ap7am logo

బైక్ కొంటున్నారా...? అయితే ఈ విషయాలు కాస్త పట్టించుకోండి!

Tue, May 23, 2017, 02:16 PM
Related Image

బైక్ పై రైడ్ చేయాలనే సరదా ఎవరికి ఉండదు చెప్పండి..? కాలేజీలోకి అడుగుపెడుతూనే రయ్ మంటూ బైక్ పై దూసుకుపోయే కుర్రకారు... రోజూ కార్యాలయానికి తనకు నచ్చిన బైక్ పై వెళ్లాలనుకునే సగటు ఉద్యోగి... ఉద్యోగం చేస్తున్న మహిళ అయినా... ఇంటి పట్టున ఉండే గృహిణి అయినా స్కూటర్ పై సవారీ చేయాలన్న సరదా వుంటుంది... ఇలా చూస్తే మోటారు సైకిల్ పై మక్కువ అన్ని వర్గాల వారిలోనూ కనిపిస్తుంది. అయితే, బైక్ కొనే ముందు అందులో మీకు కావాల్సినవి ఉన్నాయా..? అసలు మీకు ఆ బైక్ సరిపడుతుందా..? ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

మధ్య తరగతి ప్రజలకు ఒకప్పుడు బైక్ అనేది కల అయితే, నేడు కారు డ్రీమ్ గా మారిపోయింది. అయినాగానీ పట్టణాల్లో కార్లున్న వారికి బైక్ లు కూడా తప్పకుండా ఉంటున్నాయి. ఎందుకంటే చిన్న రోడ్లలోనూ బైకులపై దూసుకుపోవచ్చు. పార్కింగ్ సమస్య ఉండదు. నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లేందుకు కారు, దగ్గర దగ్గర ప్రాంతాలకు వెళ్లేందుకు బైక్ వాడడం అనేది ఎక్కువ మంది చేస్తున్న పని. ఈ విధంగా చూసుకున్నా బైకుల డిమాండ్ మన దేశంలో చాలా ఎక్కువ. అయితే, పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకే రకం బైకులు, పెద్దలు, యువకులకు, స్త్రీలకు ఒకే రకమైన బైకులు సరిపడవు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బైక్ సరిపోలుతుంది. అందుకే ఈ విషయాలను తెలుసుకోవడం అవసరం.

మీ రైడింగ్ తీరు ఎలా ఉంటుంది...?

బైక్ ను అందరూ ఒకే విధంగా నడపరు. ఒక్కొక్కరికి ఒక్కో స్టయిల్ ఉంటుంది. ఉడుకు రక్తం మీదున్న కుర్రోడు వేగంగా మెలికలు తిరుగుతూ తానో హీరోనన్న భావనలో బైక్ పై దూసుకుపోతుంటాడు. పెద్ద వయసు వారు నిదానంగా వెళుతుంటారు. ఇక స్త్రీలు కూర్చుని నడిపే భంగిమలో తేడా ఉంటుంది. బైక్ నడపడంలో చేయి తిరిగిన వారికీ, బైక్ నడపడం అప్పుడే నేర్చుకున్న వారికీ మధ్య తేడా ఉంటుంది. అనుభవం ఉన్న వారు పవర్ బైక్ కావాలనుకుంటారు. సాధారణ బైక్ వారిని సంతృప్తి  పరచలేదు. కొత్తగా నేర్చుకున్న వారు అయితే వారికి ఎంట్రీ లెవల్ బైక్స్ సరిపోతాయి. అయితే, డ్రైవింగ్ లో నైపుణ్యం లేని వారు తొలుత స్కూటర్లకు బదులు బైకులు నడిపడమే మంచిది. ఎందుకంటే స్కూటర్ పై డ్రైవింగ్ నేర్చుకుంటే తగిన నైపుణ్యం లభించడం కష్టం అవుతుంది. 

చాలా వరకు బైకులను తారు రోడ్లపై నడిపే దృష్టితోనే అందుకు అనుకూలమైన ప్రమాణాల ఆధారంగా తయారు చేస్తుంటారు. మరికొన్నింటిని మట్టి రోడ్లపై నడిపేందుకు అనుకూలంగా రూపొందిస్తారు. ఆన్ రోడ్, ఆఫ్ రోడ్ బైక్స్ అని వినే ఉంటారు. రెండో రకానికి ఉదాహరణలు రాయల్ ఎన్ ఫీల్డ్, హీరో ఇంపల్స్ తదితర బైకులు. 

representative image

ఎవరికి ఏ బైక్?

క్రూయిజర్లు: ఈ బైక్ లపై కూర్చున్నప్పుడు కాళ్లు ముందుకు పెట్టుకోవాల్సి ఉంటుంది. చేతులు చాతీకి సమాంతరంగా లేదా ఛాతికి కంటే ఎత్తులో హ్యాండిల్స్ ఉంటాయి. బజాజ్ డిస్కవర్, రాయల్ ఎన్ ఫీల్డ్ థండర్ బర్డ్ వంటివి. 

స్పోర్ట్ బైక్స్: ఈ బైక్ లకు హ్యాండిల్ బార్ ఛాతీ కంటే దిగువ భాగంలో ఉంటాయి. కాళ్లు వెనక్కి పెట్టుకోవాల్సి ఉంటుంది. ముందుకు వంగి బొర్లా పడుకున్న మాదిరిగా బైక్స్ ను నడపాల్సి ఉంటుంది. చాలా వేగంగా వెళ్లేందుకు, సడెన్ గా డ్రైవింగ్ డైరెక్షన్ మార్చుకునేందుకు, షార్ప్ కార్నర్స్ కు ఇవి అనుకూలంగా ఉంటాయి. యమహా ఆర్15, కవాసకి నింజా 300 బైక్స్ ఇందుకు ఉదాహరణలు. 

టూరర్: వీటిలో కూర్చునే సీట్ క్రూయిజర్, స్పోర్ట్ బైక్ ల తీరుకు మద్యస్థంగా ఉంటుంది. దూరం ప్రయాణాలు కోరుకునే వారికి అనువైనవి. యమహా ఫేజర్, హీరో కరిజ్మా వంటివి. 

కమ్యూటర్ బైక్స్: నిటారుగా కూర్చుని నడిపే బైక్స్ ఇవి. స్వల్ప దూరం, ట్రాఫిక్ లో ప్రయాణాలకు అనువైనవి. 100 సీసీ బైక్స్. 

తరచుగా వాడతారా...?

బైకు కొనాలంటే తక్కువలో తక్కువ రూ.50 వేలు అయినా వ్యయం చేయాల్సి ఉంటుంది. అంత ఖర్చు చేసే ముందు కీలక విషయాలపై కన్నేయడం అవసరం. ఉదాహరణకు ఏ లక్ష్యంతో కొంటున్నారనే దానిపై స్పష్టత ఉండాలి. దానికి అనుకూలమైన బైకును తీసుకోవాలి. రోజూ పరిమిత దూరం, మద్యస్థ దూరం వెళ్లే వారు అయితే 125 సీసీ, అంతకంటే ఎక్కువ సీసీ బైకులను తీసుకున్నా పెద్దగా నిర్వహణ భారం ఉండదు.

అదే పట్టణంలో ప్రతి రోజూ 50 కిలోమీటర్లకు మించి దూరం ప్రయాణించే వారికి నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండే బైక్ అనువైనది. ప్రతి 2000 కిలోమీటర్లకు ఇంజన్ ఆయిల్ మార్చుకోవడం తప్పనిసరి. అదే సమయంలో ప్రతి 4000 కిలోమీటర్లకు ఇంజన్ వాల్వ్ అడ్జస్ట్ మెంట్, కార్బ్యురేటర్, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయడం, అవసరమైతే ఎయిర్ ఫిల్టర్ మార్చుకోవడం ఇలా ఆ బైక్ కండీషన్ మంచిగా ఉండాలనుకుంటే కొంత ఖర్చు చేయక తప్పదు. అందుకే ఎక్కువ దూరం ప్రయాణించే వారు నిర్వహణ ఖర్చు తక్కువ ఉన్న వాటిని తీసుకోవడం నయం. అందుకే నిర్వహణ ఖర్చు తక్కువ ఉండాలా? మైలేజీ ఎక్కువ కావాలా..? రయ్ మంటూ దూసుకుపోయే పవర్ బైక్స్ కావాలా...? అనేదాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం అవసరం. 

అదే సమయంలో దూరం ప్రయాణించే వారు సీటింగ్ పోర్షన్ విషయంపై చాలా శ్రద్ధ పెట్టాలి. మీ బాడీ తీరు, బైక్ షేప్ ఈ రెండింటికీ మ్యాచ్ అవుతున్నాయా, షాక్ అబ్జార్బర్స్ మంచి శక్తిమంతమైనవి ఉన్నాయా అన్నది చూసుకోవాలి. లేకుంటే వెన్నుపూస డిస్కులు దెబ్బతిని భవిష్యత్తులో తీవ్ర సమస్యల బారిన పడతారు. నిజానికి చాలా మంది షాక్ అబ్జార్బర్ల అంశాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది సరైనది కాదు.

representative image

శారీరక పరిమాణాలు

భారీ కాయంతో ఉన్నవారు సాధారణ 100 సీసీ బైక్ పై వెళితే ఎలా ఉంటుంది...? అలాగే సన్నని వ్యక్తి రాయల్ ఎన్ ఫీల్డ్ నడిపితే ఎలా ఉంటుంది? పైగా వాటి బరువును వారు బ్యాలన్స్ చేసుకోగలరా..? ఇలాంటివి చూడాలి. సాధారణంగా భారీ బరువు ఉన్న వారు వీల్ బ్యాలన్స్, షాక్ అబ్జార్బర్ల సామర్థ్యం ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక సన్నని వారు హెవీ వెయిట్, పవర్ బైకులపై మోజు పడితే వాటిని నడిపే సమయంలో బ్యాలన్స్ అటూ ఇటూ అయితే ఏంటన్నది ఆలోచించుకోవాలి. భారీ ఈదురుగాలి వచ్చనప్పుడు ఎయిర్ డైనమిక్స్ కూడా మారిపోతాయి. ఆ సమయంలో బైక్ కంట్రోలింగ్ కష్టంగా ఉంటుంది.

కొత్తదా, పాతదా..

ఎక్కువ వ్యయమైనా కొత్తది కావాలా..? లేక తక్కువలో తెలిసిన వ్యక్తి అమ్ముతున్న బైక్ కావాలా... ఏది సరైనది? అన్నది తెలుసుకోవాలంటే... కొత్త బైక్ లు అయితే కొన్ని అదనపు లేటెస్ట్ ఫీచర్లతో ఉంటాయి. టెక్నాలజీ కూడా కొత్తగా ఉంటుంది. పైగా కంపెనీ వారంటీ ఉంటుంది. కొంత కాలం వరకు సర్వీసులు ఉచితం. అదే తెలిసిన వారి దగ్గర బైక్ అయితే సెకండ్ హ్యాండ్ కనుక తక్కువ ధరలో వస్తుంది. ఇంజన్ కండిషన్ బాగుంటే ఫర్వాలేదు. అయితే, వాహన మరమ్మతులకు కొత్త బైకులతో పోలిస్తే వ్యయం ఎక్కువ ఉంటుంది. ఇక ధర విషయంలో ఎంత తేడా ఉంది, ఎంత ఆదా అవుతుందన్న తదితర విషయాలను పరిశీలిస్తే నిర్ణయం సులభంగా తీసుకోవచ్చు.

representative image

బైక్ లేదా స్కూటర్

బైక్, స్కూటర్ ఈ రెండు రకాల వాహనాలపై కూర్చునే విధానం వేర్వేరుగా ఉంటుంది. బైకులను హ్యాండిల్ చేయడం స్కూటర్ల కంటే తేలిక. బైకులలో అయితే గేర్లు ఉంటాయి. స్కూటర్లు గేర్ లెస్. పైగా వీటిపై కాళ్లు ముందు పెట్టుకోవాల్సి ఉంటుంది. కనుక హ్యాండ్లింగ్ విషయంలో బైకులంత సౌకర్యంగా ఉండవు. అయితే స్కూటర్లపై ముందు భాగంలో లగేజ్ పెట్టుకునేందుకు, సీటు కింద స్టోరేజీ, హైట్ తక్కువగా ఉండడం వల్ల స్త్రీలకు సౌకర్యంగా ఉండడం వీటిలోని సౌలభ్యాలు. గేర్ లెస్ కనుక పట్టణాల్లో, ట్రాఫిక్ లో తరచూ గేర్లు మార్చడం అసౌకర్యంగా భావించే వారికి స్కూటర్లు అనువుగా ఉంటాయి. వర్షాకాలంలో రోడ్డుపై వర్షపు నీటిలో స్కూటర్ పై వెళుతుంటే నీరు చిమ్మి మీద పడడం ఉండదు.  

మైలేజీ అంత ఇంపార్టెంటా..?

తక్కువ దూరం తిరిగే వారు మైలేజీ కోసం బైక్ ఎంపికను మార్చుకోవాల్సిన పని లేదన్నది నిపుణుల సూచన. ఒక బైక్ లీటర్ పెట్రోల్ కు 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందనుకోండి. మరో బైక్ 50 కిలోమీటర్లు ఇస్తుందనుకుందాం. నెలకు 900 కిలోమీటర్లు ప్రయాణించే వ్యక్తికి 40 కిలోమీటర్ల మైలేజీ వచ్చే బైక్ కు నెలకు 22.5 లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుంది. అదే 50 కిలోమీటర్ల మైలేజీనిచ్చే బైక్ కు 18 లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ 70 రూపాయలు ఉంది. ఈ లెక్కన చూస్తే 40 కిలోమీటర్ల మైలేజీనిచ్చే బైక్ కు నెలకు రూ.315 అదనంగా ఖర్చు అవుతుంది. ఇక్కడ ఈ స్వల్ప మొత్తాన్ని చూడడం కంటే ఇతర ఫీచర్లు ఎందులో బావున్నాయన్నదే ప్రాధాన్యంగా తీసుకోవడం సరైనది అన్నది నిపుణుల సూచన. 

బరువు 

కొనే ముందు బైక్ బరువు ఎంతుందో చూసుకోవాలి. ఎందుకంటే బరువును బట్టే ఆ బైక్ ను మీరు హ్యాండిల్ చేయగలరా...? అన్న విషయం తెలుస్తుంది. పైగా బైక్ కంట్రోల్ అవడంలోనూ ఈ బరువు అన్న అంశం కీలకంగా పనిచేస్తుంది. మగవారికైతే బరువు అటూ, ఇటూ అయినా పెద్దగా ఇబ్బంది పడరు. అదే ఆడవారి విషయానికొస్తే వారు ఎక్కువ బరువున్న వాటిని హ్యాండిల్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. తక్కువ బరువున్న బైక్ పై రైడింగ్ వారికి సౌకర్యంగా ఉంటుంది.

ఎత్తు

ఎత్తు తక్కువగా ఉన్నవారికి ఎత్తుగా ఉండే ద్విచక్ర వాహనాలు సరిపడవు. చాలా అసౌకర్యంగా భావిస్తారు. కంట్రోల్ కూడా కాదు. వాహనంపై కూర్చున్నప్పుడు రెండు కాళ్లూ నేలను పూర్తిగా తాకుతూ ఉండాలి. అలాంటి బైకునే ఎంపిక చేసుకోవాలి.

స్టోరేజీ 

తరచూ ఇంటికి, లేదా వ్యాపారస్తులైతే దుకాణాలకు ఏవో ఒక వస్తువులు, సరుకులు తీసుకువెళ్లేవారికి స్టోరేజీ చాలా అవసరం. అలాంటి వారికి స్కూటర్లు అనువైనవి.

representative image

సర్వీస్ సెంటర్లు

మంచి బ్రాండ్ అయితే సరిపోదు. ఎక్కువ సర్వీసు సెంటర్లు కూడా ఉండాలి. మీరు నివసిస్తున్న ప్రాంతంలో కంపెనీ ఆథరైజ్డ్ సర్వీసు సెంటర్ ఉందేమో చూసుకోవాలి. మంచి సర్వీసు అందించే సంస్థ అయి ఉండాలి. అలాంటప్పుడు నిర్వహణ పరమైన సమస్యలు ఎదురైనప్పుడు తలనొప్పులు ఉండవు. పైగా స్పేర్ పార్ట్స్ ను అందుబాటులో ఉంచే కంపెనీ అయితేనే సౌకర్యంగా ఉంటుంది.

రీసేల్ వేల్యూ

పైన చెప్పుకున్నట్టు నాణ్యమైన, మంచి బ్రాండ్ ఉన్న బైకులు అయితే కొంత కాలం తర్వాత విక్రయించాలనుకుంటే మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. హోండా, హీరో బైకులకు రీసేల్ వేల్యూ ఎక్కువ అన్న విషయం తెలిసిందే.

ఇతర విషయాలు

* కిక్ కొట్టి బైక్ ను స్టార్ట్ చేసే రోజులు పోయాయి. ఇప్పుడంతా ఆటో స్టార్ట్. అయితే ఇప్పటికీ కొన్ని ఎంట్రీ లెవల్ బైకులలో ఆటోస్టార్ట్ సదుపాయం ఉండడం లేదు. దీన్ని కూడా పరిశీలించుకోవాలి.  

* మీ బడ్జెట్ ఏమిటన్నది కూడా ముఖ్యమే. అలాగే, నిర్వహణకు నెలవారీ ఎంత ఖర్చు చేయగలరన్న ఆర్థిక వివరాలూ కీలకమే.

* నిర్వహణ పరమైన విషయాల గురించి అప్పటికే అదే బైక్ ను వాడుతున్న సన్నిహితులను అడగడం ద్వారా కీలక విషయాలను తెలుసుకోవచ్చు. 

* మొదటి సారి బైక్ కొనేవారు అయితే ముందుగా సెకండ్ హ్యండ్ బైక్ కొని, తగిన నైపుణ్యం వచ్చిన తర్వాత నూతన బైక్ కొనుక్కోవాలని నిపుణులు సూచిస్తుంటారు.

* బైక్ కొనుగోలు చేసే ముందే డ్రైవింగ్ నేర్చుకుని, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ఉండడం మంచిది.

* పైన చెప్పుకున్న అంశాల్లో చక్కగా సరిపోలుతున్న బైక్స్ ఏవేవి ఉన్నాయో వాటిని ఎంపిక చేసుకుని, ధర, బ్రాండ్ విలువ, మోడల్ చూడ్డానికి ఎలా ఉందన్న అంశాల ఆధారంగా టాప్ 3 మోడల్స్ ను షార్ట్ లిస్ట్ చేసుకుని టెస్ట్ రైడ్ చేయాలి. ఒక డీలర్ దగ్గర కాకుండా ఇద్దరు ముగ్గురు డీలర్ల దగర్గకు వెళ్లి టెస్ట్ రైడ్ చేయండి. ఏది సౌకర్యంగా, హ్యాండిల్ చేయడానికి సౌకర్యంగా, స్మూత్ గా అనిపించిందో దాన్ని ఎంచుకోవడం సరైనది. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy