ఈ దేశాల్లో మన కరెన్సీ రూపాయే అమూల్యం!

Sun, Nov 06, 2016, 10:25 AM
Related Image

అమెరికాలో ఉద్యోగం సంపాదించేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించే భారతీయ యువత ఎంతో మంది వున్నారు. అభివృద్ధి చెందిన దేశం, డాలర్ విలువ వారి ఆకర్షణల వెనుకనున్న అసలు అంశాలు. ఒక డాలర్ సుమారు 67 రూపాయలకు సమానం. అమెరికాలో కష్టపడి లక్షన్నర డాలర్లు సంపాదిస్తే మన కరెన్సీలో కోటీశ్వరుడు అయిపోవచ్చు. ఇదంతా ఒకవైపు. మరోవైపు తొంగి చూస్తే భారత కరెన్సీ రూపాయి చాలా దేశాల్లో దర్జా ఒలకబోస్తోంది. ఆయా దేశాల డబ్బుల కంటే మన రూపాయి విలువే అధికం. అలా అని అవేమీ అభివృద్ధికి సుదూరంలో ఉండిపోయిన దేశాలేమీ కాదు.

కొత్త కొత్తగా ఏ దేశాన్ని చుట్టి వద్దామా అనుకునే పర్యాటక ప్రియులు రూపాయి హవా ఉన్న దేశాలకు వెళ్లడం ద్వారా తక్కువ ఖర్చులో ఆయా దేశాల్లోని అందచందాలను చూసి రావడానికి వీలవుతుంది.

representation image

బెలారస్

ఇక్కడ ఒక రూపాయి 268 బెలారస్ రూబ్లెస్ తో సమానం. ఇది యూరోప్ కంట్రీ. తక్కువ ఖర్చులోనే యూరోప్ అందాలను చూద్దామనుకుంటే అందుకు బెలారస్ ను ఎంచుకోవచ్చు. ఇది మాజీ సోవియట్ నేషన్. ఈ దేశంలో పర్యటిస్తే ఆలుగడ్డలతో చేేసే డ్రానికి అనే వెరైటీ వంటకాన్ని తప్పకుండా రుచి చూడాల్సిందే.

representation image

కంబోడియా

ఇక్కడ మన రూపాయి 62 రీల్స్ తో సమానం. ఆలయాలకు, ప్రాచీన నిర్మాణ శైలికి కంబోడియా చిరునామా. ఈ దేశానికి పర్యాటకుల ద్వారా గణనీయమైన ఆదాయం లభిస్తోంది. ఇక్కడి అంగ్ కోర్ వాట్ టెంపుల్ చాలా ప్రశస్తమైనది. ఈ దేశానికి వెళితే మాంసాహార ప్రిియులు చేపలతో చేసే ఫిష్ మోక్ వెరైటీని టేస్ట్ చేయాల్సిందే. చేపలు, మూలికలు, అల్లం, నిమ్మరసం, లెమన్ గ్రాస్ తో చేసే ఈ వంటకం అక్కడ చాలా ఫేమస్. ముఖ్యంగా ఇక్కడ ఆహారం, డ్రింక్స్ ఖరీదు చాలా తక్కువ.

కోస్టారికా

ఇక్కడ భారత రూపాయి... 8 స్థానిక కొలొన్స్ తో సమానం. ఇది లాటిన్ అమెరికన్ కంట్రీ. అడవులు, బీచ్ లను ఇష్టపడే పర్యాటకులకు ఈ దేశం నప్పుతుంది. ఈ దేశంలో అద్భుతమైన బీచ్ రిసార్ట్ లు ఎన్నో ఉన్నాయి. చాలా పరిశుభ్రంగా, పచ్చదనంతో ఇక్కడి ప్రాంతాలు ఉంటాయి. జురాసిక్ పార్క్ సినిమా చిత్రీకరణ ఇక్కడే జరిగింది.

representation image

ఇండోనేషియా

ఇక్కడ మన ఒక రూపాయి 215 రూపియాలతో సమానం. వెయ్యికి పైగా ద్వీపాల సమూహం ఈ దేశం. మన దేశానికి దగ్గరగా ఉన్నది. ఒకప్పుడు మన దేశంతో ఈ దేశానికి అధిక స్థాయిలో వాణిజ్య లావాదేవీలు ఉండేవట. ఈ దేశంలో పర్యటిస్తే బాలి, జావా ప్రాంతాల్లోని ప్రజల సంస్కృతి, బీచ్ లు ఆకట్టుకుంటాయి. శాకాహారం, మాంసా హారం ఏదైనా సరే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ మోడల్ లో పెద్ద మూకుడులో నిమిషాల్లో చేసేసి వడ్డించేస్తారు. వీసా ఆన్ అరైవల్ విధానంలో ముందుగా వీసా తీసుకోకుండా ఈ దేశంలో అడుగు పెట్టవచ్చు. దిగిన తర్వాత వీసా జారీ చేస్తారు. దీని కాలపరిమితి 30 రోజులు.

representation image

పరాగ్వే

ఇక్కడ ఒక రూపాయి 84 గురానీలతో సమానం. ఈ దేశం పక్కనే బొలీవియా కూడా ఉంటుంది. ఈ దేశంలో ఎన్ కార్నేషియన్ అనే ప్రాంతం పర్యాటకంగా ఫేమస్. ఇక్కడ స్థానికంగా లభించే మూలికలతో తయారు చేసే డ్రింక్ చాలా ఫేమస్. మెర్సర్ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత చౌక వ్యయం గల దేశం పరాగ్వే. కనుక చాలా తక్కువ వ్యయంతోనే అందమైన అనుభూతులను సొంతం  చేసుకో్వచ్చు.

జింబాబ్వే

ఒక రూపాయి సుమారు 6 జింబాబ్వే డాలర్లకు సమానం. ఇక్కడ ద్రవ్యోల్బణం భయంకరమైన స్థాయిలో సుమారు 1281 శాతంగా ఉంది. కనుక చాలా తక్కువ ఖర్చుతోనే ఈ దేశాన్ని చుట్టి రావచ్చు. ప్రపంచంలో అద్భుతమైన జలపాతాలుగా పేరొందిన విక్టోరియా ఫాల్స్ ఇక్కడే ఉన్నాయి.  

మంగోలియా

ఇక్కడ భారతీయ రూపాయి స్థానిక కరెన్సీలో 30 తుగ్ రిక్ లతో సమానం. మాంసాహారం అంటే చెవి కోసుకునే వారు ఒక్కసారయినా ఈ దేశానికి వెళ్లి రావాలి. మటన్ సూప్ ఇక్కడ పాప్యులర్. మాంసాహార వెరైటీల్లో ఏది కావాలన్నా ఇక్కడి రెస్టారెంట్ లలో ఆర్డర్ చేయడం ఆలస్యం సిద్ధం చేసి వడ్డిస్తారు. 

representation image

శ్రీలంక

వీసా ఆన్ అరైవల్ కింద ముందుగా వీసా తీసుకునే పని లేకుండా శ్రీలంకలో పర్యటించవచ్చు. బీచ్ లు, జంగిల్స్, కొండలు, తేయాకు తోటలకు ఈ దేశం ఫేమస్. అంతేకాదు, పొరుగున ఉన్న శ్రీలంకలో రామాయణం తాలూకు ఎన్నో ఆనవాళ్లు ఉన్నాయి. హిందువులు సందర్శించాల్సిన ప్రాంతాలు ఎన్నో వున్నాయి.

వియత్నాం

ఒక రూపాయి = 339 డాంగ్ లతో సమానం. భారతీయ పర్యాటకులకు ఆన్ లైన్ వీసా సదుపాయం ఉంది. ఈ దేశంలో హాలాంగ్ బే అద్భుత సందర్శనీయ ప్రదేశం. ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటి. సాగరంలో చిన్న చిన్న కొండలు వాటి అందాల మధ్య బోట్ లో వెళుతూ మైమరిచిపోవాల్సిందే. ఇక్కడ కూడా మాంసాహార వంటకాలు ఫేమస్.

representation image

టాంజానియా

ఇక్కడ ఒక భారతీయ రూపాయి 33 షిల్సింగ్స్ తో సమానం. సెరెంగెటి, కిలిమంజారో వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలు ఇక్కడే ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులు తప్పకుండా చూడాల్సిన ఆఫ్రికన్ కంట్రీ. సమోసాలు ఇక్కడ చాలా పాప్యులర్

లావోస్

ఇక్కడ ఒక రూపాయి 122 కిప్ లకు సరిసమానం. అడుగు పెట్టిన తర్వాత వీసా తీసుకునే సదుపాయం ఉంది. థాయ్ ల్యాండ్, వియత్నాం దేశాలకు సమీపంలో ఉంది. ప్రాచీన బౌద్ధాలయాలకు ఇది కేంద్రం. ఉత్తర లావోస్ లోని ప్రపంచ వారసత్వ ప్రదేశమైన లువాంగ్ ప్రబాంగ్ తప్పక చూడాల్సిన ప్రదేశం. స్పైసీగా ఉండే ఆకుపచ్చని బొప్పాయి సలాడ్ ఇక్కడ తప్పకుండా రుచి చూడాల్సిన ఐటమ్.

representation image

నేపాల్

ఇది మన పొరుగునే ఉన్న హిమాలయన్ కంట్రీ. వీసా అవసరం లేదు. మన రూపాయి ఇక్కడ 1.61 నేపాలీ రూపాయలకు సమానం. మన దేశానికి సమీపంలో ఉండడం ప్రధాన అనుకూలత. ఎవరెస్ట్ పర్వతం చూడాల్సిన ప్రాంతం. మాంసం, గుడ్లు, రైస్ తో కలపి చేసే చాటామరి ఐటమ్ ఇక్కడ పాప్యులర్.

హంగరీ

ఒక రూపాయి 4.22 ఫోరింట్ లతో సమానం. ఒక రాత్రి విడిది ఖర్చు 700 రూపాయలకు మించి కాదు. అలాగే, స్థానికంగా రైళ్లలో ప్రయాణ ఖర్చు కూడా చాలా తక్కువే. ప్రకృతి అందాలకు ఈ దేశం కేంద్రంగా ఉంది.

representation image

అల్జీరియా

ఇక్కడ ఒక రూపాయి = 1.63 అల్జీరియన్ దినార్లకు సమానం. ఆఫ్రికా దేశం. ఇక్కడి నగరాలు, పట్టణాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. సుందరమైన తీర ప్రాంతాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్న దేశం.  

దక్షిణ కొరియా

ఎల్జీ, శామ్ సంగ్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కంపెనీలకు పుట్టినిల్లు. ఇక్కడ ఒక రూపాయి 16.52 వాన్ లతో సమానం. పూర్తి పారిశ్రామిక దేశమైన ఇక్కడ పచ్చదనం కూడా తగినంత పాళ్లలో ఉంటుంది. పర్యాటకపరంగా సందర్శించాల్సిన దేశాల్లో ఒకటి. ఇవే కాకుండా చిలీ, ఉగాండా, పాకిస్తాన్, కొలంబియా, ఇరాన్, లావోస్, మడగాస్కర్, ఉజ్బెకిస్తాన్, యెమన్ దేశాల కరెన్సీలు కూడా రూపాయి కంటే తక్కువగానే ఉన్నాయి. 

డాలరే అన్నింటికీ కీలకం

ప్రతీ దేశం కూడా అంతర్జాతీయ స్థాయికి వచ్చే సరికి వాణిజ్యం విషయంలో డాలర్ తో తమ కరెన్సీ మారకపు విలువను లెెక్కిస్తుంటాయి. ఎందుకంటే అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఒక ప్రామాణిక కరెన్సీగా చెలామణీ అవుతోంది. ఈ లెక్కన శ్రీలంక రూపాయి మన రూపాయిలో సగం విలువ అయినప్పటికీ అమెరికా మారకపు విలువతో ఎంత ఉందన్నదే ప్రధాన అంశం అవుతుంది. ఒక దేశంలో విదేశీ పర్యాటకులు ఏదైనా కొనుగోలు చేయాల్సి వస్తే అది అంతర్జాతీయ కరెన్సీ మారకపు విలువ ప్రకారం ఉంటుంది. దేశాల స్థూల జాతీయ ఉత్పత్తి ఆధారంగా ఆ దేశ కరెన్సీ విలువ ఉంటుందనే విషయాలను గుర్తించాలి.   

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy