ap7am logo

ఇలా చేస్తే బ్యాంకు లావాదేవీలు సురక్షితం!

Tue, May 23, 2017, 12:42 PM
Related Image

నేటి జీవనంలో బ్యాంకు లావాదేవీలు ఓ భాగమైపోయాయి. ఆన్ లైన్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వినియోగం విస్తృతం కావడంతో నేరగాళ్లు వీటిని లక్ష్యం చేసుకుంటున్నారు. ప్రతి లావాదేవీ భద్రంగా ఉండాలంటే అందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.

representation imageసీవీవీ చేరిపేయండి

అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులపై వెనుక భాగంలో మూడక్షరాల నంబర్ ఉంటుంది. దీన్నే సీవీవీ అంటారు. బ్యాక్ గ్రౌండ్ తెల్లటి రంగుపై ఈ నంబర్ ఉంటుంది. కార్డు అందుకున్న వెంటనే ఈ సీవీవీ నంబర్ ను ఒకటికి నాలుగు సార్లు స్మరణ చేసి గుర్తు పెట్టుకోవాలి. ఇంట్లో ఓ చోట రాసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కార్డుపై ఉన్న సీవీవీ నంబర్ ను చెరిపేయాలి. మనలో చాలా మంది చేసే తప్పు ఏమిటంటే ఈ సీవీవీ నంబర్ ను కార్డుపై అలానే వదిలేయడం. ఈ సీవీవీ నంబర్, కార్డు ముందు భాగంలో ఉండే నంబర్, ఎక్స్ పయిరీ డేట్, పాస్ వర్డ్ వివరాలు నేరగాళ్ల కంట్లో పడడం ఆలస్యం... అచ్చం అలాంటి వివరాలతోనే డూప్లికేట్ కార్డు పుడుతుంది. మీ కార్డులో ఉన్న నగదు అంతా ఖాళీ అయిపోతుంది. అందుకే తప్పనిసరిగా సీవీవీ చెరిపేయాలి. ఒకవేళ సీవీవీ చెరిపేసిన తర్వాత నంబర్ ను మర్చిపోతే మళ్లీ కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం మినహా మరో మార్గం లేదు.

పాస్ వర్డ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి

ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో పాస్ వర్డ్ చాలా సున్నితమైనది. తేలిగ్గా గుర్తుండడం కోసం పుట్టినతేదీ, పేరును పాస్ వర్డ్ గా పెట్టుకోవడం చేస్తుంటారు కొందరు. ఇలా చేస్తే సైబర్ నేరగాళ్లు సులువుగా పసిగట్టేస్తారు. అందుకే ఊహించడానికి కూడా సాధ్యం కాని రీతిలో పాస్ వర్డ్ ఉండాలి. కేపిటల్, స్మాల్ లెటర్స్, నంబర్లు, స్టార్, హ్యాష్ వంటి ప్రత్యేక క్యారక్టర్లు కలగలిపి పాస్ వర్డ్ ఉండాలి. పాస్ వర్డ్ కూడా పెద్దగా ఎక్కువ అక్షరాలతో ఉండాలి. చిన్నదయితే మీరు టైప్ చేస్తున్న సమయంలో తెలివైన వారు సులువుగా గమనించగలరు.

పాస్ వర్డ్ లు ఎక్కడ దాచిపెడుతున్నారు..?

పాస్ వర్డ్ మర్చిపోతామేమో అన్న భయంతో కొంత మంది మొబైల్ లో, ఈ మెయిల్ లో సేవ్ చేసి ఉంచుకుంటారు. కానీ, మొబైల్ పోతే... లేదా మరెవరి చేతిలోనయినా పడితే, మెయిల్ ను సైబర్ నేరగాళ్లు తెరిస్తే ఏమవుతుందో ఆలోచించండి. అందుకే ఒకవేళ మొబైల్, మెయిల్ లో సేవ్ చేసి ఉంచినప్పటికీ అందరికీ అర్థమయ్యేలా సింపుల్ ఇంగ్లిష్ లో అది ఉండకూడదు. కేవలం మీకు మాత్రమే అర్థమయ్యే భాషలో రాసి పెట్టుకోవాలి. లేదా మొదటి చివరి అక్షరం రాసి పెట్టుకున్నా కొంత వరకు భద్రమే.

టెలిఫోన్, ఈ మెయిల్ లో షేర్ చేసుకోవద్దు

మోసగాళ్లు కొత్త పుంతలు తొక్కారు. బ్యాంకు అధికారులమంటూ కాల్ చేసి మన కార్డు సమాచారం, పాస్ వర్డ్ అడిగి తెలివిగా టోపీ పెడుతున్నారు. ఓటీపీ ఉంటే భద్రం అని అనుకుంటారు. కానీ, కాల్ చేసే జాదూగాళ్లు ఓటీపీ చెబితే కార్డు లిమిట్ పెంచుతామని అమాయకులను మోసం చేయడం ఇటీవలి కాలంలో జరుగుతోంది. కానీ ఏ బ్యాంకు కూడా కస్టమర్లకు కాల్ చేసి పాస్ వర్డ్, సీవీవీ వంటి సున్నిత సమాచారాన్ని అడగదు. అందుకే ఎవరైనా కాల్ చేసి ఈ సున్నిత సమాచారాన్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు.  

బ్రౌజర్ లో సేవ్ చేయవద్దు

కొన్ని సైట్లలో లాగిన్ డిటైల్స్ ఇవ్వగానే పాస్ వర్డ్ ను సేవ్ చేయమంటారా? అని అడుగుతుంటాయి. కొందరు ఓకే అని క్లిక్ చేసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మరోసారి లాగిన్ సమయంలో ఈ వివరాలన్నీ ఇవ్వక్కర్లేదు. అవన్నీ బ్రౌజర్ లో సేవ్ అయ్యి ఉంటాయి. అంటే అవి నేరగాళ్ల చేతుల్లో పడడానికి సిద్ధంగా ఉన్నట్టే. . 

లావాదేవీ ఏదైనా ఎస్ఎంఎస్ రావాల్సిందే

అన్ని రకాల క్రెడిట్, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకు లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ వచ్చే సదుపాయాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. మోసం జరిగిన వెంటనే సమాచారం అందుతుంది. నేరగాళ్లు విడతల వారీగా నగదును తరలించుకుపోతారు కనుక మొదటి లావాదేవీతోనే అడ్డుకోవచ్చు.

representation image

క్రెడిట్, డెబిట్ కార్డులకు ఇన్సూరెన్స్

చాలా మందికి తెలియని విషయం కార్డులకు బీమా ఉందని. నిత్య జీవితంలో జరిగే మోసాల నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులకు రక్షణ కల్పించుకోవడం మంచి ఆలోచన. వన్ అసిస్ట్, సీపీపీ ఇండియా ఈ తరహా బీమా సదుపాయాలను అందిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు ఈ బీమా సదుపాయం ఉంది. బ్యాంకు శాఖలో అడిగి తెలుసుకోవచ్చు.

ఇతరులకు అవకాశం ఇవ్వొద్దు

షాపింగ్ చేసే సమయంలో లేదా రెస్టారెంట్లు, పెట్రోల్ బంకుల్లో కార్డును అక్కడి ఉద్యోగికి ఇవ్వగా... వారు స్వైప్ చేసిన తర్వాత పిన్ నంబర్ చెప్పేయడం ఎక్కువ మంది చేసే పని. పిన్ నంబర్ కార్డు దారుడికి మాత్రమే తెలిసి ఉండాల్సిన నంబర్. ఇతరులతో పంచుకునేది కాదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్ నంబర్ ను మీరే ఎంటర్ చేయండి.

ఆ ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం పనికిరాదు. క్రెడిట్ కార్డు సీవీవీ, ఎక్స్ పయిరీ, పాస్ వర్డ్ ఉంటే చాలు లిమిట్ మేరకు ఆన్ లైన్ షాపింగ్ చేసేసుకోవడం నిమిషాల్లో పని. క్రెడిట్ కార్డు స్వైప్ చేస్తుండగా పిన్ నంబర్ చెప్పారనుకోండి, అక్కడున్న వాడు జాదూ అయితే సీవీవీ (చాలా మందికి దీన్ని చెరిపేసే అలవాటు లేదని పైన చెప్పుకున్నాం కదా), ఎక్స్ పయిరీ డేట్ ను క్షణాల్లో చూసేస్తాడు. ఇంకేముంది మీ కార్డు వాడి చేతిలో పడినట్టే. తర్వాత ఏదో ఒక రోజు అంతర్జాతీయ షాపింగ్ సైట్ నుంచి మీకో షాకింగ్ ఎస్ఎంఎస్ వస్తుంది. ‘థ్యాంకు ఫర్ షాపింగ్ @...’ అని. అది చూసి బెంబేలెత్తడం ఖాయం.

సుధ బెంగళూరులోని ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగి. అన్నింటికీ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడడం అలవాటు. పైగా సీవీవీ నంబర్ ను చెరిపేయకుండా అలానే ఉంచేసింది. ఓ రోజు సుధ కళ్లు తిరిగే అంత పని అయింది. అమెరికాలోని ఓ గ్రోసరీ స్టోర్ లో 70వేల రూపాయల విలువైన షాపింగ్ ఆమె కార్డు పేరిట జరిగినట్టు రెండు లావాదేవీల ఎస్ఎంఎస్ లు వచ్చాయి. కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి కంప్లయింట్ ఇచ్చింది. దాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. కార్డ్ బ్లాక్ చేసేశారు. ఇన్వెస్టిగేషన్ లో తేలిందేమిటంటే బ్యాంకు తప్పిదం లేదని. దాంతో రూపాయితో సహా కట్టమని స్టేట్ మెంట్ పంపారు. అజాగ్రతగా ఉంటే మీరు కూడా సుధ వలే బాధపడాల్సి వస్తుంది.

కస్టమర్ కేర్ నంబర్ ను దగ్గర ఉంచుకోవాలి

ఏదైనా అనుమానిత, మోసపూరిత లావాదేవీ జరిగినట్టు గుర్తిస్తే వెంటనే కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయమని కోరాలి. ఇందుకోసం బ్యాంకు కస్టమర్ కేర్ నంబర్ ను ఫోన్ కాంటాక్ట్స్ లో సేవ్ చేసి ఉంచుకోవాలి.

representation image

ఏటీఎం సెంటర్ లోనూ జాగ్రత్త

ఏటీఎం కేంద్రాల్లో పిన్ టైప్ చేసేటప్పుడు వేరే వారిని చూడనీయకండి. కార్డు సమాచారాన్ని కొట్టేయడానికి దొంగలు సైతం రహస్య కెమెరాలను అమర్చి ఉండవచ్చు. అందుకోసం ఒక చేత్తో పిన్ ను ఎంటర్ చేస్తున్న సమయలో రెండే అరచేతితో కవర్ చేయండి. అప్పుడు మీ పాస్ వర్డ్ వేరే కళ్లల్లో పడకుండా ఉంటుంది. చాలా మంది ఏటీఎంలో ఒక్కరే ఉంటే స్వేచ్ఛగా వ్యవహరిస్తుంటారు. కానీ, అక్కడ నేరగాళ్ల రహస్య కెమెరాలు ఉండి ఉండవచ్చు. అజాగ్రత్త పనికిరాదు.

అర్ధరాత్రి ఏటీఎం లావాదేవీలు క్షేమకరం కాదు

నేరం జరిగేందుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకోసం అర్ధరాత్రి సమయాల్లో, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లోని ఏటీఎంలను వినియోగించుకోవద్దు. రాత్రి 10 గంటల తర్వాత ఏటీఎం కేంద్రాలను ఆశ్రయించే విధానాన్ని వదిలిపెట్టాలి. డబ్బులతో పని పడితే గుర్తుంచుకుని రాత్రి 9 గంటల్లోపే డ్రా చేసుకోవాలి.  

కార్డులు వెంట ఉండాలా...?

అవసరం ఉన్నా లేకపోయినా అన్ని రకాల కార్డులను ఎప్పుడూ వ్యాలెట్లలో పెట్టుకుని తిరగడం అలవాటైపోయింది. కానీ, ఇది అంత సురక్షితం కాదు. అందుకే కార్డులతో పని ఉన్నప్పుడే వాటిని వెంట తీసుకెళ్లి మిగిలిన సమాయాల్లో ఇంట్లోనే ఉంచేయండి. అయితే, ఏ రోజు ఎక్కడ కార్డుతో అవసరం పడుతుందో తెలియదనుకుంటే... ఒక్క కార్డును మాత్రమే దగ్గర ఉంచుకుని మిగిలిన వాటిని ఇంట్లో ఉంచేయండి.

ఆన్ లైన్ లో సమాచారం విషయంలో జాగ్రత్త...

ఆన్ లైన్ లో పబ్లిక్ ఫోరమ్ లలో, సామాజిక మాధ్యమాలలో పుట్టినతేదీ, పాన్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, ఈ మెయిల్, ఫోన్ నంబర్ తదితర వివరాలను ఇస్తుంటారు. కానీ వ్యక్తిగత సమాచారాన్ని అవసరమైన చోట తప్పితే ఇంకెక్కడా షేర్ చేయవద్దు.representation image

రెండు దశల్లో పాస్ వర్డ్ లు

టు ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే ప్రతీ లావాదేవీకి ట్రాన్సాక్షన్ పాస్ వర్డ్ తో పాటు ఓటీపీ ఇస్తేనే ఓకే అయ్యేలా చేసుకోండి. దీనివల్ల లావాదేవీలకు మరింత భద్రత ఉంటుంది. అంటే రెండంచెల భద్రత అనమాట.

మెయిల్స్ తో జాగ్రత్త

బ్యాంకు లోగోతో, క్రెడిట్ కార్డు కంపెనీల పేరుతో వచ్చే మెయిల్స్ ను క్లిక్ చేయకండి.ట్రాప్ చేస్తారు. ఆ నకిలీ సైట్లో ఇచ్చే యూజర్ ఐడీ పాస్ వర్డ్, ఇతర కార్డు సమాచారాన్ని తస్కరించి మోసం చేసేస్తారు.  ఇలా చేయడానికి బదులు నేరుగా బ్యాంకు వెబ్ సైట్ అడ్రస్ ను టైప్ చేసి లాగిన్ అవ్వండి. ముఖ్యంగా గమనించాల్సిన అంశం వెబ్ సైట్  https:// తో ప్రారంభం కావాలి. అప్పుడే అది సురక్షితమైనదని అర్థం.

నెట్ కేఫ్, ఇతరుల పీసీలకు దూరం

ఇంటర్నెట్ కేఫ్, ఇతరుల కంప్యూటర్ల నుంచి లావాదేవీలు చేసే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ఆ కంప్యూటర్ల నుంచి ప్రమాదకర వైరస్ లను జొప్పించే వెబ్ సైట్లను యాక్సెస్ చేసి ఉండవచ్చు. ఆ కంప్యూటర్లలో అప్పటికే మాల్వేర్ లు ఇతరత్రా సైబర్ నేరగాళ్లు పంపిన సాఫ్ట్ వేర్ లు ఉండి ఉండవచ్చు. కీ లాగర్స్ అనే సాఫ్ట్ వేర్ యూజర్లు టైప్ చేసిన కీలను గుర్తుంచుకుంటుంది. ఆ సమాచారాన్ని నేరగాళ్లు తర్వాత దుర్వినియోగం చేస్తారు. ట్రోజన్ సాఫ్ట్ వేర్ లు సైతం కీలక సమాచారాన్ని కొట్టేస్తాయి. అందుకే యాంటీవైరస్ ఉన్న కంప్యూటర్లలోనే లావాదేవీలు చేయడం సురక్షితం.

ఇంటర్నెట్ వేగంగా ఉండాలన్న ఆలోచనతో కొంత మంది ఫైర్ వాల్ ను ఆఫ్ చేస్తారు. కానీ, ఇది ఆన్ లో ఉంటేనే రక్షణ ఉంటుంది. పైగా ఎప్పటికప్పుడు యాంటీ వైరస్ తో సిస్టమ్ ను స్కాన్ చేస్తూ ఉండాలి. మనం చూసే సాధారణ సైట్ల ద్వారా కూడా ట్రోజన్ సాఫ్ట్ వేర్ పీసీలోకి చొరబడే ప్రమాదం ఉంది. స్కాన్ చేస్తూ ఉండడం వల్ల వీటిని తొలగించుకోవచ్చు.

మొబైల్ లో లావాదేవీలు చేస్తున్నారా...?

స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. 3జీ, 4జీలు వచ్చే సరికి ఇప్పుడు చాలా మంది తమ స్మార్ట్ ఫోన్ల నుంచే లావాదేవీలు చేసేస్తున్నారు. కానీ, మొబైల్ లోనూ యాంటీ వైరస్ తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే కంప్యూటర్ వలే మొబైల్ కూడా వైరస్ కు లక్ష్యంగా మారే ప్రమాదం ఉంది.

representation image

ఓఎస్, బ్రౌజర్ అప్ డేట్ లో ఉండాలి

కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ తో పాటు, బ్రౌజర్లను అప్ టు డేట్ వెర్షన్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే భద్రతా పరంగా మరిన్ని ఫీచర్లను ఎప్పటికప్పుడు జోడిస్తూ కొత్త వెర్షన్లను కంపెనీలు విడుదల చేస్తుంటాయి. వాటిని వాడుకోవడం వల్ల కంప్యూటర్ మరింత సురక్షితంగా ఉంటుంది.

నెట్ బ్యాంకింగ్ లో లాగిన్ అవుతున్నారా...?

నెట్ బ్యాంకింగ్ లాగిన్ సమయంలో కీబోర్డు నుంచి పాస్ వర్డ్ లను టైప్ చేయకుండా బ్యాంకు సైటులో కనిపించే వర్చువల్ కీ బోర్డును సెలక్ట్ చేసుకోండి. అక్కడే కనిపించే లెటర్స్ ఆధారంగా మౌస్ సాయంతో పాస్ వర్డ్ ను ఎంటర్ చేయవచ్చు. ఇలా చేస్తే భద్రత ఉంటుంది. ఎందుకంటే కీబోర్డు ద్వారా ఎంటర్ చేసే కీలను పసిగట్టే సాఫ్ట్ వేర్ లను నేరగాళ్లు సైట్ల ద్వారా కంప్యూటర్లలోకి ప్రవేశపెడుతుంటారు. అందుకే కీబోర్డులో టైప్ చేయవద్దు. అదే సమయంలో వర్చువల్ కీ బోర్డులో పాస్ వర్డ్ ఇస్తున్న సమయంలో కంప్యూటర్ దగ్గర ఇతరులు ఎవరూ లేకుండా చూసుకోవాలి. వర్చువల్ కీ బోర్డు క్లిక్ చేసినప్పుడల్లా అందులో అక్షరాలు ఒక చోట నుంచి మరో చోటకు మారుతుంటాయి. కనుక సాఫ్ట్ వేర్లు పసిగట్టలేవు.

బ్యాంకు లావాదేవీలకు ప్రత్యేక బ్రౌజర్

బ్యాంకు లావాదేవీల వరకు ప్రత్యేక బ్రౌజర్ వాడడం కొంత వరకు భద్రంగా ఉంటుంది. ఉదాహరణకు అన్నింటికీ క్రోమ్ వాడే అలవాటు ఉందనుకుందాం. అప్పుడు బ్యాంకు లావాదేవీలను మాత్రం ఫైర్ ఫ్యాక్స్ లో చేయండి. ఈ బ్రౌజర్ ను లావాదేవీలకు తప్పిస్తే ఇతరత్రా సాధారణ బ్రౌజింగ్ కు వాడవద్దు. అదే సమయంలో బ్రౌజర్ లో పాస్ వర్డ్ లు, ఇంక ఇతర ఏ సమాచారం కూడా స్టోర్ అయ్యే అవకాశం లేకుండా డిజేబుల్ చేసి పెట్టుకోవాలి.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy