ap7am logo

ఈ ఖనిజాలు అందితే ఆరోగ్యం సూపర్..

Tue, May 23, 2017, 01:21 PM
Related Image

మన ఆరోగ్యం బాగుండాలంటే రోజూ తినే ఆహారంలో ఎన్నో రకాల పోషకాలు ఉండాల్సిందే. ఆహారంలోని కార్బోహైడ్రేట్లు, కొవ్వులు శక్తినిచ్చినా.. మన శరీరంలోని అన్ని అవయవాలు సరిగా పనిచేయాలంటే విటమిన్లు, ప్రొటీన్లు, అమైనో ఆమ్లాల వంటి పోషకాలు కూడా అందాలి. వీటితోపాటు కొన్ని ఖనిజ లవణాలూ శరీరానికి అత్యవసరం. వాటిలోనూ స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు లేదా ట్రేస్ మినరల్స్ అని రెండు రకాలు.

కాల్షియం, సోడియం, పొటాషియం, క్లోరిన్ (క్లోరైడ్), మెగ్నీషియం, ఫాస్పేట్ లు స్థూల పోషకాలు. శరీరంలో ఎముకలు, కండరాలు, గుండె, మెదడుల పనితీరు స్థూల పోషకాలపై ఆధారపడి ఉంటుంది. ఇక క్రోమియం, కాపర్, ఫ్లోరైడ్, అయోడిన్, ఐరన్, మాంగనీస్, మాలిబ్డినమ్, సెలీనియం, జింక్ లు సూక్ష్మ పోషకాలు లేదా ట్రేస్ మినరల్స్. ఇందులో క్రోమియం రక్తంలో గ్లూకోజ్ స్థాయులు సాధారణంగా ఉండేందుకు తోడ్పడుతుంది. మిగతా ట్రేస్ మినరల్స్ అన్నీ శరీరంలో హార్మోన్లు, ఎంజైముల తయారీకి అవసరం. మరి ఈ ఖనిజ లవణాలు ఏమిటి, వేటి నుంచి అవి లభిస్తాయి, లోపిస్తే వచ్చే సమస్యలేమిటి, ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో తెలుసుకుందాం..

రోజూ అందాల్సిందే..

ఖనిజ లవణాలన్నీ తక్కువ స్థాయిలోనే అయినా శరీరానికి అత్యంత అవసరం. అంతేకాదు ఇవి రోజూ శరీరానికి అందాల్సిందే. లేకపోతే మనకు ఎన్నో రకాల అనారోగ్యాలు, వ్యాధులు కలుగుతాయి. సాధారణంగా ఈ ఖనిజ లవణాలన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారానే లభిస్తాయి. పోషకాహారం తీసుకునేవారిలో ఖనిజ లవణాల లోపం ఏర్పడే అవకాశం తక్కువ. కాల్షియం, అయోడిన్, ఐరన్ ల లోపం మాత్రం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేగాకుండా ఎప్పుడూ ఒకే రకమైన ఆహారం తీసుకోవడం లేదా కొన్ని రకాల ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండడం వల్ల కూడా ఖనిజ లవణాల లోపం ఏర్పడుతుంది.

ఉదాహరణకు గుడ్లు, పాల పదార్థాలు, శాకాహారం మాత్రమే తీసుకునే వారిలో ఐరన్ లోపిస్తుంది. ఇక శిశువులకు ఖనిజ లవణాల అవసరం ఎక్కువ. ఎందుకంటే వారిలో పెరుగుదల వేగం ఎక్కువగా ఉంటుంది. ఖనిజ లవణాలేవైనా ఒక పరిమిత స్థాయికి మించి సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటే అవి శరీరానికి విషంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వీటి లోపం ఏర్పడినవారు తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో, వారు సూచించిన మోతాదుల్లోనే వినియోగించాలి.

స్థూల ఖనిజాలు ప్రాణాధారం

ఖనిజ లవణాలు శరీరానికి ప్రాణాధారం. ఇవి కణాల లోపలి నుంచి శరీరం మొత్తం మీద వివిధ ద్రవ పదార్థాల స్థితిని కాపాడుతాయి. ఈ ఖనిజ లవణాలతో తయారయే ఎలక్ట్రోలైట్లు నాడులు, కండరాల పనితీరును నియంత్రిస్తాయి. శరీరంలో ఆమ్లయుత-క్షారయుత పరిస్థితిని సమతుల్యం చేస్తాయి. ఒకవేళ ఖనిజ లవణాల లోపం ఏర్పడితే ఎలక్ట్రోలైట్లు తగ్గిపోయి.. శరీరంలో నీటి శాతం పడిపోతుంది. కండరాలు, నాడుల పనితీరు దెబ్బతింటుంది. ఇది చివరికి మరణానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఈ ఖనిజ లవణాల లోపాన్ని రక్త, మూత్ర పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. 

ఎముకలు, కండరాలకు కాల్షియం..

శరీరంలో ఎముకలు, దంతాలు ఏర్పడడానికి, ఎముకలు బలహీనం కాకుండా ఉండడానికి, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి ఇది తోడ్పడుతుంది. గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టడానికి, కండరాల పనితీరు సరిగా ఉండడానికి కాల్షియం, గుండె సరిగా కొట్టుకోవడానికి, శరీరంలో చాలా రకాల ఎంజైములు సరిగా పనిచేయడానికి కూడా కాల్షియం అత్యవసరం. శరీరానికి తగిన మోతాదులో కాల్షియం అందకపోతే రక్తంలో కాల్షియం లోపిస్తుంది. దాంతో శరీరం ఎముకల నుంచి కాల్షియంను రక్తంలోకి తరలిస్తుంది. దీనినే ‘హైపోకాల్సిమియా’ అంటారు. దీంతో ఎముకలు బలహీన పడి ‘ఆస్టియోపోరోసిస్’ సమస్య తలెత్తుతుంది. చిన్నపాటి దెబ్బలు, ప్రమాదాలకే విరిగిపోతాయి. మనిషి శరీర బరువులో 1.5 నుంచి 2 శాతం దాకా కాల్షియం ఉంటుంది.

 • కాల్షియం ఎక్కువగా పాలు, పాల పదార్థాలు, మాంసం, గుడ్లు వంటి పదార్థాల్లో లభిస్తుంది.
 • సాధారణ వ్యక్తులకు రోజుకు 1,000 మిల్లీగ్రాములు, 50 ఏళ్లు పైబడిన వారికి 1,200 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం. ఇది రోజుకు 2,500 మిల్లీగ్రాములకు మించి తీసుకుంటే శరీరానికి విషపూరితంగా మారుతుంది.
 • శరీరంలో కాల్షియం స్థాయి ఎక్కువైతే ‘హైపర్ కాల్సిమియా’ సమస్య తలెత్తుతుంది. దానివల్ల అజీర్తి, విపరీతమైన దాహం, కడుపునొప్పి, ఆకలి మందగించడం, మూత్రం ఎక్కువగా రావడం, గందరగోళపడడం వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. చివరికి కోమాలోకి వెళ్లి మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది.

కణాలకు, శరీర సమతుల్యతకు సోడియం

నాడులు, కండరాలు సరిగా పనిచేయడానికి, శరీరంలో ద్రవాల సమతుల్యతకు సోడియం అత్యవసరం. రక్తంలోను, కణాల చుట్టూ ఉండే ద్రవం (ఫ్లూయిడ్)లోను సోడియం ఉంటుంది. ఇది గ్లూకోజ్, నీరు, అమైనో ఆమ్లాల రవాణాలో తోడ్పడుతుంది. సాధారణంగా సోడియం లోపం ఏర్పడడం అరుదు. శరీరం నుంచి ద్రవాలు విపరీతంగా వెళ్లిపోయే డీహైడ్రేషన్ (అతి మూత్రం, వాంతులు, విరేచనాలు, విపరీతంగా చెమట పట్టడం వంటివి), కిడ్నీలు దెబ్బతినడం, శరీరంపై తీవ్రంగా కాలిన గాయాలు కావడం వంటి పరిస్థితుల్లో శరీరంలో సోడియం లోపం ఏర్పడుతుంది. దీనివల్ల కండరాల వణుకు, బిగుసుకుపోవడం, గందరగోళం, స్పృహ తప్పిపోవడం వంటి ప్రమాదాలు ఏర్పడుతాయి. ఈ పరిస్థితి మరీ తీవ్రమైతే కోమాలోకి వెళ్లిపోతారు, మరణం కూడా సంభవించవచ్చు.  ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉండే ద్రవాలను తీసుకోవడం ద్వారా, సోడియం ద్రవాన్ని నరాల ద్వారా ఎక్కించడం ద్వారా లోపాన్ని అధిగమించవచ్చు. అయితే సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయి. రక్తంలో ద్రవాల శాతం పెరిగి రక్తపోటుకు దారితీస్తుంది. గుండెపోటు, కడుపులో కేన్సర్, కిడ్నీ వ్యాధులు, కాలేయ సమస్యలు తలెత్తుతాయి.

 • సోడియం ఖనిజానికి ప్రధానమైన వనరు ఉప్పు. మాంసం, వెన్న, ఆలివ్, మొక్కజొన్న, బంగాళదుంపల్లో కూడా ఇది లభిస్తుంది.
 • సాధారణ వ్యక్తులకు రోజుకు 1,000 మిల్లీగ్రాముల సోడియం అవసరం. దీనిని రోజుకు 2,400 మిల్లీగ్రాములకు మించి తీసుకుంటే శరీరానికి విషపూరితంగా మారుతుంది. 
 • ప్రస్తుతం మారిన ఆహార అలవాట్ల కారణంగా శరీరానికి అందే సోడియం శాతం చాలా ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోని ఆహార పదార్థాలు, బేకరీల్లోని జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఇంట్లోనూ ఉప్పు అధికంగా వినియోగించడం వంటివాటి వల్ల అధికంగా సోడియం అందుతోంది. ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.

మెదడు, కండరాల ఆరోగ్యానికి పొటాషియం

శరీరారానికి అత్యంత అవసరమైన పోషకాల్లో పొటాషియం ప్రధానమైనది. ముఖ్యంగా నాడులు, కండరాలు సక్రమంగా పనిచేయాలంటే శరీరానికి తగిన మోతాదులో పొటాషియం అందాల్సిందే. అంతేకాదు గుండె జబ్బుల నివారణ, రక్తపోటు నియంత్రణలోనూ ఇది కీలకం. ఎముకలు దృఢంగా ఉండడానికి, మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడానికి తోడ్పడుతుంది. శరీరంలో ఉండే పొటాషియంలో చాలా వరకు కణాల అంతర్భాగంలో ఉంటుంది. పొటాషియం స్థాయులు బాగా పెరిగినా.. బాగా తగ్గినా కూడా ఇబ్బందే. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదమూ ఉంటుంది. పొటాషియం లోపం వల్ల కండరాలు బలహీనమైపోతాయి. అది తీవ్రమైతే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. హైపర్ థైరాయిడిజం సమస్య తలెత్తుతుంది. 

 • పాలు, అరటిపండ్లు, టామాటా, నారింజ, పుచ్చకాయ, బంగాళదుంప, చిలగడదుంప, పాలకూర, ఆకుపచ్చని కూరగాయలు, బఠాణీ, చిక్కుడు వంటి గింజలు, ఓఆర్ఎస్ పౌడర్ వంటి ఎలక్ట్రోలైట్ ద్రవాల్లో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది.
 • ఇది సాధారణ వ్యక్తులకు రోజుకు 3.5 గ్రాముల వరకు అవసరం. చిన్న పిల్లలు, గర్భిణులకు మరింత ఎక్కువగా అంటే 4.7 గ్రాముల వరకు అందాలి. అయితే దీర్ఘకాలం పాటు పొటాషియం ఎక్కువ మోతాదులో అందడం వల్ల గుండెకు చేటు కలుగుతుంది. రక్త పరీక్షల ద్వారా శరీరంలో పొటాషియం స్థాయులను తెలుసుకోవచ్చు. 
 • బీడీలు, సిగరెట్లు, ఖైనీల వంటి పొగాకు ఉత్పత్తులు, ఆల్కాహాల్ కారణంగా.. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, కొన్ని రకాల మందుల వినియోగం వల్ల శరీరంలో పొటాషియం లోపం ఏర్పడుతుంది. దీనిని హైపోకాలేమియా అంటారు. లోపం ఉన్నవారు ఆహారంలో మార్పులు, సప్లిమెంట్ల ద్వారా తీసుకోవచ్చు.
 • ఇక మూత్ర పిండాలు దెబ్బతినడం, కొన్ని రకాల మందులు, అధికంగా పొటాషియం ఉండే ఆహారం తీసుకోవడం వంటి కారణాల వల్ల శరీరంలో పొటాషియం స్థాయి పరిమితికి మించి పెరుగుతుంది. దీనివల్ల కండరాల బలహీనత, గుండె కొట్టుకునే వేగంలో మార్పులు, చివరికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.

రక్తపోటు నియంత్రణకు క్లోరిన్ (క్లోరైడ్)

శరీరంలో ద్రవాల స్థితిని సమతూకంగా ఉంచేందుకు క్లోరైడ్ అత్యవసరం. అంతేగాకుండా కండరాల పనితీరుకు, రక్త పోటును నియంత్రణలో ఉంచడానికి ఇది తోడ్పడుతుంది. అయితే సాధారణంగా క్లోరైడ్ లోపం ఏర్పడడం చాలా అరుదు. ఎందుకంటే మనం నిత్యం ఉపయోగించే అన్ని రకాల ఆహార పదార్థాల్లోనూ ఉప్పును వినియోగిస్తాం. దాని నుంచి తగిన మోతాదులో క్లోరైడ్ అందుతుంది.

 • క్లోరైడ్ కు ప్రధాన వనరు మనం సాధారణంగా వినియోగించే ఉప్పు. దీంతోపాటు వెన్న, ఆలివ్, మొక్కజొన్న బ్రెడ్, ఆలూ చిప్స్ వంటి ప్రాసెస్డ్ ఆహారం, మాంసంలోనూ లభిస్తుంది.
 • సాధారణ వ్యక్తులకు రోజుకు ఒక గ్రాము (1000 మిల్లీగ్రాముల) క్లోరైడ్ అవసరం. క్లోరిన్ స్వతహాగా విషపూరితమైన పదార్థం. అది పరిమితికి మించితే ప్రమాదకరంగా మారుతుంది. అయితే ఆహారం ద్వారా అధికంగా అందే క్లోరిన్ ను శరీరం ఎప్పటికప్పుడు విసర్జిస్తూ ఉంటుంది.

ఎదుగుదలకు తోడ్పడే మెగ్నీషియం

శరీరంలో ఎముకలు, దంతాల నిర్మాణానికి.. నాడులు, కండరాల పనితీరు సరిగా ఉండడానికి మెగ్నీషియం అత్యవసరం. ముఖ్యంగా శరీరంలో వివిధ అవయవాలు విడుదల చేసే ఎంజైములు క్రియాశీలం కావడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. తద్వారా శరీరం ఎదుగుదలకు తోడ్పడుతుంది. పోషకాహార లోపం, కిడ్నీ, పెద్ద పేగుల వ్యాధులు, ఆల్కాహాల్ విపరీతంగా తీసుకోవడం, డయేరియా, హైపర్ థైరాయిడిజం, కొన్ని రకాల మందుల వినియోగం కారణంగా మెగ్నీషియం లోపం ఏర్పడుతుంది. దీనిని హైపోమెగ్నీషీమియా అంటారు. దీనివల్ల ఆకలి మందగించడం, వికారం, నిద్రలేమి, శారీరక బలహీనత, వణుకు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక శరీరంలో మెగ్నీషియం స్థాయులు పెరగడాన్ని హైపర్ మెగ్నీషీమియా అంటారు. చాలా అరుదుగా కనిపించే ఈ సమస్య కిడ్నీలు చెడిపోవడం, మెగ్నీషియం అధికంగా ఉండే లవణాలు ఎక్కువగా తీసుకోవడం, యాంటాసిడ్లు అధికంగా తీసుకోవడం వల్ల తలెత్తుతుంది. దీనికారణంగా శారీరక బలహీనత, రక్తపోటు పడిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు గుండె పనితీరు దెబ్బతింటుంది.

 • ఆకుపచ్చని కూరగాయలు, నట్స్, తృణ ధాన్యాలు, బీన్స్, టమాటా పేస్ట్, పలు రకాల లవణాలు, సాఫ్ట్ డ్రింకులు, కూల్ డ్రింకులు, బేకరీ ఉత్పత్తులలో మెగ్నీషియం లభిస్తుంది.
 • పురుషులకు రోజుకు 420 మిల్లీగ్రాములు, మహిళలకు 320 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరం. పిల్లలకు పాలిచ్చే మహిళలకు మరింత ఎక్కువ మోతాదులో అందాల్సి ఉంటుంది.
 • రక్త పరీక్షల ద్వారా శరీరంలో మెగ్నీషియం స్థాయులను గుర్తించవచ్చు. సాధారణంగా మెగ్నీషియం లోపం ఏర్పడడం చాలా తక్కువ.

డీఎన్ఏను తయారుచేసే ఫాస్పరాస్ (ఫాస్పేట్)

శరీరంలో కణాల నిర్మాణంలో ఫాస్పరాస్ (శరీరంలో ఇది ఆక్సిజన్ తో కలసి ఫాస్పేట్ రూపంలో ఉంటుంది) అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. కణాల అంతర్భాగంలో ఉండే డీఎన్ఏ, ఆర్ఎన్ఏ సహా దాదాపు అన్ని న్యూక్లిక్ యాసిడ్ ల తయారీలో, కణ పదార్థం తయారీలో ఇది కీలకం. ఇక శరీరంలో శక్తి ఉత్పాదనకు తోడ్పడేది ఫాస్పేటే. ఎముకలు, దంతాల నిర్మాణానికి ఇది అవసరం. పోషకాహార లోపం, విపరీతంగా ఆల్కాహాల్ తీసుకోవడం, హైపర్ థైరాయిడిజం, డయేరియా, అల్యూమినియం ఉండే యాంటాసిడ్లను ఎక్కువ కాలం వినియోగించడం, కాలిన గాయాలు వంటి పరిస్థితుల్లో ఫాస్పేట్ లోపం ఏర్పడుతుంది. దీనినే హైపో ఫాస్పోటేమియా అంటారు. దీనివల్ల ఆకలి మందగించడం, ఎముకలు గుల్లబారి చిన్న దెబ్బకే విరిగిపోవడం వంటి సమస్యలు వస్తాయి. లోపం తీవ్రమైతే కండరాల బలహీనత, స్పృహ కోల్పోవడం, కోమాలోకి వెళ్లడం, చివరికి మరణం కూడా సంభవించే అవకాశముంటుంది. ఇక పారాథైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోవడం, కిడ్నీ సమస్యలు, డయాలసిస్ చేయించుకోవడం, ఇన్ఫెక్షన్లకు లోనైనప్పుడు శరీరంలో ఫాస్పేట్ స్థాయిలు పరిమితికి మించి పెరుగుతాయి. దీనినే హైపర్ ఫాస్పోటేమియా అంటారు. శరీరంలో అధికంగా చేరే ఫాస్పేట్ కాల్షియంతో కలసి స్పటికాలను ఏర్పరుస్తుంది. ముఖ్యంగా రక్త నాళాల్లో ఇవి ఏర్పడడం వల్ల నాళాలు గట్టిపడడం, మూసుకుపోవడం వంటివి జరుగుతాయి. దీంతో గుండెపోటు, మెదడు వంటి అవయవాలు దెబ్బతినడం జరుగుతుంది.

 • పాలు, పాల పదార్థాలు, మాంసం, చికెన్, చేపలు, తృణ ధాన్యాలు, గింజలు, చిక్కుడు, బఠాణీ వంటి విత్తనాల్లో ఫాస్పరాస్ ఎక్కువగా లభిస్తుంది. 
 • సాధారణ వ్యక్తులకు రోజుకు 700 మిల్లీగ్రాముల ఫాస్పరాస్ అవసరం. ఒక రోజులో 4 గ్రాములు (4,000 మిల్లీగ్రాముల)కు మించి ఫాస్పరాస్ శరీరానికి అందడం ప్రమాదకరం. రక్త పరీక్షల ద్వారా శరీరంలో ఫాస్పేట్ స్థాయులను పరిశీలించవచ్చు. 
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy