ap7am logo

ఆన్ లైన్ లో ఆర్డర్ చేశాక తెర వెనుక ఏం జరుగుతుంది?

Sun, May 14, 2017, 12:34 PM
Related Image

నచ్చిన వస్తువును ఆన్ లైన్ లో ఓ క్లిక్ తో కొనే ధోరణి పెరిగిపోతోంది. ఆర్డర్ చేసిన తర్వాత ఒక రోజు నుంచి వారం రోజుల్లో వస్తువు వినియోగదారుడి ఇంటికి చేరుతుంది. కానీ ఆర్డర్ చేసిన దగ్గర్నుంచి ఆ వస్తువును వినియోగదారుడి చేతికి అందించే వరకు తెరవెనుక జరిగే సుదీర్ఘ ప్రక్రియ గురించి మనకు అవగాహన ఉండదు. అందుకే అసలేం జరుగుతుందన్నది తెలుసుకుందాం...

ఆటోమేషన్ ప్రక్రియ

ఓ మీడియా సంస్థ ఫ్లిప్ కార్ట్, అమేజాన్, పలు లాజిస్టిక్ (కొరియర్) కంపెనీల ప్రతినిధులను విచారించి ఈ విషయంలో ఆసక్తికరమైన సమాచారాన్ని రాబట్టింది. కస్టమర్ ఆన్ లైన్ లో ఓ వస్తువును కొనుగోలు చేసిన తర్వాత దాన్ని వినియోగదారుడి చిరునామాకు పంపే వరకు ఎంతో టెక్నాలజీ, మానవ వనరుల కృషి ఉంటుంది. రోబోల సేవలను సైతం వినియోగించుకుంటున్నారు. కస్టమర్ వేగంగా వస్తువు అందుకోవాలనే ఆసక్తితో ఉంటాడు. ఎంత వేగంగా అందిస్తే ఆ కస్టమర్ సంతృప్తితో తిరిగి మరోసారి అదే ఆన్ లైన్ వేదికపై వస్తువు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతాడు. అందుకే ఆర్డర్ చేసిన తర్వాత వేగంగా డెలివరీ చేసేందుకు ఆటోమేషన్ టెక్నాలజీని అమేజాన్, ఫ్లిప్ కార్ట్ తదితర ఈ కామర్స్ సంస్థలు వాడుకుంటున్నాయి. representation image courtesy flipkart

ఉదాహరణకు రవి ఫ్లిప్ కార్ట్ సైటులో మోటరోలా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడని అనుకుందాం. చిరునామాకు సంబంధించిన పిన్ కోడ్ నంబర్ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పిన్ కోడ్ ఆధారంగానే డెలివరీ ప్రక్రియ మొదలవుతుంది. 500001 అనే హైదరాబాద్ పిన్ కోడ్ నుంచి ఆర్డర్ వచ్చిందనుకుంటే... సిస్టమ్ ఈ పిన్ కోడ్ కు దగ్గర్లో ఉన్న కంపెనీ గోదాముల్లో.... ఎక్కడ ఆ మొబైల్ ఫోన్ ఉందో అన్వేషిస్తుంది. ఒకవేళ శంషాబాద్ కు సమీపంలోని గోదాములో ఆ మొబైల్ ఫోన్ ఉంటే వెంటనే అక్కడి నుంచి దాన్ని పంపించేందుకు ఆదేశాలు వెళతాయి. ఒకవేళ హైదరాబాద్ గోదాములో వస్తువు లేదు. పుణె, బెంగళూరు గోదాముల్లో ఉందనుకుంటే... అప్పుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు పంపడం తేలిక కనుక బెంగళూరు గోదాము నుంచి పంపే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

నిమిషాల్లోనే పూర్తి చేస్తారు

కంపెనీ గోదాములు భారీ విస్తీర్ణంలో ( లక్ష నుంచి మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం) ఉంటాయి. వీటిల్లో వస్తువులను గుర్తించేందుకు పికర్స్ ఉంటారు. వీరి చేతుల్లో చిన్న పరికరాలు ఉంటాయి. కంపెనీ నుంచి వచ్చిన నమాచారం మేరకు వస్తువుల పేర్లను ఈ పరికరంలో ఎంటర్ చేయగానే ఆ వస్తువు అతిపెద్ద గోదాములో ఏ షెల్ఫ్ లో ఉన్నదీ, ఎలా వెళ్లాలన్నదీ సూచిస్తుంది. దీంతో నిమిషాల్లోనే ఆ వస్తువును గుర్తించడం పూర్తవుతుంది. ఆ తర్వాత దాన్ని స్కాన్ చేస్తారు. 

కస్టమర్ ఆర్డర్ చేసిన వస్తువు అదేనా? కాదా? సైజు, కలర్ ఇతరత్రా అంశాలను, సైట్ లోని ప్రొడక్ట్ పేజీతో పోల్చి క్షుణంగా పరిశీలిస్తారు. ఓకే అనుకున్న తర్వాత దాన్ని ప్యాక్ చేసి బరువు చూస్తారు. తర్వాత వేర్ హౌస్ కు అనుబంధంగా ఉన్న సెంట్రల్ హబ్ కు పంపిస్తారు. పిన్ కోడ్ ఆధారంగా వాటిని వేరు చేసి రవాణాకు సిద్ధం చేస్తారు. ఈ సేవల కోసం కొన్ని సంస్థలు రోబోలు, కన్వేయర్ బెల్ట్ లును సైతం వినియోగిస్తున్నాయి. ఇక్కడ వాస్తవంలో ఒక్కోసారి ఆర్డర్ చేసిన కలర్ కు బదులుగా వేరొకటి పంపడం కొందరికి అనుభవం అయ్యే ఉంటుంది. కానీ, ఉత్పత్తిని కొనుగోలు చేసేటప్పుడే సైట్ లో నిబంధనలు చూడాలి. కలర్ అన్నది ఏదైనా పంపబడును అని రాసి ఉండవచ్చు. 

representation image

చిరునామా స్పష్టంగా ఉంటేనే...

సెంట్రల్ హబ్ నుంచి వస్తువులను లాజిస్టిక్స్ కంపెనీ నుంచి వచ్చిన సిబ్బంది వాహనంలో తీసుకెళతారు. ఇక్కడ చిరునామా ఎంత స్పష్టంగా ఉంటే డెలివరీ ప్రక్రియ అంత వేగంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంటి డోర్ నంబర్, ఏరియా, సిటీ మాత్రమే ఇవ్వడం కంటే ఇల్లు కరెక్ట్ గా ఏ లొకేషన్ లో ఉంది. ల్యాండ్ మార్క్ తదితర వివరాలు ఇస్తే ఆ ఏరియాను కవర్ చేసే డెలివరీ కేంద్రానికి పంపిస్తారు. లేదంటే సమీపంలోని ఏదో ఒక సెంటర్ కు పంపించడం వల్ల డెలివరీ ఆలస్యం అవుతుంది. లాజిస్టిక్ హబ్ నుంచి దూరాన్ని బట్టి రోడ్డు లేదా వాయు మార్గంలో బట్వాడా చేస్తారు. అక్కడి నుంచి డెలివరీ బోయ్స్ ఆ వస్తువులను తీసుకుని వినియోగదారుడికి ఇంటి వద్దే అందిస్తారు.  

ఒకవేళ సదరు ఫోన్ కంపెనీ గోదాములో లేకుంటే, వేరే విక్రేత దారుడి ద్వారా కస్టమర్ కు అందించేట్టు అయితే, కంపెనీ ఉద్యోగి దాన్ని విక్రయదారుడి నుంచి తీసుకుని డిశ్పాచ్ హబ్ కు తీసుకొస్తాడు. అక్కడ బార్ కోడ్ స్కానింగ్ ద్వారా ఆర్డర్ చేసిన ఉత్పత్తిని క్రాస్ చెక్ చేస్తారు. ఆ తర్వాత పైన చెప్పుకున్నట్టే మిగతా ప్రక్రియ అంతా జరుగుతుంది.

ఆర్డర్ చేసిన రోజే...

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు మూడు నుంచి ఐదు రోజుల్లోపు ఉత్పత్తిని అందించే ప్రయత్నం చేస్తున్నాయి. అదనంగా షిప్పింగ్ చార్జీలు చెల్లిస్తే మరుసటి రోజు వస్తువును అందిస్తామని అమేజాన్, ఫ్లిప్ కార్ట్ హామీ ఇస్తున్నాయి. అమేజాన్ అయితే అదే రోజు డెలివరీ సేవలను కూడా అందిస్తోంది. 200 పట్టణాల్లో ఆదివారాల్లోనూ డెలివరీ చేస్తోంది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లో ఉదయం డెలివరీ సేవలను కూడా ఆఫర్ చేస్తోంది. ఇలాంటి ఆర్డర్లను ఈ కామర్స్ సంస్థల సిబ్బంది అంత్యంత ప్రాధాన్యంతో ముందుగా పంపిణీ చేస్తారు. అంటే సత్వర డెలివరీ కోసం ఒక ఆర్డర్ రాగానే మిగిలిన వాటిని కొద్దిసేపు ఆపైనా సరే ముందు వాటిని గుర్తించి డెలివరీ చేసేందుకు చర్యలు తీసుకుంటారు.  

రోబోల సేవలు

ఇలా గోదాముల్లో వస్తువుల గుర్తింపు, ప్యాకింగ్ సేవల కోసం గాను అమేజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద రోబోటిక్స్ కంపెనీ అయిన కివాను 2012లో కొనుగోలు చేసింది. దీంతో ఈ రోబోటిక్స్ రంగంలోకి మరిన్ని కంపెనీలు ప్రవేశించాయి. ఫ్లిప్ కార్ట్, పెప్పర్ ఫ్రై, జబాంగ్ తోపాటు కొరియర్ సంస్థలు అరామెక్స్, డిటీడీసీ, డెల్హీవరీ లు గ్రే ఆరెంజ్ సంస్థ అభివృద్ధి చేసిన రోబో సేవలను వినియోగించుకుంటున్నాయి. ఈ కామర్స్ సంస్థలు సత్వర బట్వాడాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చర్యలు చేపడుతున్నందున... తమవైపు డెలివరీ సేవలు ఆలస్యం కాకూడదన్న ఆశయంతో లాజిస్టిక్స్ సేవల సంస్థలు సైతం రోబోల వంటి యాంత్రీకరణ చర్యలు చేపట్టడం విశేషం.  

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy