ap7am logo

ఇండక్షన్ స్టవ్ ఎలా పనిచేస్తుంది.. దానితో లాభాలేమిటి?

Sun, May 14, 2017, 12:19 PM
Related Image

మంట కనిపించదు.. స్టవ్ వేడెక్కదు.. కానీ స్విచ్ వేస్తే చాలు.. దానిపై ఉన్న పాత్ర, అందులోని పదార్థాలు మాత్రం వేడెక్కుతాయి.. పాత్ర కూడా పెద్దగా కాలదు.. ఆహారం మాత్రం ఉడికిపోతుంది. అదే ‘ఇండక్షన్ స్టవ్’ మాయ. విద్యుత్ తో నడిచే ఈ ఇండక్షన్ స్టవ్ లు వచ్చి చాలా ఏళ్లయినా.. ఇప్పటికీ పెద్దగా ఎవరికీ తెలియదు. సరిగా వినియోగించుకుంటే ఈ ఇండక్షన్ స్టవ్ తో ఎన్నో ఉపయోగాలున్నాయి. మంట, పొగ, అత్యధిక వేడి వంటివి ఉండవు. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లొచ్చు. వృద్ధులు, పిల్లలు కూడా సులభంగా వినియోగించవచ్చు. కరెంటు ఉంటే చాలు. మరి ఈ ఇండక్షన్ స్టవ్ లు ఎలా పనిచేస్తాయి? అవి ఎంత వరకు సురక్షితం? వాటి వల్ల ఏదైనా ప్రమాదం ఉందా?  వీటిని కొనుగోలు చేసే ముందు గమనించాల్సిన అంశాలేమిటి.. వంటి వివరాలను తెలుసుకుందాం...

నేరుగా పాత్రలే వేడెక్కుతాయి..

సాధారణంగా విద్యుత్ స్టవ్ లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు వంటి వాటిలో విద్యుత్ ప్రవాహంతో ఫిలమెంటు లేదా ప్లేటు వేడెక్కి ఉష్ణం విడుదలవుతుంది. దాంతో పాత్రలు వేడెక్కి వాటిల్లోని ఆహార పదార్థాలు ఉడుకుతాయి. కానీ ఇండక్షన్ స్టవ్ ఇందుకు పూర్తి భిన్నంగా పనిచేస్తుంది. ఇండక్షన్ స్టవ్ లో నేరుగా ఎలాంటి వేడి ఉత్పత్తి కాదు. ఫిలమెంట్ లాంటిది వేడెక్కడం, దాన్నుంచి పాత్ర వేడిని గ్రహించడం ఉండదు. నేరుగా ఈ స్టవ్ పై పెట్టిన పాత్ర, అందులోని పదార్థం మాత్రం వేడెక్కుతాయి. దీనికి కారణం విద్యుదయాస్కాంత ప్రేరణ శక్తి.

ఎలా పనిచేస్తుంది?

ఇండక్షన్ స్టవ్ అంతర్భాగంలో ఇండక్షన్ కాయిల్ (రాగి తీగ చుట్ట) ఉంటుంది. అందులో విద్యుత్ ప్రవహించగానే.. దాని చుట్టూ నిర్ణీత ప్రాంతంలో విద్యుదయాస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. దీని ప్రభావానికి లోనయ్యే లోహాలతో చేసిన (ఇనుము, స్టెయిన్ లెస్ స్టీల్ వంటి) పాత్రలను ఆ స్టవ్ పై పెట్టగానే విద్యుదయాస్కాంత శక్తి ప్రభావం మొదలవుతుంది. ఈ ప్రేరణకు లోనైన ప్రాంతం వరకు పాత్రలోని అణువులు విపరీతంగా కంపించి.. నేరుగా పాత్రలోనే వేడి పుడుతుంది. ఇండక్షన్ కాయిల్ లో విద్యుత్ ప్రవాహ స్థాయి పెరిగిన కొద్దీ.. ప్రేరణ శక్తి ఎక్కువై పాత్రలో పుట్టే ఉష్ణం మరింతగా ఎక్కువవుతుంది. అందువల్ల ఇండక్షన్ కాయిల్ కు అందే విద్యుత్ ను నియంత్రించేందుకు ఇండక్షన్ స్టవ్ లో ఏర్పాట్లు ఉంటాయి. దాని ద్వారా స్టవ్ ద్వారా జనించే వేడిని పెంచుకోవడం తగ్గించుకోవడం చేయవచ్చు.

ఇండక్షన్ స్టవ్ పనితీరును ఈ వీడియోలో చూడొచ్చు


ఇనుము, స్టీలు పాత్రలు ఉండాల్సిందే..

మనం ఇళ్లలో సాధారణంగా వినియోగించే అల్యూమినియం వంట పాత్రలు ఇండక్షన్ స్టవ్ లపై పనిచేయవు. అందువల్ల తప్పనిసరిగా ఇనుము, స్టెయిన్ లెస్ స్టీలు పాత్రలు ఉపయోగించాల్సిందే. కొంత కాలంగా మార్కెట్లోకి ఇండక్షన్ బేస్ వంట పాత్రలు ప్రవేశించాయి. స్టీలుతో పాటు అల్యూమినియం, రాగి పాత్రలకు కూడా అడుగున ఫెర్రో మాగ్నటిక్ ప్లేట్లు అమర్చిన అలాంటి పాత్రలు ఇండక్షన్ స్టవ్ లపై బాగా పనిచేస్తాయి. ఇండక్షన్ స్టవ్ లపై వినియోగించుకునే పాత్రల అడుగుభాగం సమతలం (ఫ్లాట్)గా ఉండాలి. ఎందువల్ల అంటే ఇండక్షన్ స్టవ్ ఉపరితలంపై కేవలం ఒకటి రెండు సెంటీ మీటర్ల వరకే విద్యుదయాస్కాంత ప్రేరణ ప్రభావం చూపేలా తయారయి ఉంటాయి. పాత్ర అడుగుభాగం సమతలంగా ఉంటే ఎక్కువ భాగంలో వేడి ఉత్పన్నమై.. విద్యుత్ వృథా కాకుండా ఉంటుంది. స్టవ్ పై ఉన్న పింగాణీ పలకపై గుండ్రంగా కొంత ప్రదేశం (కుకింగ్ జోన్) మార్క్ చేసి ఉంటుంది. ఆ ప్రదేశం వరకే విద్యుదయాస్కాంత ప్రేరణ ఉంటుందన్న మాట. పాత్రలను ఆ భాగంలోనే మధ్యలో పెట్టాలి.

ఇండక్షన్ స్టవ్ లతో చాలా ప్రయోజనాలు 

 • ఇండక్షన్ స్టవ్ లపై వంట చాలా త్వరగా అవుతుంది. నీళ్లు కాచుకోవడం వంటివి కూడా వేగంగా చేసుకోవచ్చు. ఎల్పీజీ స్టవ్ లకన్నా వేగంగా వేడి ఉత్పత్తి అవుతుంది.
 • స్టవ్ పై వివిధ రకాల వంటకాలకు సంబంధించి ప్రీసెట్ ఆప్షన్లు ఉంటాయి. కేవలం ఒక బటన్ నొక్కితే చాలు. లేదా మనకు అవసరమైనంత వరకు వేడి పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి ఆప్షన్లు ఉంటాయి. అంతేకాదు ఎంతసేపు వేడి అందాలో కూడా టైమర్ ద్వారా సెట్ చేసుకోవచ్చు.
 • స్టవ్ పై నుంచి పాత్రను తీసివేయగానే దానంతట అదే స్టవ్ ఆగిపోతుంది. మళ్లీ పాత్రను పెట్టగానే ఆన్ అవుతుంది. అంటే ఆఫ్ చేయడం మర్చిపోయినా సమస్యేమీ ఉండదు. అందువల్ల ఈ స్టవ్ ల నిర్వహణ చాలా సులభం. కొద్దిగా అవగాహన ఉంటే వృద్ధులు, పిల్లలు, శారీరక లోపాలు ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా దీనిని వినియోగించుకోవచ్చు.
 • స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడు పొరపాటున ప్లాస్టిక్, ఫైబర్ వంటి వస్తువులు, పాత్రలేమైనా స్టవ్ పై పెట్టినా ఏమీ కాదు. వాటికి వేడి తగలదు కూడా.
 • మంట వంటిదేమీ ఉండకపోవడం వల్ల వంట గదిలో సీలింగ్ ఫ్యాన్ వంటిది పెట్టుకుని మరీ వంట చేసుకోవచ్చు.
 • స్టవ్ ను శుభ్రపరచడం వంటివి చాలా సులువు. కేవలం కొన్ని నీళ్లు చల్లి తుడిచివేస్తే చాలు.
 • ఇండక్షన్ స్టవ్ ల కారణంగా వంట గదిలో వేడి ఉండదు. ఎందుకంటే స్టవ్ లోంచి నేరుగా వేడి ఉత్పత్తి కాదు.. కేవలం వంట పాత్రలో, అదీ పాత్ర అడుగుభాగంలోనే వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడి మొత్తం ఆహారం ఉడికేందుకే వినియోగమవుతుంది.
 • దీనిని సులభంగా ఎక్కడికైనా తీసుకువెళ్లి వినియోగించుకోవచ్చు. కేవలం కరెంటు ఉంటే చాలు.
 • ఇండక్షన్ స్టవ్ ల విద్యుత్ వినియోగ సామర్థ్యం చాలా ఎక్కువ. అయినా వంట వేగంగా అవుతుంది, వేడి వృథా కాకుండా ఆహారం ఉడకడానికే వినియోగమవుతుంది కాబట్టి ఇతర ఇంధనాలతో పోలిస్తే ఇది చవకే.
 • ఇండక్షన్ స్టవ్ ల ధరలు కూడా తక్కువే. 1500 వాట్ల సామర్థ్యమున్న స్టవ్ లు కేవలం రూ.2,000 నుంచి లభిస్తాయి. 2000 వాట్ల సామర్థ్యమున్నవి రూ.3,500 వరకు ఉంటాయి.
 • ఇండక్షన్ స్టవ్ లను గంట సేపు పూర్తి స్థాయిలో వినియోగిస్తే.. సుమారు ఒక యూనిట్ నుంచి ఒకటిన్నర యూనిట్ వరకు విద్యుత్ ఖర్చవుతుంది. అయితే ఆ లోపే వంట పూర్తవుతుంది కూడా.
 • ఈ స్టవ్ లతో ఉన్న లాభాలను దృష్టిలో ఉంచుకుని పెద్ద పెద్ద హోటళ్లు, స్కూళ్ల వంటివి వీటిని వినియోగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో నగరాల్లో చాలా వరకు ఇళ్లలో ఇండక్షన్ స్టవ్ లు ఉంటున్నాయి.

చిన్న చిన్న సమస్యలూ ఉన్నాయి..

 • కరెంటు కోతల సమయంలో దీనిని వినియోగించుకోలేకపోవడం పెద్ద సమస్య.
 • మంట మీద నేరుగా కాల్చుతూ చేసే రకం వంటకాలు దీనిపై వండుకోలేం.
 • ఇండక్షన్ స్టవ్ ను వినియోగించేటప్పుడు అందులోని సర్క్యూట్లను చల్లబరిచే ఫ్యాన్ వల్ల, కాయిల్స్ లో విద్యుత్ ప్రవాహం వల్ల ఓ మోస్తరుగా ధ్వని వస్తుంటుంది. వేడి స్థాయిని పెంచేకొద్దీ అది ఎక్కువవుతుంది. దీంతోపాటు స్టవ్ మీద పెట్టే వంట పాత్రలు కంపిస్తుంటాయి. ఇవి కొంత చికాకు పరిచే అంశాలు.
 • ఇండక్షన్ స్టవ్ పై మార్క్ చేసి ఉన్న ప్రాంతం కన్నా చిన్న పాత్రలు ఉపయోగించినా.. ఏదో ఒక పక్కన భాగంపైనే పెట్టినా.. మిగతా ప్రాంతం నుంచి విడుదలయ్యే విద్యుదయాస్కాంత శక్తి, దాన్ని ఉత్పత్తి చేసేందుకయ్యే విద్యుత్ రెండూ వృథా అవుతాయి.
 • ఇండక్షన్ కుక్కర్ కొనుగోలు చేస్తే ఇప్పటికే మన ఇళ్లలో ఉన్న వంట పాత్రలను వినియోగించుకోలేం. దానికి తగినట్లు కొత్తవి కొనాల్సిందే.

అసలు ఇండక్షన్ స్టవ్ సూత్రం ఏమిటి?

‘తీగల్లో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు.. వాటి చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఆ అయస్కాంత క్షేత్రం పరిధిలోకి వచ్చిన ఫెర్రో మాగ్నటిక్ (అయస్కాంతం చేత ఆకర్షింపబడే ఇనుము, నికెల్ తదితర లోహాలు) పదార్థాల్లో ప్రేరణ కలిగి... వాటిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. కానీ ఈ లోహాల్లో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు.. వాటి నిరోధకత వల్ల అణువులు కంపించి, ఉష్ణం విడుదలవుతుంది...’’ ఇలా భౌతికశాస్త్రంలో అత్యంత సాధారణమైన, సరళమైన సూత్రాలపై ఆధారపడి ఇండక్షన్ స్టవ్ పనిచేస్తుంది.

- ఇండక్షన్ స్టవ్ లోపల విద్యుత్ నిరోధక పూత పూసిన రాగి తీగ చుట్ట ఉంటుంది. దానిలో విద్యుత్ ప్రసారమైనప్పుడు తన చుట్టూ విద్యుదయాస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఆ క్షేత్రం పరిధిలోకి ఫెర్రో మాగ్నటిక్ పదార్థాలు ( స్టీలు వంట పాత్ర) ప్రవేశించినప్పుడు.. ప్రేరణ ద్వారా అతి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న విద్యుత్ (ఎడ్డీ కరెంట్) ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల పాత్రలోని కణాలు కంపించి.. ఉష్ణం పుడుతుంది. ఆ వేడితో పాత్రలోని ఆహార పదార్థాలు ఉడుకుతాయి.

కొనే ముందు ఇవి పరిశీలించండి

 • మంచి కంపెనీకి చెందిన ఇండక్షన్ స్టవ్ ను కొనుగోలు చేయడం మేలు. నాసిరకం కంపెనీల స్టవ్ లు విద్యుత్ ను చాలా ఎక్కువగా వినియోగించుకుంటాయి. అంతేగాకుండా వాటి విద్యుదయాస్కాంత పరిధి పరిమితికి మించి ఉండే అవకాశం ఉంటుంది.
 • కుకింగ్ జోన్ లో పెట్టే వంట పాత్ర పరిమాణాన్ని గ్రహించి విద్యుదయాస్కాంత క్షేత్రాన్ని దానికి అనుగుణంగా తగ్గించుకునే టెక్నాలజీ ఉన్న ఇండక్షన్ స్టవ్ లు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. కానీ వీటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.
 • ఇండక్షన్ స్టవ్ ల విద్యుత్ వినియోగ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. పూర్తిస్థాయి వేడి కోసం వినియోగించినప్పుడు ఇవి 3,500 నుంచి 4,000 వాట్ల విద్యుత్ ను వినియోగించుకుంటాయి. అందువల్ల మీ అవసరానికి తగిన దానిని ఎంపిక చేసుకోండి.
 • ఇండక్షన్ స్టవ్ లకు మరమ్మతులు రావడం చాలా తక్కువ. అయినా ఎక్కువ కాలం వారెంటీ ఇచ్చే కంపెనీ స్టవ్ ను ఎంచుకోండి.

వినియోగంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు..

 • ఇండక్షన్ స్టవ్ వల్ల సాధారణంగా ఎటువంటి సమస్యలూ ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. సరిగా వినియోగించకుంటే మాత్రం విద్యుత్ వినియోగం బాగా పెరుగుతుంది.
 • పేస్ మేకర్, సీఆర్టీ వంటి పరికరాలు అమర్చుకున్న వారు మాత్రం ఇండక్షన్ స్టవ్ లకు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ స్టవ్ ల నుంచి ఉత్పత్తయ్యే విద్యుదయాస్కాంత శక్తి ప్రభావానికి ఆ పరికరాలు లోనయ్యే ప్రమాదం ఉంటుంది.
 • ఇండక్షన్ స్టవ్ పై ఉండే నిర్ణీత వృత్తాకార ప్రాంతం (కుకింగ్ జోన్)లో వంట పాత్రలు ఉంచాలి. ఆ ప్రాంతంతో సమానంగా ఉన్న లేదా ఇంకా వెడల్పయిన పాత్రలను వాడడం మేలు. చిన్న పాత్రలు వీలైనంత వరకు వినియోగించవద్దు.
 • వంట పాత్రల అడుగుభాగం వీలైనంత వరకూ సమతలంగా ఉండేలా చూసుకోవాలి.
 • వంట చేస్తున్నప్పుడు ఆహారాన్ని కలపడానికి లోహపు చెంచాలకు బదులుగా ఫైబర్, చెక్కతో చేసినవి  వినియోగించడం మంచిది. దీనివల్ల పాత్రలో ఉత్పత్తయ్యే స్వల్పస్థాయి విద్యుత్ మన శరీరానికి చేరే అవకాశం ఉండదు.
 • ఇండక్షన్ స్టవ్ ల పైభాగంలో పింగాణీ గాజు మిశ్రమంతో కూడిన పలక అమర్చబడి ఉంటుంది. వేడిని తట్టుకోవడానికి, రక్షణ కోసమే ఈ ఏర్పాటు. దానిపై బలంగా కొట్టడం, పాత్రలను పడేయడం వంటివి చేస్తే అది పగిలే అవకాశం ఉంటుంది. ఇందులో పగుళ్లు లేకుండా చూసుకోవాలి.
 • ఇండక్షన్ స్టవ్ పైభాగం దాదాపుగా నీరు లోపలికి వెళ్లకుండా మూసేసి ఉంటుంది. కానీ అడుగు, పక్క భాగాల నుంచి నీళ్లు లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి.
 • విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గుల వల్ల స్టవ్ లోని పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.


X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy