

రెగ్యులేటర్: గ్యాస్ రెగ్యులేటర్ నుంచి లీకేజీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని రెగ్యులేటర్ ను క్రమం తప్పకుండా పరీక్షిస్తూ ఉండాలి. గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ ఎంత ప్రెషర్ తో విడుదలయ్యేది దీని ద్వారా నియంత్రించుకోవచ్చు. ప్రతీ సారీ వంట పూర్తయిన తర్వాత రెగ్యులేటర్ ను కూడా ఆఫ్ చేసుకోవడం సురక్షితమైన చర్య. ఒకవేళ ఎప్పుడైనా గ్యాస్ వాసన వస్తుంటే ఆ సమయంలో అగ్గిపుల్ల వెలిగించడం, లైట్ వేయడం వంటివి చేయవద్దు. ఒకవేళ అప్పటికే లైట్ వేసి ఉంటే ఆఫ్ చేయాలి. అన్ని డోర్లు, కిటికీల తలుపులు తెరిచి ఉండాలి. ఆ తర్వాత సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేసి ఉండకపోతే వెంటనే ఆఫ్ చేసి రెగ్యులేటర్ ను తొలగించాలి. సిలిండర్ ను బయటకు తీసుకొచ్చి లీకేజీ ఎక్కడి నుంచి వస్తుందో గమనించాలి.  

గ్యాస్ స్టవ్ కు ఉండే ఆన్ ఆఫ్ బటన్లను ఆఫ్ చేసి గ్యాస్ లైటర్ తో వెలిగించి చూడండి. అవి సరిగా పనిచేయకపోతే గ్యాస్ విడుదల అయ్యి వాసన వస్తుంది. ముఖ్యంగా గ్యాస్ ట్యూబ్, రెగ్యులేటర్, గ్యాస్ సిలిండర్ వాల్వ్ వద్దే ఈ లీకేజీలు చోటు చేసుకుంటుంటాయి. అవసరమైతే అత్యవసర సహాయ నంబర్ కు కాల్ చేసి విషయం తెలియజేస్తే గ్యాస్ కంపెనీ నుంచి ఓ వ్యక్తి వచ్చి సిలిండర్ ను పరీక్షిస్తారు.

వంట చేసే సమయంలో...: నైలాన్ తరహా వస్త్రాలు ధరించి వంట చేయడం సురక్షితం కాదు. కిచెన్ లో మండే స్వభావం ఉన్నవి, పెంచే వాటిని ఉంచరాదు, ఉదాహరణకు పేపర్లు, వస్త్రాలు, పెట్రోల్, కిరోసిన్ వంటివి అన్నమాట. గ్యాస్ సిలిండర్ స్థాయి కంటే దిగువన గ్యాస్ స్టవ్ ఉండరాదు. అంటే గ్యాస్ సిలిండర్ ఎత్తుకంటే పైనే ఉండాలి. తగినంత వెలుతురు ఉండే గదిలోనే గ్యాస్ సిలిండర్ ను ఉంచుకోవడం సురక్షితం. కిచెన్ లోనే స్పేర్ సిలిండర్ (గ్యాస్ తో ఉన్నది) ఉంచుకోవడం సురక్షితం కాదు. సిలిండర్ ను పక్కకు వంచి వాడుకోరాదు. ఇలాంటి సురక్షితమైన చర్యలను పాటిస్తేనే అనుకోని ప్రమాదం జరిగితే గ్యాస్ కంపెనీల తరఫు నుంచి పరిహారం లభిస్తుంది. 

representataive image

గ్యాస్ తో ఉన్న సిలిండర్ ఎండకు, తడికి, వేడికి ఎక్స్ పోజ్ కారాదు. రెగ్యులేటర్ లో లోపం కనిపిస్తే దాన్ని డీలర్ వద్ద నిర్ణీత రుసుం చెల్లించి కొత్తది పొందవచ్చు. ఇంటికి గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చిన వ్యక్తినే దాన్ని తనిఖీ చేయాలని కోరండి. క్యాప్ తీసి ఎటువంటి లీకేజీలు లేవనే విషయాన్ని ధ్రువీకరించుకోవడం కస్టమర్ గా మన కున్న హక్కు. 

ప్రతీ సిలిండర్ పై ఆ సిలిండర్ గ్యాస్ కాకుండా ఎంత బరువు ఉందన్న నంబర్ వేసి ఉంటుంది. అలాగే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 14.2 కిలోలు అన్న విషయం తెలిసిందే, దీన్ని గ్యాస్ సిలిండర్ నెట్ వెయిట్ ను కలిపి  మొత్తం అంత బరువు సిలిండర్ ఉందేమో చూడాలి. అందుకోసం ఇంటికి గ్యాస్ సిలిండర్ ను తెచ్చిన సమయంలోనే దాని బరువు కొలిచి చూపించాలని కోరవచ్చు. అలా  అడిగితే చూపిించాల్సిన బాధ్యత డెలివరీ బోయ్ పైనే ఉంటుంది.  ప్రతీ సిలిండర్ వాల్వ్ (ఇత్తిడితో గుండ్రంగా ఉంటుంది) లోపల పరిశీలిస్తే గుండ్రంగా నల్లటి ఓచర్ ఉంటుంది. ఇది కట్ అయి ఉన్నా లేక అసలు లేకపోయినా... రెగ్యులేటర్ ఆన్ చేసిన సమయంలో లీకేజీ జరుగుతుంది. కనుక ఈ వోచర్ దెబ్బతింటే మార్చుకోవాల్సి ఉంటుంది. 

కస్టమర్ల హక్కులు

- గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యుల పేరిట ఆ కనెక్షన్ ను మార్చుకో్వచ్చు.

- బుక్ చేసిన ఏడు పనిదినాల్లోపు సిలిండర్ ను కస్టమర్ కు అందివ్వాలన్నది నిబంధన. అయితే, కంపెనీలో సాంకేతిక, కార్మికుల పరంగా ఏర్పడే అవాంతరాల సమయాలలో ఈ విషయంలో మినహాయింపు ఉంది.

- కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు, డాక్యుమెంట్లు ఉంటే వెంటనే అంటే అదే రోజు కనెక్షన్ జారీ చేయాలి.

- కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నట్టు అయితే స్టవ్ ను కూడా డీలర్లు అంటగడుతుంటారు. కానీ నిబంధనల ప్రకారం డీలర్ దగ్గరే స్టవ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బీఐఎస్ ధ్రువీకరణ ఉన్న ఏ ఇతర కంపెనీ గ్యాస్ స్టవ్ అయినా నిక్షేపంగా కొనుగోలు చేసి వాడుకోవచ్చు.

- డొమెస్టిక్ గ్యాస్ ను వాహనాల కోసం వినియోగించడం చట్టరీత్యా నేరం. దీనికి బదులు ఆటోగ్యాస్ కొనుగోలు చేసి వాడుకోవచ్చు. 

ఇంటికి గ్యాస్ సిలిండర్ వచ్చిన తర్వాత...

పైన సీల్ ను చెక్ చేసుకోవాలి. సేఫ్టీ క్యాప్ కు ఎటువంటి క్రాక్స్ ఉండరాదని నిబంధనలు చెబుతున్నాయి. క్యాప్ తెరచి లీకేజీ ఉందేమో పరీక్షించాలి. వేలితో వాల్వ్ ను మూసి ఉంచినట్టయితే... లీకేజీ ఉంటే లీక్ అయిన గ్యాస్ వేలిని పైకి నెడుతుంది. లీకేజీ ఉంటే కనుక ఆ సిలిండర్ ను తీసుకోవద్దు. అలాగే, గడువు దాటిన సిలిండర్ ను కూడా తీసుకోవద్దు. 

representataive image

తనిఖీ అవసరం

నిబంధనల ప్రకారం గ్యాస్ కంపెనీ మెకానిక్ ప్రతి రెండేళ్లకోసారి గ్యాస్ కనెక్షన్ ను తనిఖీ చేయాలి. స్టవ్, ట్యూబ్, రెగ్యులేటర్ తదితర పార్ట్స్ అన్నీ సరిగా ఉన్నాయో లేదో చూస్తారు. వీరికి కంపెనీలు ఐడెంటిటీ కార్డులు కూడా ఇస్తాయి. కనుక ఐడెంటిటీ కార్డు చూసి మెకానిక్ అని భావిస్తేనే అనుమతించాలి. సందేహం వస్తే గ్యాస్ డీలర్ కు ఫోన్ చేసి కనుక్కోవాలి. తనిఖీ చేసినందుకు కనీస సర్వీసు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

కనెక్షన్ మార్చుకోవాలంటే...?

ప్రస్తుతం హెచ్ పీ గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఉన్నారు. డీలర్ సర్వీసు మీకు నచ్చలేదు. సర్దుకుపోవాల్సిన పని అసలే లేదు. సమీపంలోని మరో హెచ్ పీ గ్యాస్ డీలర్ కు మారిపోవచ్చు. అలాగే ప్రస్తుతం ఉంటున్న ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినప్పుడు గ్యాస్ కనెక్షన్ ను బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది.

అదే డీలర్ సర్వీసు ఏరియా పరిధిలోని మరో ప్రాంతానికి మారితే చిరునామా మార్పు ధ్రువీకరణ ఇవ్వడం ద్వారా సింపుల్ గా రికార్డుల్లో చిన్న మార్పుతో సరిపోతుంది. అలా కాకుండా కొత్త ప్రదేశానికి వెళ్లినా, డీలర్ సేవలు నచ్చకపోయినా అప్పుడు ప్రస్తుత డీలర్ ను  సంప్రదించి ట్రాన్స్ ఫర్ టెర్మినేషన్ వోచర్ ను పొందాలి. దాన్ని, నూతన నివాస చిరునామాకు సంబంధించిన ఆధారం, కన్జ్యూమర్ కార్డుతో కొత్త డీలర్ ను సంప్రదించాలి.

ఒక పట్టణంలో ఉంటూ ఆ పట్టణ పరిధిలోనే మరో డీలర్ కు మారేట్టు అయితే గ్యాస్ సిలిండర్లు, రెగ్యులేటర్ స్వాధీనం చేయవలసిన అవసరం లేదు. వాటినే తీసుకెళ్లవచ్చు. అలా కాకుండా కొత్త ప్రాంతానికి మారిపోతే వంటగ్యాస్ సిలిండర్లు, రెగ్యులేటర్ ను డీలర్ కు స్వాధీనం చేయాలి. అప్పుడు డీలర్ ట్రాన్స ఫర్ టెర్మినేషన్ వోచర్, గ్యాస్ కనెక్షన్ తీసుకునే సమయంలో చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్లను వాపసు చేస్తాడు. దాంతో మారిన ప్రాంతంలోని డీలర్ నుంచి కనెక్షన్ పొందాల్సి ఉంటుంది.  

కస్టమర్ కేర్ నంబర్లు

18002333555 ఇది చార్జీలు లేని ఉచిత కాల్ నంబర్. ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్ కస్టమర్లు ఈ నంబర్ కు కాల్ చేసి ఎటువంటి సందేహాలైనా తీర్చుకోవచ్చు. ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. హెచ్ పీ గ్యాస్ వినియోగదారులు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు అయితే 9666023456కు కాల్ చేయాల్సి ఉంటుంది. 

ఎల్పీజీ అత్యవసర సహాయ నంబర్ 1906. ప్రభుత్వ రంగంలోని కంపెనీలకు చెందిన అన్ని రకాల ఎల్పీజీ వినియోగదారులకు అత్యవసర సాయం అందించేందుకు వీలుగా మోదీ సర్కారు ఈ 2016 జనవరి నుంచి టోల్ ఫ్రీ నంబర్ 1906ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజులో 24 గంటల్లో ఎప్పుడైనా ఈ నంబర్ కు కాల్ చేసి సాయం పొందవచ్చు.

12 సబ్సిడీ సిలిండర్లు ఎప్పుడైనా పొందవచ్చు

ఒక ఏడాదికి సబ్సిడీ రేటుపై 12 సిలిండర్లను ఒక వినియోగదారుడికి అందించాలనేది ప్రభుత్వ పరిమితి. అంటే నెలకొకటి అని గతంలో ఉండేది. ఒక నెలలో తీసుకోకపోతే ఆ నెలకు సంబంధించిన సబ్సిడీ సిలిండర్ ను తర్వాత పొందేందుకు వీలుండేది కాదు. దీన్ని మోదీ సర్కారు మార్చింది. దీని ప్రకారం ఏడాదిలో ఎన్ని సిలిండర్లను అయినా వాడుకోవచ్చు. ఒక నెలలో రెండు సిలిండర్లు అయినా పొందవచ్చు. కాకపోతే ఒక ఆర్థిక సంవత్సరంలో మొదటి 12 సిలిండర్లకు మాత్రమే సిబ్సిడీ రేటు వర్తిస్తుంది. ఆ తర్వాత తీసుకునే సిలిండర్లకు మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది.

 ఆరు నెలల్లో ఒక్కసారీ సిలిండర్ తీసుకోకుంటే..?

ఆరు నెలల కాలంలో ఒక్క సిలిండర్ కూడా తీసుకోకపోతే సదరు కనెక్షన్ ను రద్దు చేసే అధికారం కంపెనీలకు ఉంది. రద్దు చేసినప్పటికీ తిరిగి ఆ కనెక్షన్ ను యాక్టివేట్ చేయించుకోవచ్చు. అందుకోసం చిరునామా, గ్యాస్ కనెక్షన్ సీవీతో డీలర్ ను సంప్రదించి దరఖాస్తు సమర్పించాలి. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత డీలర్ తిరిగి కనెక్షన్ ను యాక్టివేట్ చేస్తాడు. ఒకవేళ డీలర్ పరిశీలనలో అప్పటికే ఆ కస్టమర్ కు వేరొక కనెక్షన్ ఉందని తేలితే కనెక్షన్ ను స్వాధీనం చేయాలని కోరతారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy