ap7am logo

‘కేవైసీ’ గురించి తప్పకుండా తెలిసి ఉండాలి

Tue, May 23, 2017, 12:43 PM
Related Image

ఇటీవలి కాలంలో ‘కేవైసీ’ అనే మాట తరచుగా వినిపించడం చాలా మందికి అనుభవమే. నో యువర్ కస్టమర్ (కేవైసీ)... నీ కస్టమర్ లేదా ఖాతాదారు గురించి తెలుసుకోవడమే కేవైసీ. మొబైల్ సిమ్ కార్డు తీసుకోవాలన్నా... బ్యాంకు ఖాతా తెరవాలన్నా... మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలన్నా... ఇలా అనేకమైన సందర్భాలకు కేవైసీ అవసరం పడుతుంది. అందుకే కేవైసీ అంటే ఏంటో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవడం అవసరం.

కేవైసీ ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని వివరాలను తెలియజేస్తుంది. ఎటువంటి ఆర్థిక సేవ పొందాలన్నా... నియంత్రణ, చట్టపరమైన నిబంధనల మేరకు కేవైసీ సమర్పించడం తప్పనిసరి. కస్టమర్ కు సంబంధించిన పలు డాక్యుమెంట్లను పరిశీలించి అతడి గుర్తింపును పరీక్షించడం కేవైసీ ప్రక్రియలో భాగం.

గుర్తింపు ధ్రువీకరణ

పాస్ పోర్ట్, పాన్ కార్డ్, వోటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్ గుర్తింపు ధ్రువీకరణ పత్రాలుగా పరిగణిస్తారు. చిరునామా ధ్రువీకరణ కోసం విద్యుత్ లేదా టెలిఫోన్ బిల్లు, బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్, రేషన్ కార్డ్, ఉద్యోగం చేస్తున్న సంస్థ నుంచి లెటర్ చెల్లుబాటు అవుతాయి. వీటితోపాటు ఇటీవలి కాలంలో తీసిన పాస్ పోర్ట్ సైజు ఆధారంగా వివరాలను సరిపోల్చుకుంటాయి పలు సంస్థలు.

representative image

ప్రతిసారీ...

సిమ్ కార్డు తీసుకోవాలంటే గుర్తింపు, చిరునామా ధ్రువీకరణల కింద ఓటర్ ఐడీ కార్డు, కలర్ పాస్ పోర్ట్ ఫొటో సమర్పించి, దరఖాస్తు పూర్తి చేయడం తప్పనిసరి. దరఖాస్తుదారుడికి సంబంధించిన అన్ని వివరాల ధ్రువీకరణ తర్వాతే సిమ్ యాక్టివేట్ అవుతుంది. మీరెవరో ధ్రువీకరణ పత్రాల ద్వారా స్పష్టంగా తెలిసిన తర్వాతే సేవలు ప్రారంభమవుతాయి. బ్యాంకు ఖాతా తెరిచే సమయంలోనూ ఇలానే గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ, కలర్ ఫొటో, పాన్ కార్డు కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లలో నెలకు ఇంత అని మదుపు చేద్దామనుకున్నా... బీమా పాలసీ తీసుకోవాలన్నా... ఈ ప్రతాలన్నీ సమర్పించాల్సి ఉంటుంది. డీమ్యాట్ ఖాతా తెరవాలన్నా, ఇలా చాలా సందర్భాల్లో ప్రతీ సారి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఏర్పడుతుంది.

ఇకపై ఈ ఇబ్బంది ఉండదు

ఇలా ప్రతిసారీ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే పని లేకుండా ఒక్కసారి ఇస్తే వాటిని భద్రపరిచి, అవసరమైన సందర్భాల్లో ఎలక్ట్రానిక్ రూపంలో ఆ పత్రాలను అందించే ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇందుకోసం సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ (సీకేవైసీఆర్)ని అమల్లోకి తీసుకొచ్చింది. సెంట్రల్ కేవైసీ నమోదు ప్రక్రియను సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అండ్ అస్సెట్ రీకన్ స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా (సీఈఆర్ఎస్ఏఐ) చూస్తుంది. ఇది ఆగస్ట్ 1, 2016 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది.

ఏం చేస్తుంది

ఆగస్ట్ 1 నుంచి వ్యక్తులు సమర్పించే కేవైసీ పత్రాలను అన్ని ఆర్థిక సంస్థలు సీఈఆర్ఎస్ఏఐ ప్లాట్ ఫామ్ పై మూడు రోజుల్లోపల అప్ లోడ్ చేయాలి. బ్యాంకులు సైతం ఈ వివరాలను అప్ లోడ్ చేయక తప్పదు. దీంతో ఒకసారి ఒక వ్యక్తికి సంబంధించిన కేవైసీ పత్రాలు సెంట్రల్ రిజిస్ట్రీకి చేరాయంటే, ఆ తర్వాత ఇక ఏ ఆర్థిక సేవలు పొందాలన్నా ఈ కేవైసీ సరిపోతుంది. వెంట పత్రాలను తీసుకెళ్లాల్సి పనిలేదు.

సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ వద్ద ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న పత్రాలను మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, గుర్తింపు పొందిన ఇతర ఆర్థిక సంస్థలు నూతన కస్టమర్లకు సేవలు అందించే సమయంలో వారి గుర్తింపును పరిశీలించుకోవడానికి, ఆ వివరాలు సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఒకసారి కేవైసీ రిజిస్ట్రీలో నమోదైన తర్వాత మిగిలిన ఆర్థిక సంస్థలు సైతం తమ కస్టమర్ కు సంబంధించి తాజా కేవైసీ వివరాలను తేలిగ్గా పొందవచ్చు. మొత్తం మీద ఈ కేవైసీ వల్ల ఆర్థిక సంస్థలు పేపర్ డాక్యుమెంట్లను భద్రపరిచే బాధ తప్పుతుంది. దీంతో ఖర్చు కూడా ఆదా అవుతుంది.

స్టాక్, కమోడిటీ మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నవారు, ఇప్పటికే కేవైసీ పత్రాలను సమర్పించే ఉంటారు. అయితే, వీరందరూ తాజాగా తల్లి పేరు, తల్లి పుట్టినింటి పేరును తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే, ప్రస్తుతం నివసిస్తున్న చిరునామాయే శాశ్వత చిరునామా అయితే ఓకే. కానీ, నివాసిత చిరునామా, శాశ్వత చిరునామా వేర్వేరు అయితే... శాశ్వత చిరునామాకు సంబంధించిన ధ్రువీకరణ కూడా అందజేయాల్సి ఉంటుంది. 

సౌకర్యాలు... చార్జీలు

అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు ఒకటే కేవైసీ ఫామ్. ఒకటికి మించిన చిరునామాలు (ఆఫీసు, నివాసిత, శాశ్వత) కేవైసీ రికార్డుల్లో నమోదు చేసుకోవచ్చు. ఆర్థిక సంస్థలు ఒక ఖాతాదారుడి కేవైసీ పత్రాలను అప్ లోడ్ చేసినందుకు 80పైసలను సీఈఆర్ఎస్representative imageఏఐకి చెల్లించుకోవాలి, అలాగే, డౌన్ లోడ్ కు 1.10 రూపాయలు, వివరాల అప్ డేట్ కు 1.15 రూపాయలు ప్రతీ లావాదేవీకి చెల్లించాల్సి ఉంటుంది. 


ఆధార్ ఆధారిత ఈకేవైసీ

టెలికం శాఖ ఆగస్ట్ లో జారీ చేసిన ఆదేశాల మేరకు ఇకపై మొబైల్ కనెక్షన్లకు ఈ కేవైసీ విధానం అమల్లోకి రానుంది. అంటే ఇకపై దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా డిజిటలీకరణ కానుంది. ఇందులో భాగంగా ఇకపై ఎవరైనా పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ కనెక్షన్లు పొందాలంటే ఆధార్ నంబర్ ను విక్రయదారుడికి ఇచ్చి, వేలి ముద్రలు వేసి, ఐరిష్ ఇస్తే సరిపోతుంది. ఆ వివరాలు ఆధారంగా యూఐడీఏఐ సంబంధిత వ్యక్తి పూర్తి వివరాలు (పేరు, చిరునామా ఇతర) డిజిటల్ సైన్ చేసిన ఎలక్ట్రానిక్ కేవైసీ సమాచారాన్ని ఆపరేటర్లకు అందిస్తుంది. వారు తమ డేటా బ్యాంకులలో ఆ సమాచారాన్ని డిజిటల్ రూపంలోనే భద్రపరుస్తారు. దీంతో ఫిజికల్ గా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే పని తప్పుతుంది. దీంతో ఆ పత్రాలు దుర్వినియోగం అవుతున్న ప్రస్తుత అవాంఛనీయ పరిస్థితులకు తెరపడుతుంది.

పైగా ఈ విధానంలో సిమ్  నిమిషాల్లోనే యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుత విధానంలో డాక్యుమెంట్లు విక్రయదారుడి నుంచి మొబైల్ కంపెనీల కార్యాలయాలకు వెళ్లిన తర్వాత సిమ్ యాక్టివేట్ అవుతుంది. నూతన విధానంలో సత్వరమే యాక్టివేట్ అవుతుంది. ఆధార్ ఆధారిత ఈ కేవైసీ మిగిలిన సేవలకు కూడా వర్తింపజేస్తే ఆధార్ నంబర్ తోనే కేవైసీ ప్రక్రియనంతా ఆన్ లైన్ లో నే పూర్తి చేసుకోవచ్చు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy