ap7am logo

2జీ, 3జీ, 4జీ LTE, VoLTE.. నెట్ వర్క్ ల కథా కమామీషు!

Tue, May 23, 2017, 01:58 PM
Related Image

రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. టెలికాం నెట్ వర్క్ లు అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ.. 2జీ నుంచి మొదలై 4జీ LTE వరకు వచ్చాయి. అందులోనూ కొత్తగా రిలయన్స్ జియో (Jio) సంస్థ వివో ఎల్ టీఈ (VoLTE) టెక్నాలజీతో అత్యుత్తమ వాయిస్ నాణ్యత అందిస్తామంటూ ముందుకు వచ్చింది. అత్యంత వేగంగా ఇంటర్నెట్ ను అందించేందుకు పూర్తిగా 4జీ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసింది. 

ఇందుకు దీటుగా క్యారియర్ అగ్రిగేషన్ టెక్నాలజీ (Carrier Aggrigation - CA)తో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ను అందించేందుకు ఎయిర్ టెల్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. కొత్త కొత్త మొబైల్ ఫోన్లు ఎన్నోకొత్త ఫీచర్లతో వస్తున్నా.. చాలా ఫోన్లలో VoLTE టెక్నాలజీ ఉండడం లేదు. అలాంటి మొబైల్ ఫోన్లతో టెలికాం సంస్థలు అందిస్తున్న సౌకర్యాలను పొందలేం. ఉదాహరణకు ప్రస్తుతం చాలా మంది వినియోగదారులు వాడుతున్న స్మార్ట్ ఫోన్లలో 3జీ సౌకర్యం మాత్రమే ఉంది. అలాంటి వాటిలో 4జీ నెట్ వర్క్ ను వినియోగించుకోలేం. ఇక 4జీ సౌకర్యం ఉన్నా VoLTE టెక్నాలజీ లేకపోవడంతో జియో సిమ్ నుంచి నేరుగా ఫోన్ కాల్స్ చేసుకోలేం. అసలు ఈ 2జీ, 3జీ, 4జీ, LTE, VoLTE, CA టెక్నాలజీలు ఏమిటి, వాటి పనితీరు, వేగం, సౌకర్యాలు, సిగ్నల్ పరిధి వంటి అంశాలు తెలుసుకుందాం..

ఫస్ట్ జనరేషన్ (1జీ)

మొబైల్ ఫోన్లు వచ్చిన తొలి నాళ్ల నాటి టెక్నాలజీని 1జీగా చెప్పవచ్చు. ప్రమాణాల పరంగా ఇది అత్యంత ప్రాథమిక టెక్నాలజీ. కేవలం వాయిస్ కాల్స్ చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. కనీసం ఎస్సెమ్మెస్ సౌకర్యం కూడా అందులో లేదు.

సెకండ్ జనరేషన్ (2జీ)

ప్రస్తుతం మన దేశంలో ఎక్కువగా అందుబాటులో ఉన్న టెక్నాలజీ 2జీ. ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్ల విప్లవానికి ఈ టెక్నాలజీయే ఊతమిచ్చింది. ఇందులో తొలుత వాయిస్ కాల్స్ తో పాటు ఎస్సెమ్మెస్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఇంటర్నెట్ సౌకర్యం కూడా వచ్చింది.

 • దీనిలో తొలుత జీపీఆర్ ఎస్ (జనరల్ పాకెట్ రేడియో సర్వీస్) సాంకేతికతతో ఇంటర్నెట్ అందించారు. దీనిలో గరిష్ట డౌన్ లోడ్ వేగం 80 కేబీపీఎస్ (కిలో బిట్స్ పర్ సెకండ్)కాగా.. గరిష్ట అప్ లోడ్ వేగం 20 కేబీపీఎస్.
 • తర్వాత మరింత వేగం కోసం ఎడ్జ్ (ఎన్ హాన్స్ డ్ డాటా రేట్స్ ఫర్ జీఎస్ఎం ఎవల్యూషన్) సాంకేతికతతో ఇంటర్నెట్ అందించారు. దీని గరిష్ట డౌన్ లోడ్ స్పీడ్ 236 కేబీపీఎస్, గరిష్ట అప్ లోడ్ స్పీడ్ 60 కేబీపీఎస్.

మూడో జనరేషన్ (3జీ)

మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగానికి ఊపునిచ్చిన ఆధునిక టెక్నాలజీ 3జీ. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడానికి, వాటి వినియోగం పెరగడానికి ఈ టెక్నాలజీయే కారణం. ఇంటర్నెట్ బ్రౌజింగ్ మాత్రమే కాదు.. ఫేస్ బుక్, ట్వీటర్, వాట్సప్ వంటి సామాజిక మీడియాతో పాటు ఎన్నో రకాల ఆన్ లైన్ సేవలు మొబైల్ ఫోన్లలోనే అందుబాటులోకి రావడానికి 3జీ తోడ్పడింది. దీనితోనే వీడియో కాల్స్ కూడా వచ్చాయి.

 • 3జీలో తొలుత డబ్ల్యూసీడీఎంఏ (వైడ్ బ్యాండ్ కోడ్ డివిజన్ మల్టీపుల్ యాక్సెస్)/యూఎంటీఎస్ (యూనివర్సల్ మొబైల్ టెలీకమ్యూనికేషన్స్ సర్వీస్) టెక్నాలజీలో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. దీనిలో గరిష్ట డౌన్ లోడ్, అప్ లోడ్ వేగం 384 కేబీపీఎస్ మాత్రమే. 
 • తర్వాత హెచ్ఎస్ పీఏ (హైస్పీడ్ పాకెట్ యాక్సెస్) సాంకేతికత వచ్చింది. దీని గరిష్ట డౌన్ లోడ్ స్పీడ్ 14.4 ఎంబీపీఎస్ (మెగాబిట్స్ పర్ సెకండ్), గరిష్ట అప్ లోడ్ స్పీడ్ 5.76 ఎంబీపీఎస్ కు పెరిగింది.
 • అనంతరం ఇదే టెక్నాలజీని మరింత మెరుగుపర్చి హెచ్ఎస్ పీఏ ప్లస్ (హైస్పీడ్ పాకెట్ యాక్సెస్ ప్లస్) ను రూపొందించారు. దీని గరిష్ట డౌన్ లోడ్ స్పీడ్ 42 ఎంబీపీఎస్, గరిష్ట అప్ లోడ్ స్పీడ్ 11.5 ఎంబీపీఎస్ కు పెరగడం గమనార్హం.

నాలుగో జనరేషన్ (4జీ) - లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ (LTE)

ఇటీవలే ప్రచారంలోకి విపరీతంగా ప్రభావం చూపిస్తున్న అత్యాధునిక టెక్నాలజీలే 4జీ, ఎల్టీఈ. 4జీ, LTE రెండూ దాదాపు ఒకే తరహా టెక్నాలజీలే అయినా.. పనితీరు, సౌకర్యాల విషయంలో స్వల్ప తేడా ఉంటుంది. కేబుల్ ద్వారా అందే బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కన్నా వేగంగా ఇంటర్నెట్ ను అందించగలగడం ఈ టెక్నాలజీ ద్వారా సాధ్యమైంది. 3జీ టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే 4జీ, LTE టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాయి. దీంతో మనం కొన్ని రోజుల కింద కొన్న సెల్ ఫోన్లలో సైతం 3జీ ఉండి 4జీ సౌకర్యం ఉండకపోవడం.. 4జీ కూడా ఉండి LTE లేకపోవడాన్ని గమనించవచ్చు. ప్రస్తుతం LTE లో కూడా మరింత ఆధునిక వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. దానిని LTE-A గా వ్యవహరిస్తారు. LTE, LTE-A లను ట్రూ 4జీ గా చెబుతారు. అయితే ప్రాథమికంగా 4జీ, LTE టెక్నాలజీల్లో వాయిస్ కాలింగ్ సౌకర్యం ఉండదు. అందువల్లే VoLTE (వాయిస్ ఓవర్ LTE) టెక్నాలజీని అభివృద్ధి చేశారు.

 • 4జీ, LTE నెట్ వర్క్ లలో గరిష్ట డౌన్ లోడ్ స్పీడ్ 100 ఎంబీపీఎస్ (మెగాబిట్స్ పర్ సెకండ్), గరిష్ట అప్ లోడ్ స్పీడ్ 50 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది.
 • LTE-A నెట్ వర్క్ లో గరిష్ట డౌన్ లోడ్ వేగం 1 జీబీపీఎస్ (గిగాబిట్స్ పర్ సెకండ్), గరిష్ట అప్ లోడ్ స్పీడ్ 500 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది.
 • 4జీ లో వైమాక్స్ (వరల్డ్ వైడ్ ఇంటరోపరబిలిటీ ఫర్ మైక్రోవేవ్ యాక్సెస్) 1, వైమాక్స్2 అనే మరో రెండు టెక్నాలజీలు కూడా ఉన్నాయి. వీటి వేగం LTE కంటే కాస్త తక్కువగా ఉంటుంది. అయితే వైమాక్స్ టెక్నాలజీని మన దేశంలో వినియోగించడం లేదు. 

VoLTE (వాయిస్ ఓవర్ LTE) పనితీరు ఏమిటి?

ప్రాథమికంగా 4జీ, LTE లలో వాయిస్ కాలింగ్ సదుపాయం ఉండదు. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ అందించగలిగినా.. ఈ సదుపాయం లేకపోవడం పెద్ద లోపం. దానిని సరిదిద్దేందుకే VoLTE ని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా వాయిస్ కాల్స్ అత్యంత నాణ్యంగా, అత్యంత స్పష్టంగా ఉంటాయి. అయితే సాధారణ LTE నెట్ వర్క్ పై కూడా VoLTE ని వినియోగించుకునేందుకు వీలు కల్పించే సాఫ్ట్ వేర్లను నిపుణులు అభివృద్ధి చేశారు. అందువల్లే చాలా 4జీ ఫోన్లలో VoLTE సపోర్టు లేకున్నా... ఒక చిన్న అప్లికేషన్ (యాప్) ద్వారా కాల్స్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. 

క్యారియర్ అగ్రిగేషన్ టెక్నాలజీ (Carrier Aggrigation - CA)

4జీ నెట్ వర్క్ పైనే మరింత వేగాన్ని అందించేందుకు ఉద్దేశించిన టెక్నాలజీయే క్యారియర్ అగ్రిగేషన్ టెక్నాలజీ. ఇది కొంచెం టెక్నికల్ అంశాలతో కూడుకున్న విషయం. LTE సెల్యూలార్ నెట్ వర్క్ లోని వివిధ సిగ్నల్ స్ట్రెంత్ లను అనుసంధానం చేస్తూ ఒకేసారి రెండు, అంతకన్నా ఎక్కువ సిగ్నల్ ఫ్రీక్వెన్సీలపై డేటాను అందించడమే ఈ టెక్నాలజీ ప్రత్యేకత. దీనినే LTE-A (ఎల్ టీఈ అడ్వాన్స్ డ్)గా కూడా చెప్పవచ్చు. దీని ద్వారా ప్రస్తుతం మన దేశంలో అందిస్తున్న 4జీ ఇంటర్నెట్ వేగానికి మూడింతల వేగంగా ఇంటర్నెట్ అందించవచ్చు.

ఐదో జనరేషన్ (5జీ) -  XLTE

మన దగ్గర ఇప్పటికే 4జీ నెట్ వర్క్ దాదాపు పూర్తిగా అందుబాటులోకి వచ్చేసింది. ఇక ముందు రాబోయేది ఐదో జనరేషన్ (5జీ) టెక్నాలజీయే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు, ఎంతో మంది శాస్త్రవేత్తలు 5జీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. దీని వేగం 1 జీబీపీఎస్ నుంచి 10 జీబీపీఎస్ వరకూ ఉండే అవకాశముంది.  

జీఎస్ఎం, సీడీఎంఏ ఏమిటి?

సెల్ ఫోన్ నెట్ వర్క్ లకు సంబంధించి సిగ్నళ్లను ప్రసారం చేసే రెండు వేర్వేరు టెక్నాలజీలే జీఎస్ఎం (గ్లోబల్ సిస్టం ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్), సీడీఎంఏ (కోడ్ డివిజన్ మల్టీపుల్ యాక్సెస్). ఈ రెండూ దాదాపు ఒకే తరహా పనితీరును కలిగి ఉంటాయి. దాదాపు ఒకే వేగంతో పనిచేస్తాయి.

 • 2జీలో ఇంటర్నెట్ ప్రసారానికి జీఎస్ఎంలో జీపీఆర్ఎస్, ఎడ్జ్ టెక్నాలజీ ఉంటే... సీడీఎంఏలో ఆర్ టీటీ (రేడియో ట్రాన్స్ మిషన్ టెక్నాలజీ) ఉంటుంది.
 • 3జీలో ఇంటర్నెట్ ప్రసారానికి డబ్ల్యూసీడీఎంఏ/యూఎంటీఎస్, హెచ్ఎస్ పీఏ, హెచ్ఎస్ పీఏ ప్లస్ లు ఉంటే... సీడీఎంఏలో ఈవీడీవో (ఎవల్యూషన్ డాటా ఆప్టిమైజ్డ్) టెక్నాలజీ ఉంటుంది.
 • ఇక 4జీ అనేది జీఎస్ఎం, సీడీఎంఏ రెండింటికీ పూర్తిగా భిన్నమైన టెక్నాలజీ. దీనిని ఓఎఫ్ డీఎంఏ ( ఆర్థోగోనల్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీపుల్ యాక్సెస్ - OFDMA) టెక్నాలజీగా పేర్కొంటారు. అందులో అధునాతనమైన LTE-A ను ఎస్ సీ ఎఫ్ డీఎంఏ (సింగిల్ క్యారియర్ - ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీపుల్ యాక్సెస్SC-FDMA) గా పేర్కొంటారు.

మరెన్నో టెక్నాలజీలు..

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు, ఎందరో శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీలు, వేగవంతమైన విధానాలను రూపొందిస్తూనే ఉంటారు. అందులో విస్తృతంగా వినియోగించుకునేందుకు వీలైన, ఆర్థికపరంగా వినియోగ సాధ్యమైన టెక్నాలజీలను ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ గుర్తిస్తుంది. వాటిని మరింతగా మెరుగుపర్చి ప్రమాణాలను, విధానాలను నిర్ధారిస్తుంది. అనంతరం టెలికాం సంస్థలు దానిని వినియోగించుకుని సేవలు అందిస్తాయి. అయితే ఈ నెట్ వర్క్ లకు సంబంధించి పేర్కొన్న ఇంటర్నెట్ స్పీడ్ లెక్కలన్నీ ప్రామాణిక పరిస్థతుల్లో పేర్కొనేవే. టెలికాం టవర్ల నుంచి దూరం, భవనాలు, ప్రదేశాలను బట్టి నెట్ వర్క్ ల వేగంలో మార్పులు ఉంటాయి.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy