ap7am logo

ఆస్తులపై ఆదాయం సంపాదించుకోండిలా...!

Mon, Nov 07, 2016, 11:50 AM
Related Image

కష్టపడి సంపాదించిన ప్రతీ రూపాయి మనకు తిరిగి ఎంతో కొంత సంపాదించి పెట్టాలి. లేకుంటే ఆ కష్టానికి పెద్దగా ప్రయోజనం మిగలనట్టే. సంపన్నుల సంగతి పక్కన పెడితే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలకు క్రమానుగత ఆదాయం తప్పనిసరి. స్వయం ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం పని ఏదైనా గానీ వచ్చిన ఆదాయం నుంచి కొంత ఆస్తులవైపు మళ్లించడం ద్వారా మంచి రాబడి అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆస్తులపై ఆదాయానికి ఉన్న మార్గాలను చూద్దాం.

భూమి విలువ పెరిగేదే కానీ తరిగేది కాదు. 2050 నాటికి మరో 34 ఏళ్లలో దేశంలో అదనంగా 60 కోట్ల మంది జనాభా వృద్ధి చెందుతుందని అంచనాలు ఉన్నాయి. అంటే ఆ మేరకు నివాసాలకు డిమాండ్ ఉంటుంది కదా. అదే సమయంలో జనాభా వృద్ధికి అనుగుణంగా నివాస వసతులు ఆ స్థాయిలో పెరగవు. అందుకే ముందు చూపుతో వ్యవహరిస్తే భూమిపై పెట్టుబడితో మాంచి ఆదాయాన్ని ఆర్జించడానికి వీలుంటుంది.

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లేదా స్థలాలు, ఇళ్లపై పెట్టుబడులు మిగిలిన అన్ని పెట్టుబడి సాధనాల కంటే ఎక్కువ రాబడులను ఇస్తాయని ఇప్పటి వరకు ఉన్న చరిత్రను చూస్తే తెలుస్తుంది. అందుకే యుక్త వయసు నుంచి మధ్య వయసులోపు వారు తమ పొదుపులో అధిక భాగాన్ని వీటివైపు మళ్లించడం ద్వారా ఎన్నో విధమైన ప్రయోజనాలను అందుకోవచ్చు.  

ఒకప్పుడు జీవిత కాలం పాటు సంపాదించి కూడబెట్టిన దాంతో... వృద్ధాప్యంలో ఓ ఇల్లు సమకూర్చుకునేవారు. కాలం మారింది. ఆర్జన మార్గాలు పెరిగిపోయాయి. ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. మంచి ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపే ఇల్లు కోసం ప్లాన్ చేసుకుంటోంది నేటి యువత. నిజానికి ఇదే సరైన విధానం అన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే ఆదాయపన్ను మినహాయింపుల నుంచి గరిష్టంగా లబ్ధి పొందవచ్చు. ఇంటి కోసం కొన్న స్థలం విలువ రుణం తీర్చివేసేలోపు భారీగా పెరుగుతుంది. ఆ తర్వాత అదే ఆస్తిని ఆదాయాన్నిచ్చే బంగారు బాతుగా మలచుకోవచ్చన్నది ఆర్థిక పండితుల సూచన.

representation image

ఇది చూడండి...

ఉదాహరణకు రాజీవ్ కు 26ఏళ్లు. కొత్తగా పెళ్లయింది. ఉద్యోగంలో చేరి కూడా మూడేళ్లే అయింది. హైదరాబాద్ నగరంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇంటిని అద్దెకు తీసుకుని రూ.10వేల రూపంలో నెలనెలా అద్దె చెల్లిస్తున్నాడు. ఏడాది తర్వాత ఓ రోజు ఇంటి యజమాని వచ్చి వచ్చే నెల నుంచి ఇంటి అద్దె రూ.11 వేలు అని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో రాజీవ్ లో ఆలోచన మొదలైంది. ఇంటికి ఇంత అద్దె చెల్లించడం సమంజసమేనా..? అన్న ఆలోచన మొదలైంది.

మరుసటి రోజు సన్నిహిత మిత్రుడిని తీసుకుని తాను పనిచేస్తున్న ఆఫీసుకు 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోపు తక్కువ బడ్జెట్ లో ఉన్న ఇళ్లకోసం ప్రయత్నించాడు. చివరికి రూ.22 లక్షల్లో నూతన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు సంపాదించాడు. అద్దె ఇల్లు ఖాళీ చేసి ఆ ఇంట్లోకి మారిపోయాడు. ఇంటి కోసం సొంతంగా కొంత సమకూర్చుకుని రూ.14 లక్షల రుణం తీసుకున్నాడు. 20 ఏళ్ల కాల వ్యవధి నిర్ణయించుకున్నాడు. అప్పటి వడ్డీ రేటు ప్రకారం నెలనెలా రూ.12,867 రూపాయల ఈఎంపై చెల్లించడం మొదలు పెట్టాడు.

ప్రయోజనాలు చూద్దాం

- రాజీవ్ అద్దె ఇంట్లోనే ఉండి ఉంటే నెలకు రూ.11వేలు చెల్లించాల్సి వచ్చేది. దానికి బదులు అతడు రుణంపై సొంత ఇంటికి మారిపోవడం వల్ల  అదనంగా చెల్లించేది కేవలం రూ.1,867 రూపాయలే.

- ఇక్కడ ఇంకో ప్రయోజనం ఉంది. ఏటేటా అద్దె పెరుగుతూనే ఉంటుంది. కానీ ఇంటిపై తీసుకున్న రుణం ఈఎంఐ పెరగదు. ఏదో వడ్డీ రేట్లలో మార్పులు జరిగితే తప్ప ఆ పెరుగుదల పరిమితంగానే ఉంటుంది. కనుక ఇంటిపై రుణం రూపంలో అతడిపై పడిన భారం ఏదీ లేనట్టే.

- నిన్నటి వరకు రాజీవ్ అద్దె ఇంట్లో ఉండే సగటు జీవి. మరి నేడో... ఓ ఇంటికే యజమాని. మెట్రో నగంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఉందంటే బంధు, మిత్ర వర్గంలో ఆ గుర్తింపే వేరు కదా.

- 20 ఏళ్ల తర్వాత ఆ ఇంటిపై సర్వ హక్కులు రాజీవ్ కే. ఎందుకంటే అద్దె రూపంలో చెల్లించే మొత్తంతోనే అతడు సొంతింటి రుణాన్ని తీర్చివేశాడు.

- రాజీవ్ 26 ఏళ్ల వయసులో కొన్న ఇంటి భూమి విలువ అతడికి 55 ఏళ్లు వచ్చే సరికి బాగా పెరిగిపోయింది. పైగా అతడు ఉంటున్న ప్రాంతం కూడా నగరంలో మరింతగా కలసిపోయి బాగా అభివృద్ధి చెందింది. దీంతో రాజీవ్ మరోసారి తన ఆలోచనకు పని చెప్పాడు.

- ఇంజనీర్ ను సంప్రదించి తన ఇంటి స్ట్రక్చర్ జీవిత కాలం గురించి, నాణ్యత గురించి విచారిండాడు. మరో 30, 40 ఏళ్లు చక్కగా మన్నుతుందని ఇంజనీర్ నుంచి సమాధానం వచ్చింది. వాస్తు పండితులను కూడా సంప్రదించాడు.

- తన డబుల్ బెడ్ రూమ్ ఇంటిపై మరో రెండు అంతస్తులకు ప్లాన్ చేశాడు. మొదటి అంతస్తులో తన కోసం డబుల్ బెడ్ రూమ్ హౌస్. రెండో అంతస్తులో రెండు సింగిల్ బెడ్ రూమ్ పోర్షన్లు. ఇక ప్రస్తుతం ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ ను ఆఫీస్ స్పేస్ గా మార్పు చేయించాడు. పార్కింగ్ కు కొంత స్థలం వదిలాడు. కిందా, పైనా కలిపి అద్దెల రూపంలో సుమారు రూ.36 వేలు వచ్చేలా ప్లాన్ చేశాడు.

- నిర్మాణ పెట్టుబడికి రూ.25 లక్షల వరకు వ్యయం అవుతుండడంతో తన ఇన్వెస్ట్ మెంట్స్ నుంచి ఓ రూ.15 లక్షల రూపాయలను సొంతంగానే సమకూర్చుకున్నాడు. బ్యాంకు నుంచి రూ.10 లక్షల రుణం తీర్చుకుని అనుకున్నట్టే నిర్మాణాలను పూర్తి చేశాడు.

- ఈఎంఐగా నెలకు రూ.10వేలు చెల్లించడం మొదలు పెట్టాడు.

-  రాజీవ్ ఇంకా రిటైర్ అవనేలేదు. కానీ అతడికి ప్రతీ నెలా అద్దెల రూపంలో రూ.26వేల ఆదాయం సమకూరుతోంది. పైగా ఈ అదాయం ఏటేటా కొంత మొత్తం పెరుగేదే. ఆస్తిపై ఆదాయం రాబట్టుకోవడం ఎలాగో అర్థం చేసుకునేందుకు కేవలం ఇదొక ఉదాహరణ మాత్రమే.

- అయితే, అందరికీ నూటికి నూరుపాళ్లు ఇదే విధంగా సాధ్యం అవుతుందని చెప్పలేం. దీని వెనుక ఎన్నో అంశాలు ఉంటాయి. ఆస్తిని కొనుగోలు చేసే ముందు భూమి మార్కెట్ విలువ, నిర్మాణ వ్యయం. ప్రస్తుతం అద్దె ఇంటికి చెల్లిస్తున్నది ఎంత, రుణం తీసుకుని సొంతంగా ఇంటికి ప్లాన్ చేసుకుంటే లాభం ఎంత, ఏ ప్రాంతంలో భూమి లేదా ఇల్లు కొనాలి, భవిష్యత్తులో వృద్ధికి ఏమంత అవకాశం ఉంది, ఆ ప్రాంతానికి రవాణా వసతులు, హాస్పిటల్స్, స్కూల్స్ అందుబాటు, అలాగే భవిష్యత్తులో వాణిజ్య ప్రాంతంగా మారే అవకాశాలు ఉన్నాయా? ఈ విధమైన కనీస లెక్కలను వేయగలిగే తెలివితనం ఉంటే రాజీవ్ లా మనకూ సాధ్యం కానిదేమీ లేదు. అయితే, ఇవేమీ తెలియకుంటే ఫైనాన్షియల్ ప్లానర్స్, రియల్టీ నిపుణులను సంప్రదించి తగిన ప్రణాళిక మేరకు అడుగులు వేయాల్సి ఉంటుంది.

నివాస భవనం లేదా వాణిజ్య భవనం ఏదైనా గానీ వాటిపై వచ్చే అద్దె ఆదాయం తీసుకున్న రుణంలో సగం నుంచి మూడొంతులు తీర్చేలా ప్లాన్ చేసుకుంటే అది చక్కని ఇన్వెస్ట్ మెంటే అవుతుంది. ఒకవేళ వాణిజ్యపరమైన ఆస్తిని కొన్నారనుకుందాం. అప్పుడు దానిపై అద్దె ఆదాయానికీ బోలెడు మార్గాలు ఉన్నాయి.

representation image

వాణిజ్య ఆస్తిపై ఆదాయం

ఉంటున్న ప్రాంతం, అక్కడి జనాభా, వాణిజ్య భవనాలకు ఉన్న డిమాండ్ ఇటువంటి అంశాలన్నీ ఆదాయాన్ని నిర్ణయించేవి. అందుకే కొనే భవనం వాణిజ్య ప్రాంతానికి దగ్గర ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఆ ఆస్తిని రిటైల్ విక్రయ షాపులకు, సూపర్ మార్కెట్లకు, రెస్టారెంట్లకు  అద్దెకు ఇవ్వవచ్చు. ఏదేనీ ప్రైవేటు సంస్థకు కార్యాలయంగానైనా ఇవ్వవచ్చు. లేదా బ్యాంకులకు అద్దెకివ్వడం ద్వారా మంచి ఆదాయానికి అవకాశం ఉంది.

స్థలం అయితే...

ఖాళీ స్థలం కొని వెంటనే నిర్మాణం చేసే ఆలోచన లేకపోతే దాన్ని లీజుకు ఇవ్వవచ్చు. తాత్కాలిక షెడ్ వేసుకుని వ్యాపారాలు చేసుకునే వారు ఎందరో ఉన్నారు. లేదా గోదాముగా మార్చి ఆదాయాన్ని పంచుకునే వారు కూడా ఉన్నారు. లేదా మరో మార్గంలో వెళితే మంచి ఆదాయాన్నే సమకూర్చుకోవచ్చు. అదెలా అంటే... ఖాళీగా ఉన్న స్థలాన్ని బిల్డర్ కు అప్పగించడం. డిమాండ్ ఉన్న ప్రాంతంలో 300 గజాలపైన స్థలం ఉంటే చాలు. స్థలాన్ని బిల్డర్ కు ఇచ్చేస్తే షేరింగ్ విధానంలో అందులో బహుళ అంతస్తుల నిర్మాణాలను అతడే చేసి స్థల యజమానికి కొంత వాటా అప్పగిస్తాడు. ఉదాహరణకు ఒక్కో అంతస్తుకు రెండు ఫ్లాట్స్ చొప్పున పది ఫ్లాట్స్ నిర్మించి అందులో అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం యజమానికి బిల్డర్ నాలుగు నుంచి ఐదు ఫ్లాట్స్ వరకు అప్పగించే అవకాశం ఉంది. వాటిని అద్దెకివ్వడం వల్ల మంచి ఆదాయమే వస్తుంది.

రిటైర్ అయ్యాకే ఇల్లే ఆదాయ వనరు

ఉద్యోగ కాలంలో పెద్దగా కూడబెట్టకపోయినా పర్లేదు. కష్టపడి సొంత ఇల్లు సమకూర్చుకుంటే చాలు. అదే విశ్రాంత జీవనంలో స్థిరమైన ఆదాయ వనరుగా అక్కరకు వస్తుందన్నది నిపుణుల సూచన. రిటైర్ అయిన తర్వాత సొంత ఇంటిపై రివర్స్ మార్ట్ గేజ్ రుణం తీసుకోవడం ద్వారా వారి జీవనం కోసం అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. వారి తదనంతరం లేదా కాల వ్యవధి తర్వాత బ్యాంకులు ఇంటిని విక్రయించి రుణం పోను మిగిలినది చెల్లిస్తాయి. తీసుకున్న వారు జీవించి లేకుంటే వారి వారసులకు చెల్లిస్తాయి.

దీని వల్ల రెండు ప్రయోజనాలున్నాయి. జీవించి ఉన్నంత కాలం సొంతింట్లోనే ఉండవచ్చు. పైగా ఆదాయం పొందవచ్చు. ఈ ఆదాయాన్ని వాయిదాలుగా లేదా ఏక మొత్తంగా అయినా తీసుకోవచ్చు. తలిదండ్రులు తీసుకున్న రివర్స్ మార్ట్ గేజ్ రుణాన్ని పిల్లలు తీర్చివేసి ఆ ఇంటిని సొంతం చేసుకునే అవకాశం ఉందన్న విషయాన్ని తెలుసుకోవాలి.

గృహ రుణానికి రివర్స్ లో పనిచేసేదే రివర్స్ మార్ట్ గేజ్ రుణం. ఇంటిపై రుణం తీసుకుంటే నెలనెలా వాయిదాల రూపంలో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. దానికి బదులు ఇంటిపై రివర్స్ మార్ట్ గేజ్ రుణం తీసుకుంటే బ్యాంకులు ఆ ప్రాపర్టీని తనఖా ఉంచుకుని యజమానికి రుణాన్ని వాయిదాలుగా లేదా ఏక మొత్తంగా ఇచ్చి నిర్ణీత కాలావధి తర్వాత వసూలు చేసుకుంటాయి.

అయితే ఈ రుణం ఎంతన్నది ఇంటి విలువను బట్టి నిర్ణయిస్తారు. విశ్రాంత జీవనంలో ఆదాయం కోసమే కాకుండా వైద్యం, ఇతర అత్యవసరాలకు, ఇంటి మరమ్మతులకు కూడా ఈ రివర్స్ మార్ట్ గేజ్ రుణం అక్కరకు వస్తుంది. అయితే, ఈ రుణాన్ని వ్యాపారం, ట్రేడింగ్ కోసం ఉపయోగించరాదు. ఒకవేళ రివర్స్ మార్ట్ గేజ్ రుణాన్ని ఏకమొత్తంగా తీసుకుని నెలనెలా ఆదాయాన్నిచ్చే పథకాల్లో పెట్టుకోవడం ద్వారాను ఆదాయం పొందవచ్చు.

దీనికి అర్హతలు

60 ఏళ్లు దాటి ఉండాలి. సొంత ఇల్లు అయి ఉండాలి. దానిపై రివర్స్ మార్ట్ గేజ్ రుణాన్ని సొంతంగా లేదా భార్యతో కలసి తీసుకోవచ్చు. ఇల్లు తనపేరు లేదా జీవిత భాగస్వామితో కలసి జాయింట్ గా ఉన్నా దీనికి అర్హత ఉంటుంది. కేవలం నివాసిత భవనంపైనే ఇది లభిస్తుంది. రుణం కాల వ్యవధి గరిష్ఠంగా 20 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ గడువు వరకు ఇంట్లోనే ఉండవచ్చు. ఆ తర్వాత కొనసాగాలంటే రుణాన్ని పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. గడువులోపల మరణానికి గురైతే వారి జీవిత భాగస్వామికి హక్కులు లభిస్తాయి.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy