ap7am logo

వాటర్ ప్యూరిఫయర్లలో ఏది మంచిది...? ఏది ఎలా పనిచేస్తుంది?

Thu, Jul 21, 2016, 12:56 PM
Related Image

స్వచ్ఛమైన, పరిశుభ్రమైన నీరు సహజసిద్ధంగా లభించే పరిస్థితి నేడు దాదాపుగా కనిపించడం లేదు. నీటి కాలుష్యం ఎన్నో రకాల వ్యాధులకు కారణమవుతుందన్న విషయం తెలుసు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తమ ఇళ్లల్లో వాటర్ ప్యూరిఫయర్లను వాడుకోవాల్సిన పరిస్థితి. నీటిని శుద్ధి చేసేందుకు ఎన్నో రకాల వాటర్ ప్యూరిఫయర్లు నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎలా పనిచేస్తాయి, ఉపయోగాల గురించి తెలుసుకుంటేనే గానీ తమకు అనువైది ఏదో తెలియదు.

ప్యూరిఫికేషన్ విధానాలు

క్లోరినేషన్ తో నీటిని శుద్ధి చేసి సరఫరా చేసే విధానం చాలా పురపాలక, నగర పాలక సంస్థల్లో ఉంది. క్లోరిన్ వాయువు కలుపగానే హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాయువు విడుదలై సూక్ష్మ జీవులను చంపేస్తుంది. కానీ, క్లోరిన్ కలిపిన నీటిని తాగడం ఆరోగ్యానికి హానికరం.  

యాక్టివేటెడ్ కార్బన్ (బొగ్గు)

బొగ్గుతో నీటిని శుద్ధి చేసుకునే ప్రక్రియ ఈనాటిదేమీ కాదు. ఐదువేల సంవత్సరాల నుంచీ ఉంది. ఆ విధానం నుంచి అభివృద్ధి చేసిందే గ్రాన్యులర్ యాక్టివేటెడ్ కార్బన్ లేదా పౌడర్ బ్లాక్డ్ కార్బన్. యాక్టివేటెడ్ కార్బన్ కిట్ చాలా రకాల ప్రమాదకరమైన రసాయనాలను తొలగిస్తుంది. క్లోరిన్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్, అమ్మోనియా, నాచు, ఇతర పదార్థాలను శుద్ధి చేస్తుంది. కార్బన్ కు ఉండే సూక్ష్మ రంధ్రాలు నీటిలోని పెస్టిసైడ్స్ ను సైతం పట్టేస్తాయి. నీటిలో ఉన్న చెడు వాసనను కూడా తొలగిస్తాయి. ఈ కార్బన్ సెట్ ను నిర్ణీత లీటర్ల శుద్ధీకరణ తర్వాత తొలగించి కొత్తది అమర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, సూక్ష్మ క్రిములు, నైట్రేట్లు, ఫ్లోరైడ్స్ ను ఇది తొలగించలేదు. సీసం, పాదరసం వంటి హెవీ మెటల్స్ ను కూడా ఫిల్టర్ చేయలేదు. సాధారణంగా 0.5 మైక్రాన్ల నుంచి 50 మైక్రాన్ల వరకు ఉన్న కలుషితాలను తొలగిస్తుంది.

మునిసిపల్ వాటర్, రక్షిత నీటి సరఫరా వ్యవస్థల ద్వారా సరఫరా అయ్యే నీటిలో సాధారణంగా టైఫాయిడ్, కలరా, డీసెంట్రీకి కారణమయ్యే సూక్ష్మజీవులు ఉండవు. ఇలాంటి చోట కార్బన్ ఫిల్టర్లు వాడుకోవచ్చు. అదే బావి నీరు, ఇతర మార్గాల ద్వారా లభించే నీటి కోసం కార్బన్ ఫిల్టర్ల కంటే ఆర్వో ఫిల్టర్లు అనువుగా ఉంటాయి. ఎందుకంటే వ్యాధి కారక బ్యాక్టీరియాను కార్బన్ తొలగించలేదు.

representation image

మెంబ్రేన్లు

పలు రకాల వాటర్ ప్యూరిఫయర్లలో నీటిని శుద్ధి చేసేందుకు మెంబ్రేన్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. రివర్స్ ఓస్మోసిస్ (ఆర్వో), మైక్రో ఫిల్టరేషన్ (ఎంఎఫ్), అల్ట్రా ఫిల్టరేషన్ (యూఎఫ్), నానో ఫిల్టరేషన్ (ఎన్ఎఫ్) ప్యూరిఫయర్లలో నీటి శుద్ధి కోసం పలు రకాల మెంబ్రేన్లను ఉపయోగిస్తున్నారు. వీటి మెంబ్రేన్లలోని సూక్ష్మ రంధ్రాల పరిమాణం వేర్వేరుగా ఉంటుంది. అన్నింటి కంటే అతి సూక్ష్మమైన రంధ్రాలున్న మైక్రో పర్మబుల్ మెంబ్రేన్ ను ఆర్వోలో వినియోగిస్తున్నారు. కొబ్బరి చెట్టు వేర్లు భూమిలోని మురికి నీటిని గ్రహించిన తర్వాత వేర్లలో ఉండే సూక్ష్మ పొరల ద్వారా నీరు పరిశుభ్రంగా మారి కొబ్బరిబోండంలోకి చేరుతుంది. ఇదే విధమైన టెక్నాలజీని ప్రస్తుతం మెంబ్రేన్లలో ఉపయోగిస్తున్నారు. అతి సూక్ష్మమైన రంధ్రాలతో కూడిన పలుచటి సింథటిక్ మెంబ్రేన్లను తయారు చేస్తున్నారు.  

రివర్స్ ఓస్మోసిస్ ఫిల్టర్లు (ఆర్వో)

నీటికి ఉన్న సహజసిద్ధమైన లక్షణం తక్కువ గాఢత వైపు నుంచి అధిక గాఢత ఉన్న వైపు నీరు ప్రవహిస్తుంది. దీన్నే ఓస్మోసిస్ ప్రక్రియ అంటారు. నీటి గాఢతను టీడీఎస్ గా పేర్కొంటారు. అదే రివర్స్ ఓస్మోసిస్ విధానంలో నీటిని అధిక గాఢత నుంచి తక్కువ గాఢత వైపు పంపించడం జరుగుతుంది. ఇందుకోసం నీటిని అధిక ఒత్తిడితో ఆర్వో చాంబర్ లోకి పంపుతారు. అంత ఒత్తిడితో పంపినప్పుడే అతి సూక్ష్మమైన రంధ్రాలతో కూడిన మెంబ్రేన్ నీటిని వడగట్టగలదు.

ఆర్వో మెంబ్రేన్ కు ఉండే అతి సూక్ష్మమైన రంధ్రాల నుంచి నీటి కణాలు మాత్రమే మరో వైపునకు వెళతాయి. నీటిలోని మలినాలు, బ్యాక్టీరియా మెంబ్రేన్ దగ్గరే ఆగిపోతాయి. నీటిలో కరిగి ఉన్న రసాయనాలను ఆర్వో వాటర్ ఫిల్టర్ మాత్రమే వడగట్టగలదు. అలాగే, నీటిలో కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్ అయాన్లు ఉంటాయి. ఇవి కనీస మోతాదులో అందితే శరీరానికి ఉపయోగం. ఎక్కువైతే కిడ్నీలో రాళ్లు, ఇతర సమస్యలు వస్తాయి. అందుకే నీటిలో అధిక పరిమాణంలో ఉన్న మినరల్స్ ను తొలగించుకునేందుకు ఆర్వో వాటర్ ప్యూరిఫయర్ ఉపయోగపడుతుంది. అంతేకాదు ఫ్లోరైడ్, సీసం, క్లోరిన్, పురుగుల మందు అవశేషాలు, డిటర్జెంట్, నైట్రేట్లు, సల్ఫేట్లను సైతం ఆర్వో ప్యూరిఫయర్ వడగడుతుంది.

representation image

నీరు టాప్ ద్వారా ఆర్వో వాటర్ ఫిల్టర్ లోకి ప్రవేశించగానే... మెంబ్రేన్ కంటే ముందు ఉండే సెడిమెంట్ పరికరం నీటిలోని బురదను వడగడుతుంది. తర్వాత ఉండే యాక్టివేటెడ్ కార్బన్ బ్లాక్ నీటిలోని క్లోరిన్ తో పాటు మరికొన్ని కాలుష్యాలను అడ్డుకుంటుంది. దాంతో మెంబ్రేన్ పై ఎక్కువ ఒత్తిడి పడదు. ఆ తర్వాత సెమీ పర్మబుల్ మెంబ్రేన్ ద్వారా నీరు శుద్ధి అవుతుంది. ఈ శుద్ధ జలం అక్కడి నుంచి స్టోరేజీ ట్యాంకులోకి చేరుతుంది.

ఈ ప్రక్రియ అంతా అయ్యాక చివరిలో నీటిలో ఇంకేమైనా చెడు వాసన ఉంటే కార్బన్ బ్లాక్ తొలగిస్తుంది. దీంతో శుద్ధి ప్రక్రియ ముగిసినట్టు. శుద్ధ జలంతో స్టోరేజీ ట్యాంకు నిండగానే ఆటోమేటిక్ షటాఫ్ వాల్వ్ ఇక నీటిని ట్యాంకులోకి రాకుండా ఆపుతుంది. మళ్లీ కొంత ఖాళీ ఏర్పడిన వెంటనే శుద్ధి ప్రక్రియ మొదలవుతుంది. మెంబ్రేన్ దగ్గర ఆగిపోయిన మలినాలన్నింటినీ అవుట్ లెట్ పైపు ద్వారా ఆర్వో ఫిల్టర్ ఎప్పటికప్పుడు బయటకు పంపుతూనే ఉంటుంది.

వేటి పరిమాణం ఎంత..?

ఆర్వో ప్యూరిఫయర్ లోని మెంబ్రేన్ లో ఉండే సూక్ష్మ రంధ్రాల పరిమాణం 0.0001 మైక్రాన్లు. నీటిలోని బ్యాక్టీరియా పరిమాణం 0.4 నుంచి 1 మైక్రాన్ల పరిమాణంలో ఉంటుంది. అదే వైరస్ అయితే 0.2 నుంచి 0.4 మైక్రాన్ల పరిమాణంలో ఉంటుంది. నీటిలో ఉప్పు కణాలు 0.0007 మైక్రాన్ల పరిమాణంలో ఉంటాయి. పురుగుల మందు అవశేషాలు మాత్రం 0.001 మైక్రాన్ల సైజులో ఉంటాయి. అంటే దాదాపుగా అన్ని రకాల హానికారకాలను ఆర్వో ప్యూరిఫయర్లు వడగడతాయని అర్థమవుతోంది. చిన్న పరిమాణంలో ఉన్నవాటిని కూడా వడగట్టడం వల్ల వాడుకను బట్టి ఏడాది రెండేళ్లకోసారి మెంబ్రేన్ జీవిత కాలం ముగిసిపోతుంది. అప్పుడు కొత్తదాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా అన్ని రకాల పరిశ్రమల్లోనూ, వాణిజ్య నీటి శుద్ధి కంపెనీల్లోనూ ఆర్వో వాటర్ టెక్నాలజీనే వాడుతున్నారు. ప్రపంచంలో ప్రస్తుతమున్న నీటి శుద్ధి విధానాల్లో ఇదే మెరుగైనది. టీడీఎస్ ఎక్కువగా ఉన్న నీటిని శుద్ధి చేసేందుకు ఇదే అనువైనది.  

ఇవి గమనించాలి...

ఆర్వో ప్యూరిఫయర్ లో అధిక ఒత్తిడితో నీటిని మెంబ్రేన్ ద్వారా పంపేందుకు పంప్ అవసరం అవుతుంది. అందుకోసం విద్యుత్ సౌకర్యం తప్పకుండా ఉండాలి. అలాగే, నీటిలోని మలినాలు, బ్యాక్టీరియా, సాలిడ్స్ ను బయటకు పంపేందుకు ఎక్కువ నీరు తీసుకుంటుంది. ఒక లీటర్ నీటిని శుద్ధి చేసేందుకు దాదాపు రెండు లీటర్ల నీటిని బయటకు పంపిస్తుంది. దీంతో నీటి వృధా ఉంటుంది. ఇవి లైవ్ ప్యూరిఫయర్లు. అంటే సంప్రదాయ వాటర్ ఫిల్టర్లలో పైన చాంబర్ లో నీరు పోస్తే కింద చాంబర్ కు వచ్చే విధానం కాదు. టాప్ నుంచి నేరుగా ఓ పైప్ ను కనెక్ట్ చేయాల్సి ఉంటుంది.

ఏ ఫ్లోర్ లో ఉంటున్నారు?

ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఏ ఫ్లోర్ లో ఉంటున్నారన్నదీ ముఖ్యమే. ఆర్వో వాటర్ ప్యూరిఫయర్లకు 5 నుంచి 40 పీఎస్ఐ (పౌండ్స్ పర్ స్వ్కేవర్ ఇంచ్) ఒత్తిడి అవసరం. పది అడుగుల ఎత్తు 5 పీఎస్ఐతో సమానం. ఉదాహరణకు ఐదంతస్తుల భవనంలో మీరు రెండో అంతస్తులో ఉన్నారనుకోండి. అక్కడి నుంచి 30 అడుగుల ఎత్తులో ఓవర్ హెడ్ ట్యాంకు ఉంది. అప్పుడు 15 పీఎస్ఐ అవుతుంది. ఈ ఒత్తిడి 40 దాటితే దాన్ని తగ్గించేందుకు రెడ్యూసర్ వినియోగించాలి.

representation image

అల్ట్రా వయలెట్ (యూవీ ఫిల్టర్లు) 

ఈ రకం ప్యూరిఫయర్లలో ముఖ్యమైన పరికరం యూవీ లైట్. గుండ్రటి చాంబర్ లో యూవీ లైట్ ఉంటుంది. ఈ చాంబర్ లోకి నీరు ప్రవేశించగానే యూవీ లైట్ ద్వారా (కనీస రేడియేషన్ స్థాయి) కిరణాలు ప్రసారం అవుతాయి. ఈ కిరణాలు సూక్ష్మక్రిములు, వైరస్, బ్యాక్టీరియా కణాల డీఎన్ఏ పై దాడి చేసి చంపేయడం లేదా వాటిని నిర్వీర్యం చేస్తాయి. అన్ని రకాల వ్యాధి కారకాలను ఇది తొలగిస్తుంది. కానీ, రసాయనాలు, రంగు, వాసనను తొలగించలేదు. అంటే సూక్ష్మక్రిములు, వైరస్ మినహా మరే ఇతర కలుషితాలను యూవీ తొలగించలేదు.

అందుకే కొన్ని రకాల కంపెనీలు యూవీ ప్యూరిఫయర్లకు సెడిమెంట్, కార్బన్ ఫిల్టర్లను కూడా అమరుస్తున్నాయి. దీంతో మడ్డితోపాటు కొన్ని రకాల కలుషితాలను తొలగించడానికి వీలవుతుంది. అయినప్పటికీ హెవీ మెటల్స్, ఫ్లోరైడ్ తొలగించలేవు. నీటిలో ఎక్కువ టీడీఎస్ ఉన్నట్లయితే యూవీ వాటర్ ఫిల్టర్లు అనువైనవి కావు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... మురికిగా ఉన్న నీటిని యూవీ చాంబర్ లోకి పంపితే అందులోని బ్యాక్టీరియాను యూవీ కిరణాలు చంపలేవు. ఎందుకంటే బ్యాక్టీరియాను ఇతర పదార్థాలు కప్పి ఉంచుతాయి కనుక. అందుకే యూవీ ఫిల్టర్లలో యూవీ లైట్ చాంబర్ కంటే ముందు సెడిమెంట్, కార్బన్ ఫిల్టర్లు ఉంటాయి.

యూవీ లైట్ 11 వాట్ల నుంచి 60 వాట్ల వరకు విద్యుత్ ను (కెపాసిటీ, కంపెనీని బట్టి) వాడుకుంటుంది. ఈ లైట్ ను ఏడాదికోసారి మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బల్బ్ సామర్థ్యం తగ్గినట్టు మనం గుర్తించలేకపోవచ్చు. అలాంటప్పుడు బ్యాక్టీరియాపై యూవీ కిరణాల దాడి ప్రభావవంతంగా ఉండదు. అందుకే ఏడాదికోసారి మార్చుకోవడం మంచిదని నిపుణుల సూచన. అలాగే, ఫిల్టర్ కాట్రిడ్జ్ ను కూడా నిర్ణీత కాలం తర్వాత మార్చుకోవాలి. ఆర్వో ఫిల్టర్ మాదిరిగానే ఇది కూడా లైవ్ ప్యూరిఫయర్. అంటే టాప్ కు నేరుగా కనెక్ట్ చేస్తే 24 గంటలూ పనిచేసేందుకు సిద్ధంగా ఉంటుంది. పైగా విద్యుత్ ప్రసారం ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఆర్వోలో మాదిరిగా వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియ ఉండదు కనుక నీటి వృధా ఉండదు. దీనికి అమెరికా ఎఫ్ డీఏ ఆమోదం ఉంది. యూవీ ప్యూరిఫయర్ లో నీరు లోపలికి వెళ్లేందుకు ఇన్ లెట్, తర్వాత యూవీ చాంబర్, నీరు బయటకు వెళ్లేందుకు అవుట్ లెట్ ఉంటాయి. యూవీ చాంబర్ లో యూవీ బల్బ్, దానికి స్లీవ్ ఉంటాయి. బల్బ్ కు విద్యుత్ ప్రసారాన్ని నియంత్రించే యూవీ బల్లాస్ట్ కంట్రోలర్ యూనిట్ కూడా ఒకటి ఉంటుంది.  

అల్ట్రా ఫిల్టరేషన్ (యూఎఫ్)

ఇందులోనూ ఆర్వో వలే సెమీ పర్మబుల్ మెంబ్రేన్ ఉంటుంది. అయితే, ఆర్వో మెంబ్రేన్ తో పోలిస్తే అల్ట్రా ఫిల్టరేషన్ (యూఎఫ్) మెంబ్రేన్ రంధ్రాలు పెద్దవిగా 0.01 మైక్రాన్లు ఉంటాయి. కనుక టీడీఎస్ ను తగ్గించలేదు. అయినప్పటికీ బ్యాక్టీరియా, వైరస్ ల పరిమాణం యూఎఫ్ మెంబ్రేన్ లోని రంధ్రాల పరిమాణం కంటే ఎక్కువే. కనుక అన్ని రకాల వ్యాధి కారకాలను నిర్వీర్యం చేస్తుంది. సూక్ష్మ క్రిములు పెట్టిన గుడ్లను కూడా యూఎఫ్ మెంబ్రేన్ తొలగించగలదు. కొన్ని రకాల వాటర్ ప్యూరిఫయర్లలో (ఉదాహరణకు ప్యూర్ ఇట్) బ్యాక్టీరియాను చంపేందుకు క్లోరిన్ వాయువు ఉపయోగిస్తున్నారు. క్లోరిన్ వాయువు బ్యాక్టీరియాను చంపేస్తుంది. కానీ, నీటిలో సూక్ష్మ జీవులు పెట్టిన గుడ్లను క్లోరిన్ నిర్వీర్యం చేయలేదన్న విషయాన్ని తెలుసుకోవాలి.  

యూవీ వాటర్ ప్యూరిఫయర్ లో బ్యాక్టీరియా డీఎన్ఏ కణాలపై దాడి చేసి నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఆ బ్యాక్టీరియా నీటిలోనే ఉండిపోతుంది. కానీ, యూఎఫ్ లో ఉన్న మెంబ్రేన్ బ్యాక్టీరియాను వడగడుతుంది. ఇందులో ఫ్లషింగ్ సిస్టమ్ ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు ప్రెస్ చేయడం ద్వారా మెంబ్రేన్ వడగట్టిన బ్యాక్టీరియా, వైరస్, మడ్డి బయటకు వెళ్లిపోతాయి. రంధ్రాలు పెద్దవిగా ఉంటాయి కనుక నీరు మెంబ్రేన్ నుంచి వెళ్లేందుకు టాప్ నుంచి వచ్చే ప్రెషర్ సరిపోతుంది. కనుక కరెంట్ తో పనిలేదు. పైగా ఆర్వో మాదిరిగా నీటి వృధా ఉండదు. మురికి నీటిని సైతం శుద్ధి చేస్తుంది. దీంతో కాచి వడపోసుకునే పని తప్పుతుంది. పదేళ్ల వరకు నిశ్చింతగా పనిచేస్తుంది. మునిసిపల్, ప్రజా తాగు నీటి సరఫరా వ్యవస్థలు, బావులు, నదీ నీటి శుద్ధి కోసం ఆర్వో వలే యూఎఫ్ కూడా సమర్థవంతమైనది. టీడీఎస్ ను తొలగించకపోవడం ఒక్కటే ఇందులో ఉన్న ప్రధాన ప్రతికూలత.  

నానో ఫిల్టరేషన్ (ఎన్ ఎఫ్)

నానో ప్యూరిఫయర్లలో మెంబ్రేన్ల సూక్ష్మ రంధ్రాల పరిమాణం ఆర్వో మెంబ్రేన్ తో పోలిస్తే పెద్దవిగానే ఉంటాయి. కొన్ని రకాల సాల్ట్స్, హెవీ మెటల్స్ ను, నీటిలో కలిసి ఉన్న హానికారక కెమికల్స్ ను తొలగించగలదు. మోనోవాలంట్ సాల్ట్స్ అయిన సోడియం క్లోరైడ్ ను వడగట్టలేదు. తక్కువ ఒత్తిడితోనూ ఈ ప్యూరిఫయర్ పనిచేస్తుంది. సూక్ష్మ క్రిములు, వైరస్ లను వడగడుతుంది. క్యాల్షియం, మెగ్నీషియం వంటి సాల్ట్స్ ను 60 శాతం వరకు తొలగిస్తుంది. 1000 పీపీఎం లోపు టీడీఎస్ ఉన్న నీటి శుద్ధికి అనువైనది. నీటిలో దుర్వాసన ఉంటే అది కూడా తొలగిపోతుంది. దేశంలో ఆక్వాగార్డ్, టాటా తదితర కంపెనీలు ఈ టెక్నాలజీతో ప్యూరిఫయర్లను విక్రయిస్తున్నాయి. అంతేకాదు, ఆర్వో, యూవీ, యూఎఫ్ టెక్నాలజీలన్నీ ఉన్న ఫిల్టర్లను కెంట్ అందిస్తోంది. కనుక కొనుగోలుకు ముందు అందుబాటులో ఉన్న ఉత్పత్తులు, వాటిలో ఉండే సానుకూలతల సమాచారాన్ని తెలుసుకోవడం సురక్షిత నీటి కోసం తప్పదు.

సిరామిక్ ఫిల్టర్లు

చెక్క పొడి లేదా వడ్ల ఊకను మట్టితో కలిపి సిరామిక్ ఫిల్టర్లను తయారు చేస్తుంటారు. తెల్లగా గుండ్రంగా ఉండే సిరామిక్ ఫిల్టర్ క్యాండిల్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వీటికి ఉంటే అతి సూక్ష్మమైన రంధ్రాలు బ్యాక్టీరియాను కిందికి రాకుండా అడ్డుకుంటాయి. క్లోరిన్, ఈ కొలి బ్యాక్టీరియాను 99 శాతం వరకు అడ్డుకుంటుంది. అయితే, కెమికల్స్ ను మాత్రం వడగట్టలేదు. నీటిని వడగట్టే ప్రక్రియ నిదానంగా ఉంటుంది. గంటకు రెండు నుంచి మూడు లీటర్లు నీటిని మాత్రమే శుద్ధి చేయగలవు. తరచుగా శుభ్రం చేసుకోవాల్సి రావడం ఇబ్బందికరం. దీనివల్ల క్యాండిల్స్ త్వరగా అరిగిపోతుంటాయి. క్యాండిల్స్ పై మడ్డి పేరుకుపోయి ఉంటే నీరు కిందకు దిగదు. 

ఏ ప్యూరిఫయర్ ఎంచుకోవాలి?

ముందుగా నివాసం ఉంటున్న ప్రాంతంలో తాగేందుకు అందుబాటులో ఉన్న నీటిలో ఏ విధమైన కలుషితాలు ఉన్నాయో తెలుసుకుంటే అప్పుడు ఏ ఫిల్టర్ తీసుకోవాలన్నది సులభంగా తెలుస్తుంది. అందుకే నీటి నమూనాలను సమీపంలోని ల్యాబ్ కు తీసుకెళితే అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా అనువైన వాటర్ ఫిల్టర్ ను కొనుగోలు చేసుకోవచ్చు. ఏ ఫిల్టర్ ఏమేమి తొలగిస్తుందో పైన చెప్పుకున్న సమాచారం ఈ విషయంలో తగినంత మార్గదర్శకంగా ఉంటుంది. 

నీటి గాఢత అంటే...?

టీడీఎస్ అంటే నీటిలో ఉండే మినరల్స్, లోహాలు, ఉప్పు మొదలైనవి. నీటిలో కరిగి ఉన్న సాలిడ్స్ ను బట్టి ఆ నీరు మంచి నీరు(సాఫ్ట్) లేక భార జలమా(హార్డ్) అన్నది నిర్ణయిస్తారు. నీటిలో కరిగి ఉన్న మొత్తం సాలిడ్స్ (టీడీఎస్) ను బట్టి ఈ నీరు ఎంత భారమన్నది తెలుస్తుంది. దీన్ని పార్ట్స్ పర్ మిలియన్ (పీపీఎం) గా చెబుతారు. సాఫ్ట్ వాటర్ లో టీడీఎస్ తక్కువగా 150 నుంచి 300 పీపీఎం వరకు ఉంటుంది. భారజలం లేదా కాలుష్యానికి గురైన నీటిలో టీడీఎస్ 500 పీపీఎం కంటే ఎక్కువ ఉంటుంది. నీటిలో టీడీఎస్ ఎంతున్నదీ తెలిపే మీటర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం... టీడీఎస్ 300 ఎంజీ లోపు ఉంటే ఆ నీరు తాగేందుకు అత్యుత్తమం. 300 నుంచి 600 ఎంజీలోపు మంచిదిగాను 600 నుంచి 900 ఎంజీ మధ్య ఉంటే పర్వాలేదు. 900కు మించి ఉంటే ఆ నీరు తాగేందుకు అనువైనది కాదు. 

కాలుష్యాలు...

భూమిపై ఉన్న నీటిలో 80 శాతం కాలుష్యమయమని వాటర్ ఎయిడ్ అనే అంతర్జాతీయ స్వచ్చంద సంస్థ 2015 నివేదిక వెల్లడిస్తోంది. ఇళ్లకు పైపుల ద్వారా సరఫరా అవుతున్న నీటి నమూనాలను దేశవ్యాప్తంగా సేకరించి పరీక్షించి తేల్చిన వాస్తవమిది. భూగర్భ జలం సైతం అధిక కాలుష్యం బారిన పడినట్టు ఎన్నో నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఉండాల్సిన పరిమాణం (1.5పీపీఎం) కంటే ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రాల్లోని 69 జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఈ 15 రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్ మినహా మిగతా రాష్ట్రాల్లోని 73 జిల్లాల్లో లవణ (ఉప్పు) శాతం అధికంగా ఉన్నట్టు తేలింది. అలాగే బిహార్, రాజస్థాన్, త్రిపుర, పశ్చిమబెంగాల్లోని 23 జిల్లాల్లో భూగర్భ జలంలో ఇనుము (0.3 పీపీఎం కంటే) ఎక్కువగా ఉంది. ఏపీ, తెలంగాణ సహా 14 రాష్ట్రాల్లోని 40 జిల్లాల్లో హెవీ మెటల్స్ ఉన్నాయి. 11 రాష్ట్రాల్లోని 95 జిల్లాల్లో నైట్రేట్ పరిమాణం (45 పీపీఎం కంటే) ఎక్కువగా ఉంది.

ఏ నీటిలో ఏమున్నాయి...?

నది నీరు, పైపుల ద్వారా సరఫరా చేసే నీరు బురదగా కనిపించడం గమనించే ఉంటారు. పరీవాహక ప్రాంతాల్లోని మట్టి, ఇసుక కలవడం వల్ల ఇలా కనిపిస్తుంది. కొండ ప్రాంతాల్లో ప్రవహించే నదీ నీటిలో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. బోరుబావులు, సముద్ర నీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. సోడియం, పొటాషియం అనేవి ఈ నీటిలో ఎక్కువగా ఉంటాయి. అలాగే, బోరు బావుల నీటిలో కాల్షియం, మెగ్నీషియం కూడా గుర్తించవచ్చు. ఈ నీటిలో టీడీఎస్ ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు సీసం, ఆర్సెనిక్ వంటి హానికారక కెమికల్స్ ను గుర్తించవచ్చు. అలాగే, సరస్సులు, నదులు, వాన నీటిలో గాఢత తక్కువగా ఉంటుంది. నీరు కలుషితం అయితే బ్యాక్టీరియా ఉంటుంది. నీరు ప్రవాహ గతిలో భూ గర్భం, భూ ఉపరితలంపై ఉండే ఎన్నో ఖనిజాలు, పదార్థాలను తనలో కలుపుకుంటుంది. వీటివల్ల కలిగే నష్టాలు... 

అల్యూమినియం తక్కువ పాళ్లలోనే ఉంది కదా అనుకోవడానికి లేదు. అతి తక్కువ పరిమాణంలో అయినా సరే దీర్ఘకాలం పాటు అల్యూమినియం తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. అల్జీమర్స్ కు దారి తీయవచ్చు. లీటర్ నీటిలో 0.05 నుంచి 0.2 ఎంజీకి మించి అల్యూమినియం ఉండరాదని అమెరికా ఆహార, ఔషధ విభాగం (ఎఫ్ డీఏ) గణాంకాలు చెబుతున్నాయి. ఆర్సెనిక్ ను కేన్సర్ కారకంగా పేర్కొంటారు. ఈ హానికారక లోహం శరీరంలోకి చేరడం వల్ల చర్మం, ప్రసరణ వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉంది. లీటర్ నీటిలో 0.01 ఎంజీకి మించి ఆర్సెనిక్ ఉండడం ప్రమాదకరం.

బెరీలియం కూడా అత్యంత ప్రమాదకరమైన రసాయనం. దీనివల్ల కేన్సర్ వస్తుందని శాస్త్రీయంగా రుజువు అయింది. బేరియం లోహం పరిమితికి మించి తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది. గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది. కడుపులో వికారం, కండరాల బలహీనతకు దారితీస్తుంది. లీటర్ నీటిలో 0.004 మిల్లీగ్రాములకు మించి ఉంటే ఆ నీటిని తాగడం ప్రమాదకరమే. 

బోరాన్ అనేది ప్రత్యేకంగా కొన్ని మొక్కలకు మాత్రమే హానికరం. కాడ్మియం లోహం దీర్ఘకాలం పాటు తక్కువ పాళ్లలో శరీరానికి నీటి ద్వారా అందినా కిడ్నీ వ్యాధులకు దారితీస్తుంది. ఎముకలు పెళుసుబారడం, ఊపిరితిత్తులు పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. లీటర్ నీటిలో బొరాన్ 0.005 ఎంజీకి మించి ఉండరాదు. క్రోమియం పరిమితికి మించి దీర్ఘకాలం పాటు శరీరానికి అందడం వల్ల చర్మం మంటలు, లివర్, కిడ్నీ, నాడీ కణజాలం దెబ్బతినడానికి కారణమవుతుంది. లీటర్ నీటిలో 0.1ఎంజీకి మించి ఉండరాదు. 

కాపర్ ను దీర్ఘకాలం పాటు పరిమితికి మించి తీసుకున్నట్టయితే కడుపులో వికారం, వాంతుల సమస్యలు ఎదురవుతాయి. లీటర్ నీటిలో ఇది 1.3ఎంజీ వరకు ఉండవచ్చు. దంతాలు పుచ్చిపోకుండా ఫ్లోరైడ్ నివారిస్తుంది. అదే సమయంలో పరిమితికి మించి ఫ్లోరైడ్ ను దీర్ఘకాలం పాటు తీసుకోవడం వల్ల  దంతాలపై ఉండే రక్షణ పొర ఎనామిల్ దెబ్బతింటుంది. ఎముకలు పెళుసుబారిపోవడంతోపాటు కీళ్ల నొప్పులు వేధిస్తాయి. లీటర్ నీటిలో 4 ఎంజీకి మించి ఉండడం హానికరం. కలుషిత నీటిలో ఫీకల్ కోలిఫార్మ్ బ్యాక్టీరియా, ఈ కొలి తదితర బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటివల్ల తీవ్ర అనారోగ్యం బారిన పడతారు. కనుక శుద్ధి చేసుకుని నీటిని తాగాల్సి ఉంటుంది. 

క్యాల్షియం ఎముకలు, దంతాలకు అవసరమైన లోహం. నీరు ఉప్పగా మారడంలో క్యాల్షియం పాత్ర కీలకమైనది. పొటాషియం రక్తపోటు తగ్గించడానికి సాయపడుతుంది. అంతేకాదు కిడ్నీలో రాళ్ళ ముప్పును తగ్గించడంతోపాటు ఎముకలు బలహీనం కాకుండా పొటాషియం కాపాడుతుంది. పెద్దలు రోజుకు 4.7 గ్రాముల పొటాషియాన్ని తీసుకోవచ్చు. ఇక ఐరన్ లోహం లీటర్ నీటిలో 0.3ఎంజీ వరకు ఉండవచ్చు. 

లీటర్ నీటిలో సీసం 0.015ఎంజీ వరకు ఉండవచ్చు. ఇది చిన్నారులకు హానికరం. సీసం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీంతో మెదడు సంబంధిత, కిడ్నీ సంబంధిత వ్యాధులు చుట్టుముడతాయి. లిథియం వల్ల వాంతులు, విరేచనాలు, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మెగ్నీషియం లీటర్ నీటిలో 125 ఎంజీకి మించి ఉంటే విరేచనాలకు దారితీస్తుంది. మేంగనీస్ పరిమాణం ఎక్కువైతే చిన్నారులు, తల్లిగా మారాల్సిన వారికి హానికలిగిస్తుంది. లీటర్ నీటిలో 0.05ఎంజీకి మించి ఉండరాదు. మోలిబ్ డెనమ్ మోతాదు నీటిలో ఎక్కువగా ఉంటే కాలేయ పరిమాణం పెరగడంతోపాటు గ్రాస్ట్రో ఇంటెస్టినల్, కిడ్నీ వ్యాధులకు కారణమవుతుంది.  ఇది లీటర్ నీటిలో 0.04ఎంజీకి మించి ఉండరాదు. 

నికెల్ లోహం దీర్ఘకాలం పాటు శరీరానికి అందితే గుండె, లివర్ దెబ్బతినడంతోపాటు శరీర బరువు తగ్గిపోతుంది. లీటర్ నీటిలో 0.1ఎంజీ వరకు ఉండవచ్చు. నైట్రేట్, నైట్రైట్ లు ఆరు నెలల్లోపు శిశువులకు ప్రమాదకరం. సిలీనియం లీటర్ నీటిలో 0.05 ఎంజీ వరకు ఉండవచ్చు. పరిమితి మేరకు తీసుకోవడం వల్ల పోషకంగా ఉపయోగపడుతుంది. కానీ పరిమితికి మించితే దీర్ఘకాలంలో కిడ్నీలు, లివర్, నరాలు, రక్త ప్రసరణ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. 

వెండి లోహం మోతాదుకు మించితే ప్రాణాంతకం అవుతుంది. చర్మం రంగు పాలిపోవడానికి దారి తీస్తుంది. లీటర్ నీటిలో 0.1ఎంజీకి మించి ఉండరాదు. థాలియం దీర్ఘకాలం పాటు శరీరానికి అందితే జుట్టు రాలిపోవడం, లివర్, కిడ్నీ, వృషణాలు దెబ్బతినడానికి కారణమవుతుంది. యురేనియం దీర్ఘకాలంపాటు పరిమితికి మించి తీసుకుంటే కిడ్నీలు పాడవుతాయి. లీటర్ నీటిలో యురేనియం 0.03ఎంజీ వరకు ఉండవచ్చు. జింక్ ఎక్కువ అయితే దీర్ఘకాలంలో రక్తహీనత (అనీమియా)కు దారితీస్తుంది. లీటర్ నీటిలో జింక్ 5ఎంజీ వరకు ఉండవచ్చు.  

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy