ఎన్ఆర్ఐలు స్వదేశంలో వేటికి పన్నులు చెల్లించాలి...?

Wed, Nov 02, 2016, 11:31 AM
Related Image

ఉన్నతమైన భవిష్యత్తును ఆశిస్తూ ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. ఐక్యరాజ్యసమితి సర్వే ప్రకారం 2015లో విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 1.6 కోట్లు. ఉపాధి రీత్యా విదేశాల్లో స్థిరపడినప్పటికీ స్వదేశంలోనూ వారికి ఆదాయ వనరులు ఉండి ఉండవచ్చు. సొంత ఇంటిపై అద్దె ఆదాయం వస్తుండవచ్చు. లేదా పొలంపై ఆదాయం రావచ్చు. లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా రాబడులు అందుకుంటూ ఉండవచ్చు. అయితే, ఆదాయపన్ను పరంగా ఎన్ఆర్ఐలకు కూడా పలు నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాటిని ప్రతీ ఎన్ఆర్ఐ విధిగా తెలుసుకోవాలి.

నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే ఎవరు...?

ఒక ఆర్థిక సంవత్సరంలో 182 రోజుల కంటే తక్కువ దినాలు భారత్ లో ఉండి, మిగిలిన అన్ని రోజులు విదేశంలో ఉంటే వారిని ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ)గా ఆదాయపన్ను చట్టం పరిగణిస్తోంది. ఒకవేళ 60 రోజులు కంటే ఎక్కువ, 182 రోజులు కంటే తక్కువ కాలం స్వదేశంలో ఉండి, అంతకు ముందు వరుసగా నాలుగేళ్లలో ఏడాదికి 365 రోజుల పాటు స్వదేశంలోనే ఉండి ఉంటే వారిని భారతీయ నివాసుడిగానే పరిగణిస్తారు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో 182 రోజులకు తక్కువ కాకుండా భారత్ లో ఉంటే వారు స్థానిక పౌరుడిగానే పిలవబడతారు. 

representation image

ఆదాయం ఏదైనా పన్ను తప్పదు

ఎన్ఆర్ఐలు విదేశాల్లో ఉంటున్నప్పటికీ భారత్ లో వేతనం, అద్దె, డిపాజిట్లపై వడ్డీ, ఆస్తులు విక్రయించగా వచ్చిన మూల ధన లాభాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్వదేశంలో వచ్చే అన్ని రకాల ఆదాయాలను కలిపి వాటిపై పన్ను చెల్లించాలి. కనీస మినహాయింపు కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఎన్ఆర్ఐలు విధిగా రిటర్నులు దాఖలు చేయడం తప్పనిసరి. అదే సమయంలో వీరు పన్ను మినహాయంపులు, ట్యాక్స్ రిఫండ్ లకు కూడా అర్హులే. అలాగే, ఒక ఆర్థిక సంవత్సరంలో ఎదురైన నష్టాలను తర్వాతి ఆర్థిక సంవత్సరాల్లో చూపించుకుని పన్ను పరంగా భారాన్ని తప్పించుకోవచ్చు.

తిరిగొచ్చిన రెండేళ్ల తర్వాతే..

కొంత కాలం విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత... విదేశంలో ఆర్జించిన ఆదాయంపై ఇక్కడ వెంటనే పన్ను భారం ఉండదు. ఓ వ్యక్తి వరుసగా తొమ్మిదేళ్ల పాటు విదేశంలో నివసించి స్వదేశానికి తిరిగి వస్తే అతడు/ఆమె రెండేళ్ల పాటు ‘రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్’ (ఆర్ఎన్ఓఆర్) గా పరిగణించబడతారు. ఈ రెండేళ్ల పాటు విదేశంలో ఆర్జించే ఆదాయంపై వారికి పన్ను ఉండదని ఆదాయపన్ను చట్టాలు చెబుతున్నాయి. రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయి రెసిడెంట్ హోదా కిందకు మారిపోతారు కనుక ఆ తర్వాత నుంచి పొందే విదేశీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. భారత్ కు వచ్చిన ఎన్ఆర్ఐ సాధారణ పౌరుడిగా మారిన అనంతరం అన్ని రకాల విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయం వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా చేయకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలకు బాధ్యులు అవుతారు. 

ఏదేనీ ఎన్ఆర్ఐ భారత్ లో వ్యాపారం ద్వారా లేదా వృత్తి పరమైన ఆదాయం పొందుతుంటే పన్ను వర్తిస్తుంది. ఒకవేళ అది వ్యాపారం లేదా వృత్తి అయి దాన్ని భారత్ నుంచే కంట్రోల్ చేసేట్టు అయితే అలా వచ్చిన ఆదాయం కూడా పన్ను పరిధిలోకి వస్తుంది. భారత్ లో ఆర్జించిన ఆదాయం ఎన్ఆర్ఐలు వారు నివసించే దేశంలోని చట్టాల ప్రకారం పన్ను పరిధిలోకి వస్తుంది. అయితే, ఆ దేశంతో భారత్ కు ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం ఉండి ఉంటే స్వదేశంలో పన్ను చెల్లించనందువల్ల నివసించే చోట పన్ను మినహాయింపు పొందవచ్చు. భారత్ లో చేసిన పెట్టుబడులు షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీలు ఏవైనాగానీ వాటిపై వచ్చే ఆదాయంపై 20 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. కేపిటల్ గెయిన్స్ బాండ్లలో, తిరిగి మరో ఇంటిపై పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపులు పొందవచ్చు. 

పీపీఎఫ్ ఖాతాకు అవకాశం లేదు

ఎన్ఆర్ఐలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను తెరిచేందుకు లేదు. ఒకవేళ ఎన్ఆర్ఐగా మారిపోకముందు స్వదేశంలో పీపీఎఫ్ ఖాతా తెరచి ఉంటే గడువు తీరే వరకు దాన్ని కొనసాగించుకోవచ్చు. గడువు తీరిన తర్వాత ఆ మొత్తాన్ని తాను నివసిస్తున్న దేశానికి తరలించుకుపోవచ్చు. సాధారణ వ్యక్తులకు ఉన్నట్టు 15 ఏళ్ల తర్వాత మరో ఐదేళ్లు గడువు పొడిగించుకునే అవకాశం ఎన్ఆర్ఐలకు లేదు. గడువు తీరిన తర్వాత కూడా డబ్బులు వెనక్కి తీసుకోకుంటే దాన్ని చెల్లింపులు లేకుండా గడువు పొడిగించిన ఖాతాగా మారిపోతుంది. 

పన్ను నిబంధనలు అందరికీ ఒకటే

భారతీయులకు వర్తించే పన్ను శ్లాబులే ఎన్ఆర్ఐలకూ అమలవుతాయి. ఉదాహరణకు సాయిరామ్ అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ అనుకుందాం. అమెరికాలో సాయిరామ్ కు అతడి కంపెనీ డాలర్ల రూపంలో వేతనం చెల్లిస్తోంది. అదే సమయంలో సాయిరామ్ కు స్వస్థలం గుంటూరు జిల్లా చిలకలూరి పేటలోని ఎస్ బీఐ ఖాతాలో ఉన్న నగదు నిల్వలపై వడ్డీ ఆదాయం వస్తోంది. అదే సమయంలో సాయిరామ్ కు హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ ఇల్లు ఉంది. దాన్ని నెలకు రూ.35వేల అద్దెకు ఇచ్చాడు. సాయిరామ్ తల్లిదండ్రులు స్వస్థలంలోనే ఉంటున్నారు. వారికి నెల నెలా రూ.10వేలు పంపిస్తున్నాడు.

తల్లిదండ్రుల కోసం రూ.20వేల ప్రీమియంతో బీమా పాలసీ కూడా తీసుకున్నాడు. కేవలం అద్దె ఆదాయమే సంవత్సరానికి రూ.4,20,000 వస్తోంది. ఆదాయపన్ను చట్టం ప్రకారం ఇంటిపై వచ్చే ఆదాయంపై 30 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. ఇది పోను అద్దెపై వచ్చే నికర ఆదాయం 2,94,000. వీటికి అదనంగా బ్యాంకులో ఉన్న నగదుపై సాయిరామ్ కు ఏడాదికి రూ.30 వేలు ఆదాయం వస్తోంది. అప్పుడు 3,24,000 ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. జీవిత బీమా ప్రీమియంకు సెక్షన్ 80సీ కింద మినహాయింపు ఉన్నందున దాన్ని తీసివేస్తే నికర ఆదాయం 3,04,000. దీనిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రిటర్నులు కూడా దాఖలు చేయాలి. భారత్ లో ఓ ఇల్లు లేదా ఫ్లాట్ లేదా లీజుకిచ్చిన స్థలం ఉండి దానిపై ఆదాయాన్ని ఆర్జిస్తుంటే స్థానికులకు వర్తించే ఆదాయపన్ను చట్ట నిబంధనలే ఎన్ఆర్ఐలకూ వర్తిస్తాయి. 

ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ అయితే, స్వదేశంలోని బ్యాంకు ఖాతా ద్వారా వేతనం అందుకుంటూ ఉన్నట్టయితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ అయినప్పటికీ స్వదేశంలో సేవల ద్వారా ఆర్జించే ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అనుకుందాం. భారత ప్రభుత్వం తరఫున విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. అయినప్పటికీ మీరు పొందే ఆదాయం భారత్ లో పన్ను పరిధిలోకి వస్తుంది. భారత దౌత్యవేత్తలు, అంబాసిడర్లకు అయితే పన్ను వర్తించదు. వారికి పన్ను మినహాయింపు ఉంది.

విదేశీ ఆదాయంపై పన్ను ఉంటుందా?

స్వదేశంలో ఉంటూ ఆర్జించే విదేశీ ఆదాయంపై పన్ను ఉంటుంది. ఒకవేళ ఎన్ఆర్ఐ హోదా కలిగి ఉన్నా స్వదేశంలో పొందే ఆదాయం కూడా పన్ను పరిధిలోకి వస్తుంది. ఎన్ఆర్ఈ ఖాతా, ఎఫ్ సీఎన్ఆర్ ఖాతాలపై వచ్చే వడ్డీపై పన్ను ఉండదు. ఎన్ఆర్వో ఖాతాపై వడ్డీ ఆదాయంపై పన్ను ఉంటుంది.

representation image

రిటర్నులు దాఖలు చేయాలా...?

భారతీయ పౌరులకు వర్తించినట్టే పన్ను నిబంధనలు ఎన్ఆర్ఐలకూ వర్తిస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల ఆదాయం వరకు పన్ను ఉండదు. ఆదాయం అంతకు మించితే రిటర్నులు దాఖలు చేయాలి. టీడీఎస్ రిఫండ్ కావాలన్నా, నష్టాలను తర్వాతి సంవత్సరాల్లోకి బదలాయించుకోవాలన్నా రిటర్నుల దాఖలు తప్పదు. ఒకవేళ స్వదేశంలో ఏదైనా ఆస్తిని విక్రయించారనుకుంటే దానిపై టీడీఎస్ కోసుకుని ఉంటే, ఇతరత్రా ఎలాంటి ఆదాయం లేకపోతే రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఎన్ఆర్ఐలు గడిచిన ఆర్థిక సంవత్సరం తాలూకూ రిటర్నులు మరుసటి ఆర్థిక సంవత్సరంలో జూన్ నెల 31లోపు దాఖలు చేయాల్సి ఉంటుంది.

అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందా?

మొత్తం ట్యాక్స్ ఆదాయం రూ.10వేలు దాటితే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అడ్వాన్స్ గా చెల్లించకుంటే చట్ట ప్రకారం దానిపై వడ్డీని వసూలు చేస్తారు.

ఎన్ఆర్ఐ ఇంట్లో అద్దెకుంటే...

ఎన్ఆర్ఐకి చెందిన ఇంట్లో అద్దెకు ఉంటూ నెలనెలా అద్దెను చెల్లించి ఊరుకుంటే సరిపోదు. ఎన్ఆర్ఐ ఇంటి యజమాని అయితే అతడికి చేసే చెల్లింపులపై కిరాయిదారుడు 30 శాతం టీడీఎస్ ను తగ్గించి ఆదాయపన్ను శాఖకు జమచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆన్ లైన్ లో ఫామ్ 15సీఏను సమర్పించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫామ్ 15సీఏ సమర్పించే ముందు ఫామ్ 15సీబీని కూడా సమర్పించాల్సి రావచ్చు. ఫామ్ సీబీలో అద్దె చెల్లింపులకు చార్టర్డ్ అకౌంటెంట్ ధ్రువీకరణ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, టీడీఎస్ రేటు, టీడీఎస్ డిడక్షన్ ను కూడా పేర్కొనాలి. ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం కింద పన్ను మినహాయింపులు ఉంటే వాటిని తెలియజేయాలి. ఎన్ఆర్ఐకి చేసే చెల్లింపులు ఒకే లావాదేవీలో రూ.50వేలు మించకుండా, ఒక ఆర్థిక సంవత్సరంలో లావాదేవీల మొత్తం రూ.2.5 లక్షలకు మించకుండా ఉంటే ఫామ్ 15సీబీ సమర్పించాల్సిన పనిలేదు. 

ఎన్ఆర్ఐలకు పన్ను మినహాయింపులు

సెక్షన్ 80సీ కింద: ఎన్ఆర్ఐలకు కూడా స్థానికుల వలే పలు రకాల పన్ను మినహాయింపులు ఉన్నాయి. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులను మినహాయించుకోవచ్చు. కాకపోతే పాలసీలు ఎన్ఆర్ఐ పేరు లేదా అతడి జీవిత భాగస్వామి, లేదా చిన్నారుల పేరుతో ఉండాలి. బీమా మొత్తంలో ప్రీమియం పది శాతం లోపే ఉండాలి. స్కూల్ కాలేజీల్లో తమ పిల్లలకు (ఇద్దరు వరకు) చెల్లించే ఫీజులపై ఎన్ఆర్ఐలకు పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఇంటి కొనుగోలుకు తీసుకున్న రుణానికి చేసే అసలు చెల్లింపులపై మినహాయింపు లభిస్తుంది. గృహరుణం తీసుకుని దానికి చెల్లింపులు చేస్తుంటే... సెక్షన్ 80సీ కింద వడ్డీ కాకుండా అసలు రుణానికి చేసే చెల్లింపులపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అలాగే, ఆస్తి కొనుగోలుకు చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలపైనా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందవచ్చు.  

సెక్షన్ 80డీ కింద: ఎన్ఆర్ఐలు ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.15వేల వరకు పన్ను మినహాయంపు పొందవచ్చు. ఒకవేళ ఎన్ఆర్ఐ సీనియర్ సిటిజన్ అయి ఉంటే ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియం రూ.20వేల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. వృద్ధులైన తన తల్లిదండ్రులకు ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియం రూ.20వేలలోపు ఉంటే ఎన్ఆర్ఐలకు పన్ను మినహాయింపు ఉంది. మొత్తం మీద ఈ సెక్షన్ కింద గరిష్ట మినహాయంపు రూ.40వేల వరకు పొందడానికి అవకాశం ఉంది. ఈ పరిమితిలో లోబడే హెల్త్ చెకప్ ల కోసం చేసే వ్యయం రూ.5 వేలపై పన్నుమినహాయింపు కూడా ఉంది. 

సెక్షన్ 80ఈ కింద: ఈ సెక్షన్ కింద విద్యా రుణంపై వడ్డీ రూపంలో చేసే చెల్లింపులకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. వడ్డీ ఎంత మొత్తమైనా పూర్తిగా మినహాయింపు లభిస్తుంది. ఈ విధంగా ఎనిమిదేళ్లు లేదా అంతకన్నా తక్కువ కాల వ్యవధికి పన్ను మినహాయింపులు లభిస్తాయి. అసలుకు చేసే చెల్లింపులకు మినహాయింపు లేదు. ఎన్ఆర్ఐ ఉన్నత విద్యాభ్యాసం లేదా జీవిత భాగస్వామి లేదా పిల్లలకు తీసుకునే విద్యా రుణాలకు ఈ నిబంధన వర్తిస్తుంది.

సెక్షన్ 80జీ: పలు రకాల సామాజిక సేవా కార్యక్రమాలకు ఇచ్చే విరాళాలపై ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. 

సెక్షన్ 80టీటీఏ: సేవింగ్స్ బ్యాంకు ఖాతాపై వచ్చే వడ్డీ ఆదాయంపై గరిష్టంగా 10వేల వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలకు కూడా ఇది వర్తిస్తుంది. 

వీటికి మినహాయింపుల్లేవు

ఎన్ఆర్ఐగా మారిపోక ముందు ప్రారంభించిన పీపీఎఫ్ ఖాతాపై, ఎన్ఎస్ సీ, పోస్టాఫీసు ఐదేళ్ల డిపాజిట్ పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లకు పన్ను మినహాయింపుల్లేవు. అలాగే, సెక్షన్ 80సీసీజీ కింద రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీమ్ లో పెట్టే పెట్టుబడులు కూడా పన్ను పరిధిలోకే వస్తాయి. అంగవైకల్యం ఉన్నవారు ఆధారపడి ఉంటే వారి పోషణకు చేసే వ్యయానికి పన్ను మినహాయింపులు కల్పించే 80డీడీ కూడా ఎన్ఆర్ఐలకు వర్తించదు. అలాగే అంగవైకల్యం కలిగిన వారి ఆరోగ్యం కోసం చేసే వ్యయంపైనా 80డీడీబీ కింద పన్ను మినహాయింపుల్లేవు. ఒకవేళ పన్ను చెల్లింపుదారుడే అంగవైకల్యంతో బాధపడుతుంటే పన్ను మినహాయింపు కల్పించే సెక్షన్ 80యూ కూడా భారత్ లో నివసించే వారికే వర్తిస్తుంది.

దీర్ఘకాలిక మూలధన లాభాలపై అంటే ఏదైనా ఆస్తి కొని మూడేళ్లు దాటిన తర్వాత విక్రయిస్తే వచ్చే లాభాలపై 20 శాతం పన్నును టీడీఎస్ రూపంలో మినహాయించుకుంటారు. అయితే సెక్షన్ 54 (ఇల్లు అమ్మకం), సెక్షన్ 54ఈసీ, 54ఎఫ్ (ఇల్లు కాకుండా ఇతర ఆస్తి విక్రయంపై) కింద దీర్ఘకాలిక మూల ధన లాభాలపై పన్ను మినహాయంపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. మూలధన లాభాల పన్ను నుంచి తప్పించుకునేందుకు సెక్షన్ 54ఈసీ వీలు కల్పిస్తుంది. విక్రయించగా వచ్చిన మొత్తాన్ని మరో ఆస్తిపై పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. పన్ను రహిత బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారానూ పన్ను భారాన్ని తప్పించుకోవచ్చు. ఆస్తి విక్రయించిన తర్వాత తిరిగి ఆరు నెలల కాలంలోపు వీటిపై పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగే మూడేళ్ల వరకు కొనసాగించడం ద్వారానే పన్ను మినహాయింపు లభిస్తుంది. 

ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి...?

సాయిరామ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతడు పనిచేస్తున్న కంపెనీ సాయిరామ్ ను సింగపూర్ కార్యాలయంలో నాలుగు నెలల పాటు విధులు నిర్వహించాలని కోరింది. దాంతో అతడు నాలుగు నెలలు సింగపూర్ లో ఉండి వచ్చాడు. అంటే సుమారు 120 రోజులు. సింగపూర్ లో సేవలకు గాను డాలర్ల రూపంలో కంపెనీ అతడి బ్యాంకు ఖాతాకు జమ చేసింది. నిబంధనల ప్రకారం సాయిరామ్ 182 రోజుల కంటే మించి విదేశంలో లేడు. కనుక విదేశీ ఆదాయం కూడా స్వదేశంలో ట్యాక్స్ రిటర్నుల్లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సాయిరామ్ సింగపూర్ లో 182 రోజులకు మించి పని చేశాడనుకుందాం. అప్పుడు అతడు నాన్ రెసిడెంట్ అవుతాడు. కనుక స్వదేశంలో ఆర్జించిన ఆదాయాన్నే రిటర్నుల రూపంలో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో కంపెనీ సాయిరామ్ కు సింగపూర్ డాలర్ల రూపంలో భారత్ లోని బ్యాంకు ఖాతాకు జమ చేసింది కనుక దానిపై పన్ను ఉంటుంది.

ఉదాహరణకు సూర్యచంద్ర భారతీయ పౌరుడు. అయినా అతడికి విదేశాల నుంచి ఆదాయం వస్తోంది. దీనిపై స్వదేశంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇది ఏ దేశం నుంచి వస్తుందో అక్కడ కూడా పన్ను చెల్లించాల్సి వస్తుంది. కనుక ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం కింద మినహాయింపు అవకాశంతో ఒకవైపు పన్ను తప్పించుకోవచ్చు. ఎన్ఆర్ఐ హోదాతో ఉన్నంత వరకు విదేశాల్లో ఆర్జన, ఆదాయ వనరులపై స్వదేశంలో పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy