ap7am logo

బ్యాంకు డిపాజిట్లలో ఉన్న లాజిక్ తెలుసా?

Fri, May 19, 2017, 02:39 PM
Related Image

సామాన్యులకు స్టాక్ మార్కెట్లు అర్థం కావు. వారికి బ్యాంకు, పోస్టాఫీసు డిపాజిట్ల వంటి సంప్రదాయ పొదుపు పథకాల గురించే ఎక్కువగా తెలుసు. మధ్య తరగతి విద్యావంతులు సైతం బ్యాంకు ఖాతాల్లో, బ్యాంకు డిపాజిట్లలో మదుపు చేస్తుంటారు. దేశంలోని బ్యాంకులు లక్షల కోట్ల రూపాయలను రుణాలుగా ఇస్తున్నాయంటే... ఖాతాదారుల నుంచి డిపాజిట్ల రూపంలో సేకరించిన నిధులేగా అవన్నీ. నిజానికి బ్యాంకుల్లో డిపాజిట్లతో బ్యాంకులకే లాభం... అదెలాగన్నది వివరంగా చూద్దాం.

బ్యాంకులంటే భద్రం. ప్రభుత్వ భరోసా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది బ్యాంకుల్లోనే పొదుపు చేసుకుంటుంటారు. కానీ, సంస్కరణల ఫలితంగా ఇతర అభివృద్ధి చెందిన, వర్థమాన దేశాల వలే మన దేశీయ ఆర్థిక పరిస్థితులు సైతం 15 ఏళ్ల క్రితంతో పోలిస్తే పూర్తిగా మారిపోయాయి. డిపాజిట్లపై రేట్లు గణనీయంగా తగ్గిపోయాయి. అందుకే కాలంతోపాటే మదుపరులు కూడా మారాలి. అప్పుడే తమ కష్టార్జితాన్ని వృద్ధి చేసుకోగలరు. కనీసం తమ డబ్బు విలువను అయినా కాపాడుకోగలరు.

ప్రస్తుతం దేశీయ బ్యాంకులు వివిధ రకాల కాల వ్యవధిగల డిపాజిట్లపై వార్షికంగా 7 శాతానికి మించి వడ్డీ ఇవ్వడం లేదు. 2017 మొదటి త్రైమాసికంలో రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సగటున 4-5 శాతం మధ్యన ఉంది. ద్రవ్యోల్బణం అంటే డబ్బు విలువను హరించేది. అందుకే ఎలాంటి రాబడిపై అయినా ద్రవ్యోల్బణం శాతాన్ని తీసివేసిన తర్వాతే నికర రాబడి లెక్కించాలి. ఇప్పుడు వడ్డీ 7 శాతంలో ద్రవ్యోల్బణం 5 శాతం తీసివేయగా మిగిలిన రాబడి 2 శాతం. 

రూ.10వేలు దాటితే...

ఉదాహరణకు ప్రశాంత్ 1.5 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేశాడని అనుకుందాం. వడ్డీ 7 శాతం. ఈ లెక్కన ఏడాది అనంతరం అతడికి కాంపౌండింగ్ వడ్డీతో కలుపుకుని 10,683 రూపాయల ఆదాయం వస్తుంది. దీనిపై పన్ను భారం ఉంటుందని తెలుసుకోవాలి. ఆదాయపన్ను చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం 10వేల వరకు ఉంటే పన్ను కోత ఉండదు. అంతకు మించితే బ్యాంకులు వడ్డీ ఆదాయంలో 10 శాతం (టీడీఎస్)  కోసేసి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తాయి. ఒకవేళ సదరు ఖాతాదారుడు పాన్ నంబర్ ఇవ్వకపోయి ఉంటే 20 శాతం టీడీఎస్ కోసేసి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తాయి బ్యాంకులు.

రాబడి ఏమీ ఉండదు!

పై ఉదాహరణ ప్రకారం ప్రశాంత్ లక్ష రూపాయలే డిపాజిట్ చేస్తే ఏడాదికి వచ్చే వడ్డీ ఆదాయం 7,122 రూపాయలే. కనుక పన్ను భారం ఉండదు. కానీ లక్షన్నర రూపాయలు డిపాజిట్ చేసి ఉంటే 10,683 ఆదాయం వచ్చి ఉంటుంది. అప్పుడు బ్యాంకులు పది శాతం 1,068రూపాయలను టీడీఎస్ (మూలం వద్ద పన్ను) కింద మినహాయించుకుంటాయి. అప్పుడు నికర ఆదాయం 9,615 రూపాయలే. సుమారు 6.3 శాతం వార్షిక వడ్డీ రేటు గిట్టుబాటు అయినట్టు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం 5 శాతం తీసివేస్తే నికరంగా 1.03 శాతం మిగిలినట్టు.  

ఒకవేళ ప్రశాంత్ లక్ష రూపాయలే డిపాజిట్ చేసినా... పన్ను పోటు ఉండదన్న భరోసా లేదు. ఎందుకంటే ఒక ఏడాదిలో అన్ని డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయాన్ని పన్ను చెల్లింపునకు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రశాంత్ కు లక్ష రూపాయలపై వడ్డీ ఆదాయం 7,714 రూపాయలకు అదనంగా 2,287 రూపాయల ఆదాయం రికరింగ్ డిపాజిట్ల రూపంలో వచ్చి ఉంటే... టీడీఎస్ పోను మిగిలేది ఏముంటుంది. అయితే, బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ ఆదాయం 10వేల రూపాయలు మించితేనే టీడీఎస్ అమలు చేస్తాయి.

ఇలా అయితే నష్టమే

ఆదాయపన్ను చెల్లింపు దారుల్లో 10, 20, 30 శాతం చొప్పున పన్ను చెల్లించే వారు ఉంటారు. వీరిలో గరిష్ట పన్ను శ్లాబులో ఉన్న వారు సెక్షన్ 80సీ ప్రకారం మినహాయింపుల మేర వివిధ పొదుపు పథకాల్లో పెట్టబడులు పెట్టే ఉంటారు. ఇలాంటి వారు ఆ పరిమితి మేరకే డిపాజిట్ చేసుకోవడం ద్వారా పన్ను తప్పించుకోవచ్చు. కానీ అది దాటిన తర్వాత బ్యాంకు డిపాజిట్ల వంటి అతి తక్కువ రాబడి ఇచ్చే పథకాల్లో పెట్టుబడి పెడితే నష్టపోవాల్సి వస్తుంది. ఎలా అంటే ఉదాహరణకు ప్రశాంత్ 20 శాతం పన్ను చెల్లింపు పరిధిలో ఉంటే లక్ష రూపాయల డిపాజిట్ పై ఏడాదికి వచ్చిన 7,122 రూపాయలపై 20 శాతం అంటే 1,424 రూపాయలు పన్ను రూపంలో చెల్లించాలి. నికరంగా 5,698 రూపాయలు రాబడి వచ్చినట్టు. అంటే వార్షికంగా నికరంగా గిట్టుబాటైన వడ్డీ 5.5శాతం. ద్రవ్యోల్బణం 5 శాతంతో పోలిస్తే నికరంగా మిగిలింది అరశాతం.

సేవింగ్స్ ఖాతాలపై వచ్చే వడ్డీ ఆదాయం రూ.10వేలకు మించినప్పటికీ  బ్యాంకులు టీడీఎస్ అమలు చేయవు. అయితే, అలాంటి సందర్భాల్లో ఆ ఆదాయాన్ని సాధారణ ఆదాయానికి కలిపి పన్ను పరిధిలోకి వస్తే చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లించే ఆదాయం లేకుంటే ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసి టీడీఎస్ కింద కోల్పోయిన దాన్ని తిరిగి పొందవచ్చు. కానీ, వెయ్యి, రెండు మూడు వేల కోసం రిటర్నులు దాఖలు చేసేందుకు చాలా మంది ఇష్టపడరు. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే పన్ను చెల్లింపుదారులు అయితే, వడ్డీ ఆదాయాన్ని తమ ఆదాయానికి కలిపి తమ శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. ఉదాహరణకు ప్రశాంత్ 20 శాతం పన్ను చెల్లింపు రేటులో ఉండి ఉంటే అతడు తన వడ్డీ ఆదాయంపై టీడీఎస్ కింద 10 శాతం మినహాయించినా, మిగిలిన పది శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 

representative image

పన్ను భారం తప్పేదెలా...?

ఉదాహరణకు ఒకే బ్యాంకు శాఖలో అధికంగా డిపాజిట్ చేస్తే టీడీఎస్ ఉంటుందన్న ఆలోచనతో అదే బ్యాంకుకు చెందిన రెండు మూడు శాఖల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేశారనుకుందాం. అప్పుడు కూడా టీడీఎస్ ఉంటుంది. అన్ని బ్యాంకు శాఖల్లోని ఖాతాలను పాన్ నంబర్ ఆధారంగా ట్రాక్ చేసి టీడీఎస్ మినహాయిస్తారు. అలా కాకుండా వివిధ బ్యాంకు శాఖల్లో డిపాజిట్లు చేస్తే టీడీఎస్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. అయితే, పాన్ నంబర్ ఆధారంగా ఓ వ్యక్తి పేరిట ఉన్న పెట్టుబడులన్నింటినీ ఆదాయపన్ను శాఖ మదింపు చేస్తూ ఎగవేతదారులకు నోటీసులు జారీ చేయడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది.

ఇక సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ 4 శాతం మాత్రమే. ద్రవ్యోల్బణంతో చూస్తే ఒక శాతం డబ్బు విలువను కోల్పోతున్నారని అర్థం చేసుకోవాలి. అందుకే ప్రతీ ఒక్కరూ ద్రవ్యోల్బణానికి మించి మంచి రాబడులను ఇచ్చే పెట్టుబడి మార్గాలను తెలుసుకోవాలి. వాటిల్లోనే మదుపు చేయాలి. 

మంచి రాబడినిచ్చే పెట్టుబడి సాధనాలు

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పై కనీస రాబడి 12 శాతం అంతకంటే ఎక్కువే ఉంటుంది. రిస్క్ అంతగా వద్దనుకుని బ్యాలన్స్ ఫండ్స్ లో పెట్టినా 10 శాతానికి తక్కువ కాకుండా ప్రతిఫలం అందుకోవచ్చు. లేదా కనీసం పీపీఎఫ్ లో జమ చేసుకున్నా 8 శాతానికి పైనే రాబడి వస్తోంది. లేదు డిపాజిట్లలోనే పెడతామంటే... ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో పెట్టడం ద్వారా కనీసం టీడీఎస్ కోతల నుంచి తప్పించుకోవచ్చు. ఆర్థిక విషయాలపై ఎంత మాత్రం అవగాహన ఉందన్న ఆధారంగానే ఓ వ్యక్తి ధనవంతుడు కావడం అనేది ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే ఆర్థికంగా ఆలోచించే వారు ఎవరైనా బ్యాంకు డిపాజిట్ల జోలికి వెళ్లకపోవడమే తెలివైన నిర్ణయమని చెప్పుకోవాలి. 

వృద్ధులు భద్రతకు భరోసా ఉండే సంప్రదాయ డిపాజిట్ పథకాలను నమ్ముకుంటుంటారు. వీరు ఎక్కువగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేస్తుంటారు. బ్యాంకులు వృద్ధులకు అరశాతం వడ్డీ ఎక్కువే ఆఫర్ చేస్తున్నాయి. కానీ, సంపాదన ఆగిపోయిన తర్వాత కనీసం 20 ఏళ్లకు తక్కువ కాకుండా జీవిస్తున్న రోజులివి. అంత సుదీర్ఘ కాలం ఉంటుంది కనుక బ్యాంకుల్లో పూర్తిగా డిపాజిట్ చేయకుండా బ్యాలన్స్ మ్యూచువల్ ఫండ్స్ కు కొంత మళ్లించడం ద్వారా మంచి రాబడిని అందుకుంటారు.

representative image

టీడీఎస్ వద్దనుకుంటే...

వార్షిక ఆదాయం 2.5లక్షల్లోపే ఉంటే పన్ను మినహాయింపు ఉందన్న విషయం తెలిసిందే. ఒకవేళ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం కలిపినా వార్షిక ఆదాయం పన్ను మినహాయింపు పరిధిలోనే ఉందంటే అప్పుడు టీడీఎస్ కోయకుండా ఫామ్ 15హెచ్, 15జీ సమర్పిస్తే సరిపోతుంది. ఇవి డిపాజిట్ దారులే స్వయంగా బ్యాంకుకు వెళ్లి సమర్పించాలి. అంతేకానీ బ్యాంకులు గుర్తు చేయవు. ఇవ్వకపోతే టీడీఎస్ ఖాయం. టీడీఎస్ కోసిన తర్వాత రిటర్నులు దాఖలు చేయడం తప్పనిసరి. 

డిపాజిట్ దారులు గుర్తించుకోవాల్సినవి

బ్యాంకుల్లో లక్ష రూపాయల డిపాజిట్ వరకే ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒకవేళ బ్యాంకు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని చేతులెత్తేస్తే అప్పుడు డిపాజిట్ దారులకు లక్ష రూపాయల వరకే దక్కుతుంది. అంతకు మించి ఎంత డిపాజిట్ చేసినాగానీ రూపాయి తిరిగి రాదు. అందుకే ఒకే బ్యాంకులో లక్ష రూపాయలకు మించి డిపాజిట్ చేయడం కంటే, లక్ష చొప్పున వేరే బ్యాంకుల్లో డిపాజిట్ గా చేసుకోవడం నయం. ఒకవేళ టీడీఎస్ తలనొప్పి ఎందుకు అన్న ఆలోచనతో తన పేరిటే కాకుండా భార్యా పిల్లల పేరుపై కొందరు డిపాజిట్ చేస్తుంటారు. కానీ, బ్యాంకులు వారికి ఏమైనా ఆదాయం ఉందా అని పరిశీలిస్తాయి. లేకుంటే వారి ఆదాయాన్ని సైతం కుటుంబ సంపాదనాపరుడి ఆదాయంలోనే కలిపేసి టీడీఎస్ అమలు చేస్తాయి.

వృద్ధులకు భరోసా...

అయితే, విశ్రాంత జీవితంలో ఉన్న వారికి బ్యాంకు డిపాజిట్లు సురక్షితం. ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదుగా మార్చుకోవచ్చు. లేదా డిపాజిట్ ను రద్దు చేసుకోకుండా దానిపై ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునే సౌలభ్యం ఉంది. అంటే డిపాజిట్ హామీగా ఉంచుకుని ఇచ్చే రుణం. దీనిపై వడ్డీ కూడా డిపాజిట్ పై అమలవుతున్న వడ్డీ రేటుకు అదనంగా 1 నుంచి 2 శాతం వరకు ఉంటుంది. రిటైర్ అయిన వారు నెలనెలా వేతనం రూపంలో ఆదాయం పొందేందుకు పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం, బ్యాంకు డిపాజిట్లు అక్కరకు వస్తాయి. కానీ ఇలా డిపాజిట్లపై వచ్చే ఆదాయాన్ని నమ్ముకున్న వారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. 

రామనాథం గారు ఇటీవలే రిటైరయ్యారు. ఆయన వయసు 60 ఏళ్లు. రిటైర్ మెంట్ సమయంలో వచ్చిన మొత్తంలో నుంచి 5 లక్షల రూపాయలను డిపాజిట్ చేసి దానిపై ప్రతీ నెలా 3000 వేల రూపాయల ఆదాయం అందుకుంటున్నారు. కానీ, రామనాథం గారికి 70, 80 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా బ్యాంకులో ఉన్న డిపాజిట్ మొత్తం అలానే ఉంటుంది. నెలనెలా వచ్చే మొత్తం కూడా పెరగదు. కానీ, అన్నేళ్లలో రూపాయి విలువ ఎంత శాతం తగ్గి ఉంటుందో ఆలోచించండి. నెలనెలా అందుకునే రూ.3వేలల్లో కనీసం వెయ్యి రూపాయలను మంచి ట్రాక్ రికార్డు ఉన్న మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడి పెడుతూ వెళితే తగ్గే రూపాయి విలువకు సమాన స్థాయిలో నగదు మొత్తాన్ని పెంచుకోవడానికి వీలుంటుంది.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy