ap7am logo

మొబైల్ బ్యాంకింగ్ లో ఈ సౌకర్యాల గురించి తెలుసా..?

Fri, May 19, 2017, 02:03 PM
Related Image

సెల్ ఫోన్ ఇప్పుడు అన్ని పనులకు రిమోట్ గా మారింది. స్మార్ట్ ఫోన్ డేటా ఉండాలే గానీ మొబైల్ ఫోన్ తో సాధ్యం కానిది లేదన్న స్థాయిలో టెక్నాలజీ అభివృద్ధి చెందింది. మన దేశంలో మొబైల్ ఫోన్ కనెక్షన్ల సంఖ్య 100 కోట్లు. అందుకే బ్యాంకు సేవలు సైతం నేడు ఫోన్ల ద్వారా అరచేతిలోకి వచ్చేశాయి. సాధారణ ఫోన్ల నుంచి సైతం బ్యాంకు సేవలు అందుకోవడం అన్నది ఎంత సౌకర్యంగా ఉంటుందో ఆలోచించండి. అన్నింటికీ ఆధారం సెల్ ఫోన్ అవుతున్నప్పుడు... మొబైల్ బ్యాంకు సేవల గురించి తప్పకుండా తెలుసుకోవడం అవసరం. 

మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం కోసం ఖాతాదారులు ముందుగా తమ మొబైల్ నంబర్ ను బ్యాంకు శాఖలో రిజిస్టర్ చేయించుకోవాలి. అదే సమయంలో మొబైల్ బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన దరఖాస్తు కూడా చేసుకోవాలి. అప్పుడు మొబైల్ బ్యాంకింగ్ సేవలకు గాను మొబైల్ మనీ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఎంఎంఐడీ) జారీ చేస్తారు. ఇది ఏడంకెలతో ఉంటుంది. అలాగే, మొబైల్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఎంపిన్) ను జారీ చేస్తారు. మొబైల్ బ్యాంకు సేవలకు ఎంపిన్ పాస్ వర్డ్ గా పనిచేస్తుంది. ఇది తప్పుగా మూడు సార్లు ఎంటర్ చేస్తే ఆ రోజుకి మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందకుండా డీయాక్టివేట్ అవుతారు. 

ఎస్ఎంఎస్ బ్యాంకింగ్

ఈ సేవలకు ఎలాంటి అప్లికేషన్, డేటా, జీపీఆర్ఎస్ సదుపాయాలు అవసరం లేదు. సాధారణ మొబైల్ ఫోన్ల నుంచే ఎస్ఎంఎస్ రూపంలో సేవలు పొందవచ్చు. మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ పంపిస్తే అటువైపు నుంచి రిప్లయ్ వస్తుంది. ఆప్షన్లు ఎంచుకోవడం అకౌంట్ సమ్మరీ, బ్యాలన్స్ విచారణలను ఎస్ఎంఎస్ ద్వారా పొందవచ్చు. అలాగే, చెక్ బుక్ రిక్వెస్ట్, మొబైల్ నుంచి మొబైల్ కు నగదు బదిలీ తదితర సదుపాయాలను బ్యాంకులు అందిస్తున్నాయి. ప్రతీ బ్యాంకుకు ఇందుకు సంబంధించిన ప్రత్యేక నంబర్ ఉంటుంది. ఎస్ఎంఎస్ లకు టెలికాం కంపెనీలు టారిఫ్ ప్రకారం చార్జీలు వసూలు చేస్తాయి. బ్యాంకులు కూడా నామమాత్రపు చార్జీలు వసూలు చేస్తున్నాయి. 

representation image

యూఎస్ఎస్ డీ

అన్ స్ట్రక్చర్డ్ సప్లమెంటరీ సర్వీస్ డేటా (యూఎస్ఎస్ డీ) ద్వారా బ్యాంకు సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉన్నాయి. మొబైల్ బ్యాంకింగ్ లో ఇది కూడా భాగం. *111# ఈ విధమైన యూఎస్ఎస్ డీ కోడ్స్ ను మొబైల్ లో టైప్ చేసి కాల్ చేస్తే బ్యాలన్స్, డేటా, రీచార్జ్ ప్యాక్ ల సమాచారం డిస్ ప్లే అవుతుందన్న విషయం చాలా మందికి తెలుసు. ఇదే విధానంలో బ్యాంకు సేవలు కూడా పొందవచ్చు.

ఈ సర్వీసు ద్వారా అకౌంట్ స్టేట్ మెంట్స్, మినీ స్టేట్ మెంట్స్, క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ కోసం రిక్వెస్ట్ పంపవచ్చు. అలాగే, బ్యాలన్స్ వివరాలు, గత ట్రాన్సాక్షన్ వివరాలు కూడా తెలుసుకోవచ్చు. చెక్ బుక్కులు, రుణాలు, స్టాప్ పేమెంట్స్, నగదు బదిలీ, మొబైల్ టాపప్, రీచార్జ్ సేవలు పొందడానికి అవకాశం ఉంది. బ్యాంకుల వైపు నుంచి ఈ సేవలకు చార్జీ లేదు. కానీ, సెల్ ఫోన్ నెట్ వర్క్ ప్రొవైడర్ మాత్రం చార్జ్ చేస్తారు. ఒకసారి లావాదేవీకి 1.50 రూపాయల చార్జీ.

*99#

ఈ కోడ్ తో టైప్ చేసి కాల్ బటన్ ఓకే చేస్తే తర్వాత కొన్ని ఆప్షన్లు వస్తాయి. ఈ ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకుని బ్యాంకు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎస్ బీఐ ఖాతాదారులు అయితే ఎస్ బీఐ అని లేదా బ్రాంచ్ ఐఎఫ్ఎస్ సీ కోడ్ టైప్ చేసి పంపితే తదుపరి ఆప్షన్లు వస్తాయి.

అకౌంట్ బ్యాలన్స్, మినీ స్టేట్ మెంట్, సెండ్ మనీ యూజింగ్ ఎంఎంఐడీ (ఎంఎంఐడీ నంబర్ ఆధారంగా నగదు బదిలీ), సెండ్ మనీ యూజింగ్ ఐఎఫ్ ఎస్ సీ (ఐఎఫ్ఎస్ సీ కోడ్ ఆధారంగా నగదు బదిలీ) ఇంకా మరికొన్ని ఆప్షన్లు కూడా కనిపిస్తాయి. ప్రతి ఆప్షన్ ముందు సీరియల్ నంబర్ ఉంటుంది. సెండ్ మనీ యూజింగ్ ఐఎఫ్ఎస్ సీని ఎంచుకున్నారనుకోండి. అప్పుడు నగదు ఎవరికైతే పంపాలని అనుకుంటున్నారో వారికి సంబంధించిన ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్ సీ, నగదు మొత్తం, మీ ఎంపిన్ టైప్ చేసి ఓకే చేస్తే నగదు బదిలీ జరిగిపోతుంది. ఒకవేళ అవతలి వ్యక్తి కూడా మొబైల్ బ్యాంకింగ్ యూజర్ అయి ఉంటే అప్పుడు అతడి మొబైల్ నంబర్, అతడి ఎంఎంఐడీ టైప్ చేసి ఎంపిన్ ఇవ్వడం ద్వారానూ నగదు బదిలీ చేయవచ్చు.

ఈ విధానంలో ఒకసారి రూ.5వేల వరకు పంపుకోవచ్చు. తెలుగులో ఈ సదుపాయం కోరుకునే వారు *99*24#కి డయల్ చేయాల్సి ఉంటుంది. ఎంఎంఐడీ, ఎంపిన్ ను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. జీఎస్ఎం వినియోగదారులకే ఈ సదుపాయం. డబ్బులు అందుకునేవారు మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం కలిగి ఉండాలనేమీ లేదు. పంపే వారు మొబైల్ బ్యాంకింగ్ యూజర్లు అయి ఉంటే చాలు. 24గంటలు, 365 రోజులూ ఈ సేవ అందుబాటులో ఉంటుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ సేవను అందిస్తున్నాయి. 

representation image

యాప్స్ ఆధారిత బ్యాంకింగ్

స్మార్ట్ ఫోన్ అయి ఉండి, డేటా లేదా వైఫై అందుబాటులో ఉన్న వారు యాప్ ద్వారా కూడా బ్యాంకు సేవలు పొందడం నేడు చాలా సులభంగా మారిపోయింది. యాప్ ద్వారా సేవలు కూడా మొబైల్ బ్యాంకింగ్ కిందకే వస్తాయి. కనుక మొబైల్ బ్యాంకింగ్ యూజర్ గా నమోదు చేసుకోవాలి. ఒకసారి మొబైల్ బ్యాంకింగ్ యూజర్ గా నమోదు చేసుకుంటే అప్పుడు, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, యూఎస్ఎస్ డీ బ్యాంకింగ్, మొబైల్ యాప్ బ్యాంకింగ్, వ్యాప్ ద్వారా సేవలు పొందడానికి వీలవుతుంది. యాప్ ద్వారా అకౌంట్ బ్యాలన్స్, స్టేట్ మెంట్, చెక్ స్టేటస్, స్టాప్ పేమెంట్, అదే బ్యాంకు, లేదా ఇతర బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ, బిల్ పేమెంట్లు, రీచార్జ్ లు, ఇలా ఎన్నో సేవలు పొందవచ్చు. 

వ్యాప్ WAP

జీపీఆర్ ఎస్ సదుపాయం ఉన్న సాధారణ ఫోన్ల నుంచి సైతం వ్యాప్ ఆధారంగా మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. పైన చెప్పుకున్నట్టే అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. జీపీఆర్ఎస్ ఉన్న ఫోన్లలో మొబైల్ వెబ్ సైట్ నుంచి సేవలు అందుకోవచ్చు. 

యూఎస్ఎస్ డీ సేవలను విస్తరించడంపై ట్రాయ్ దృష్టి

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజాగా యూఎస్ఎస్ డీ ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సేవలను విస్తృతం చేసే దిశగా ఉన్న అడ్డంకులను తొలగించే పనిలో ఉంది. ప్రస్తుతం యూఎస్ఎస్ డీ కాల్ చార్జీ ఒకసారికి 1.50 ఉండగా దీన్ని ఎంత వరకు తగ్గించాలి? ఈ చార్జీ కస్టమర్ లేక బ్యాంకులే భరించాలా? అన్న అంశాలను ట్రాయ్ తేల్చనుంది. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy