ap7am logo

హోమ్ లోన్ కావాలంటే వీటిపై లుక్కేయాల్సిందే!

Tue, May 23, 2017, 12:58 PM
Related Image

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. దాన్ని సాకారం చేసుకోవాలంటే అవసరమైనంత నగదు చేతిలో రెడీగా ఉండాల్సిన పనిలేదు. బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీ సంస్థలను ఆశ్రయిస్తే చాలు సులభంగానే రుణాలిస్తున్నాయి. కొత్త ఇంటికే కాదు, పాత ఇంటికి, నిర్మాణంలో మార్పులకు, పాత ఇంటికి మెరుగులు దిద్దడం, ఇలా ఎన్నో రుణాలున్నాయి. 

హోమ్ పర్చేజ్ లోన్స్

కొత్తగా నిర్మించిన ఇల్లు లేదా పాత ఇల్లు కొనుగోలుకు అవసరమైన రుణాన్ని హోమ్ పర్చేజ్ లోన్స్ అంటారు. కేవలం ఇల్లే కాదు, ఫ్లాట్ కొనుగోలు కూడా దీని కిందకే వస్తుంది. కొనుగోలు సమయంలో మార్కెట్ ధర ఎంతుందో అందులో 85 శాతం విలువ మేర రుణాన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ ఇంతమేర రుణం వస్తుందనుకోవడం పొరపాటు. వ్యక్తిగత అర్హత, ఆదాయాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది.

హోమ్ కన్ స్ట్రక్షన్ లోన్స్

అప్పటికే ప్లాట్ (స్థలం) కలిగి ఉండి అందులో ఇంటిని నిర్మించుకోవాలనుకునే వారి కోసం ఈ రుణాలు. రుణం కోరుకునేవారు తగిన ఎస్టిమేషన్ వేయించుకుని బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్థలం కొని ఏడాదికి మించకుండా ఉంటే దాని విలువ కూడా నిర్మాణ వ్యయంలో కలిపి అంచనాగా సమర్పించవచ్చు.

హోమ్ ఎక్స్ టెన్షన్ / ఎక్స్ పాన్షన్ లోన్స్ 

ప్రస్తుతమున్న ఇంటి నిర్మాణ రూపు రేఖలు మార్చుకోవడానికి, అదనంగా గదులు నిర్మించడానికి, మరో ఫ్లోర్ వేసేందుకు ఈ లోన్స్ అక్కరకు వస్తాయి.

representation image

హోమ్ ఇంప్రూవ్ మెంట్ లోన్స్

ఇంటి ఆధునికీకరణ, మరమ్మతు పనులకు ఇచ్చే రుణాలను హోమ్ ఇంప్రూవ్ మెంట్ లోన్స్ గా పేర్కొంటారు. రంగులు వేయడం, ఎలక్ట్రికల్ వర్క్, వాటర్ ప్రూఫ్ పనులు, ఇంటిపై నీటి ట్యాంకు నిర్మాణం ఇలాంటివన్నీ వీటి పరిధిలోకి వస్తాయి.

హోమ్ కన్వర్షన్ లోన్స్ 

ఇప్పటికే ఒక హోమ్ లోన్ తీసుకున్నారు. అయితే, మరో ఇల్లు కొనుగోలు చేసి అందులోకి మారిపోవాలని ఉంది. అలాంటి సందర్భాల్లో కన్వర్షన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు ప్రస్తుతమున్న ఇంటి రుణాన్ని కొత్త ఇంటి రుణానికి బదిలీ చేస్తారు. అదనంగా కావాల్సిన మేర రుణం జారీ చేస్తారు. దాంతో కొత్తగా ఇచ్చే రుణం కోసం పాత బాకీని తీర్చేయాల్సిన ఇబ్బంది తప్పుతుంది.

ల్యాండ్ పర్చేజ్ లోన్స్

ల్యాండ్ పర్చేజ్ లోన్స్ అన్నవి ఓ ప్లాట్, స్థలం కొనుగోలుకు వీలు కల్పిస్తాయి. చాలా బ్యాంకులు ప్లాట్ ధరలో 85 శాతం వరకు రుణంగా అందిస్తున్నాయి. కేవలం ఇల్లు కట్టుకోవాలన్న లక్ష్యం కోసమే కాకుండా పెట్టుబడి కోసం ప్లాట్లను కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి సైతం బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీ సంస్థలు ఈ రుణాలను జారీ చేస్తున్నాయి.

స్టాంప్ డ్యూటీ లోన్స్

ఓ పెద్ద స్థలం, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు. స్టాంప్ డ్యూటీకి భారీగానే వెచ్చించాల్సి వస్తోంది. సరిగ్గా ఇలాంటప్పుడే బ్యాంకులు స్టాంప్ డ్యూటీ లోన్స్ పేరుతో స్టాంప్ డ్యూటీ చార్జీలు చెల్లించడానికి అవసరమైనంత మేర రుణాన్ని అందిస్తున్నాయి.

బ్రిడ్జ్ లోన్స్

అప్పటికే ఓ ఇల్లు ఉంది. దాన్ని విక్రయిద్దామనుకుంటే వెంటనే కొనేవారు కరువయ్యారు. అదే సమయంలో మరో మంచి ఇల్లు అందుబాటు ధరలో ఉంది. సో వెనుకాడక్కర్లేదు. బ్యాంకులను ఆశ్రయించి బ్రిడ్జ్ లోన్ తీసుకోవచ్చు. అంటే కొత్తది కొనుక్కుని పాతది విక్రయించే మధ్య కాలానికి ఈ రుణం అమల్లో ఉంటుంది.  

representation image

ల్యాండ్ లోన్ హోమ్ లోన్ మధ్య తేడాలు

హోమ్ లోన్స్ అన్నవి అన్ని రకాల ఇళ్లకు వర్తిస్తాయి. ఎలాంటి ఇల్లు, ఏ ఏరియాలో కడుతున్నారు తరహా అడ్డంకులు ఏవీ ఉండవు. కానీ, ల్యాండ్ లోన్ విషయానికి వస్తే మాత్రం ఇవి కీలకం అవుతాయి. ల్యాండ్ లోన్ మాత్రం కేవలం నివాసిత స్థలానికే పరిమితం. అది కూడా మున్సిపాలిటీ, కార్పొరేషన్ లిమిట్స్ లోనే ఉండాలి. అదే సమయంలో వ్యవసాయ స్థలం కొనుగోలుకు, గ్రామాల్లో ఇంటి స్థలం కొనుగోలుకు ఈ రుణం లభించదు.

తక్కువ ఎల్టీవీ

ఆస్తి విలువలో పొందే రుణం శాతమే ఎల్టీవీ రేషియో. ఇళ్ల రుణాల్లో 80- 85 శాతం కొన్ని సందర్భాల్లో 90 శాతం వరకు రుణం పొందవచ్చు. అదే ల్యాండ్ లోన్ విషయానికొస్తే మాత్రం 70 శాతం వరకే రుణం లభిస్తుంది. ప్లాట్ విలువలో 30 శాతం సొంతంగా సమకూర్చుకుంటే బ్యాంకులు మిగిలిన 70 శాతం సమకూరుస్తాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు మాత్రం 85 శాతం వరకూ కూడా రుణం ఇస్తున్నాయి.

పన్ను ప్రయోజనాలు ఉండవు

గృహరుణంపై వార్షికంగా రూ.1.50 లక్షల వరకు చెల్లించే వడ్డీకి ఆదాయపన్ను పరంగా మినహాయింపు పొందవచ్చు. అంతేకాదు, గృహరుణంపై వడ్డీ కాకుండా అసలుకు చెల్లించే మొత్తానికి కూడా పన్ను మినహాయింపులు ఉన్నాయి. కానీ ల్యాండ్ లోన్ పై మాత్రం ఇలాంటి ప్రయోజనాలు ఏవీ లేవు.

ఎన్ఆర్ఐలకు అవకాశం లేదు

చాలా వరకు బ్యాంకులు ఎన్ఆర్ఐలకు ల్యాండ్ లోన్స్ ఇవ్వడం లేదు. ఒకవేళ ఏదైనా బ్యాంకు ఇచ్చినా అధిక వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి.

తక్కువ కాల వ్యవధి

గృహ రుణాలపై కాల వ్యవధి 30 ఏళ్ల వరకు తీసుకోవచ్చు. కానీ ల్యాండ్ లోన్ తీర్చేందుకు 15 ఏళ్ల వరకే గడువు ఉంటుంది. అయితే, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే 20 ఏళ్ల వరకు కూడా అవకాశం ఇస్తోంది.

గరిష్ట పరిమితి

ల్యాండ్ లోన్స్ పై చాలా బ్యాంకులు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పరిమితి విధిస్తున్నాయి. అంటే కొనే స్థలం ధర ఎంతున్నా అంతకు మించి రుణం ఇవ్వవు. కానీ, అదే గృహ రుణం విషయంలో మాత్రం దాని వాస్తవ ధర, రుణ గ్రహీత వార్షికాదాయం, తీర్చివేయగల సామర్థ్యంపై రుణం మొత్తం ఆధారపడి ఉంటుంది.

షరతులు

చాలా బ్యాంకులు కొనుగోలు చేస్తున్న ప్లాట్ లో ఇంటి నిర్మాణం మొదలు పెట్టాలనే ముందస్తు షరతు విధిస్తున్నాయి. ఉదాహరణకు ఎస్ బీఐ ప్లాట్ లోన్ ఇచ్చే సమయంలో కొనుగోలు అనంతరం రెండేళ్లలో ఇంటి నిర్మాణం ప్రారంభించాలనే షరతు విధిస్తోంది. అదే ఐసీఐసీఐ బ్యాంకు అయితే రెండేళ్లలో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలనే షరతు పెడుతోంది. ఇక ఈఎంఐ, డాక్యుమెంటేషన్, సహ దరఖాస్తు దారులు, వడ్డీ రేటు విషయంలో హోమ్ లోన్, ల్యాండ్ లోన్ రెండూ ఒక్కటే.  

బ్యాలన్స్ ట్రాన్సఫర్ లోన్

ప్రస్తుతం రుణం పొంది ఉన్న బ్యాంకు సేవల తీరు నచ్చకపోయినా, అధిక వడ్డీ రేటు వసూలు చేస్తున్నారని అనిపించినా... బ్యాలన్స్ ట్రాన్సఫర్ లోన్ తీసుకోవచ్చు. అప్పుడు మిగిలి ఉన్న రుణ బకాయిని వేరొక బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు సహా చాలా బ్యాంకులు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. 

రుణం కోసం కావాల్సిన పత్రాలు

స్వయం ఉపాధి, వ్యాపారస్తులు అయితే... గుర్తింపు ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ, పాస్ పోర్ట్ ఫొటోలు, గత మూడు సంవత్సరాల ఆదాయ వివరాలు, వ్యాపారస్తులయితే గత మూడు సంవత్సరాల బ్యాలన్స్ షీట్లు, విద్యార్హతల ధ్రువీకరణ, వ్యాపారం నిర్వహణలో ఉందన్న ఆధారం, మూడు సంవత్సరాల ఆదాయపన్ను రిటర్నులు ఇవ్వాల్సి ఉంటుంది. వేతన జీవులు అయితే... గుర్తింపు, నివాస ధ్రువీకరణలు, పాస్ పోర్ట్ సైజు ఫొటో, గత ఆరు నెలల బ్యాంకు స్టేట్ మెంట్, ఫామ్ 16, తాజా వేతన స్లిప్ ఇస్తే సరిపోతుంది. 

డౌన్ పేమెంట్

రుణ దరఖాస్తు దారులు నిర్మాణ వ్యయం, లేదా ల్యాండ్ లోన్ అయితే కొనుగోలు ఖరీదులో తమ వంతుగా 15 శాతం నుంచి 30 శాతం వరకు సమకూర్చుకోవాలి. దీన్నే డౌన్ పేమెంట్ అంటారు. అప్పుడు మిగిలిన మేర బ్యాంకులు రుణాలుగా అందిస్తాయి.

representation image

అర్హతలు

నెలవారీ ఆదాయం, వ్యక్తిగత రుణ చరిత్ర ప్రధానంగా పరిశీలనకు వచ్చే అంశాలు. ఉదాహరణకు రవి వేతన జీవి. నెలకు రూ.25వేల వేతనం. అప్పుడు నెల వేతనానికి 40 నుంచి 60 రెట్లు అంటే రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు రుణ అర్హత లభిస్తుంది.

సహ దరఖాస్తుదారులు

జీవిత భాగస్వామి, తండ్రి, తల్లి, కుమారుడు, సోదరుడు సహ దరఖాస్తుదారులుగా అర్హులు. వీరితో కలసి సంయుక్తంగా రుణానికి దరఖాస్తు చేసుకుంటే ఇద్దరు దరఖాస్తు దారుల ఆదాయన్ని కలిపి రుణ అర్హతను నిర్ణయిస్తారు.

ఫిక్స్ డ్, ఫ్లోటింగ్ వడ్డీ రేటు

స్థిర వడ్డీ రేటు అన్నది మారకుండా స్థిరంగా ఉంటుంది. కానీ, కొన్ని బ్యాంకులు కేవలం ఐదేళ్ల వరకే ఈ ఫిక్స్ డ్ రేటు ఉంచేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఆ తర్వాత బ్యాంకు ప్రైమ్ లెండింగ్ రేటు ఆధారంగా చర వడ్డీ రేటుకు మారుస్తున్నాయి. చర వడ్డీ రేటు అనేది స్థిరంగా ఉండకుండా మారుతుంటుంది. బ్యాంకులు తమ రుణాల రేటును (పీఎల్ఆర్)ను ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తుంటాయి. ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లలో మార్పులు చేస్తే ఆ మేరకు తమ పీఎల్ ఆర్ లోనూ మార్పులు చేస్తాయి. ఆ వెంటనే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు కూడా మారిపోతుంది. ఫ్లోటింగ్ నుంచి ఫిక్స్ డ్ రేటుకు, ఫిక్స్ డ్ రేటు నుంచి ఫ్లోటింగ్ రేటుకు మారే అవకాశం కూడా ఉంది. 

ప్రైమ్ లెండింగ్ రేటు

బ్యాంకులు నిధుల సేకరణకు వ్యయం చేస్తుంటాయి. ఉదాహరణకు ఓ ఖాతాదారుడు లక్ష రూపాయల డిపాజిట్ చేస్తే బ్యాంకులు 8 శాతం వడ్డీ రేటును ఇస్తున్నాయనుకుందాం. అప్పుడు బ్యాంకులు 8 శాతంతోపాటు వాటికి అదనంగా నిర్వహణ, ఇతర వ్యయాలను కలిపితే ఇది సుమారు 9 నుంచి 10 శాతం మధ్యలో ఉంటుంది. ఇదే రుణ సేకరణ వ్యయం అవుతుంది. ఇదే లక్ష రూపాయలను రుణం కోరుకునే వారికి ఇచ్చినప్పుడు తన నిధుల సేకరణ వ్యయానికి కొంత కమిషన్ అర శాతం నుంచి ఒక శాతం కలుపుకుని హోమ్ లోన్స్ పై వడ్డీని ఖరారు చేస్తుంటాయి. అదే పర్సనల్, క్రెడిట్ కార్డులపై వడ్డీ రేట్లు భారీగా ఉంటాయి.

ఈఎంఐ

రుణ వాయిదా మొత్తం మారకుండా చివరి వరకు ఒకేలా ఉంటుది. వడ్డీ పెరిగితే రుణ చెల్లింపు కాల వ్యవధి పెరుగుతుందే తప్ప నెల వాయిదా పెరగదు.

ప్రీ పేమెంట్ చార్జ్

రుణ కాల వ్యవధి పూర్తి కాకముందే రుణం తీర్చేస్తే మిగిలి ఉన్న కాలం, బకాయిపై 0.5 నుంచి 2 శాతం వరకు ప్రీ పేమెంట్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు.

ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు

తక్కువ వడ్డీ రేటు ప్రయోజనాలు కస్టమర్లకు లభించాలన్న సదాశయంతో బ్యాంకులు హోమ్ లోన్ ట్రాన్స్ ఫర్ కు అవకాశం కల్పించాలని ఆర్ బీఐ కోరడంతో ఇది సాకారమైంది. రుణాన్ని మరొక బ్యాంకుకు బదిలీ చేసుకోవాలనుకుంటే... ముందు ప్రస్తుతం రుణం ఇచ్చిన బ్యాంకుకు దరఖాస్తు అందజేయాలి. దాన్ని పరిశీలించిన అనంతరం బ్యాంకు సమ్మతి తెలుపుతూ ఎన్ఓసీ (నిరభ్యంతర లేఖ) లెటర్ ను జారీ చేస్తుంది. అలాగే, మిగిలి ఉన్న రుణానికి సంబంధించిన స్టేట్ మెంట్ ను కూడా జారీ చేస్తుంది. వీటిని కొత్తగా రుణం తీసుకునే బ్యాంకుకు సమర్పించాలి. 

అలాగే కొత్తగా రుణం తీసుకునే సమయంలో ఉన్నట్టుగా మిగిలిన అన్ని నిబంధనలను పాటించాలి. ఎస్టిమేషన్ వేల్యూ, లీగల్ వెరిఫికేషన్ వంటివి అనమాట. ఇతర డాక్యుమెంట్లను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆస్తి పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. దాంతో మిగిలి ఉన్న రుణాన్ని పాత బ్యాంకుకు కొత్త బ్యాంకు తీర్చివేస్తుంది. అయితే, రుణ కాల వ్యవధి పాత బ్యాంకులో ఉన్నట్టుగానే ఉంటుంది. దాన్ని పెంచడం, ఈఎంఐ తగ్గించడం వంటి అభ్యర్థనలను కొత్తగా రుణం ఇచ్చే బ్యాంకు పరిశీలించకపోవచ్చు.

చివరిగా ఈ సదుపాయాన్ని వినియోగించుకునే వారు... రుణ కాల వ్యవధి తొలి నాళ్లలో పరిశీలించడమే లాభదాయకం. ఉదాహరణకు 20 ఏళ్ల రుణ కాలంలో 10, 15 ఏళ్లు గడిచిన తర్వాత దాన్ని బదిలీ చేసుకోవడం వల్ల పెద్ద లాభం ఉండదు. అందుకే కాల వ్యవధిలో మొదటి 25 శాతం గడువులోపే దీన్ని పరిశీలించడం లాభదాయకం.

మీకు గృహ రుణం ఎంతొస్తుందో తెలుసా..?


ఇల్లు లేదా స్థలం కొనే ముందు పరిశీలించాల్సిన అంశాలివే...!

ఇల్లు కట్టుకోవడానికి ఇదే సరైన సమయం... రుణంపై రూ.2.50 లక్షల రాయితీ!


X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy