ap7am logo

ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు ఓ బ్రహ్మాస్త్రం... పిల్

Thu, May 11, 2017, 02:55 PM
Related Image

1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ పార్టీలను, పౌరుల హక్కులను కాలరాసింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై కూడా ప్రభావం చూపింది. దీంతో అత్యవసర స్థితి తొలగిపోయిన తర్వాత అత్యవసర పరిస్థితుల్లో దెబ్బతిన్న ప్రతిష్ఠను పునరుద్ధరించే చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం/పిల్)కు ద్వారాలు తెరిచింది.

భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ బాధ్యతను కూడా కోర్టులు చూస్తుంటాయి. ఆర్టికల్ 21 ప్రకారం... జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అంటే... ఉచితంగా న్యాయాన్ని పొందే హక్కు, గౌరవంగా జీవించే హక్కు, విద్యా హక్కు, పనిచేసే హక్కు, వేధింపుల నుంచి రక్షణ ఇవన్నీ కూడా జీవించే హక్కు కిందకే వస్తాయి. అంటే ఉచితంగా న్యాయాన్ని పొందే హక్కుకు పిల్ నిదర్శనం. 1983లో బంధువా ముక్తి మోర్చా కేసు విచారణ సందర్భంగా... బలవంతంగా పనిచేయించడాన్ని వెట్టిచాకిరీ కిందే వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే, ఏసియాడ్ వర్కర్స్ కేసులో జస్టిస్ పీఎన్ భగవతి... కనీస వేతనం కంటే తక్కువ పొందుతున్న వారు ఎవరైనా లేబర్ కమిషనర్, లేబర్ కోర్టులకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టును పిల్ రూపంలో ఆశ్రయించవచ్చని స్పష్టం చేశారు. 

ప్రజా ప్రయోజనం అంటే...?

పిల్ అంటే... ఏవరో ఒకరి ప్రయోజనాల కోసం కాకుండా ఎక్కువ మంది ప్రజల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించే మార్గం.  ప్రజా ప్రయోజనాలు అంటే... ఏమేంటి అన్న సందేహం వస్తుంది. వెట్టిచాకిరీ, కాలుష్యం, ఉగ్రవాదం, రహదారి భద్రత, పర్యావరణ పరిరక్షణ, మనుషుల అక్రమ రవాణా... ఏ అంశమైనా అందులో ఎక్కువ మంది ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంటే పరిరక్షణ కోసం గాను పిల్ దాఖలు చేయడానికి న్యాయవ్యవస్థ పౌరులకు అవకాశం కల్పించింది. రాజ్యాంగం ప్రసాదించిన ఇతర హక్కులకు విఘాతం కలిగినా, ఓ వర్గం ప్రయోజనాలు దెబ్బతింటున్నా పిల్ దాఖలుకు అవకాశం ఉంది.  

ఎవరు దాఖలు చేయవచ్చు?

representational imageదీన్ని పౌరులు ఎవరైనా, స్వచ్చంద సంస్థలు కూడా నేరుగా హైకోర్టు, సుప్రీంకోర్టులో దాఖలు చేయవచ్చు. ఇతర కేసుల్లో మాదిరిగా బాధితులే దాఖలు చేయాలన్న నిబంధన లేదు. దేశంలో 1970ల్లో పిల్ విధానం ప్రారంభం కాగా, 80ల నుంచి పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుల్లో పిల్ దాఖలుకు అవకాశం ఉంది. పిల్ దుర్వినియోగం కాకూడదన్న సదుద్దేశంతో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం పిల్స్ దాఖలు చేయరాదు. లేఖ రూపంలో పంపినా దాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది.

పిల్ దాఖలు చేసేముందు...

పిల్ దాఖలుకు ముందు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశానికి సంబంధించి తగిన సమాచారం సేకరించాలి. ఆధారాలను సేకరించాలి. వాటిని ఓ రికార్డుగా మీ వద్ద ఉంచుకోవాలి. కోర్టులో ఎవరికి వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలు చేయనున్నామో... ముందు సంబంధిత సంస్థలకు లీగల్ నోటీసు ఇవ్వాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిల్ దాఖలు చేస్తుంటే అంతకు రెండు నెలల ముందే లీగల్ నోటీసు ఇవ్వాలి.  పిల్ దాఖలుకు నామమాత్రపు ఫీజు (ఫిక్స్ డ్ కోర్టు ఫీ) తప్ప ఇతరత్రా వ్యయం ఏమీ ఉండదు. పిల్ దాఖలు వరకు బాగానే ఉంది. కానీ, ఆధారాలు సమర్పించగలిగే స్థితిలో లేకుంటే... కోర్టు వాస్తవాల ఆధారంగా సమాచారాన్ని సేకరించేందుకు కమిషన్ ను నియమిస్తుంది. 

సుమోటో అంటే... 

ఏదేనీ ఒక అంశంపై కోర్టు తనంతట తానే విచారణ చేపట్టడాన్నే సుమోటో కేసుగా  పేర్కొంటారు. ఎక్కువ మంది ప్రజల ప్రయోజనాలకు సంబంధించినది అయినా కావచ్చు. లేదా తీవ్రమైన నేరమైనా కావచ్చు. బాధితులు ఒక్కరే అయినా కావచ్చు. కోర్టు స్వచ్చందంగా విచారణ చేపడితే అది సుమోటోగా పేర్కొంటారు. విచారణ దశలో కోర్టు దాన్ని వేరే పిటిషన్ కింద మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy