ap7am logo

ఏ తరహా ‘టీవీ’లో ఏముంది... ఏ టెలివిజన్ కొనడం ప్రయోజనం...?

Tue, May 23, 2017, 12:32 PM
Related Image

సీఆర్టీ టీవీల శకం ఎప్పుడో ముగిసిపోయింది. ఎల్ సీడీ టీవీలు కొంత కాలం పాటే మనుగడలో ఉన్నాయి. ఇప్పుడంతా ఎల్ఈడీ, స్మార్ట్, యూహెచ్ డీ టీవీల శకం. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కడంతో టీవీల స్వరూపం కూడా మారుతూ వస్తోంది. ఎలక్ట్రానిక్ షోరూమ్ లోకి అడుగుపెట్టడం ఆలస్యం పదుల సంఖ్యలో టీవీ తెరలు కొనుగోలుదారుడ్ని అయోమయానికి గురిచేస్తాయి. ఈ నేపథ్యంలో ఏ టీవీలో ఏముంది, వీటివల్ల ఉపయోగాలు ఏంటో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

టీవీ కొనేవారు చూసే వాటిలో ముఖ్యమైన అంశాలు... సైజు, ధర, ఫీచర్లు, టెక్నాలజీ, విద్యుత్ వినియోగం. టెలివిజన్ సైజు ఎక్కువ ఉండరాదు, అలా అని తక్కువగా కూడా ఉండడం సరికాదు. ఎందుకంటే ప్రతీ సైజుకు తగ్గట్టు కనీసం ఇన్ని అడుగుల దూరం నుంచి చూడాల్సి ఉంటుంది. భారీ స్క్రీన్ టీవీకి నాలుగు అడుగుల దూరంలో కూర్చుని చూస్తే బొమ్ములు, వస్తువులు టీవీ తెరపై పెద్దగా కనిపిస్తాయి. దాంతో సౌకర్యంగా అనిపించదు.

representation image

ఎంత దూరం...

అందుకే ఏ సైజు టీవీకి ఎన్ని అడుగుల దూరం నుంచి కూర్చోవాలో చూద్దాం. ఉదాహరణకు 32 అంగుళాల టీవీ అయితే 1080 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంటే దానికి నాలుగు అంగుళాల దూరంలో కూర్చుని చూడాలి. అదే సైజు టీవీలో 720 పిక్సల్ రిజల్యూషన్ ఉంటే 6 అడుగుల దూరంలో కూర్చోవాలి. 576 పిక్సల్స్ రిజల్యూషన్ ఉంటే 8 అడుగుల దూరంలో కూర్చుని చూడడం వల్ల సౌకర్యంగా, స్పష్టంగా ఉంటుంది. రిజల్యూషన్, సైజుని బట్టి ఎన్ని అడుగుల దూరం నుంచి చూడడం సరైనదో ఈ పట్టిక తెలియజేస్తుంది. 

టీవీ సైజు576 రిజల్యూషన్720 పిక్సల్స్1080 పిక్సల్స్
32-inch8′ feet6′4′
37-inch10′7′4.5′
40-inch10.5′8′5′
42-inch11′8′5.5′
46-inch12′9′6′
50-inch13′10′6.5′
55-inch15′11.5′7.5′
65-inch17′13′8.5′

పిక్సల్స్ ను బట్టే క్లారిటీ 

టీవీలకు సంబంధించి క్లారిటీ (చిత్రాల స్పష్టత) అనేది చాలా ముఖ్యం. ఎవరైనా ముందుగా చూసే వాటిలో ఇది కూడా ఒకటి. మరి క్లారిటీ ఉండాలంటే పిక్సల్సే ప్రధానం. ఎక్కువ పిక్సల్స్ ఉంటే చిత్రాలను మరింతగా క్యాప్చర్ చేసి ప్రదర్శిస్తుంది. దాంతో స్పష్టత పెరుగుతుంది. 

* స్టాండర్డ్ డెఫినిషన్, హెడ్ డీ రెడీ టీవీలు, ఫుల్ హెచ్ డీ, ఎక్స్ ట్రా హై డెఫినిషన్/అల్ట్రా హెడ్ డీ, 4కే అల్ట్రా హెచ్ డీ అనే రకాలు ఉన్నాయి. 

వీటిలో హెచ్ డీ రెడీ టీవీల రిజల్యూషన్ 1280/720 ఉంటుంది. అంటే 720 పిక్సల్స్ అని. 

* ఫుల్ హెచ్ డీ అంటే 1920/1080 లేదా 1080 పిక్సల్స్. ఈ రిజల్యూషన్ 32 అంగుళాలు అంతకంటే ఎక్కువ సైజు మోడల్స్ లోనే ఉంటోంది.  

ఎక్స్ ట్రా/అల్ట్రా హై డెఫినిషన్ టీవీ, 4కే  అల్ట్రా హెడ్ డీ టీవీల్లో  3840/2160 రిజల్యూషన్ ఉంటుంది.ఈ టీవీల ప్రారంభ సైజు 42 అంగుళాలు. 4కే అంటే ఏంటా? అని చాలా మందిలో సందేహం ఉంటుంది. ఫుల్ హెచ్ డీ టీవీల్లో ఉండే 1080 పిక్సల్స్ తో పోలిస్తే  4రెట్లు అధిక పిక్సల్స్ అనే అర్థంలో 4కే అనే పేరు స్థిరపడింది. 

* స్టాండర్డ్ టీవీ నుంచి ఎక్స్ ట్రా హై డెఫినిషన్ టీవీ వరకు పిక్సల్ పెరుగుతూ వెళ్లినట్టు తెలుస్తోంది. అంటే చిత్రాల స్పష్టత కూడా స్టాండర్డ్ టీవీతో పోలిస్తే ఎక్స్ ట్రా హై డెఫినిషన్ టీవీలో అధికంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. 

ఇక్కడ ఓ చిన్న లాజిక్ కూడా ఉంది. నిర్ణీత దూరానికి మించి కూర్చుని చూస్తే హెచ్ డీ టీవీ ఏదైనా ఒకేలా కనిపిస్తుంది. పైన చెప్పుకొన్నట్టు పిక్సల్స్ రేటును బట్టి, టీవీ సైజును బట్టి నిర్ణీత దూరంలోనే కూర్చుని టీవీని చూడడం వల్ల ఆ ఫీల్ ను ఎంజాయ్ చేయవచ్చు. 4కే అల్ట్రా హెచ్ డీ టీవీల్లో పిక్చర్ క్వాలిటీ అత్యధికంగా ఉండడం వల్ల స్క్రీన్ సైజు కూడా పెద్దగా ఉంటుంది. అయితే, మన దేశంలో ఉన్న చానళ్లకు సంబంధించి ఫుల్ హెచ్ డీ టీవీ సరిపోతుందనేది నిపుణుల మాట.

representation image

రీఫ్రెష్ రేటు

ప్రస్తుత టీవీల్లో చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం రీఫ్రెష్ రేటు. టీవీలో ఒక సెకనులో ఎన్ని చిత్రాలు వేగంగా కదిలేదీ ఈ రీఫ్రెష్ రేటు నిర్ణయిస్తుంది. ఉదాహరణకు కారు రేసింగ్ పోటీలో చిత్రాలు చాలా వేగంతో కదులుతాయన్న విషయం తెలుసు కదా. ఎక్కువ రీఫ్రెష్ రేటు ఉన్న టీవీల్లో చిత్రాలు బ్లర్ కావు. అధికంగా కదిలే చిత్రాలను మినహాయిస్తే సాధారణ సినిమాలు, ఇతర కార్యక్రమాలను చూసే విషయంలో రీఫ్రెష్ రేటు ఎంతున్నా ఒకటే.

టీవీల తయారీదారులు రీఫ్రెష్ రేటుకే రకరకాల ముద్దు పేర్లు తగిలిస్తుంటారు. సోనీ మోషన్ ఫ్లో, శామ్ సంగ్ క్లియర్ మోషన్ రేటు, తోషిబా క్లియర్ స్కాన్ వంటివనమాట. ఈ రీఫ్రెష్ రేటు అనేది గరిష్టంగా 200హెచ్ జడ్ వరకు ఉంటుంది. నిజానికి ఓ కంపెనీ రీఫ్రెష్ రేటును  1000 హెచ్ జడ్ గా పేర్కొనవచ్చు. అది నమ్మి బోల్తా పడకండి. వాస్తవంలో అది 200 హెచ్ జడ్ కు మించి ఉండదు. మొత్తానికి రీఫ్రెష్ రేటు రేంజ్ 50 నుంచి 200 హెచ్ జడ్ మధ్యే ఉంటుంది. 

సౌండ్/ఆర్ఎంఎస్ అవుట్ పుట్

చిత్రం తర్వాత శబ్దమే టీవీల్లో అత్యంత ముఖ్యమైన అంశం. శబ్ద నాణ్యత ఉంటే ఇరిటేషన్ ఉండదు. లేకుంటే టీవీల్లో మాటలు ఒక్కోసారి సరిగా అర్థం కావు. 5W 5W ఆర్ఎంఎస్ అని ఉంటే టీవీలో ఉన్న రెండు స్పీకర్లు 5వాట్ చొప్పున శక్తి మేర శబ్దం విడుదల ఉంటుంది. ఎక్కువ ఆర్ఎంఎస్ ఉంటే శబ్దం అధికంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంతేకానీ, ఆర్ఎంఎస్ అధికంగా ఉంటే శబ్ద నాణ్యత అధికంగా ఉంటుందనుకోరాదు.

ఐపీఎస్ ప్యానల్, వీఏ ప్యానల్ 

ఎల్ఈడీ టీవీ ఎదురుగా కూర్చుంటే ఒకలా, పక్కన కూర్చుంటే ఒకలా... ఇలా ఒక్కో కోణంలోంచి చూస్తే కలర్స్ మారిపోతుండడం గమనించవచ్చు. ఇది ప్యానల్ వల్లే. ప్యానల్స్ లో ఐపీఎప్, వీఏ ప్యానల్స్ అనే రకాలు ఉంటాయి. వీఏ ప్యానల్ కంటే ఐపీఎస్ ప్యానల్స్ బెటర్. ఐపీఎప్ ప్యానల్స్ దృఢంగా, మన్నికగా ఉంటాయి. పైగా ఏ వైపు నుంచి చూసినా సౌకర్యంగా ఉంటుంది.

పిక్చర్ ఇంజన్

టీవీ చూడడాన్ని మరింత సౌకర్యంగా చేయడంలో భాగంగా కొత్త టెక్నాలజీ ఆవిష్కరణల్లో భాగమే ఈ పిక్చర్ ఇంజన్. టీవీలో తక్కువ రిజల్యూషన్ ఉన్న వీడియో ప్లే చేసేందుకు ఇది చక్కగా పనిచేస్తుంది. ఎలా అంటే ఒకవేళ స్మార్ట్ టీవీ వాడుతున్నారనుకోండి. యూ ట్యూబ్ లో ఉన్న తక్కువ రిజల్యూషన్ వీడియోను ప్లే చేశారు. పిక్చర్ ఇంజన్ ఉంటే ఆ వీడియో బ్లర్ కాకుండా చూస్తుంది.  

స్మార్ట్ టీవీలు

సాధారణ టీవీలో ఉండే ఫీచర్లు అన్నీ ఉంటాయి. వీటికి అదనంగా ఇంటర్నెట్ కు కనెక్ట్ చేసుకుని బ్రౌజ్ చేసుకునే సౌలభ్యం స్మార్ట్ టీవీలతో సాధ్యం అవుతుంది. వైఫై కు కూడా కనెక్ట్ చేసుకుని ఆన్ లైన్ లో వీడియోలు చూసుకోవచ్చు. గూగుల్ క్రోమ్ క్యాస్ట్ అనే చిన్న డివైజ్ ను టీవీ హెచ్ డీఎంఐ పోర్ట్ కు కనెక్ట్ చేసుకోవడం ద్వారా స్మార్ట్ టీవీ కాస్తా ఆండ్రాయిడ్ టీవీగా మారిపోయి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అందించే సౌకర్యాలన్నింటినీ పొందవచ్చు. 

ప్లాస్మా టీవీలు

ఎల్ సీడీ, ఎల్ఈడీ టీవీలతో పోలిస్తే ప్లాస్మా టీవీ ల కాంట్రాస్ట్, కలర్ కచ్చితత్వం ఎక్కువ. ఇవి 40 అంగుళాల సైజు నుంచే అందుబాటులో ఉన్నాయి. ప్లాస్మా స్క్రీన్స్ రెండు గాజు తెరలతో తయారవుతాయి. రెండు గాజు తెరల మధ్య గ్యాస్ ను నింపి సీల్ చేస్తారు. విద్యుత్ వాహకంతో ఈ గ్యాస్ లు వెలుగును ప్రసారం చేస్తాయి.

ఓఎల్ఈడీ టీవీ

ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డియోడ్ (ఓఎల్ఈడీ) టీవీలు కార్బన్ వంటి ఆర్గానిక్ మెటీరియల్స్ ను వినియోగించుకుని వెలుగునిస్తాయి. ఎల్ఈడీ టీవీల్లో వలే బ్యాక్ లిట్ కాకుండా ప్రత్యేకంగా ఏ భాగానికి అవసరమైన వెలుగు అక్కడే జనరేట్ అవుతుంది. అందుకే మిగతా వాటన్నింటి కంటే కలర్, కాంట్రాస్ట్, చిత్రాలను ప్రాసెస్ చేయడంలో, పలుచగా ఉండడంతో ఓఎల్ఈడీ అన్నింటికంటే టాప్ అని చెప్పవచ్చు. కానీ వీటి ధరలు భారీ స్థాయిలో ఉంటాయి.

representation image

3డీ టీవీ

సాధారణ టీవీల్లో 3డీ టెక్నాలజీ తో వస్తున్నవి కూడా ఉన్నాయి. వీటిలో 3డీ సినిమాలను ప్రత్యేకంగా రూపొందించిన కళ్లద్దాలతో చూడడం మరపురాని అనుభవం అని చెప్పవచ్చు. అదే సమయంలో సాధారణ సినిమాలను సైతం కూడా కళ్లద్దాలు అవసరం లేకుండా చూసుకోవచ్చు. ఈ టెక్నాలజీలో రెండు చిత్రాలను (ఒకటి ఒక కన్నుకు, మరొకటి మరో కన్నుకు) ఒకే ఫ్రేమ్ లో రూపొందిస్తారు. ఒకటి నిలువుగా, ఒకటి అడ్డంగా ఉంటుంది. ఈ విధంగా రూపొందించిన చిత్రాలను 3డీ కళ్లద్దాలను ధరించి చూస్తే... ఒకే ఫ్రేమ్ లో అడ్డం, నిలువునా రెండు భిన్న రకాల చిత్రాలు కనిపించడాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోను అవుతారు. 

లైటింగ్ టెక్నాలజీ

ఎల్ఈడీ టీవీల్లో డైరెక్ట్ లైటింగ్, ఎడ్జ్ లైటింగ్ అనే రెండు రకాలు ఉన్నాయి. డైరెక్ట్ లిట్ టీవీనే ఫుల్ లిట్ ఎల్ఈడీ టీవీ అని కూడా పేర్కొంటారు. వీటిల్లో ఎల్ సీడీ ప్యానల్ అంతటా ఎల్ఈడీ లైట్లు అమర్చి ఉంటాయి. ఎడ్జ్ లిట్ టీవీల్లో డిస్ ప్లే ప్యానల్ చివర్లలోనే ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. ఇవే స్క్రీన్ అంతటా వెలుగును వ్యాప్తి చేస్తాయి. గదిలో వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు, లేదా రాత్రి సమయాల్లో లైట్ ఆఫ్ చేసి ఎడ్జ్ లిట్ టీవీని చూస్తే చిత్రాల నాణ్యతలో తేడా కనిపిస్తుంది. 

లోకల్ డిమ్మింగ్

ఈ టెక్నాలజీ ఉన్న ఎల్ఈడీ టీవీల్లో ఎల్ఈడీ టీవీల బ్రైట్ నెస్ తగ్గించుకునే సదుపాయం ఉంది. ఈ టెక్నాలజీ సాధారణంగా డైరెక్ట్ లిట్ ఎల్ఈడీ టీవీల్లో ఉంటుంది.

విద్యుత్ వినియోగం

నేరుగా కంటికి కనిపించని అంశం ఇది. టీవీలను బట్టి విద్యుత్ వినియోగం మారిపోతుంటుంది. అందుకే దీని గురించి కూడా తెలుసుకోవాలి. 22 అంగుళాల సైజులో వెనుకటి తరం సీఆర్టీ టీవీ వాడుకునే విద్యుత్ లో ఎల్ఈడీ టీవీ కేవలం మూడింట ఒక వంతు మాత్రమే వినియోగిస్తుంది. ఈ సైజు ఎల్ఈడీ టీవీల సగటు వినియోగం 35 వాట్స్. 22 అంగుళాలకు పైన 40 అంగుళాల వరకు హెచ్ డీ రెడీ ఎల్ఈడీ టీవీల విద్యుత్ వినియోగం 55 నుంచి 65 వాట్స్. ఇంతకంటే పెద్ద సైజుకు వెళితే ఎల్ఈడీ టీవీల కంటే ప్లాస్మా టీవీలు 40 శాతం అధికంగా విద్యుత్ ను వాడతాయి.

మరీ పెద్ద టీవీలు అయితే 600 వాట్స్ వినియోగం కూడా ఉంటుంది. 40 అంగుళాల కంటే పెద్దదైన ఎల్ఈడీ టీవీ 80 వాట్స్ వరకు వాడితే, ప్లాస్మా టీవీ 140 వాట్స్ వాడుతుంది. హెచ్ డీ రెడీ, ఫుల్ హెచ్ డీ, అల్ట్రా హెచ్ డీ టీవీలు సాధారణ టీవీల కంటే మరింత స్పష్టతతో చిత్రాలను అందిస్తాయి కనుక అధికంగా విద్యుత్ ను తీసుకుంటాయి. అలాగే అధిక రీఫ్రెష్ రేటు ఉన్నా, అధిక ఆర్ఎంఎస్ ఉన్నా ఆ మేరకు విద్యుత్ వినియోగం కూడా పెరిగిపోతుంది. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Advertisements