దేనిపై ఎంత వడ్డీ వస్తుందో తెలుసా...?

Tue, May 23, 2017, 01:05 PM
Related Image

పొదుపు, మదుపుల ద్వారానే సంపద వృద్ధి సాధ్యపడుతుంది. నెల నెల ఆదాయంలోంచి కొంత పొదుపు చేసి బ్యాంకు ఖాతాలో ఉంచితే పిల్లలు పెట్టదు. పిల్లలు పెట్టాలంటే ఎన్నో పెట్టుబడి సాధనాలు ఉన్నాయి. అవి భిన్న రకాలుగా పనిచేస్తాయి. రాబడుల్లోనూ హెచ్చు తగ్గులు ఉంటాయి. అందుకే మీకు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చే సాధనమేంటో తెలుసుకోవడానికే ఈ సమాచారం.

బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్లు

ప్రస్తుతం బ్యాంకు ఎఫ్ డీ ల వార్షిక వడ్డీ రేట్లు 7 శాతం స్థాయిలో ఉన్నాయి. అంటే ఓ లక్ష రూపాయలను ఏడాది కాలానికి డిపాజిట్ చేస్తే ఏడాది తర్వాత చేతికి అందేది 1,07,714 రూపాయలు. ప్రతిఫలం 7,714 రూపాయలు.

డెట్ ఇన్ కమ్ ఫండ్

చారిత్రకంగా చూస్తే వీటిపై సగటున వార్షికంగా 9.07 శాతం వడ్డీ రేటు లభించింది. అంటే లక్ష రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేయకుండా... ఏడాది కాలానికి డెట్ ఇన్ కమ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే... 9.07 వడ్డీ ప్రకారం ఏడాది చివర్లో చేతికి అందే మొత్తం 1,09,000 రూపాయలు. అంటే నికర ప్రతిఫలం 9,000 రూపాయలు.

డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్

ఈ ఫండ్స్ చారిత్రక రాబడులను పరిశీలిస్తే ఏడాదికి సగటున 12.7 శాతం రాబడిని ఇచ్చాయి. ఆ ప్రకారం లక్ష రూపాయలను ఏక మొత్తంలో వీటిలో పెట్టుబడి పెడితే 1.13 లక్షల రూపాయల రాబడి వస్తుంది.

ఈపీఎఫ్ (ఉద్యోగుల భవిష్య నిధి)

ప్రస్తుతం ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. ఈపీఎఫ్ లో సాధారణంగా ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టడం అనేది సాధ్యం కాదు. ఈపీఎఫ్, పీపీఎఫ్ లలో పెట్టే పెట్టుబడిపై సెక్షన్ 80సీ ప్రయోజనాలతోపాటు చివర్లో అందుకునే మొత్తంపై కూడా పన్ను ఉండదు. ఆ ప్రకారం చూసుకుంటే ఈపీఎఫ్, పీపీఎఫ్ రిస్క్ లేని సంప్రదాయ పెట్టుబడి సాధనా్లోల పరంగా ఉత్తమమైనవి.

అలాగే మ్యూచువల్ ఫండ్స్ లోనూ కనీసం ఐదేళ్లపాటు అయినా పెట్టుబడి పెడితే సగటు రాబడి అందుకోవడం సాధ్యపడుతుంది. పైగా విత్ డ్రా సమయంలో స్టాక్ మార్కెట్లు దిద్దుబాటులో (కరెక్షన్) ఉండకూడదు. కనుక ఇలాంటి విషయాలను జాగ్రత్తగా గమనంలో పెట్టుకోవాలి.

పీపీఎఫ్

దీనిపై ప్రస్తుతం కేంద్రం 8.1 శాతం వడ్డీ ఇస్తోంది. సెక్షన్ 80సీ పన్ను పరంగా లభించే ప్రయోజనాలను కలిపి చూసుకుంటే 11.72 శాతం రాబడి గిట్టుబాటైనట్టు భావించవచ్చు.

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)

ఇది పన్ను రహిత మ్యూచువల్ ఫండ్ సాధనం. టాక్స్ సేవింగ్స్ ఫండ్స్ అంటారు. ఈఎల్ఎస్ఎస్ చారిత్రక రాబడులు 15.8 శాతంగా ఉన్నాయి. అయితే, వీటిలో పెట్టే పెట్టుబడులకు మూడేళ్ల పాటు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 80సీ ప్రయోజనాలు కూడా కలిపి లెక్కిస్తే 22.87 శాతం గిట్టుబాటవుతుందని అనుకోవచ్చు.

ఎన్ పీఎస్

విశ్రాంత జీవితం కోసం ఉద్దేశించినదే ఎన్ పీఎస్. ఇందులో ఇప్పటి వరకు వచ్చిన రాబడులను చూస్తే సగటున 11.62 - 13 శాతంగా ఉన్నాయి.

యులిప్స్

యూనిట్ లింక్డ్ బీమా పాలసీలను కూడా ఒక విధమైన పెట్టుబడి సాధనంగా చూడవచ్చు. వీటి చారిత్రక రాబడులు 14.92 శాతంగా ఉన్నాయి. ఇక సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలు (కట్టిన ప్రీమియంలకు అదనంగా చివర్లో రాబడి వచ్చేవి) చారిత్రకంగా సగటున 3.27 శాతం రాబడులను ఇచ్చాయి.

చివరిగా ఏ పెట్టుబడి సాధనమైనా నికర రాబడిలోంచి సగటు ద్రవ్యోల్బణాన్ని తీసివేసి చూసి ఓ నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకు సగటు ద్రవ్యోల్బణాన్ని 5 శాతంగా పరిగణిస్తే... అంతకంటే ఎక్కువగా రాబడి ఉన్న వాటిల్లోనే పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం. సగటు ద్రవ్యోల్బణం కంటే తక్కువ రాబడినిచ్చే ఎండోమెంట్ పాలసీల్లాంటి వాటిలో పెడితే రాబడి రాకపోగా, మీ డబ్బులోనే కొంత మొత్తాన్ని నష్టపోవాల్సి ఉంటుందని అర్థం చేసుకోండి. అయితే, బీమా పాలసీల్లో రాబడి చూడరాదన్నది ప్రాథమిక సూత్రం. అందుకే ఎండోమెంట్ కంటే టర్మ్ పాలసీలు ఉత్తమం.  

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy