ap7am logo

జీవిత బీమా క్లెయిమ్ తిరస్కరణ ప్రమాదం… తస్మాత్ జాగ్రత్త!

Sun, May 14, 2017, 11:06 AM
Related Image

జీవన ప్రయాణం సాఫీగా సాగిపోతే అంతా ఆనందమే. కానీ ఈ ప్రయాణంలో అనుకోని ఉపద్రవం ఏర్పడితే..? కుటుంబానికి ఆధారమైన వ్యక్తికి జరగరానిది ఏదైనా జరిగి దూరమైతే... ఆ కుటుంబం పరిస్థితి ఏంటి..? బాగోగులు ఎవరు చూడాలి..? ఆర్థిక అవసరాలు ఎలా తీరాలి..? అందుకే ప్రతి ఒక్కరూ జీవిత బీమా తీసుకోవడమన్నది చాలా ముఖ్యం. అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక అండనిచ్చేలా ఆ బీమా పాలసీ ఉండాలి. ఒకవేళ పైన చెప్పిన పరిస్థితే ఎదురై బీమా కోసం క్లెయిమ్ చేసుకున్నారనుకోండి. ఆశగా ఎదురు చూస్తున్న వేళ... మీ పాలసీ తిరస్కరిస్తున్నామంటూ బీమా కంపెనీ అసలు చావు కబురు చెబితే, దాన్ని జీర్ణించుకోవడం కష్టమే. జీవన, మరణాలు మన చేతుల్లో ఉండవు. కానీ పాలసీ క్లెయిమ్ ను తిరస్కరించే అవకాశం కంపెనీకి ఇవ్వకుండా ఉండడమనేది పాలసీదారుల చేతుల్లోనే ఉంటుంది. కనుక ఈ విషయంలో ఏం చేయాలన్నది తెలుసుకుందాం... 

దరఖాస్తును స్వయంగా నింపితేనే రక్షణ

representational imageదరఖాస్తును పాలసీ తీసుకుంటున్నవారే స్వయంగా పూర్తి చేయాలి. దీనివల్ల పాలసీ పత్రాన్ని పూర్తిగా చదివే అవకాశం లభిస్తుంది. అందులో కోరిన ప్రతి సమాచారాన్ని స్వయంగా పూర్తి చేయడం వల్ల కచ్చితత్వం ఉంటుంది. అలా కాకుండా పాలసీ పత్రంపై సంతకం చేసి చెక్ ఇవ్వడం వల్ల దాన్ని పూర్తి చేసే బాధ్యత ఏజెంట్ పై పడుతుంది. మీ వ్యక్తిగత సమాచారం, ఆరోగ్య వివరాలు, అంతకు ముందున్న పాలసీల వివరాలు అతడికి తెలియవు కదా. అలాంటప్పుడు ఏదో ఒకటి రాసేసి తప్పుడు సమాచారాన్ని అందులో పేర్కొంటే నష్టమే. అందుకే పాలసీ పత్రాన్ని స్వయంగా నింపాలి. పూర్తి అయిన తర్వాత దాన్ని జిరాక్స్ తీసుకుని తర్వాత మరోసారి అన్ని వివరాలను చదవాలి. ఎక్కడైనా పొరపాటు దొర్లితే దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి వెంటనే లిఖిత పూర్వకంగా తెలియజేసి పాలసీ పత్రంలో మార్పించుకోవాలి. 

తప్పుడు సమాచారం ఇస్తే అంతే!

బీమా కంపెనీ కోరిన ప్రతి సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయాల్సి ఉంటుంది. ఏదైనా సమాచారాన్ని కావాలని దాచిపెట్టి, మోసం చేస్తే... తర్వాత క్లెయిమ్ సమయంలో దాన్ని కంపెనీ గుర్తించినట్లయితే తిరస్కరణకు గురి కావచ్చు. అందుకే సరైన వివరాలనే ఇవ్వాల్సి ఉంటుంది. వయసు, ఎత్తు, బరువు, వృత్తి, ఆదాయం, ప్రస్తుతం ఉన్న పాలసీల విషయమై కచ్చిత సమాచారాన్ని దరఖాస్తులో పేర్కొనడం తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న పాలసీల వివరాలను దాచి పెడితే క్లెయిమ్ తిరస్కరణకు కంపెనీకి చేతులారా అవకాశం ఇచ్చినట్టే. 

ఉద్యోగం విషయంలోనూ...

కొన్ని ఉద్యోగాల్లో ప్రాణాలకు భద్రత ఉంటుంది. కొన్ని ఉద్యోగాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు  ఓ బ్యాంకు ఉద్యోగి, ఓ కారు డ్రైవర్ మధ్య తేడా ఉంటుంది కదా. కారు డ్రైవర్, గనుల్లో పని చేస్తున్న వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకని పాలసీ తీసుకునేటప్పుడు చేస్తున్న ఉద్యోగం గురించి వాస్తవాలు తెలియజేయాలి. నిజాలు దాచిపెట్టారని కంపెనీ భావిస్తే క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది. 

ఆరోగ్య వివరాలు కూడా కీలకమే

వ్యక్తిగత ఆరోగ్యం గురించిన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాచి పెట్టవద్దు. పాలసీ విషయంలో ఈ వివరాలు కంపెనీలకు చాలా కీలకం. అప్పటి వరకు ఉన్న అనారోగ్య సమస్యల గురించి పూర్తి వివరాలను పేర్కొనాలి. తల్లిదండ్రుల వైద్య చరిత్ర గురించి కూడా సమగ్ర వివరాలను అందించాలి. ఎక్కడా ఏ సమాచారాన్ని కూడా దాచిపెట్టవద్దు. మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా రిస్క్ ఉందని కంపెనీ భావిస్తే ప్రీమియం అధికంగా నిర్ణయించి పాలసీ జారీ చేస్తుంది. లేదా ఇవ్వడానికి నిరాకరించనూవచ్చు. అలాగే వ్యక్తిగత అలవాట్ల విషయంలోనూ వివరాలు దాచి పెట్టవద్దు. మద్యం అలవాటు ఉంటే ఉందనే అందులో రాయాలి. అలాగే గుట్కాలు లేదా పొగాకు ఉత్పత్తులను నమిలే అలవాటు ఉన్నా దాన్ని కూడా పొందుపరచాలి. పూర్తి వివరాలను అందించి పాలసీ తీసుకోవడం వల్ల తిరస్కరణకు అవకాశం ఉండదు. 

వైద్య పరీక్షలు చేయించుకోండి

representational imageపాలసీ పత్రంలో పేర్కొన్న వివరాలను కంపెనీ ఉద్యోగి పూర్తిగా పరిశీలించిన తర్వాత పాలసీ జారీ అవుతుంది. అందుకు సమగ్ర వివరాలు అందించడం చాలా అవసరం. ఎక్కువ మొత్తంలో బీమా కోరుకున్న వారిని వైద్య పరీక్షలు చేయించుకోవాలని కంపెనీలు కోరతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య పరీక్షలకు నిరాకరించవద్దు. ఒకవేళ కంపెనీ అడగకపోయినా మీరు స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకుంటానని అడిగి మరీ చేయించుకోవడం మంచిది. లేదంటూ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టారంటూ బీమాను తిరస్కరించే అవకాశాన్ని స్వయంగా కంపెనీకి ఇచ్చినవారవుతారు. 

పాత పాలసీల వివరాలూ ఇవ్వాలి

ప్రస్తుతం ఉన్న పాలసీల గురించి చెప్పకూడదని చాలా మంది అనుకుంటారు. కానీ నిబంధనల ప్రకారం ఈ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ సమయంలో బీమా కంపెనీలు పాలసీ దరఖాస్తు పత్రాన్ని ముందేసుకుని భూతద్దంతో ప్రతీ అంశాన్ని నిబంధనల కోణంలో పోస్ట్ మార్టమ్ చేస్తాయి. ఎక్కడైనా అవకాశం దొరికిందా తిరస్కరించడానికి రెడీ అయిపోతాయి. అందుకే ఒక్క అవకాశాన్ని కూడా ఇవ్వకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. 

పాలసీ ల్యాప్స్ కాకూడదు

ప్రీమియాన్ని నిర్ణీత గడువులోగా చెల్లిస్తూ ఉంటేనే పాలసీ మనుగడలో ఉంటుంది. గడువులోపు కట్టకుంటే పాలసీ ల్యాప్స్ అవుతుంది. దాంతో క్లెయిమ్ కు అవకాశం ఉండదు. సాధారణంగా కంపెనీలు నిర్ణీత గడువు తర్వాత కొన్ని రోజుల పాటు గ్రేస్ పీరియడ్ ఇస్తాయి. ఆ లోపు కట్టినా పాలసీ ల్యాప్స్ కాదు. మనుగడలో లేని పాలసీకి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఎలా ఉంటుంది.? ఆలోచించండి. 

నామినీ... 

నామినీ వివరాలను పాలసీ పత్రంలో పేర్కొనడం తప్పనిసరి. ఒకసారి ఇచ్చిన వివరాలను కాలానుగుణంగా మార్చుకోవడమూ ముఖ్యమే. ఒకవేళ నామినీగా ఎవరి పేరైనా సూచించి ఉండి, తర్వాత కాలంలో వారు ఆకస్మిక మరణానికి లోనైతే... మరొకరిని నామినీగా వెంటనే కంపెనీకి సూచించాలి. దానివల్ల క్లెయిమ్ ఆలస్యం కాకుండా ఉంటుంది. 

క్లెయిమ్ కు ఆలస్యం చేయరాదు

అకాల మరణం చోటు చేసుకుంటే సంబంధీకులు వెంటనే బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి. దాంతో క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభించినట్టు లెక్క. ఆలస్యం చేస్తే క్లెయిమ్ విషయంలో కంపెనీకి సందేహాలు తలెత్తుతాయి. దాంతో స్క్రూటినీ ఆలస్యం అవుతుంది. 

కంపెనీలు ఏమంటున్నాయి…?

ఆరోగ్యం విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వడం, ప్రస్తుతం ఉన్న అనారోగ్య సమస్యలు, వ్యాధుల సమాచారాన్ని తెలియజేయకపోవడం జీవిత బీమా తిరస్కరణకు ప్రధాన కారణాలని హెచ్ డీఎప్ సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొడక్ట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సంజయ్ తివారీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ఒకవేళ గుండెజబ్జులు ఉన్నా, ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్నా తెలియజేయకపోతే క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుందని ఆయన వివరించారు. అందుకే క్లెయిమ్ సందర్భంగా మరణానికి గల కారణాల గురించి మెడికల్ రిపోర్టులను కంపెనీలు అడుగుతాయన్నారు. 95 శాతం పాలసీల తిరస్కరణలు ప్రధానంగా తప్పుడు సమాచారం ఇవ్వడం, సమాచారాన్ని దాచి పెట్టడం వల్లేనని ఆయన అంటున్నారు. 

పాలసీ తీసుకునే సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవడమే కాదు.. వ్యక్తిగత, కుటుంబ సభ్యుల representational imageఆరోగ్య చరిత్రకు సంబంధించిన ప్రశ్నలకు పాలసీ పత్రంలో సరైన సమాధానాలు ఇవ్వడమూ ముఖ్యమేనని తివారీ అన్నారు. వైద్య పరీక్షల్లో పూర్తి వివరాలు వెల్లడి కావని ఆయన చెబుతున్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా గుండెజబ్బులు ఉన్నాయా? మధుమేహం వంటి సమస్యలు ఉన్నాయా? అప్పటి వరకు ఏవైనా అనారోగ్య సమస్యలకు చికిత్సలు తీసుకున్నారా? తదితర సమాచారాన్ని పూర్తిగా అందించాలని ఆయన సూచించారు. కనుక సమగ్ర సమాచారాన్ని ఇవ్వడం ద్వారా కంపెనీలకు క్లెయిమ్ తిరస్కరణకు అవకాశం లేకుండా ప్రతి ఒక్క పాలసీదారుడు జాగ్రత్త పడడం వారిపై ఆధారపడిన వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన వారవుతారు.  

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy