ap7am logo

అందమైన పెళ్లి వేడుక... అతి తక్కువ బడ్జెట్ లో

Fri, May 19, 2017, 01:54 PM
Related Image

వివాహం ప్రతీ ఒక్కరి జీవితంలో మరపురానిది. ఒక అద్వితీయ వేడుక. అందుకే చాలా మంది పెళ్లి విషయంలో ఆడంబరాలకు పోతుంటారు. వివాహం విషయంలో ఇలా ఎన్నో ఆకాంక్షలతో బడ్జెట్ భారీగా పెరిగిపోతుంది. మరి వ్యయం తక్కువలోనే పెళ్లి వేడుక నిర్వహించే మార్గాలపై దృష్టి సారించాలి.  

ముందుగా కాబోయే దంపతులు పెళ్లి వేడుకకు సంబంధించి కుటుంబ సభ్యులతో కలసి చర్చించాలి. ఆడంబరంగానా, సింపుల్ గానా లేక అన్ని సమపాళ్లలో ఉండాలా?  అన్నది నిర్ణయించాలి. అన్నింటికంటే ముందు బడ్జెట్ ఎంత అనేది ఫిక్స్ చేసుకోవాలి. దీన్ని బట్టి మిగతావి చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. పెళ్లిలో భాగంగా ఏమేమి ఉండాలన్నదానిపై ఓ నిర్ణయానికి వస్తే ఆ వివరాలన్నింటినీ ఓ బుక్ లో నోటు చేసుకుని ఖర్చుపై అంచనాకు రావచ్చు.

representation image

విందు భోజనం 

వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాల వారి విందు అహ్హహ్హ నాకే ముందు అనే పాటలోని సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎస్వీ రంగారావు గారు గది నిండా సిద్ధం చేసిన వంటకాల ముందు తిష్ట వేసి రుచులు చూడడం కనిపిస్తుంది. నిజానికి మన భారతీయుల పెళ్లి వేడుకల్లో విందులు కూడా ఇదే రీతిలో ఉంటాయి. ఒకటా రెండా కాదు... కూరలు, పప్పులు, పులుసులు, పచ్చళ్లు, ఆవకాయ, అప్పడాలు, బజ్జీలు, స్వీట్, గారెలు, పెరుగు, పులిహోర ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో. రోజూ ఇంట్లో మహా అయితే రెండు మూడు వెరైటీలకు మించి తినే అలవాటు ఉండదు. మరి వివాహ విందుకు వచ్చే సరికి ఎందుకు అతివృష్టి. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో ఎక్కువగా ఖర్చు వృధా అయ్యేది ఆహారంపైనే. అందుకే ఇక్కడ కేర్ తీసుకోవాలి.

ముందుగా వివాహ విందులో మాంసాహారం ఆలోచనను పక్కన పెట్టేయండి. ఇక్కడే చాలా ఖర్చు ఆదా అవుతుంది. శాకాహార వంటకాలతో పసందైన రుచులను సిద్ధం చేయించి అతిథులకు కట్టిపడేసే ఆలోచనలకు పదును పెట్టాలి. కమ్మని పప్పు, ఒక కూర, ఒక వేపుడు, రుచికరమైన రసం లేదా సాంబారు, అప్పడాలు లేదా వడియాలు, ఓ పచ్చడి, ఓ స్వీటు లేదా చక్కెర పొంగలి, పెరుగు. రుచిగా, నాణ్యంగా ఉంటే ఇన్ని వంటకాలు చాలు. ఇలా కాకుండా ఒకటికి నాలుగు రకాల కూరలు, రెండు రకాల స్వీట్లు, గారెలు, చివరిలో ఐస్ క్రీమ్స్ ఇలా ఘనంగా ఉండాలన్న ఆలోచనతో గుర్తొచ్చిన ఐటమ్స్ ను చేర్చుకుంటూ వెళితే జాబితా చాంతాడు అవుతుంది. బిల్లు భారంగా మారిపోతుంది.

మెనూ తగ్గించుకోవడం పిసినారితనం ఎంత మాత్రం కాదు. వడ్డించిన 20 వంటకాల్లో ఐదు బావుండి మిగతావి బాగోలేకపోతే... వాటిని వదిలేసి బాగున్న వాటిని లాగించడం మొదలు పెడతారు. దాంతో అవి అయిపోయి తర్వాతి బంతుల్లో కూర్చున్న వారికి బాలేని ఐటమ్స్ పెట్టి వారితో అక్షింతలు వేయించుకోవడం అవసరమా చెప్పండి? అందుకే మెనూ చిన్నగా ఉండాలి. రుచి అమోఘంగా ఉండాలి. ఈ కాన్సెప్ట్ తో అతిథులు సుష్టుగా భోంచేస్తారు. బిల్లు కూడా తక్కువవుతుంది.

ఊరంతా అతిథులే.representation image. పెళ్లికి పెద్దలే!

మనసున్న అతిథులు నేడు ఎంత మంది ఉన్నారంటే అరగంట ఆలోచించి కొద్ది మంది పేర్లే చెప్పగలరు. మరి పెళ్లి అనేసరికి ముఖ పరిచయం ఉన్న వారి దగ్గర్నుంచి దూరపు బంధువుల వరకు ప్రతి ఒక్కరినీ పిలవడం అవసరమా...? పెళ్లంటే జన సందోహంగా ఉండాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ బడ్జెట్ పక్కాగా ఉండాలంటే అతిథుల జాబితాను తప్పకుండా క్లీన్ చేయాలి. బడా, బడా సెలబ్రిటీలే పరిమిత ఆహ్వానితుల మధ్య తమ వివాహ వేడుక జరుపుకుంటున్నారు. ఎందుకో ఆలోచించండి. వందల సంఖ్యలో ఆహ్వానితులు రావడం ఒక ఎత్తు. వారికి అన్ని రకాల మర్యాదలు చేసి, ఆదరించి అతిథి దేవోభవ అంటూ అన్నీ సక్రమంగా అందేలా చూసుకోవడం సాధారణ విషయమేమీ కాదు. పైగా నేడు పెళ్లి వేడుకల్లో ఏర్పాట్ల మధ్య సమన్వయం లోపం సాధారణమైపోయింది. అందుకే ఎక్కువ మందిని పిలిచి అభాసు పాలు కాకూడదు.

కొంత మంది వివాహ వేడుక ఉందంటే స్నేహితులతో రెడీ అయిపోతారు. శుభలేఖలో ఉన్న వధువు, వరుడు, కనీసం వారి కుటుంబ సభ్యులతో పరిచయం లేని వారు కూడా జరగబోయే పెళ్లికి ప్రేక్షకులైపోతారు. వీరంతా అవసరమా...? బంధువులలోనూ దూరపు చుట్టాలను, అంతగా పరిచయం లేని వారిని పిలవాలనే ఆలోచనను పక్కన పెట్టాలి. దగ్గరి బంధువులు, అవసరంలో ఆదుకునే మనసున్న వారు, బెస్ట్ ఫ్రెండ్స్, కెరీర్ పరంగా సహకారాత్మకంగా ఉండేవారికి మాత్రమే ఆహ్వానితుల జాబితాలో చోటు కల్పించాలి. అతిధుల సంఖ్య 100 నుంచి 200 దాటకుండా చూసుకుంటే వచ్చిన వారికి అతిథి సత్కారాలు సరిగ్గా జరిగేలా చూసుకోవచ్చు. ఎక్కువ మంది ఉంటే సందడిగా ఉంటుంది. కానీ గందరగోళం కూడా నెలకొంటుంది.

కోరికలు ఎక్కువైతే.. పొదుపు తప్పదు

వివాహ కార్యక్రమం చిరస్మరణీయంగా మిగిలి పోవాలంటే ఎన్నో అదనపు ఆకర్షణలు, భిన్నమైన అంశాలను జోడించాలని కొందరు భావిస్తుంటారు. వచ్చిన వారికి ఎప్పటికీ నిలిచి ఉండేలా ఓ చిన్న కానుక ఇవ్వాలని అనుకునే వారు కూడా పెరుగుతున్నారు. అయితే, ఇలా మిక్కిలి సంతోషాలను పోగేసుకోవాలంటే బడ్జెట్ పెరుగుతుంది. సినిమాల ప్రభావం కావచ్చు, ప్రత్యక్షంగా చూసిన అనుభవం కావచ్చు... నా పెళ్లి చాలా ఘనంగా జరగాలని కోరుకునే వారు పెరుగుతున్నారు. అలాంటి వారు ముందుగా సంపాదన మొదలు పెట్టిన వెంటనే నెలనెలా కొంత పొదుపు చేస్తూ వెళ్లాలి.

సంపాదన మొదలైన తర్వాత ఎంత లేదన్నా ఏడాది నుంచి మూడేళ్ల వరకు పెళ్లికి ఆగేవారు ఉన్నారు. పెళ్లి కాకముందు జీతంలో చాలా మిగులు ఉంటుంది. అందుకే పెళ్లి కోసం కొంత మొత్తాన్ని పక్కన పెడుతూ వెళితే... పెళ్లి చేసుకునే నాటికి మంచి నిధి సమకూరుతుంది. తల్లి దండ్రుల వైపు నుంచి ఎలానూ సహకారం ఉంటుంది. వాస్తవానికి ఈ బాధ్యతలను తల్లిదండ్రులే చూడడం భారతీయ సంప్రదాయంలో భాగం. కానీ రోజులు మారాయి. నేటి యువతరం పెళ్లి ఖర్చును వారే స్వయంగా భరించే ధోరణి క్రమంగా విస్తరిస్తోంది. దానికి తోడు తల్లిదండ్రుల వైపు నుంచి కూడా ఆర్థిక సహకారం ఉంటుంది కనుక పెళ్లి విషయంలో కలలు నెరవేర్చుకునేందుకు వీలుంటుంది.

representation image

పెళ్లి వేదిక ఎక్కడ?

పెళ్లి బడ్జెట్ లో వేదిక కూడా కీలకమే. ఖరీదైన గార్డెన్లు, ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకుంటే బడ్జెట్ పెరుగుతుంది. దానికి బదులు మీ ఇల్లు పెద్దదిగా ఉంటే అక్కడే ఏర్పాట్లు కానిచ్చేయవచ్చు. లేదంటే దగ్గరి బంధువుల్లో ఎవరికైనా పెద్ద ఇల్లుంటే అక్కడే చేసుకోవచ్చు. లేదంటే కల్యాణ మండపాలు కూడా తక్కువలో వచ్చేవి ఉన్నాయి. చిన్న సైజులో ఉన్న బాంక్వెట్ హాల్ అయినా ఖర్చు తగ్గుతుంది. మనసు పెట్టి ఆలోచిస్తే ఖర్చు తక్కువలోనే మంచి వేదికలను ఎంచుకోవచ్చు.

దగ్గర్లో సాగర తీరం ఉంటే అక్కడ వేదిక ఏర్పాటు చేసుకోవచ్చు. స్కూల్ బిల్డింగ్స్ ఆదివారం, ఇతర సెలవు దినాల్లో మూసి ఉంటాయి. తెలిసిన వారుంటే వాటిని ఒక్కరోజుకు ఇవ్వమని అడగవచ్చు. పది, ఇరవై మందికి మించి పిలుచుకోవద్దనుకుంటే ఆర్యసమాజ్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. గుళ్లు, చర్చ్ లు కూడా ఉన్నాయి.

పెళ్లి, రిసెప్షన్ ఒక్కసారే

రిసెప్షన్ పెట్టుకునేట్టు అయితే వివాహానికి ముందు గానీ, తర్వాత గానీ ఉండాలి. వివాహ వేదికపైనే రిసెప్షన్ కూడా పూర్తి కావాలి. అంతేకానీ, మరో పూట, మరో సారి ఏర్పాట్లతో ఖర్చు పెరుగుతుంది.

ఆఫ్ సీజన్ లో పెళ్లి కలసి వస్తుంది

చూపులు కలిశాయి. మాటలు నచ్చాయి. పెళ్లికి అంగీకారం కుదిరింది. ఇక ఆగమేఘాలపై పెళ్లి జరిగిపోవాలని కోరుకోకండి. నిదానమే ప్రధానం అనే సూత్రం ఇక్కడ పనికివస్తుంది. వెంటనే పెళ్లి అంటే పనులను చాలా వేగంగా చేయాల్సి వస్తుంది. హడావిడిలో తప్పుడు నిర్ణయాలకు అవకాశం ఉంటుంది. 

ముహూర్తాన్ని బట్టి బడ్జెట్ పెరగడం, తరగడం అన్నది కూడా ఉంటుంది. మంచి ముహూర్తం, దానికి తోడు సెలవుదినం, ఎక్కువ పెళ్లిళ్లు అదే రోజు ఉన్నాయనుకోండి. పెళ్లి వేదిక దగ్గర్నుంచి ప్రతి ఒక్కటీ ఖరీదైపోతుంది. హిందూ వివాహం అనుకోండి. వంటవారు, ఫొటో గ్రాఫర్లు, భజంత్రీలు, డెకరేటర్లకు చేతినిండా పని ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వారు ఎక్కువ డిమాండ్ చేస్తారు. అలాగే పెళ్లికి వాహనాల విషయంలోనూ ఎక్కువ ఖర్చు భరించాల్సి వస్తుంది. అందుకే ఉన్న సుముహూర్తాల్లో బడ్జెట్ కు కలసి వచ్చే దాన్ని ఎంచుకోవాలి.  

పెళ్లి ముహూర్తం అనేది చాలా దూరంలో పెట్టుకున్నట్టయితే... ఆఫర్లలో తక్కువకే వస్త్రాలు, ఇతర కొనుగోళ్లు చేసుకోవచ్చు. అలాగే ముందుగా వేదిక బుక్ చేసుకుంటారు కనుక తక్కువకే రావచ్చు. పెళ్లికి అవసరమైన బస్సు లేదా రైలు టికెట్లు ఇలా అన్నింటినీ ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా బడ్జెట్ దాటకుండా చూసుకోవచ్చు. ముహూర్తానికి తక్కువ వ్యవధి ఉంటే ఖర్చుకు వెనుకాడకండా అన్నింటినీ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. వేసవి సహజంగా పెళ్లిళ్ల సీజన్ అని చెప్పుకోవచ్చు. వేసవిలో పూలు చాలా ఖర్చు. ఎండల వేడి ఉంటుంది కనుక అతిథులకు అదనపు వసతులు ఏర్పాటు చేయాల్సిరావచ్చు. అందుకే ఆఫ్ సీజన్ లో పెళ్లిని నిర్ణయించుకోవడం కూడా ఖర్చు తగ్గించుకునే కార్యక్రమంలో భాగమే.

representation image

ఫొటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్ అవసరమా..?

ఫొటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్ ను మాట్లాడుకోవడం వల్ల ఎంత లేదన్నా 20వేలు ఖర్చు చేయక తప్పదు. నేడు డిజిటల్ కెమెరాలు చాలా మంది దగ్గర ఉంటున్నాయి. కనుక ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి ఈ బాధ్యతలు అప్పగిస్తే సంతోషంగా స్వీకరిస్తారు. మీకు ఖర్చు కూడా తగ్గుతుంది. 

వస్త్రాలు

సాధారణ రోజుల్లో కొనే బడ్జెట్ కంటే అధిక ధర వెచ్చించి పెళ్లికి వస్త్రాలు కొనడం సాధారణం. బడ్జెట్ కొంచెం పెరిగితే ఫర్లేదు కానీ మరీ అధికం కాకుండా జాగ్రత్త పడాలి. పెళ్లికి మంచిగా కనిపించాలన్నది ముఖ్యమే. కానీ 1000 రూపాయల షర్ట్ వేశామా... 3వేల రూపాయల షర్ట్ వేశామా? అన్నది ముఖ్యం కాదు. చూడ్డానికి మంచిగా కనిపించాలి. బడ్జెట్ దాటకుండా చూసుకునేందుకు ఆరు డ్రెస్ లు కొనాలనుకుంటే ఐదింటితోనే సరిపెట్టండి.

కానుకలు

పెళ్లికి వచ్చిన వారికి కానుకలు ఇవ్వాలనేమీ లేదు. బహుమతులు తీసుకోకుండా, అదే సమయంలో ఇవ్వకుండా ఉంటే ఏ పేచీ ఉండదు. అనవసరపు గొప్పలు పోవడం వల్ల ఖర్చు పెరిగిపోతుంది. కాదు, బహుమతులు తీసుకోకపోయినా ఇవ్వాల్సిందేనంటే ఓ మొక్కను కానుకగా ఇవ్వండి. దాన్ని ఇంటి ఆవరణలో నాటమని కోరండి. 10 రూపాయల నుంచి 50 రూపాయల్లోపు పెడితే (ఒక్కో దానికి) మంచి మొక్కలే వస్తాయి.

representation image

శుభ లేఖలు

వివాహ ఆహ్వాన పత్రిక చెత్తబుట్ట పాలు అయ్యేదన్న విషయాన్ని గ్రహిస్తే కార్డుల కోసం ఖర్చు చేయడాన్ని మానుకుంటారు. అతిథిగా కార్డు ఇచ్చి వచ్చిన తర్వాత... దాన్ని అపురూపంగా దాచుకునేవారు ఎవరూ లేరు, పెళ్లింటి వారు తప్ప. అందుకే మెయిల్స్, వాట్సాప్ ద్వారా అందమైన కార్డులను అతిథులకు పంపించండి. లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయండి.

ఒకవైపు వివాహ ఆహ్వాన పత్రికగానూ, మరోవైపు వివాహ బహుమతిగానూ రెండూ ఒకేదానిలో కలసి వచ్చే మార్గం ఒకటుంది. మంచి మెలామైన్ ప్లేట్ మధ్య భాగంలో వివాహ ఆహ్వానం, వధువు, వరుడు, పెళ్లి వేదిక, సుముహూర్తం, ఫోన్ నంబర్ ను రాయించి దాన్నే ఆహ్వానపత్రిక, కానుకగా ఇవ్వండి. లేదంటే హ్యాండ్ బ్యాగుపై ఈ వివరాలు ప్రింట్ చేయించి కానుకగా ఇవ్వండి.

వేదిక అలంకరణ

వివాహ వేదికకు పూలతో అలంకరణ అన్నది ఖర్చుతో కూడుకున్నది. దానికి బదులు పేపర్ ఫ్లవర్స్ తో చేయించడం ఖర్చు తక్కువ అవుతుంది. నలుగురిని విచారించి అందంగా, ఖర్చు తక్కువ అలంకరణ దేనితో అవుతుందో తెలుసుకున్న తర్వాతే ఆర్డర్ ఇవ్వండి.

వెడ్డింగ్ ప్లానర్స్

వెడ్డింగ్ ప్లానర్ ను నియమించుకోవడం ఖర్చుతో కూడుకున్నదే. అయితే, వారి వల్ల ఖర్చు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. పెళ్లికి అవసరమైన సకల వస్తువుల్లో ఏది ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందన్న దానిపై వారికి చక్కని అవగాహన ఉంటుంది. ఒకవేళ పెళ్లి బాధ్యతలు చూసేందుకు అనుభవజ్ఞులైన వారుంటే మీరే స్వయంగా ప్లాన్ చేసుకోవచ్చు.

కొనుగోళ్లు... ఆదాలు

పెళ్లికి షెర్వాణీలు, బ్లేజర్లు, సూట్ లు వంటి ఖరీదైన వాటిని తీసుకుంటే అనంతర కాలంలో వాడి వాడకం తక్కువే. వీటిని అద్దెకు ఇచ్చే సంస్థలు కూడా ఉన్నాయి. అలాగే, హోల్ సేల్ ధరలకు ఇచ్చే షాపులు కొన్నుంటాయి. వాటిలో షాపింగ్ చేయడం కలసి వస్తుంది. బంగారం ఆభరణాలు కూడా పరిమితంగా తీసుకోవడం వల్ల వ్యయం తగ్గుతుంది. అందులోనూ ఆఫర్ల సమయంలో, పెళ్లికి ఇంకా  చాలా సమయం ఉన్నా ధర తగ్గితే కొనడం మంచిది.

representation image

వధువు వివాహం అనంతరం ఉద్యోగానికి వెళ్లేట్టు అయితే పెళ్లి కోసం మరీ ఎక్కువ శారీలను తీసుకోకుండా పరిమితంగానే కొనుగోలు చేయాలి. ఎందుకంటే నేటి కాలం యువతులు చీరలు తక్కువగా కడుతున్నారు. ఉద్యోగమా, గృహిణా అన్నదానితో సంబంధం లేకుండానే ఈ ధోరణి కొనసాగుతోంది. కనుక కట్టుకోని వాటిని ఎక్కువగా కొనేయడం వృధానే కదా.  వధూ వరులకు మెహెందీ అలంకరణను ఆర్టిస్ట్ కు బదులు అయిన వారిలో ఏవరో ఒకరితో చేయించుకోవడం వల్ల డబ్బులు ఆదా అవుతాయి. వివాహానికి విచ్చేసిన దగ్గరి బంధువులకు వస్త్ర దానాలు కార్యక్రమం బడ్జెట్ ను పెంచుతుంది. కనుక టైట్ బడ్జెట్ అయితే, బంధువులకు వస్త్ర దానాన్ని జాబితా నుంచి తొలగించండి. ఇక పెళ్లి సందర్భంగా డ్యాన్స్ లు, పాటలు, డీజేలు వంటివి ఖర్చును పెంచేవే.   

కేటరింగ్/బఫే, సెల్ఫ్ కుకింగ్ 

సీజన్ లో పెళ్లి అయితే క్యాటరింగ్ వాళ్లు మరో పెళ్లిలో మిగిలిన వస్తువులను మీకు సర్వ్ చేసే అవకాశం ఉంది. ఆఫ్ సీజన్ లో అయితే మీ కోసమే ఫ్రెష్ గా చేస్తారు. పైగా కొద్ది తక్కువ ధరకు కూడా ఒప్పుకోవచ్చు. క్యాటరింగ్ వాళ్లతో చాలా రకాల సమస్యలు ఉంటాయి. అందుకే తెలిసిన క్యాటరర్ తో లిఖిత పూర్వక అగ్రిమెంట్ చేసుకోవాలి. వంటలు చేస్తున్న సమయంలోనే వాటి రుచులు పరిశీలించి తగిన మార్పులు సూచించేందుకు పెళ్లి రోజున క్యాటరర్ దగ్గరకు ఒకర్ని పంపించాలి.

లేదు, వంటవారిని నియమించుకుని వడ్డించేలా ప్లాన్ చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది. బాగా వంట చేసే మాస్టర్ ను మాట్లాడుకుని వండిన వంటలు వడ్డించే బాధ్యతలను బంధువుల్లోనే కుర్రకారుకి అప్పగించాలి.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy