మహిళలకు ఆర్థిక చేయూత ఎలా...?

Thu, Oct 27, 2016, 01:18 PM
Related Image

మహిళలు వివాహితులైనా, అవివాహితులైనా రిటైర్మెంట్ లైఫ్ సాఫీగా సాగిపోయేందుకు ఆదాయం లేదా ఆర్థిక ఏర్పాట్లు అవసరం. పురుషుల కంటే ఎక్కువ ఆయుర్దాయం కలిగి ఉన్న మహిళలకు 55 - 60 ఏళ్లు వచ్చిన తర్వాత స్థిరమైన ఆదాయం తప్పనిసరి. ఎందుకు, ఎలా అన్నది చూద్దాం.  

representative image

సర్వేలు ఏమంటున్నాయి?

ఇటీవల 15 దేశాల్లో ఇదే అంశంపై అధ్యయనం జరిగింది. ఆర్థిక భద్రత, ఇల్లు, ఉద్యోగం తదితర అంశాలపై వారి నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత అర్థమైన విషయం ఏమిటంటే... చాలా మంది మహిళలు విశ్రాంత జీవితానికి సంబంధించి ప్రణాళికలు వేసుకోకపోవడమే. కానీ, మహిళలకూ తప్పకుండా ఆర్ధిక భద్రత అవసరం అని ఆర్థిక రంగ నిపుణులు బలంగా చెబుతున్నారు.

సెంటర్ ఫర్ టేలంట్ ఇన్నోవేషన్ సంస్థ సర్వే ప్రకారం... భారత్ లో 36 శాతం చదువుకున్న మహిళలు పెళ్లయిన తర్వాత పిల్లల కోసం ఉద్యోగాలను వదిలేస్తున్నారు. కొంత మది పార్ట్ టైమ్ జాబ్స్ కు పరిమితం అవుతున్నారు. సామాజిక, ఆర్థిక, కుటుంబ పరమైన కారణాల వల్ల మహిళలు ఆర్జనకు దూరంగా ఉంటున్నారు.

అమెరిప్రైజ్ అనే సంస్థ సర్వే ప్రకారం దేశంలో 79 శాతం మధ్య తరగతి మహిళల్లో విశ్రాంత జీవితం గురించి ప్రణాళిక అనేది ప్రాధాన్యతే కాదని తేలింది. అంటే వీరు పొదుపు గురించి తెలియని వారు కాదు. కానీ రిటైర్మెంట్ ప్రణాళిక ఎంత ముఖ్యమైనదన్న అవగాహన వారిలో లోపించింది. అవివాహితులైన ఉద్యోగ మహిళల్లో 22 శాతం మంది సొంతంగానే ఇన్వెస్ట్ మెంట్ నిర్ణయాలు తీసుకుంటుంటే... 52 శాతం మంది వివాహిత మహిళలు భర్త లేదా తండ్రి సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నారని డీఎస్ పీ బ్లాక్ రాక్ సంస్థ దేశంలోని 14 పట్టణాల్లో నిర్వహించిన సర్వేలో తెలిసింది.  

ఆయుర్దాయం

మహిళలు పురుషుల కంటే ఎక్కువ కాలం జీవిస్తారు. సగటున ఈ ఆయుర్దాయం నాలుగేళ్లు అధికంగా ఉంది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం విశ్లేషణ ప్రకారం మహిళల ఆయుర్దాయం భారత్ లో 69 ఏళ్లు. మరి వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలను తట్టుకుని నిశ్చింతగా ఉండేందుకు తగినంత ఆర్థిక ప్రణాళిక ఎంతో అవసరం. ఎందుకంటే పురుషులతో పోలిస్తే వృద్ధాప్యంలో మహిళలకే అనారోగ్య సమస్యలు ఎక్కువని చాలా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంటే ఈ సమస్యలను ఎదుర్కొని ఎక్కువ కాలం పాటు జీవించాలంటే ఆర్థికంగా బలంగా ఉండాలి. పైగా మహిళలు తమ కంటే వయసులో కొంచెం పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంటారు. ఈ విధంగా చూసుకున్నా వారు జీవించే కాలం అధికంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం అయితే భర్త మరణం తర్వాత అదనంగా 15 ఏళ్లు జీవించే మహిళలు సైతం ఉన్నారు.

జరగకూడనిది జరిగితే...? 

భర్త సంపాదనపైనే ఆధారపడిన ఓ ఇల్లాలి పరిస్థితి చూద్దాం. సదరు ఇంటి యజమాని సరైన రిటైర్మెంట్ ప్రణాళిక వేసుకోకుండా సంపాదించిన మొత్తాన్ని జల్సాలకే, లగ్జరీ లైఫ్ కోసం ఖర్చు చేశాడనుకుందాం. ఓ రోజు హార్ట్ ఎటాక్ తో అతడు మరణించాడు. తరచి చూస్తే అతడి పేరిట ఎలాంటి పొదుపులు లేవు. ఇన్సూరెన్స్ ఉన్నా అది నామమాత్రమే. అప్పుడు కానీ ఆ ఇల్లాలికి భవిష్యత్తు ఎంత భయానకమో బోధ పడలేదు. ముందుగానే జాగ్రత్త పడి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురైనా ఆమె ధైర్యంగా ఉండేది.

ఒకవేళ ఇల్లాలే ముందుగా మరణిస్తే భర్తకు వచ్చే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ భర్తపై ఆధారపడిన ఇల్లాలి పరిస్థితి మాత్రం క్లిష్టంగా మారుతుంది. నిజానికి మహిళలు పురుషులతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో పొదుపు చేయగల వెసులుబాటు కలిగి ఉంటారు. వారు ఉద్యోగులైతే, ఆర్జనా పరులైతే ఈ వెసులుబాటు ఉంటుంది. అందుకని భర్తపై ఆధారపడకుండా మహిళలు సొంతంగా రిటైర్మెంట్ ప్రణాళిక వేసుకోవడం అవసరమన్నది నిపుణుల సూచన.

ఉదాహరణకు చరణ్, సునంద ఇద్దరికీ 25 ఏళ్లు. వారిద్దరూ దంపతులు. ఇద్దరూ 60 ఏళ్లకు రిటైర్ అవుతారనుకుందాం. నెలవారీ ఖర్చు చెరో రూ.30వేలు ఉందనుకుంటే 60 ఏళ్లకు చరణ్ కు రూ.కోటిన్నర, సుష్మితకు రూ.2 కోట్లు అవసరం. అందుకే మహిళ ఆర్జన ప్రారంభించిన దగ్గర్నుంచి అధిక మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. పైగా భర్త ఆర్జన కూడా ఉంటుంది కనుక ఆమె సంపాదన పూర్తిగా కుటుంబ అవసరాలకు వెచ్చించాల్సిన బాధ్యత అంతగా ఉండదు.

గృహిణిగానే ఉండిపోతే రిటైర్మెంట్ కోసం పొదుపు చేసేందుకు ఏమీ ఉండదు. భర్త పొదుపుపైనే ఆధారపడాల్సి వస్తుంది. ప్రతీ భర్త తన కోసం, తన భార్య కోసం తన పిల్లల కోసం బాధ్యతగా పొదుపు చేస్తాడని ఆశించడానికి లేదు. దీని వెనుక ఎన్నో కారణాలు ముడిపడి ఉంటాయి. ఆర్జన శక్తి, ఖర్చు, పొదుపు ప్రాధాన్యం తెలియకపోవడం, తెలిసినా పొదుపు పట్ల ఆసక్తి లేకపోవడం, వ్యసనాలు ఇలా ఎన్నెన్నో కారణాలు ఉంటాయి. అందుకే ఆర్థిక పండితులు ప్రతీ ఇల్లాలికీ ఎంతో కొంత ఆర్జన ఉండాలని, దాన్ని పొదుపుగా మళ్లించాలని చెబుతుంటారు.

representative image

పార్ట్ టైమ్ వర్క్

చదువుకున్న ఇల్లాలు అయితే పిల్లలు స్కూలుకు వెళ్లడం మొదలైన తర్వాత ఉద్యోగ బాధ్యతలను స్వీకరించాలి. ఉద్యోగానికి అంత తీరిక లేకపోతే ఇంట్లోనే స్వయం ఉపాధికి బోలెడన్ని మార్గాలు ఉన్నాయి. అలాగే, రోజులో పరిమిత సమయం పాటు చేసే పార్ట్ టైమ్ జాబ్స్ కూడా ఉన్నాయి. వీటిని ఉపయోగించుకోవాలి.

మహిళల్లో చాలా మందికి తమ సంపాదనను పొదుపువైపు మళ్లించే అవకాశాల గురించి అంతగా అవగాహన లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే సంపాదనను బ్యాంకు ఖాతాల్లో ఉంచేస్తున్నారట. మరి మారుతున్న జీవన విధానం, అవసరాలు, ద్రవ్యోల్బణం ఇవన్నీ చూస్తే బ్యాంకు ఖాతాల్లో ఉంచడం వల్ల నష్టపోవాల్సి వస్తుంది. కనుక ఎంతో కొంత సంపాదించడం ముఖ్యం కాదు. దాన్ని ప్రణాళికాబద్ధంగా ఇన్వెస్ట్ మెంట్ వైపు మళ్లించడం అవసరం.

నియంత్రణలు

మహిళల పట్ల ఈ సమాజ దృక్పథం వేరు. మహిళలు మగవారితో పోలిస్తే త్వరగా పెళ్లి చేసుకుంటారు. కుటుంబ బాధ్యతలు వారిపై ఎక్కువ. ఇవన్నీ వారి కెరీర్, సంపాదనపై ప్రభావం చూపుతాయి. అయినా మిగిలిన సమయాన్ని సంపాదనకు వినియోగించడం ద్వారా ఆమె తన జీవితానికి భరోసా కల్పించుకోవడం ఎంతో ముఖ్యం.

60 ఏళ్లకు ఎంత మిగిలి ఉందో చూడాలి

ఎంత ఫండ్ అవసరమో నిర్ణయించుకుని దాన్ని చేరుకునేందుకు ప్రణాళిక వేసుకోవాలి. ఈ ప్రణాళికలో ఓ ఇంటి ఇల్లాలిగా మధ్య మధ్యలో మీ సంపాదనకు కలిగే విఘ్నాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దాని ద్వారా మధ్య మధ్యలో విరామాలను మినహాయించి ఎంత సంపదకు ఎంత పొదుపు చేయవచ్చన్న ప్రణాళిక వేసుకోవచ్చు.

మదుపు మార్గాలు

ఎన్ పీఎస్. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఇది పింఛను పథకం. ఇందులో నెలనెలా లేదా ఏడాదికి ఏక మొత్తంలోనయినా పొదుపు చేయవచ్చు. ఈపీఎఫ్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ ద్వారానూ పెన్షన్ ఫండ్ ను సమకూర్చుకోవచ్చు. ప్రత్యేకంగా పెన్షన్ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అలాగే తమ పేరిట జీవిత బీమా, ఆరోగ్య, ప్రమాద వైకల్య బీమాలను కూడా తీసుకోవాలి. భవిష్యత్తులో పెన్షన్ కోసం అద్దె ఆదాయం లభించే ఇల్లును సమకూర్చుకోవడం కూడా రిటర్మెంట్ ప్రణాళికే. అవసరమైతే అదే ఇంటిని మార్ట్ గేజ్ కింద పెట్టి జీవించి ఉన్నంత కాలం నెలనెలా సంపాదన పొందవచ్చు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy