ap7am logo

మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలుకు ఎన్నో మార్గాలు

Mon, Jun 13, 2016, 05:18 PM
Related Image

నెలకు కేవలం వెయ్యి రూపాయల పొదుపుతో కోటి రూపాయల సంపదకు యజమాని అయ్యే అవకాశం కేవలం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వల్లే సాధ్యం. 20 ఏళ్ల వయసు నుంచి నెలకు వెయ్యి రూపాయల చొప్పున 60 ఏళ్ల వరకు పొదుపు చేస్తూ వెళితే... సగటున 12 శాతం వార్షిక వృద్ధి అంచనా ప్రకారం సమకూరే నిధి 1,17,64,773 రూపాయలు. అందుకే ప్రతీ ఒక్కరి జీవితంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు తప్పక చోటు ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఎన్నో రకాలు ఉన్నట్టే... వాటి కొనుగోలుకు ఎన్నో మార్గాలున్నాయి. అందుకే ఇన్వెస్ట్ మెంట్ ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని తెలుసుకోవడం చాలా ఉపయోగకరం. 

మ్యూచువల్ ఫండ్స్ విషయంలో మన దేశంలో ఏటేటా అవగాహన విస్తృతమవుతోంది. ఫలితంగా పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయి. ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను తమ ఆర్థిక ప్రణాళికలో భాగం చేసుకుంటున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 59 లక్షల మంది కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ప్రారంభించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 22 లక్షలుగానే ఉంది.

ఏజెంట్లు లేదా బ్రోకర్లు

మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలుకు ముందు నుంచీ ఉన్న మార్గం. ఏజెంట్ కు కాల్ చేయడమే ఆలస్యం ఇంటికే పత్రాలు తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకుని, కేవైసీ డాక్యుమెంట్లు, డీడీ తీసుకుని వెళ్లిపోతాడు. ఇదంతా ఎందుకు చేస్తాడనుకుంటున్నారా...? అతడికి కంపెనీ కమీషన్ చెల్లిస్తుంది. దీర్ఘకాలంపాటు అలా పొదుపు చేస్తూ వెళితే ఇన్సూరెన్స్ ఏజెంట్ కంటే మ్యూచువల్ ఫండ్ ఏజెంటుకే ఎక్కువ కమీషన్ లభిస్తుంది. కష్టార్జితం మీది.. లాభార్జితం అతడిది అన్నమాట.

కానీ, ఉచితంగా ఏదీ రాదన్న విషయం తెలుసు కదా. సరైన పథకం ఎంపిక చేసుకునే విషయంలో విలువైన సలహాలు ఇచ్చే ఏజెంటు అయితే నిక్షేపంలా అతడి ద్వారానే కొనుగోలు చేయడం మంచిది. కొత్తగా పెట్టుబడులు ప్రారంభించే వారు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏజెంటు లేదా బ్రోకర్ సేవలను పొందడం మంచి నిర్ణయమే. అయితే, ఆ ఏజెంటు కేవలం అప్లికేషన్ పూర్తి చేయించుకుని అన్ని పత్రాలను వెంట తీసుకెళ్లే డెలివరీ బోయ్ గానే పనిచేస్తే ఉపయోగం లేనట్టే. అన్ని పథకాల గురించిన సమాచారం తెలుసుకున్న ఏజెంటు అయి ఉంటే మంచి సేవలు అందించగలడు.  

ఏఎంసీ వెబ్ సైట్లు

మ్యూచువల్ ఫండ్స్ ను నిర్వహించే కంపెనీలను అస్సెట్ మేనేజ్ మెంట్ కంపెనీ (ఏఎంసీ)లు అంటారు. ప్రతీ ఏఎంసీ కూడా తన వెబ్ సైట్ ద్వారా పథకాల్లో పెట్టుబడులకు అవకాశం కల్పిస్తోంది. సేవలు ఉచితమే. అయితే, మొదటి సారి ఓ ఏఎంసీకి చెందిన మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు ఆ కంపెనీ కార్యాలయం లేదా కలెక్షన్ సెంటర్ కు వెళ్లి దరఖాస్తును సమర్పించాలి. దాంతోపాటు కేవైసీ పత్రాలు, చెక్, పాన్ కార్డు కాపీ తదితర పత్రాలను సమర్పించాలి. ఆ తర్వాత ఫోలియే నంబర్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ జారీ చేస్తారు. ఆ తర్వాత నెలనెలా ఏఎంసీ వెబ్ సైట్ ద్వారానే పెట్టుబడులు పెట్టవచ్చు. 

ఈసీఎస్ ఇస్తే నెలనెలా బ్యాంకు ఖాతా నుంచి వాయిదా మొత్తాన్ని డెబిట్ చేసుకుంటారు. ఇలా కాకుండా మరో ఏఎంసీ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మళ్లీ ఆ కంపెనీ వెబ్ సైట్ కు వెళ్లి పైన చెప్పుకున్నట్టే కేవైసీ తప్ప అన్నీ పూర్తి చేయాలి. ఇదంతా కొద్ది శ్రమతో కూడిన కార్యక్రమమే. పైగా ప్రతీ ఏఎంసీ ఫోలియో నంబర్, పిన్ గుర్తు పెట్టుకోవడం కూడా కష్టమే. మొదటి సారి ఇన్వెస్టర్ అయితే, కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనల మేరకు అన్ని రకాల వివరాలు, పత్రాలు అందించాల్సి ఉంటుంది. ఒకసారి ఏదేనీ ఏఎంసీ సంస్థకు కేవైసీ సమర్పించి ఉంటే ఆ తరువాత ప్రతీ ఫండ్ హౌస్ వద్ద కేవైసీ నిబంధనలు పూర్తి చేసే పని తప్పుతుంది. 

స్వతంత్ర వెబ్ సైట్లు

ఫండ్స్ ఇండియా, జిప్ సిప్, ఫండ్స్ సూపర్ మార్ట్ ఇలా తటస్థ వేదికలు కూడా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఏ ఏఎంసీ పథకంలోనయినా ఒకే ఖాతాతో పెట్టుబడులు పెట్టుకునే సౌలభ్యం వీటి సొంతం. పెట్టుబడుల వివరాలన్నీ ఒకే చోట ఉంటాయి. ఏ పథకంలో ఎన్ని యూనిట్లు ఉన్నాయి, వాటి విలువ ఎంత తదితర వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. కానీ, ఇవి డైరెక్ట్ ప్లాన్స్ కావు. రెగ్యులర్ ప్లాన్స్. అంటే వీటిలో పెట్టే పెట్టుబడులపై మధ్య వర్తిత్వపు కంపెనీలకు ఏఎంసీ కంపెనీలు కొంత కమీషన్ ను ముట్టచెబుతాయి. దీర్ఘకాలంలో అందుకునే ప్రతిఫలంలో డైరెక్ట్ ప్లాన్స్ తో పోలిస్తే రెగ్యులర్ ప్లాన్స్ లో అందుకునే మొత్తంలో స్వల్ప తేడా ఉంటుంది. కానీ, పెట్టుబడుల పరంగా ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి. 

ఉదాహరణకు ఫండ్స్ ఇండియాలో ఒక్కసారి ఇన్వెస్టర్ గా ఆన్ లైన్ లో నమోదు చేసుకుని కేవైసీ, పాన్ కార్డు వివరాలు, పత్రాలు అన్నీ సమర్పించి ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ పథకంలో కావాలంటే ఆ పథకంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. లేదా తమ ఖాతాలో ఉన్న ఫండ్ యూనిట్లను విక్రయించుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ పథకాల్లో మంచి రాబడులను ఇస్తున్న పథకాల గురించి తెలుసుకోవచ్చు. కాకపోతే ఈ స్వతంత్ర పోర్టళ్లతో ఒప్పందం ఉన్న బ్యాంకులో ఖాతా కలిగి ఉండాలి. అప్పుడే నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీల నిర్వహణకు వీలవుతుంది. ఫండ్స్ ఇండియా వంటి వెబ్ సైట్లలో ఖాతా ఉంటే కంపెనీల బాండ్లు, ఎఫ్ డీలు, ఎన్ పీ ఎస్, ట్రేడింగ్, డీమ్యాట్ వంటి అన్ని రకాల పెట్టుబడులకు వీలుంది. అంటే ఒకే ఖాతా ద్వారా పెట్టుబడులన్నింటినీ నిర్వహించుకోవచ్చు.

బ్రోకర్ల ద్వారా ఆన్ లైన్ విధానంలో...

స్టాక్ మార్కెట్లలో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు గాను బ్రోకర్ల దగ్గర ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ కలిగి ఉన్న వారు మ్యూచువల్ ఫండ్స్ లోనూ పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్, షేర్ ఖాన్, జెరోదా, ఇండియా ఇన్ఫోలైన్ తదితర కంపెనీలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ విధానంలోనూ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం సౌకర్యంగానే ఉంటుంది. ఆయా షేర్ బ్రోకర్ల వెబ్ సైట్లలో లాగిన్ అయ్యి స్కీమ్ ను ఎంచుకుని ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఆ మేర వివరాలను నమోదు చేసి ఓకే చేస్తే సరిపోతుంది. ట్రేడింగ్ ఖాతాలో నగదు నిల్వలు ఉంటే అందులోంచి డెబిట్ అవుతుంది. లేదా బ్యాంకు ఖాతా ద్వారా ఫండ్స్ ను ట్రేడింగ్ ఖాతాకు బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి ఏకమొత్తంలో పెట్టుబడి మాత్రమే కాదు, నెల నెలా ఏదేనీ పథకంలో సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ (సిప్) విధానంలో పెట్టుబడి పెట్టాలనుకున్నా వీటి ద్వారా ఆ సౌకర్యం ఉంది.

ఉదాహరణకు జెరోదా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా ఓ ఆన్ లైన్ వేదిక (https://mf.zerodha.com/) ఏర్పాటు చేసింది. జెరోదా ట్రేడింగ్, డీ మ్యాట్ ఖాతా కలిగి ఉన్న వారు ఇందులో సులభంగా లాగిన్ అయ్యి నచ్చిన పథకాన్ని ఎంపిక చేసుకుని పెట్టుబడి పెట్టవచ్చు. ఓ పథకంలో సిప్ విధానంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే సిప్ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. ఓ పథకంలో ఆరు నెలలు పెట్టుబడి పెట్టాలనుకున్నారనుకోండి. నెలనెలా ఎంత మొత్తం, ఏ తేదీ, ఎన్ని నెలలు తదితర  వివరాలు ఇవ్వాలి. దాంతో నెలనెలా నిర్ణీత తేదీ నాటికి ట్రేడిండ్ ఖాతాలో నగదు నిల్వలు ఉంటే ఆ మేరకు డెబిట్ చేసి సిప్ కు మళ్లిస్తారు. ఎప్పుడైనా సరే నమోదు చేసి ఉన్న సిప్ లను మోడిఫై చేసుకోవచ్చు. కేవలం మూడు నెలలు చాలు అనుకుంటే ఆ మేరకు ఎడిట్ చేసుకోవాలి. 

కొనుగోలు చేసిన మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లన్నీ కూడా డీమ్యాట్ ఖాతాకు బదిలీ అవుతాయి. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లన్నీ కూడా డీమ్యాట్ ఖాతా స్టేట్ మెంట్ లో ఒకే చోట చూసుకోవచ్చు. కొన్ని కొనుగోలు, అమ్మకం సమయంలో చార్జీ వసూలు చేస్తుండగా... జెరోదా వంటి సంస్థలు కొనుగోలు సేవను, అమ్మకం సేవను ఉచితంగా అందిస్తున్నాయి. విక్రయించినప్పుడు డీమ్యాట్ ఖాతాలో డెబిట్ చార్జీలు పడతాయి. ఈ చార్జీలు కంపెనీలను బట్టి మారుతుంటాయి.  అయితే, ప్రతీ బ్రోకర్ వద్ద అన్ని రకాల ఏఎంసీ పథకాల్లో మదుపు చేసే అవకాశం లేదు. వాటితో ఒప్పందం కుదుర్చుకున్న ఏఎంసీల పథకాలను మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. పైగా కేవలం మ్యూచువల్ ఫండ్స్ కోసమే డీ మ్యాట్ ఖాతా నిర్వహిస్తున్నట్టయితే వార్షిక నిర్వహణ రుసుములు అదనపు భారం. అప్పటికే షేర్ల కోసం ఖాతా ఉండి ఉంటే ప్రయోజనమే.

ఎంఎఫ్ యుటిలిటీ

మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సంఘం (యాంఫీ) ఏర్పాటు చేసిన వేదిక ఇది. దీని ద్వారా సేవలన్నీ ఉచితమే. ఏ మ్యూచువల్ ఫండ్ పథకంలోనయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ముందుగా కామన్ అకౌంట్ నంబర్ (క్యాన్) కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎన్ని పథకాల్లో పెట్టుబడులు అయినా ఒక్క లావాదేవీతో పూర్తి చేసుకోవచ్చు. పే ఈజ్ విధానంలో ఒక్కసారి బ్యాంకు నుంచి డెబిట్ చేసుకునేందుకు సమ్మతి తెలిపితే నెల నెలా ఆటోమేటిక్ గా బ్యాంకు ఖాతా నుంచి నగదు ఎంఎఫ్ యుటిలిటీకి వెళుతుంది. అయితే, ఈ ప్రక్రియ సాధారణ ఇన్వెస్టర్ కు ఓ పట్టాన అర్థం కాదు. సర్వీసు విషయంలోనూ డ్రా బ్యాక్ ఉంది. దగ్గర్లో ఎంఎఫ్ కార్యాలయం అందుబాటులో లేకపోవడం, కేవలం కాల్ సెంటర్, కస్టమర్ సర్వీసు సెంటర్ ద్వారానే సేవలు పొందడం అందరికీ వీలయ్యేది కాదు. ఎంఎఫ్ ద్వారా నేరుగా ఏఎంసీల పథకాల్లో పెట్టుబడి పెడుతున్నాం కనుక డైరెక్ట్ ప్లాన్స్ ద్వారా ఎక్కువ రాబడికి అవకాశం ఉంటుంది.

మై క్యామ్స్, కార్వీ

ఇవి కూడా అన్ లైన్, యాప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులకు వీలు కల్పించేవే. ఏఎంసీ, ఇన్వెస్టర్ మధ్య మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తుంటాయి. నిర్వహణ ఎంఎఫ్ యుటిలిటీ వలే ఉంటుంది. రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్స్ లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. పెట్టుబడులు అన్నీ ఒకే ఖాతా ద్వారా జరుగుతాయి. అయితే, అన్ని కంపెనీల ఫండ్స్ అందుబాటులో ఉండకపోవడం ప్రతికూలత. క్యామ్స్ అయితే, అదనగా పోర్ట్ ఫోలియే సేవలు, ఈక్విటీ షేర్లు, బాండ్లు, సేవింగ్స్ స్కీమ్స్, ఇన్సూరెన్స్, కమోడిటీ, రియల్ ఎస్టేట్ సర్వీసులను అందిస్తోంది. 

బ్యాంకులు

బ్యాంకులు కూడా ఖాతాదారులకు మ్యూచువల్ ఫండ్ సేవలు అందిస్తున్నాయి. కానీ, అన్ని రకాల కంపెనీల పథకాలను అందించడం లేదు. సర్వీసు విషయంలో కస్టమర్లకు సౌకర్యంగా అనిపించదు.

representation image

డైరెక్ట్ ప్లాన్స్, రెగ్యులర్స్ ప్లాన్స్ మధ్య ఉన్న తేడా

ఆన్ లైన్ లో ఏఎంసీ వెబ్ సైట్లు, ఎంఎఫ్ యుటిలిటీ, మరి కొన్ని వేదికల్లో మాత్రమే డైరెక్ట్ ప్లాన్స్ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. మిగతా  తటస్థ వేదికల ద్వారా అయినా కొనుగోలు చేసేవి రెగ్యులర్ ప్లాన్స్ కిందకే వస్తాయి. పెట్టుబడి దారులకు డైరెక్ట్ ప్లాన్స్ అందించాలని 2012లో సెబీ ఆదేశించింది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ పథకం నిర్వహణ కోసం ఏఎంసీలకు కొంత వ్యయం అవుతుంది. ఓ పథకానికి ఫండ్ మేనేజర్ల దగ్గర నుంచి ఎంతో మంది పనిచేసే వారు ఉంటారు. వారికి వేతనాల రూపంలో అయ్యే ఖర్చులు, కంపెనీ లాభాలు, డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెంటు కమీషన్ చెల్లింపు ఇవన్నీ కలిపి నిర్ణీత శాతాన్ని ఎక్స్ పెన్స్ రేషియోగా పేర్కొంటారు. 

డైరెక్ట్ ప్లాన్స్ లో డిస్ట్రిబ్యూటర్లు లేదా ఏజెంట్లకు కమీషన్ చెల్లించే పని ఉండదు. రెగ్యులర్ ప్లాన్స్ లో కమీషన్ ఖర్చులు ఉంటాయి. దీంతో పథకాన్ని బట్టి వీటి మధ్య ఎక్స్ పెన్స్ రేషియో మారుతుంటుంది. ఉదాహరణకు హెచ్ డీఎఫ్ సీ టాప్ 200 పథకాన్ని తీసుకుంటే 2016 ఏప్రిల్ 30 నాటికి డైరెక్ట్ ప్లాన్ ఎక్స్ పెన్స్ రేషియో 1.64 శాతం కాగా, రెగ్యులర్ ప్లాన్స్ ఎక్స్ పెన్స్ రేషియో 2.25 శాతం.  0.61శాతం తేడా కనిపిస్తోంది. ఈ స్వల్ప శాతమే 10 ఏళ్ల నుంచి 30 ఏళ్ల కాలంలో పెట్టుబడులపై రాబడుల విషయంలో తేడా చూపెడుతుంది.

ఉదాహరణకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున పదేళ్ల పాటు ఓ పథకంలో రవి, కిరణ్ పదేళ్ల పాటు పెట్టుబడి పెట్టారనుకుందాం. ఒకరు డైరెక్ట్ ప్లాన్ అయితే, మరొకరు రెగ్యులర్ ప్లాన్ ఎంచుకున్నారు. ఎక్స్ పెన్స్ రేషియో .50 శాతం తేడా ఉంది. పదేళ్ల పాటు పెట్టుబడి పెడితే రెగ్యులర్ ప్లాన్ లో 9,40,969 రూపాయలు కాగా, డైరెక్ట్ ప్లాన్ లో 10,55,096 అయింది. పదేళ్లలో 1,15,000 తేడా కనిపిస్తోంది కదా. ఇదే 20 ఏళ్ల పాటు అయితే, తేడా రూ.5 లక్షలు, 30 ఏళ్ల పాటు అయితే 16 లక్షల రూపాయలు వస్తుంది. అంటే ఇంత మేర రెగ్యులర్ ప్లాన్ లో పెట్టుబడి పెట్టిన వారు నష్టపోవాల్సి ఉంటుంది. పూర్తిగా ఈక్విటీ ఆధారిత పథకాల్లోనే ఇంత మేర తేడా ఉంటుంది. అదే బ్యాలన్స్ ఫండ్స్ లో ఈ ఎక్స్ పెన్స్ రేషియో తేడా తక్కువగా, డెట్ ఫండ్స్ లో ఇంకా తక్కువగా ఉంటుంది. 

ఎన్ఏవీ నిర్ణయించేది ఎలా

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు యూనిట్ల రూపంలో ఉంటాయి. ప్రతీ యూనిట్ కు నెట్ అస్సెట్ వేల్యూ (ఎన్ఏవీ) కేటాయిస్తారు. ఇది ఎలా అంటే ఉదాహరణకు మీరు ఓ పథకంలో 5వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. ఆ పథకం యూనిట్ ఎన్ఏవీ కొనుగోలు తేదీన 20 రూపాయలు ఉందనుకోండి. అప్పుడు 5వేల రూపాయలకు 250 యూనిట్లు వస్తాయి. యూనిట్ విలువ ప్రతీ రోజూ మారుతుంటుంది. స్టాక్ మార్కెట్లో షేర్ల ధరల మాదిరిగానే మ్యూచువల్ ఫండ్ యూనిట్ల ఎన్ఏవీలో మార్పులు జరుగుతుంటాయి. ఉదాహరణకు ఓ పథకం కింద ఏఎంసీకి 2వేల కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి. వాటిని భిన్న రకాలుగా మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంటారు. వాటిని యూనిట్లుగా విభజిస్తారు కనుక ప్రతీ రోజు పెట్టుబడుల విలువను, యూనిట్లతో లెక్కించి ఎన్ఏవీని నిర్ణయిస్తుంటారు.

ఓ పథకం కింద 2వేల కోట్లు రూపాయల పెట్టుబడులు ఉన్నాయి. అప్పుడు ఆ ఫండ్ ఎన్ఏవీ 2వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఈ మొత్తాన్ని యూనిట్లతో భాగించగా అప్పుడు ఒక్కో యూనిట్ ఎన్ఏవీ ఎంతో తెలుస్తుంది. ఓ పథకం ప్రారంభంలో 100 కోట్ల రూపాయలు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చాయనుకోండి. 10 రూపాయల ముఖ విలువతో ఫండ్ హౌస్ యూనిట్లను కేటాయిస్తుంది. తర్వాత కాలంలో ఆ పెట్టుబడుల విలువ వృద్ధి చెందుతూ దానికనుగుణంగా యూనిట్ ఎన్ఏవీ కూడా పెరుగుతూ వెళుతుంది. తర్వాత కాలంలో కొనుగోలు చేసే ఇన్వెస్టర్లకు 10 రూపాయల ముఖ విలువ ఉన్న యూనిట్ ను మార్కెట్ ధర ప్రకారం కేటాయిస్తారు. 

కొనుగోలుకు వర్తించే ఎన్ఏవీ

లిక్విడ్ ఫండ్స్ ఎన్ఏవీని సెలవు రోజుల్లో (ఆదివారం) ప్రకటిస్తుంటారు. ఇలా సెలవు రోజుల్లో ప్రకటించిన ఎన్ఏవీ ధరే తదుపరి సెలవు రోజు కొత్త ఎన్ఏవీ ప్రకటించే వరకు అమల్లో ఉంటుంది. ఉదాహరణకు సోమవారం మధ్యాహ్నం 2లోపు లావాదేవీకి సంబంధించిన రిక్వెస్ట్ అందితే, ఫండ్ హౌస్ వద్ద దరఖాస్తు దారుడి కొనుగోలు విలువకు సరిపడా నిధులు ఉంటే అంతకుముందు రోజు ఎన్ఏవీ ధర ప్రకారం యూనిట్లు కేటాయిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత లావాదేవీ అయితే అదే రోజు ముగింపు ధర ప్రకారం మరుసటి రోజు యూనిట్లు కేటాయిస్తారు. 

అదే లిక్విడ్ ఫండ్స్ ఉపసంహరణకు సంబంధించిన డెడ్ లైన్ మధ్యాహ్నం 3 గంటలు. ఆ లోపు వచ్చిన దరఖాస్తుదారులకు ఆ రోజు ముగింపు ధర ప్రకారం మర్నాడు యూనిట్లు విక్రయించి నగదు చెల్లింపులు చేస్తారు. అదే ఈక్విటీ ఇతర ఫండ్ల విషయంలో... మధ్యాహ్నం మూడు గంటల లోపు కొనుగోలు, విక్రయం (ఉపసంహరణ) కోసం వచ్చిన దరఖాస్తులకు అదే రోజు ఎన్ఏవీ వర్తిస్తుంది. మూడు గంటల తర్వాత అందే దరఖాస్తులకు మర్నాడు ఎన్ఏవీ వర్తిస్తుంది. 

రెగ్యులర్ ప్లాన్స్ ను డైరెక్ట్ ప్లాన్స్ కిందకు మార్చుకోవచ్చా...?

ఏఎంసీని సంప్రదించి నిర్ణీత ఫారమ్ ను సమర్పించి రెగ్యులర్ ప్లాన్స్ ను డైరెక్ట్ ప్లాన్స్ కిందకు మార్చుకోవచ్చు. అయితే, ఎగ్జిట్ చార్జీలు భరించాల్సి ఉంటుంది. పన్ను పరంగా ప్రయోజనాలు ఉంటే కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ ప్లాన్స్ ను డైరెక్ట్ ప్లాన్స్ కింద మార్చాలంటే ఆ యూనిట్లను విక్రయించి తిరిగి డైరెక్ట్ ప్లాన్స్ కింద యూనిట్లను కొనుగోలు చేస్తారు. అయితే, రెగ్యులర్ ప్లాన్స్ కింద పెట్టుబడి పెట్టి ఏడాది దాటితే ఎలాంటి ఉపసంహరణ చార్జీలు ఉండవు. ఒకవేళ ఏడాదిలోపే అయితే, వాటిని ఉపసంహరించుకోకుండా అలా ఉంచి... డైరెక్ట్ ప్లాన్స్ లో  ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ ప్లాన్ కింద పెట్టుబడులు ఏడాది పూర్తయిన తర్వాత డైరెక్ట్ ప్లాన్ కిందకు ఎలాంటి చార్జీలు లేకుండా మార్చుకోవచ్చు. ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మినహా మరే ఇతర ఫండ్స్ ను అయినా మార్చుకోవచ్చు.

చార్జీలు

మ్యూచువల్ ఫండ్స్  యూనిట్ల కొనుగోలుకు ఎలాంటి చార్జీలు ఉండవు. ఏడాదిలోపు ఉపసంహరించుకున్న సందర్భాల్లోనే నిర్ణీత చార్జీలు విధిస్తారు. ఈ చార్జీలు ఆరు నెలలలోపు అయితే 2శాతం, ఆ తర్వాత నుంచి ఏడాది లోపు 1 శాతం మేర ఉంటాయి.

representation image

మంచి పథకాలను ఎంచుకునే విధానం

దేశంలో సుమారు 44కుపైగా అస్సెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇవి పది వేలకు పైగా పథకాలను నిర్వహిస్తున్నాయి. 2016 మార్చి నాటికి ఏఎంసీల నిర్వహణలో ఉన్న ఇన్వెస్టర్ల నిధులు సుమారుగా 14 లక్షల కోట్లు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న పథకాల్లో మంచి వాటిని ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తేనే అధిక ప్రతిఫలం అందుకోవడం సాధ్యమవుతుంది. 

ఒక మంచి పథకాన్ని ఎంచుకోవడానికి గణాంకాలే ప్రామాణికం. పనితీరులో ఉత్తమంగా ఉన్న స్కీమ్స్ గురించి వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. గత ఐదు పదేళ్ల కాలంలో ఆ ఫండ్ పనితీరు ఎలా ఉందన్నది చూడాలి. ఎంత శాతం సగటున వార్షిక ప్రతిఫలాన్ని అందించిందన్నది ముఖ్యం. కొత్త పథకమైతే మూడేళ్ల పనితీరును ప్రామాణికంగా తీసుకోవాలి. మొదటి క్వార్టయిల్ ర్యాకింగ్ లో ఉన్న ఫండ్స్ పనితీరులో ఉత్తమమైనవి. పనితీరులో దారుణంగా ఉన్నవి నాలుగో క్వార్టయిల్ ర్యాంకింగ్ లో ఉంటాయి. 

క్వార్టయిల్ ర్యాకింగ్ అనేది వివిధ పారా మీటర్ల (పథకంలో ఉండే రిస్క్, ఎక్స్ పెన్స్ రేషియో వంటివి) ఆధారంగా పథకాన్ని మదింపు వేసి పెట్టుబడుల పరంగా దానికి ర్యాంక్ ఇచ్చే విధానం. ఉదాహరణకు ఓ పథకం మూడేళ్లు పూర్తి చేసుకుంటే దాని విషయంలో మూడేళ్ల కాలాన్ని తొమ్మిది నెలల చొప్పున నాలుగు భాగాలు చేసి విశ్లేషించి ర్యాకింగ్ ఇస్తారు. 

ప్రతీ ఫండ్ హౌస్ వెబ్ సైట్ కు వెళితే ప్రతీ పథకం సమాచారం లభిస్తుంది. పనితీరు వివరాలు, పోర్ట్ ఫోలియో ... అంటే ఏ ఏ కంపెనీ షేర్లలో ఎంత మేర పెట్టుబడులు ఉన్నాయో తెలుస్తుంది. ఫండ్ మేనేజర్ వివరాలు ఉంటాయి. ఎక్స్ పెన్స్, టర్నోవర్ రేషియో వివరాలు తెలుస్తాయి. వీటి ఆధారంగా కూడా ఓ నిర్ణయానికి రావచ్చు. 

ఒకరు ఓ పథకాన్ని ఎంచుకునే ముందు తప్పకుండా చూడాల్సినది  ఎక్స్ పెన్స్ రేషియో. ఉదాహరణకు నెల నెల రెండు పథకాల్లో వెయ్యి రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందు మంచి రాబడుల చరిత్ర ఉన్న నాలుగు పథకాలను ఎంపిక చేసుకోండి. అప్పుడు వాటి డైరెక్ట్ ప్లాన్స్ లేదా రెగ్యులర్ ప్లాన్స్ ఎక్స్ పెన్స్ రేషియోను పరిశీలించండి. ఎక్స్ పెన్స్ రేషియో తక్కువగా ఉన్నది ఎంపిక చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో రాబడుల్లో పైన చెప్పుకున్నట్టే గణనీయమైన తేడా కనిపిస్తుంది.

ఓ పథకం కింద పెట్టుబడుల నిర్వహణ, రాబడులు ఫండ్ మేనేజర్ శక్తి, సామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే పథకంలో పెట్టుబడి పెట్టేముందు సదరు మేనేజర్ ట్రాక్ రికార్డును పరిశీలించాలి. సదరు మేనేజర్ గతంలో నిర్వహించిన పథకాలు, పనితీరు, ఆ మేనేజర్ నిర్వహణలో ఉన్న మొత్తం పథకాలను చూడాల్సి ఉంటుంది. 

ఫండ్స్ రకాలు

ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్, ఇంటర్వల్ అని వైవిధ్యంతో కూడిన ఫండ్ పథకాలు ఉన్నాయి.

1.డెట్/ఇన్ కమ్

ఫండ్ నిధుల్లో అధిక మొత్తాన్ని డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలతో పెట్టుబడి పెడతారు. ఈక్విటీ పథకాలతో పోలిస్తే ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అంటే రిస్క్ తక్కువ, ప్రతిఫలం తక్కువ అనే తీరులో వీటి పనితీరు ఉంటుంది. పెద్దగా రిస్క్ తీసుకోలేని వారికి, స్వల్ప కాలానికి పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇవి అనువైనవి.

2. మనీ మార్కెట్/లిక్విడ్

స్వల్ప కాలానికి అంటే కేవలం నెలల వ్యవధి కోసం అయితే, వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదుగా మార్చుకోవచ్చు. పైగా చెప్పుకోదగ్గ వడ్డీ గిట్టుబాటవుతుంది. స్వల్ప కాలిక డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి ప్రతిఫలాలను అందిస్తాయి. ఏదైనా అవసరం కోసమో లేక మంచి పెట్టుబడి అవకాశం కోసమే నగదును సిద్ధం చేసుకున్న తర్వాత కొంత సమయం ఉందనుకోండి. ఆ నగదును సేవింగ్స్ ఖాతాలో అట్టి పెట్టుకోవడం కంటే ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఉత్తమం. 8 శాతం వరకు ప్రతిఫలాన్నిస్తాయి.

representation image

3. ఈక్విటీ పథకాలు

ఈక్విటీ పథకాల్లోనూ బోలెడు రకాలు ఉన్నాయి. ప్యూర్ ఈక్విటీ ఫండ్స్ గురించి చెప్పుకోవాలంటే... రిస్క్ ఎక్కువ, ప్రతిఫలమూ ఎక్కువే అన్న తరహాలో వీటి పనితీరు ఉంటుంది. పథకం కింద సమకూరిన నిధుల్లో దాదాపుగా 90 నుంచి 100 శాతం వరకు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. దీర్ఘకాలం అంటే కనీసం 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం కోసం పెట్టుబడి పెట్టాలనుకునేవారు ప్యూర్ ఈక్విటీ పథకాలను ఎంచుకోవడం వల్ల ఎక్కువ ప్రతిఫలం అందుకోవచ్చు. ఇందులోనూ లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్ అని ఉన్నాయి. కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా వీటిని వర్గీకరించారు. వీటిలో స్మాల్ క్యాప్ లో అధిక రిస్క్, మిడ్ క్యాప్ లో మధ్యస్తం, లార్జ్ క్యాప్ లో తక్కువ రిస్క్ ఉంటుంది. 

4. ఇండెక్స్ ఫండ్స్

సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లోని స్టాక్స్ లోనే పెట్టుబడులు పెడతాయి. నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కు మార్కెట్ విలువ ప్రకారం 10 శాతం వెయిటేజీ ఉందనుకోండి. ఓ ఇండెక్స్ ఫండ్ కింద ఏఎంసీ సేకరించిన మొత్తం నిధుల్లో రిలయన్స్ లో 10 శాతం పెట్టుబడులు పెడతాయి. అలా సూచీలోని మొత్తం స్టాక్స్ వెయిటేజీ ఆధారంగా ఒక్కోదానిలో అంతమేర పెట్టుబడి పెడతారు. సూచీ గమనం ఆధారంగా ప్రతి ఫలం ఉంటుంది. నిఫ్టీ సూచీ ఏడాదిలో 15 శాతం పెరిగితే అంతమేర లాభం వచ్చినట్టు. 15 శాతం తగ్గితే అంతమేర నష్టం వచ్చినట్టు. 

ఈ ఫండ్స్ ను ఎంపిక చేసుకునే విషయంలో ఫండ్ మేనేజర్ నైపుణ్యంతో పనిలేదు. ఎందుకంటే ఎవరైనా సూచీల్లోని స్టాక్స్ లో వాటి వెయిటేజీ ప్రకారం పెట్టుబడి పెడతారు. మార్కెట్ల గురించి, మ్యూచువల్ ఫండ్స్ పనితీరును సమీక్షించుకోవడం తెలియని వారు ఇండెక్స్ ఫండ్స్ ను ఎంచుకోవడం ఉత్తమం. ఇక్కడ ఫండ్ మేనేజర్ పనితీరుతో పని లేదు కనుక ఎక్స్ పెన్స్ రేషియో కూడా తక్కువగా ఉంటుంది. 

సాధారణ ఫండ్స్ ఎక్స్ పెన్స్ రేషియో 2 శాతంగా ఉంటే ఇండెక్స్ ఫండ్స్ లో 1 శాతంగా ఉంటుంది. పైగా మిగిలిన ఫండ్స్ లో ముందు రోజు ప్రకటించిన ఎన్ఏవీ ధర ప్రకారం తదుపరి రోజు అమ్మకాలు, కొనుగోళ్లు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్సేంజ్ ఫండ్స్ మాత్రం స్టాక్ మార్కెట్లో ట్రేడవుతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్ రేటుకు కొనుగోలు చేసుకోవచ్చు. 

5. సెక్టోరల్ పథకాలు

రంగాలవారీ ప్రత్యేక పథకాలను కూడా మ్యుూచువల్ ఫండ్స్ ను అందిస్తున్నాయి. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ ఇలా అన్నమాట. ఫార్మా సెక్టోరల్ పథకం అయితే, సేకరించిన మొత్తం నిధులను ఆ రంగంలోని షేర్లలోనే పెట్టుబడి పెడతారు. 

6. ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్/ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్

పన్ను ఆదా కోరుకునే వారికి ఈ పథకాలు ఉపయుక్తం. అంతేకాదు, పన్ను ప్రయోజనం అవసరం లేని వారు సైతం వీటిని కొనుగోలు చేయడం వల్ల మంచి ప్రతిఫలాన్నే అందుకోవచ్చు. ఈ పథకం కింద ఈక్విటీల్లోనే పొదుపు చేస్తారు. ఈ పథకాల్లో పెట్టుబడులకు మూడేళ్ల పాటు లాకిన్ పీరియడ్ ఉంటుంది. మూడేళ్ల పాటు విక్రయించుకోవడానికి లేదు. దీంతో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉండదు. దాంతో మంచి ప్రతిఫలం అందుతుంది. డైవర్సిఫైడ్ ఫండ్స్ అంటే భిన్న రంగాలకు చెందిన స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేవి. 

7. బ్యాలన్స్ డ్ ఫండ్స్

మంచి రాబడి, స్థిరత్వం కోరుకునేవారికి, ఎక్కువ రిస్క్ వద్దనుకునేవారికి ఇవి అనువుగా ఉంటాయి. సేకరించిన నిధుల్లో 50 శాతం వరకే ఈక్విటీల్లో పెడతాయి. మిగిలిన నిధులను సంప్రదాయ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి.

8. ఇంటర్నేషనల్ ఫండ్స్

విదేశీ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతూ ప్రతిఫలాలను అందిస్తుంటాయి. అలాగే, బంగారంలో పెట్టుబడులకు గాను గోల్డ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. 

9. ఆర్బిట్రేజ్ ఫండ్స్

ఇవి స్వల్ప కాలంలో డెట్ ఫండ్స్ కు ప్రత్యామ్నాయం. ఈక్విటీ, డెరివేటివ్ మార్కెట్ల మధ్య ధరల్లో ఉన్న తేడాలను క్యాష్ చేసుకుంటాయి. ఆ విధంగా అందుకున్న లాభాలను ఇన్వెస్టర్లకు అందిస్తాయి. వీటిలో రిస్క్ దాదాపుగా ఉండదు. కొంత మేర డెట్ ఇనుస్ట్రుమెంట్స్ లో కూడా పెట్టుబడిగా పెడతాయి.  దాదాపు 9 శాతం మేర ప్రతిఫలం వీటిల్లో ఉంటుంది. 

ఇది ఎలా ఉంటే ఒక స్టాక్ ఈక్విటీ మార్కెట్లో 1000 రూపాయలు ఉందనుకోండి. అదే స్టాక్ డెరివేటివ్స్ లో 1500 రూపాయలు ఉంటే ఫండ్ మేనేజర్ ఈక్విటీ మార్కెట్లో కొనుగోలు చేసి డెరివేటివ్ మార్కెట్లో షేర్లను అమ్మేస్తారు. ఒక్క షేరుకు 500 రూపాయలు లాభం అన్నమాట. ఇలాంటి అవకాశాలు దొరికినప్పుడే వినియోగించుకుంటారు. మార్కెట్లో వోలటిలిటీ ఎక్కువగా ఉన్న సమయాల్లోనే ఇలాంటి అవకాశాలు వస్తాయి. అలాంటి సమయాల్లోనే ఈ పథకాల్లో ఎక్కువ లాభాలు అందివస్తాయి,.  

10. క్లోజ్ ఎండెడ్ పథకాలు

ఈ పథకాల్లో సిప్ విధానం ఉండదు. ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నిర్ణీత కాలం తర్వాత ఇవి ఓపెన్ ఎండెడ్ గా మారతాయి. ఉదాహరణకు 3 సంవత్సరాలు క్లోజ్ ఎండెడ్ అని ఉంటే మూడేళ్ల తర్వాత అవి మార్కెట్లో ఓపెన్ ఎండెడ్ గా పెట్టుబడులకు అందుబాటులో ఉంటాయి. లేదా ఆ పథకాన్ని మూసేసి పెట్టుబడులను ఇన్వెస్టర్లకు ఇచ్చేస్తాయి. ఈ క్లోజ్ ఎండెడ్ కాల వ్యవధి తీరిన తర్వాత ఎన్ఏవీ ఎంతో తెలుస్తుంది. ఇవి ఈక్విటీ లేదా డెట్ ఫండ్స్ కూడా అయి ఉండవచ్చు. కొన్ని పథకాలు ఎన్ఎఫ్ఓ కాల వ్యవధి తర్వాత అంటే నిధుల సేకరణ గడువు ముగిసిన తర్వాత స్టాక్ ఎక్సేంజ్ లలో లిస్ట్ అవుతుంటాయి.

11. కేపిటల్ ప్రొటెక్షన్

పేరులో ఉన్నట్టుగానే పెట్టుబడులను కాపాడుతూ ప్రతిఫలాన్ని అందించే దృష్టితో పనిచేస్తుంటాయి. కాల వ్యవధికి తగ్గట్టుగా ఎక్కువ శాతం నిధులను అధిక నాణ్యతతో కూడిన సంప్రదాయ రాబడి మార్గాల్లో పెట్టబడులుగా పెట్టి.. ఈక్విటీలో స్వల్ప శాతం పెట్టుబడి పెడతాయి. దాంతో ఓ మోస్తరు రాబడులను అందిస్తాయి.

12. ఫిక్స్ డ్ మెచ్యూరిటీ ప్లాన్స్

ముందుగా ప్రకటించిన కాల వ్యవధి వరకు మనుగడలో ఉంటాయి. డెట్ ఇనుస్ట్రుమెంట్స్ లో పెట్టుబడి పెట్టి రాబడులను అందిస్తాయి.

13. మంత్లీ ఇన్ కమ్ ప్లాన్స్

క్రమానుగతంగా రాబడులు కోరుకునే వారి కోసం ఇవి అనువైనవి. పేరులో మంత్లీ ఉంది కదా అని నెలనెలా ప్రతిఫలం అందిస్తారనుకోవద్దు. లాభాలు, నిధుల లభ్యతకు అనుగుణంగా డివిడెండ్ చెల్లిస్తుంటాయి. 70 నుంచి 95 శాతం వరకూ డెట్ ఇనుస్ట్రుమెంట్స్ లో పెట్టుబడి పెడతాయి. 5 నుంచి 30 శాతం వరకు ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెడతాయి. డెట్ పథకాల ద్వారా వచ్చిన రాబడులకుతోడు, దీర్ఘకాలంలో ఈక్విటీ ప్రతిఫలాలను డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంటాయి.

14. ఇంటర్వల్స్

వీటిలో ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్ రెండు రకాలు ఉంటాయి. ముందుగా ప్రకటించిన మేరకు మధ్య మధ్యలో వీటిలో లావాదేవీలు నిర్వహించుకోవడానికి అవకాశం ఇస్తారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy