'రెండు చేతులా సంపాదనకు ఇవిగో... బోలెడు మార్గాలు!

Thu, Sep 29, 2016, 03:13 PM
Related Image

జీవన విధానం మారింది. అవసరాలు పెరిగిపోతున్నాయి. కానీ సంపాదన సరిపోవడం లేదన్న మాట ఎక్కువ మంది నుంచి వినిపిస్తుంది. చాలడం లేదన్న మాటను పక్కన పెట్టి ఆలోచిస్తే, కళ్ల ముందే సిరులు కురిపించే బోలెడు మార్గాలు కనిపిస్తాయి. అమెరికా కార్మిక విభాగం గణాంకాల ప్రకారం 2015 లో 2.7 కోట్ల మంది పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారట. ఈ సంఖ్య మన దేశంలోనూ భారీగానే ఉంటుంది.

representation image

వంటలో నైపుణ్యం ఉందా...?

ఏదైనా వెరైటీని నోరూరించేలా ప్రిపేర్ చేయగలరా? ఇంకెందుకు ఆలస్యం, ఇంటి నుంచే ఆర్డర్లను అందుకోండి. అడుగు బయట పెట్టక్కర్లేదు. ఫోన్ ద్వారా ఆర్డర్ చెప్పేస్తారు. సిద్ధం చేసిన వెంటనే దూత వచ్చి దాన్ని తీసుకుని ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ కు అందజేస్తారు. ఇది నగరాల్లో నయా వ్యాపారం. ఫుడ్ పాండా వంటి పలు సైట్లు ఈ తరహా సేవలకు వేదికగా నిలుస్తున్నాయి. మీరు సొంతంగానూ ఆర్డర్లు తీసుకుని కూడా అందించవచ్చు. బిజినెస్ జోరందుకుంటే ఫుల్ టైమ్ లేదంటే పార్ట్ టైమ్.

ఫ్రీలాన్సర్ గా...

మీరు ఏవైనా ఆర్టికల్స్ ను బాగా రాయగలరా...? లేదా ఒక భాషలో ఉన్న సమాచారాన్ని మరో భాషలోకి అనువాదం చేయగలరా? రాసే నైపుణ్యం ఉంటే దాన్నే ఫ్రీలాన్స్ వర్క్ గా ఎంచుకోండి. మేగజైన్లు, వెబ్ సైట్లు, న్యూస్ పేపర్లు ఇలా అవసరం ఉన్న సంస్థలకు రోజులో కొంత సమయం పాటు సేవలు అందించండి.

elance.com, odesk.com వంటి వెబ్ సైట్లలో పేరు నమోదు చేసుకుంటే ఆన్ లైన్ టెస్టులు నిర్వహించి మీలో ఉన్న ప్రతిభను గుర్తించి పది మందికీ తెలియజేస్తుంది. అప్పుడు మీ సేవలు కావాలనుకున్న వారు గంటకు ఇంత చొప్పున మీ సేవలను వినియోగించుకుంటారు. ముఖ్యంగా ఆన్ లైన్ లో ఫ్రీలాన్స్ వర్క్ పేరుతో బోగస్ సంస్థలు చాలానే ఉన్నాయి. కనుక సైట్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ఖాళీ సమయాల్లో పనిచేయడం ద్వారా (ఫ్రీలాన్స్) ఆదాయం సంపాదనకు అనువైన ఈ సైట్ల ద్వారా భారత్ నుంచి ఎంతో మంది ఫుల్ టైమ్ పనిచేస్తూ లక్షల రూపాయల్లోనూ ఆదాయం గడిస్తున్నారు.  

representation image

చిన్నారుల సంరక్షణతోనూ డబ్బులే

నగర, పట్టణ జీవనంలో దంపతుల్లో చాలా మంది ఇద్దరూ ఉద్యోగ బాధ్యతల్లో ఉంటున్నారు. దాంతో తమ చిన్నారులను చూసుకోలేని పరిస్థితి. అందుకే చైల్డ్ కేర్ సెంటర్ల వ్యాపారం ప్రస్తుతం మంచి జోరులో ఉంది. పట్టణీకరణ పెరుగుతున్న కొద్దీ, కుటుంబాలు చిన్నవైపోతున్న కొద్దీ ఇటువంటి వ్యాపారాలకు లోటు ఉండదు. దీన్ని వ్యాపార అవకాశంగా ఎందుకు తీసుకోకూడదు. కాకపోతే చిన్నారుల సంరక్షణ విషయంలో నైపుణ్యం ఉండాలి. అందుకోసం కొంచెం ట్రైనింగ్ కూడా తీసుకోవాల్సి రావచ్చు. అయినా ఆసక్తి అనిపిస్తే ముందడుగే మంచిది.

అద్దెకు ఇస్తే...

మీకు ఇల్లు ఉందా... ఇంట్లో ఓ గది అయినా ఖాళీగా ఉంటోందా..? దాన్ని అద్దెకు ఇచ్చేయండి. పర్మినెంట్ గా కాదు. ఎయిర్ బీఎన్ బీ సైటులో నమోదు చేసుకుంటే ఒక రోజు, వారం రోజుల కోసం విడిది కోరుకునే వారికి మీ ఇల్లు లేదా గదిని చూపిస్తుంది. బుక్ చేసుకుంటే అదనపు ఆదాయం వచ్చి పడినట్టే.

representation image

ఇంటిపై రెస్టారెంట్

సొంతిల్లు ఉంటే ఇంటి పైభాగంలో ఓపెన్ టాప్ రెస్టారెంట్ ను తెరిచేయండి. చక్కని షెఫ్ ను, నలుగురైదుగురు మంచి వర్కర్లను చూసుకుంటే దండిగా ఆదాయం. రూఫ్ టాప్ రెస్టారెంట్ నగరాల్లో ఆకర్షణీయంగా ఉంటుంది.

లంచ్ బాక్స్ సర్వీస్

పట్టణాలు, నగరాల్లో ఈ సేవకు మంచి డిమాండ్. చాలా వరకు కార్యాలయాల్లో క్యాంటీన్లు ఉంటాయన్నది వాస్తవమే. కానీ ఇంటి ఫుడ్ తిన్నామన్న ఫీల్ ఉండదు. ఉదయమే ఆఫీసుకు వెళ్లేవారు వెంట తీసుకెళ్లే లంచ్ బాక్స్ లోని వంటకాలు మధ్యాహ్నానికి రుచి మారిపోతాయి. మంచి నాణ్యతతో, రుచులతో శాంపిల్ గా ఏదేనీ ఓ సంస్థ ఉద్యోగులకు లంచ్ బాక్స్ ను ఒక రోజు అందించి చూడండి. వచ్చిన ఫలితమే ముందుకు నడిపిస్తుంది. కానీ, ఒక్కటే లాజిక్. ధర ఎక్కువగా ఉండకూడదు. కొంచెం రీజనబుల్ గా ఉండాలి. అందుకే తక్కువ లాభం చూసుకోవాలి. వ్యాపారం పెరిగితే లాభం అదే ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది.

కేటరింగ్

పైన చెప్పుకున్నట్టే మంచి రుచికరమైన ఆహారాన్ని చిన్న చిన్న కార్యక్రమాలకు, వేడుకలకు కేటరింగ్ రూపంలో అందించవచ్చు. నిర్మాణ రంగ కాంట్రాక్టర్లు, ప్రముఖ బిల్డర్ సంస్థలు కార్మికులకు ప్రతిరోజు మధ్యాహ్నం ఉచిత భోజనాన్ని అందిస్తుంటాయి. ఆ కాంట్రాక్టు తీసుకోవడం ద్వారా మంచి ఆదాయమే వస్తుంది.

హౌస్ కీపింగ్

కార్యాలయాల్లో హౌస్ కీపింగ్ సర్వీస్ కు ప్రాధాన్యం పెరిగింది. ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచేందుకు భారీగానే వ్యయం చేస్తున్నాయి. ఈ సేవలను సర్వీస్ ఏజెన్సీలకు కాంట్రాక్టు ఇస్తుంటాయి. మంచిగా కష్టపడి పనిచేసే వారుంటే ఓ బృందాన్ని తయారు చేసుకుని కాంట్రాక్టు తీసుకోవడం ద్వారా బాగానే సంపాదించుకోవచ్చు.  

కాఫీ మెషిన్లు

కార్యాలయాల్లో కాఫీ, టీ మెషిన్లతోనూ ఆదాయం సమకూర్చుకోవచ్చు. పెద్ద పెద్ద కార్యాలయాలు, కంపెనీల వద్ద సబ్సిడీపై ఆఫర్ చేస్తే మెషిన్ల ఏర్పాటుకు అనుమతి పొందవచ్చు.

ట్యూషన్లు @ హోమ్

మీకు ఎందులోనైనా ఒక విభాగంలో నైపుణ్యం ఉండాలేగానీ డబ్బులు ఎందుకు రాలవు!  సంగీతంలో ప్రావీణ్యం, యోగ విద్య, లెక్కల్లో ఘనాపాటి, వేదిక్ మ్యాథ్స్ లో దిట్ట ఇలా ఏదైనా కావచ్చు. మీ ఇంట్లోనే ఉదయం సాయంత్రం ఓ రెండు గంటల పాటు శిక్షణ ప్రారంభించండి. ఎంతో కొంత ఆదాయం గ్యారంటీ. కొంత మంది ధనవంతులు ఇంటికే వచ్చి చెప్పే వాళ్ల కోసం ఎదురు చూస్తుంటారు. కావాల్సినంత డబ్బులు ఇచ్చే వాళ్లయితే వెళ్లి చెప్పడానికి సంకోచం అక్కర్లేదు.

representation image

ట్యూషన్లు @ ఆన్ లైన్

ఆన్ లైన్ ప్రపంచాన్నంతటినీ ఏకతాటిపై ఊపేస్తోంది. పైన చెప్పుకున్నట్టు మీకంటూ ఏ విభాగంలో అయినా నైపుణ్యం ఉంటే ఆన్ లైన్ విధానంలో విదేశాల్లో ఉన్న తెలుగువారికి చక్కగా ట్యూషన్లు చెప్పేయండి. దండిగా ఆదాయం గ్యారంటీ. కళలే అవసరం లేదు. ఏదో ఒక సబ్జెక్టులో నిష్ణాతులు అయితే చాలు. http://www.2tion.com/ , http://www.tutorvista.co.in, http://www.pearsoned.com/ ఇలా ఎన్నో సైట్లు ఉన్నాయి. 

ట్యుటర్ విస్టా ఆన్ లైన్ టీచింగ్ అవకాశాలకు ప్రముఖ సైట్. ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకుపైగా ఈ సైట్ సాయంతో బోధించడం ద్వారా సంపాదిస్తున్నారు. ఇప్పటికే టీచింగ్ లో అనుభవం ఉన్న వారు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో అధ్యాపకులు సైతం అదనపు ఆదాయం కోసం ట్యూటర్ విస్టా తలుపు తట్టవచ్చు.

గూగుల్ హెల్ప్ అవుట్

మీకు నైపుణ్యాలు ఉంటే గూగుల్ హెల్ప్ అవుట్స్ కు వెళ్లి కూడా ఇతరులకు బోధించవచ్చు. ఆర్ట్స్, మ్యూజిక్, కుకింగ్ ఇలా ఎన్నో కేటగిరీలు అక్కడ ఉంటాయి. మీ నైపుణ్య విభాగాన్ని ఎంచుకుని ఔత్సాహికులకు బోధించడం ద్వారానూ ఆదాయం పొందవచ్చు.

representation image

యూ ట్యూబ్ తోనూ ఆదాయం

యూ ట్యూబుల్ లో ఓ చానల్ ఓపెన్ చేయండి. ప్రత్యేకమైన వీడియోలను అందులో పోస్ట్ చేయండి. వాటిని ఎక్కువ మంది చూడాలి. లైక్ చేయాలి. పాప్యులర్ కావాలి. అంతే, ఆటోమేటిక్ గా మీకు ఆదాయం వచ్చేస్తుంది. మరో చోట నుంచి కాపీ కొట్టిన వీడియోలు కాదు. సొంతంగా రూపొందించిన వీడియోలు అయి ఉండాలి.

ఉదాహరణకు మీకంటూ పైన చెప్పుకున్నట్టు ఏదైనా సబ్జెక్టులో నైపుణ్యం ఉంటే... ఆ సబ్జెక్ట్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతో చదువరుల కోసం వీడియోలను రూపొందించి యూట్యూబ్ లో పెట్టేయండి.

బ్లాగ్

మీకంటూ ఓ బ్లాగ్ క్రియేట్ చేసుకోవడం చాలా సులభం. ఆన్ లైన్ లో బ్లాగ్స్ ఏర్పాటుకు ఎన్నో సైట్లు ఉన్నాయి. మీరు ఆర్థిక విషయాల్లో దిట్ట అయితే చక్కగా, ఆసక్తికరమైన విషయాలతో బ్లాగ్ ఏర్పాటు చేసుకోండి. రీడర్స్ ఫాలో అయ్యేట్టు చేసుకోండి. పక్కనే గూగుల్ యాడ్స్ కు కొంచెం చోటు ఇవ్వండి చాలు. వాటి ద్వారా మీకంటూ కొంత ఆదాయం వస్తుంటుంది. వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేయవచ్చు. కానీ, సైట్ రూపకల్పన కోసం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నిర్వహణ ఖర్చు కూడా ఉంటుంది. బ్లాగ్ అయితే, ఇవేమీ అవసరం ఉండదు. 

ఫైనాన్షియల్ ప్లానర్/అడ్వైజర్

ఇన్సూరెన్స్ కంపెనీకి అడ్వైజర్ గా చేరడం ద్వారా పాలసీల విక్రయంపై కొంత ఆదాయం గడించవచ్చు. ఎన్ బీఎఫ్ సీ సంస్థల తరఫున రుణాలు, ఇతర ఆర్థిక ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం ద్వారానూ ఆదాయం సమకూర్చుకోవచ్చు.

తెలివి ఉండాలే గానీ...

ఢిల్లీకి చెందిన ఓ కాలేజీ విద్యార్థినికి ఓ రోజు వెరైటీ ఐడియా వచ్చింది. తనకు తరచూ పాదరక్షలు మార్చడం అలవాటు. నెలకో కొత్త జత తీయడం అలవాటు. దాంతో అలా వాడేసిన పాదరక్షలతో ఇంట్లో ఓ గది నిండిపోయింది. దీంతో ఆమె ఓ రోజు ఒక జత బయటకు తీసి దానిపై చక్కని పెయింట్ వేసింది. దాన్ని ఫోటో తీసి తన ఫేస్ బేక్ పేజీలో పెట్టేసింది. ఎంతో మంది ఆసక్తి చూపించారు. అప్పటి నుంచి దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకుంది.  

representation image

కెమెరా ఉందా...?

అయితే, ఎందుకు ఆలస్యం. మంచి మంచి ఫొటోలను తీసి షట్టర్ స్టాక్ డాట్ కామ్, షట్టర్ పాయింట్ డాట్ కామ్, ఐ స్టాక్ ఫోటో డాట్ కామ్ తదితర సైట్లకు అమ్మేయండి. తీసే ఫొటోలు అధిక నాణ్యతతో పిక్సల్స్ అధికంగా ఉండాలి. ఫొటోలను సైట్ లోకి అప్ లోడ్ చేస్తే... వెబ్ టీమ్ వాటిని పరిశీలిస్తుంది. తగిన ప్రమాణాల మేరకు ఉన్నవాటిని ఆ సైట్లు పోస్ట్ చేస్తాయి. వాటిని కావాల్సిన వారికి విక్రయిస్తాయి. అలా విక్రయించిన ప్రతీ ఇమేజ్ పై 85 శాతం వరకు రాయల్టీ లభిస్తుంది. ఏది పడితే అది అమ్మేయడం కుదరదు. ఎటువంటి ఫొటోలకు అనుమతి అన్నది సైట్ ను ఆశ్రయించడం ద్వారా తెలుసుకోవచ్చు.

ఆన్ లైన్ షాప్ తెరిచేయండి

ఆసక్తి ఉంటే చేతి ఉత్పత్తుల్లో ప్రత్యేకమైన వాటిని తయారు చేయడం నేర్చుకోండి. ఇప్పటికే ఏదైనా వచ్చి ఉంటే ఇంకా మంచిది. లేదా భిన్నమైన ఆర్టికల్స్ ను హోల్ సేల్ డీలర్ నుంచి కొనుగోలు చేసి ఈబే,  ఫ్లిప్ కార్ట్, పేటీఎం వంటి సైట్లలో విక్రయానికి పెట్టేయవచ్చు. ఒకసారి సెల్లర్ గా నమోదు చేసుకుంటే ఈబే టీమ్ కాల్ చేసి వివరంగా చెబుతుంది. ఆన్ లైన్ షాప్ ఎలా ప్రారంభించాలి, వస్తువుల ఫొటోలు, వివరాలు ఎలా పోస్ట్ చేయాలి, ఆర్డర్ వచ్చినప్పుడు ఎలా పంపాలి ఇలా అన్ని విషయాలను వివరంగా చెబుతారు. 

పాత వస్తువులు అమ్మేస్తే పోదూ

పేరుకు పాత వస్తువులే. కానీ, కొని ఒక్కరోజైనా కాకముందే ఆ వస్తువుపై ఆసక్తి కోల్పోయే వారు బోలెడు. ఇలాంటి వాటిని తక్కువ ధరకు సేకరించి వాటిని క్వికర్, ఓఎల్ఎక్స్ వంటి సైట్లలో అమ్మేయడం ద్వారా దండిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. నచ్చితే మంచి ధర పెట్టి కొనుక్కునే ఆసక్తిపరులు ఎంతో మంది ఉన్నారు. లేదా ఈ సైట్లలో చాలా చవగ్గా వస్తున్న వస్తువులను మీరే కొనుగోలు చేసి ఆఫ్ లైన్ మార్కెట్లో విక్రయించుకోవచ్చు.

representation image  

రచనా నైపుణ్యం ఉన్నా కాసులే

మీలో మంచి రచయిత దాగి ఉండవచ్చు. ఆ మేథావిని బయటకు రప్పించండి. ఇప్పుడంతా ఈ బుక్స్ ట్రెండ్. ఆన్ లైన్ లోనే రాసేసి ఆ రచనపై రాయల్టీ పొందవచ్చు. అమేజాన్, కినిగె వంటి సైట్లు ఇలాంటి అవకాశాలను కల్పిస్తున్నాయి. అమేజాన్ కిండెల్ డైరెక్ట్ పబ్లిషింగ్ పేరుతో నేరుగా పబ్లిషింగ్ కు అవకాశం ఇస్తోంది. ఎవరైనా సరే కిండెల్ ఈ బుక్ స్టోర్ లో తమ రచనను పొందుపరచవచ్చు. ఎక్కడ విక్రయం అయిందన్న దాని ఆధారంగా 35 నుంచి 70 శాతం వరకు పుస్తక ధరలో రాయల్టీని ఈ సంస్థలు అందిస్తాయి.  

సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ అయితే?

టెస్టింగ్ టూల్స్, జావా, శాప్, డాట్ నెట్, ఎక్సెల్ ఇలా ఎన్నో డిమాండ్ ఉన్న విభాగాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఏదైనా ఓ అంశంలో ఎక్స్ పర్ట్ అయి ఉంటే కోర్స్ మెటీరియల్ ను రూపొందించి https://www.udemy.com/ , https://www.skillshare.com/ వంటి సైట్లలో విక్రయించడం ద్వారా ఆదాయం ఆర్జించవచ్చు. ఉదాహరణకు ఫొటోగ్రఫీలో ప్రత్యేకమైన మెళకువలు తెలిసినా సరే వాటిని సైతం ఇతరులు నేర్చుకునేందుకు అందుబాటులో ఉంచడమే ఆదాయ మార్గం. 

రిఫరల్ ఆదాయం

మాట చాతుర్యం ఉందా...? దాన్నే పెట్టుబడి అని భావించండి. తెలిసిన వారిని కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలకు రిఫర్ చేస్తే మీకు కొంత పారితోషికం లభిస్తుంది. అలాగే లెక్కకు మిక్కిలి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. చదువు తర్వాత వీటి బాట పట్టేవారిని గుర్తించి వారిని ఓ కోచింగ్ సంస్థకు పరిచయడం చేయడం ద్వారానూ ప్రతిఫలం పొందవచ్చు. మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఇల్లు కొనుక్కునే ఆలోచనలో ఉన్నారనుకోండి. ప్రముఖ బిల్డర్ కు వారి వివరాలు అందించండి. అదృష్టం బాగుండి ఆ బిల్డర్ ప్రాజెక్టులో మీకు తెలిసిన వ్యక్తి ఇల్లు లేదా ఫ్లాట్ కొంటే మీకు మంచి కమిషన్ అందుతుంది. రియల్టీ మార్కెటింగ్ లో భారీ ఆదాయార్జనకు అవకాశాలు ఉంటాయి. మీకున్న పరిచయాలను వినియోగించుకుంటే చాలు. తక్కువ కాలంలో ధనవంతులైపోవచ్చు.

ఆన్ లైన్ ద్వారా కన్సల్టెన్సీ సేవలు

మీరు ఎందులో అయినా వృత్తి నిపుణులు అయితే, కన్సల్టెన్సీ సేవలను అందించడం ద్వారానూ ఆదాయం గడించవచ్చు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో ఇందుకు బోలెడు అవకాశాలు ఉన్నాయి.

representation image

టూర్ ప్లానర్

పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని చాలా మందికి ఉంటుంది. కానీ, ఎక్కడికి వెళ్లాలి, ఎలా, అక్కడ సౌకర్యాలు ఇటువంటి సమాచారం పూర్తిగా అందుబాటులో ఉండదు. దీన్ని కూడా ఆదాయ మార్గంగా తీసుకోవచ్చు. దేశ విదేశాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాల సమగ్ర సమాచారాన్ని సేకరించి ప్రతీ ప్రాంతానికి సంబంధించి, ఆహారం, వసతి, సందర్శనీయ ప్రదేశాలు, రవాణా సౌకర్యాలు గురించి తెలియజేయడంతోపాటు, ఐఆర్ సీటీసీ, ట్రావెల్స్ సంస్థల ప్యాకేజీలు తెలియజేసి బుక్ చేయడం ద్వారా కమిషన్లు రాబట్టుకోవచ్చు.

డేటా ఎంట్రీ

డిజిటలైజేషన్ యుగం కావడంతో డేటా ఎంట్రీ అవసరం పెరిగిపోయింది. సమాచారాన్ని ఆన్ లైన్ డేటాబేస్ లోకి ఎంట్రీ చేయడమే ఇందులో చేయాల్సింది. ఫిజికల్ రూపంలో ఉన్న సమాచారాన్ని టైప్ చేస్తూ ఆన్ లైన్ లో భద్రపరచడం. అవగాహన కోసం చెప్పుకోవాలంటే 250 పేజీలకు 6వేలు, 400 పేజీలకు 10వేల రూపాయల పారితోషికం ఉంటుంది.

representation image

డొమైన్స్ కొని అమ్మేస్తే పోదూ

ఏపీ7ఏఎం.కామ్ దీన్నే డొమైన్(వెబ్ సైట్ పేరు) అంటారు. ఈ వెబ్ పేర్ల నమోదు విక్రయం కూడా చక్కని వ్యాపారమే. ఉదాహరణకు ట్యాంక్ బండ్ డాట్ కామ్ పేరుతో ఎవరైనా డొమైన్ పేరును అప్పటికే ఎవరూ సొంతం చేసుకోకుండా ఉండి ఉంటే... దాన్ని పొందవచ్చు. గోడాడీ వంటి సైట్లు ఇలా డొమైన్స్ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పిస్తున్నాయి. జస్ట్ వందల రూపాయల్లోనే వెబ్ డొమైన్ సొంతం చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన, వినూత్నమైన పేర్లతో, ముందు ముందు ఏవి అవసరం ఉంటాయన్నది ఆలోచించి ఆ పేర్లతో ముందుగానే డొమైన్ సొంతం చేసుకుంటే తర్వాత అదే భారీ ధర పలుకుతుంది. అమ్ముకోవడం ద్వారా బాగానే గడించవచ్చు.

సోషల్ మీడియా పండిట్

ఖాళీ సమయంలో ఫేస్ బుక్, ట్విట్టర్ ను చాలా మంది రఫ్ గా వాడేస్తుంటారు. దానికే అంకితం అన్నట్టుగా అదే పనిగా లైక్స్, షేర్స్ తో మునిగిపోతుంటారు. కానీ, అదే వ్యాపకంగా ఎందుకు మార్చుకోకూడదు? ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు నేడు వ్యాపార సంస్థలకు, కంపెనీలకు ఎంతో అవసరం. వాటి ద్వారా అవి కస్టమర్లు, క్లయింట్లను చేరుకోవడం సులభం. మరి ఆయా కంపెనీల తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ప్రజలకు చేరవేస్తుండాలి. అందుకోసం అవి నిపుణుల సేవలు తీసుకుంటాయి. ఆ అవకాశంతో ఆదాయం పొందవచ్చు. వీరినే సోషల్ మీడియా మార్కెటింగ్ నిపుణులుగా పేర్కొంటారు. 

representation image

జిమ్

జిమ్ సెంటర్ నిర్వహణ కూడా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కాకపోతే దీన్ని నిర్వహించే వారు కూడా వ్యాయామ సాధకులై ఉండాలి. వ్యాయామాల నిర్వహణపై తగినంత అవగాహన కూడా కలిగి ఉండాలి. అలాంటి వారు కొంత పెట్టుబడితో జిమ్ సెంటర్ ఏర్పాటు చేసి ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటల పాటు నిర్వహణ ద్వారా మంచి ఆదాయాన్ని పొందడానికి వీలుంది.

డబ్బింగ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు

మాట, ఉచ్చారణ స్పష్టంగా, మృదువుగా, గంభీరంగా ఉంటే డబ్బింగ్ ఆర్టిస్టులుగా సినిమా పరిశ్రమలో ప్రయత్నం చేయవచ్చు. అంతకంటే ముందు టీవీ చానళ్లలో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా పనిచేయడం ద్వారా ఉచ్చారణ తీరుపై తగినంత అవగాహన పొందవచ్చు.

representation image

ఈవెంట్ కోఆర్డినేటర్

బర్త్ డే పార్టీ కావచ్చు. షష్టి పూర్తి కావచ్చు. మరేదైనా ఫంక్షన్ కావచ్చు. లేదా ఓ కంపెనీ ఉత్పత్తి ఆవిష్కరణ కార్యక్రమం కావచ్చు. వీటి నిర్వహణ బాధ్యతలను తలకెత్తుకునేవారే ఈవెంట్ మేనేజర్లు. నిర్వహణ నైపుణ్యాలు దండిగా ఉన్నవారికి ఇటువంటి అవకాశాలు విరివిగా అందుబాటులో ఉన్నాయి. ఒక కార్యక్రమ నిర్వహణ అంటే అతిథులను ఆహ్వానించడం దగ్గర్నుంచి అది ముగిసే వరకూ ప్రతీ అంశం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తలనొప్పి నిర్వాహకులకు లేకుండా ఈవెంట్ మేనేజర్లు చూసుకుంటే కార్యక్రమం సక్సెస్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు నిర్వాహకులు కూడా ఆందోళన చెందకుండా అన్నీ గమనించుకోవడానికి వీలుంటుంది. 

వెడ్డింగ్ ప్లానర్

ఈవెంట్ మేనేజర్ నైపుణ్యం ఉన్నవారు వెడ్డింగ్ ప్లానర్ గానూ సేవలు అందించవచ్చు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది ఓ సామెత. అంటే ఎంతో మందితో ఎన్నో రకాల పనులతో ఇవి కూడుకుని ఉంటాయి. అందుకే వీటి నిర్వహణ అంత సులభమేమీ కాదు. ఈ అవసరాల నేపథ్యంలోనే వెడ్డింగ్ ప్లానర్లు పుట్టుకొచ్చారు.

representation image

ఇంటీరియర్ డెకరేటర్లు

ఇంటిని అందంగా ఉంచుకోవాలనే కోర్కె సంపన్నుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇటువంటి వారు ఇంటీరియర్ డెకరేటర్ల సేవలను వినియోగించుకుంటారు. ఇంట్లో ఏది ఎక్కడ ఉండాలో వీరు డిసైడ్ చేస్తారు. ఇంటిని అందంగా మార్చి అందుకు సేవా చార్జీని వసూలు చేసుకుంటారు. 

గార్డెనింగ్ సర్వీసులు

ఇళ్లల్లో గార్డెనింగ్ ధోరణి పెరిగిపోయింది. మంచి మొక్కలతో ఇంటిని అందంగా చేసుకోవాలని దాదాపు అందరికీ ఉంటుంది. కానీ, గార్డెనింగ్ అంటే ఎక్కువ సమయం పట్టే కార్యక్రమం. మీరుంటున్న కాలనీలోనే కొద్దో గొప్పో గార్డెనింగ్ పై వ్యయం చేయగలవారిని ఒప్పించి రంగంలోకి దిగి మీరేంటో చూపించండి. మెప్పును సంపాదిస్తే ఆ కాలనీలో ఉన్న చాలా ఇళ్లవారు మీ సేవల కోసం ఆరాటపడక తప్పదు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy