ap7am logo

పర్సుతో పని లేదు... యూపీఐ యాప్ ఉంటే చాలు

Thu, May 11, 2017, 02:12 PM
Related Image

పార్టీ ఇస్తానని చెప్పి ఫ్రెండ్స్, కొలీగ్స్ ను రెస్టారెంట్ కు తీసుకెళ్లారు. అతిథి దేవోభవ అన్న రీతిలో కోరిందల్లా ఆర్డర్ ఇచ్చుకుని కుమ్మేయండని ప్రోత్సహించారు. ఓహోహో.. నాకే విందు.. హ్హహ్హహ్హ అంటూ అందరూ సుష్టుగా కానిచ్చేశారు. వెళ్లింది ఐదుగురు.. బిల్లు చూస్తే 8వేలు. ఇంతేనా, అంటూ జేబులో చేయి పెట్టారు. వ్యాలెట్ కనిపించలేదు. నగదు, బ్యాంకు కార్డులు కూడా అందులోనే ఉన్నాయే...! మొహం ఒక్కసారిగా రూపు మారిపోయింది. వారిలో ఓ స్నేహితుడికి పరిస్థితి చెప్పి అతనితో బిల్లు కట్టించి అక్కడి నుంచి బయటపడ్డారు. 

ఇలాంటి పరిస్థితిని ఎలా ఊహిస్తాం చెప్పండి? ఇదే అని కాదు జేబులో ఉన్న నగదుకు, వ్యాలెట్ కు భద్రత ఉంటుందని చెప్పలేము కదా. అందుకే జేబులో రూపాయి లేకపోయినా బిల్లులు చెల్లించడానికి ఏ మాత్రం వెనకాడక్కర్లేదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) విధానం బ్యాకింగ్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లనుంది. బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణను చాలా సులభతరం చేయనుందని ఆ రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. యూపీఐ యాప్ తో ఎవరికైనా క్షణాల్లో నగదు పంపుకోవచ్చు. అన్ని రకాల బిల్లులు చెల్లించవచ్చు. పర్సుతో పని లేకుండా చేసే యూపీఐతో ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయి. నగదు లావాదేవీలను తగ్గించడమే ఈ విధానం వెనుక ముఖ్య ఉద్దేశం. ఐఎంపీఎస్ కు మెరుగైన విధానమే యూపీఐ విధానం. 

representation image

వాస్తవానికి క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నా... ఇప్పటికీ ఎక్కువ మంది నగదుతోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. బ్యాంకు ఏటీఎం కేంద్రాల్లో ఉచిత నగదు లావాదేవీలు పరిమితం చేయడంతో నగదును డ్రా చేసుకుని వినియోగిస్తున్న వారు కూడా పెరిగారు. జేబులో నగదు ఉంటే కార్డులతో పనే ఉండదు. కానీ యూపీఐ మొబైల్ యాప్ ఉంటే ఇవేమీ లేకపోయినా ఫర్వాలేదు!. దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతుండడంతో మొబైల్ వ్యాలెట్ల వినియోగం కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. 

చాలా సులభం

ప్రస్తుతం పేటీఎం, మొబిక్ విక్, పేయూ మనీ ఇలా పలు రకాల మొబైల్ వ్యాలెట్ యాప్ లు ఉన్నాయి. ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ యాప్స్. ముందుగా ఆయా వ్యాలెట్లలో నగదు నిల్వ చేసుకుని లేదా నగదు పంపుకుని గానీ అక్కడి నుంచి చెల్లింపులు చేయడం సాధ్యం కాదు. యూపీఐ మాత్రం నేరుగా బ్యాంకు ఖాతా నుంచే నగదు లావాదేవీలను పూర్తి చేస్తుంది. ప్రస్తుతం దాదాపుగా చాలా బ్యాంకులకు ప్రత్యేకంగా యాప్స్ ఉన్నాయి. వీటి ద్వారా లావాదేవీలు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వాటితో పోల్చినా యూపీఐనే సౌలభ్యం అని నిపుణులు పేర్కొంటున్నారు.

 మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా లావాదేవీల నిర్వహణకు ఇతరుల ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్ సీ కోడ్ తదితర వివరాలు అవసరం. కొద్దిగా సంక్లిష్టమైన విధానం కావడంతో బ్యాంక్ యాప్స్ అంతగా ప్రజాదరణ పొందలేదు. ఇక డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా అన్ని వేదికల్లోనూ లావాదేవీలు చేయడం సురక్షితమని చెప్పలేము. వాటి వివరాలను తస్కరించి డబ్బులు డ్రా చేసుకుంటున్న ఘటనలు కూడా చూస్తున్నాం. పైగా ఆన్ లైన్ వేదికల్లో కార్డు వివరాలన్నింటినీ నమోదు చేయాల్సి రావడం ప్రయాసతో కూడుకున్నదే. కానీ యూపీఐ ఇలాంటి ప్రతికూలతలన్నింటినీ చెరిపేసి లావాదేవీలను సులభతరం, సురక్షితం చేస్తుందని నిపుణుల విశ్లేషణ. 

లావాదేవీ ఇలా జరుగుతుంది...

ఎలా అంటే ఒకరికి ఎస్ బీఐలో ఖాతా ఉందనుకుందాం. మరొక వ్యక్తికి ఆంధ్రా బ్యాంకులో ఖాతా ఉందనుకుందాం. ఈ రెండు బ్యాంకులు యూపీఐ తో కనెక్ట్ అయి ఉంటే చాలు. అప్పుడు వీరిద్దరిలో ఎవరు కావాలంటే వారికి నగదు పంపుకోవడం, తీసుకోవడం చాలా సులభం. ఇందులో నగదు లావాదేవీలకు బ్యాంకు ఖాతా నంబర్ తో పని లేదు. ప్రతి ఒక్కరికీ వర్చ్యువల్ అడ్రస్ ఉంటుంది. అది ఎలా అంటే ఏబీసీ@ఎస్ బీఐ ఇదే వర్చ్యువల్ ఐడీ. ఇలా కాకుండా మొబైల్ నంబర్@ఎస్ బీఐ లేదా ఆధార్ నంబర్@ఎస్ బీఐ అని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ బీఐ ఖాతాదారుడు ఒకరు యూపీఐ యాప్ ను తన మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకుని వర్చువల్ ఐడీ పొంది ఉన్నాడనుకుందాం. అతడు ఫ్లిప్ కార్ట్ లో ఓ ఉత్పత్తిని చూసి కొనుగోలు చేయాలనుకున్నప్పుడు పేమెంట్ సెక్షన్ లో యూపీఐని సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ వర్చువల్ ఐడీని ఇవ్వగానే కస్టమర్ మొబైల్ లోని యాప్ లో అలర్ట్ నోట్ కనిపిస్తుంది. సెక్యూర్డ్ పిన్ నంబర్ అక్కడ ఎంటర్ చేయడం ద్వారా లావాదేవీ పూర్తయిపోతుంది. అలాగే, సూపర్ మార్కెట్ కు వెళ్లి వెయ్యి రూపాయల సరుకులు కొన్నారు. బిల్లింగ్ కౌంటర్ దగ్గర వర్చువల్ ఐడీ చెప్పగానే తన మొబైల్ యాప్ లో లావాదేవీ ఆమోదం కోరుతూ నోట్ కనిపిస్తుంది. పిన్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా బ్యాంకు ఖాతా నుంచి నగదు సూపర్ మార్కెట్ ఖాతాకు బదిలీ అవుతాయి. 

representation image

ఉదాహరణకు శ్రీరామ్ కు ఎస్ బీఐ లో ఒక ఖాతా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో ఒక ఖాతా ఉందనుకుందాం. ఈ రెండింటి మధ్య నగదు బదిలీ చేసుకోవాలంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా సాధ్యం. ఇందుకు ఆయా బ్యాంకు వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి లావాదేవీ పూర్తి చేయడం, ఆ నగదు అవతలి వైపు ఖాతాలో జమ కావడానికి సమయం పడుతుంది. ఏ పేమెంట్ విధానంలో (ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ) పంపామన్నదానిపై ఈ సమయం ఆధారపడి ఉంటుంది. అలాగే, ఎస్ బీఐ, హెచ్ డీఎఫ్ సీ రెండు బ్యాంకుల మొబైల్ అప్లికేషన్లు శ్రీరామ్ మొబైల్ లో ఉన్నాయనుకుందాం. అప్పుడు ఆ రెండింటి మధ్య నగదు బదిలీ చేసుకోవాలంటే యాప్స్ వల్ల సాధ్యం కాదు. కానీ యూపీఐతో ఇది సాధ్యమే. ఎస్ బీఐ యాప్ లోకి వెళ్లి హెచ్ డీఎఫ్ సీ ఖాతా వర్చువల్ ఐడీతో నగదును ఎస్ బీఐ ఖాతాల జమ చేసుకోవచ్చు. అలాగే, ఎస్ బీఐ నుంచి హెచ్ డీఎఫ్ సీ ఖాతాక నగదు బదిలీ చేసుకోవచ్చు.

ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే...

బ్యాంకుకు అనుసంధానమైన యూపీఐ యాప్ లోకి లాగిన్ అయిన తర్వాత నగదు పొందాలంటే అవతలి వ్యక్తి వర్చువల్ ఐడీని, నగదు మొత్తాన్ని నమోదు చేయాలి. ఓకే చేసిన వెంటనే అవతలి వ్యక్తికి మొబైల్ యాప్ స్క్రీన్ పై  నోటిఫికేషన్ కనిపిస్తుంది. సంబంధిత వ్యక్తి తన ఎంపిన్ నమోదు చేయగానే లావాదేవీ పూర్తయి నగదు మొత్తం వెంటనే మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అదే విధంగా నగదును మరొకరికి బదిలీ చేయాలనుకుంటే సెండింగ్ మనీ/పేమెంట్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఎవరికైతే నగదు పంపాలనుకుంటన్నామో ఆ వ్యక్తి వర్చువల్ ఐడీ, నగదు మొత్తాన్ని ఎంటర్ చేసి ఓకే చేసిన తర్వాత ఎంపిన్ ను నమోదు చేస్తే సరిపోతుంది. యూపీఐ ద్వారా లక్ష రూపాయల వరకు నగదు పంపుకోవచ్చు. ఒక లావాదేవీకి అర్ధరూపాయి మాత్రమే చార్జీ ఉంటుంది. 

ఏ లావాదేవీ  పూర్తి కావాలన్నా... నమోదిత మొబైల్ నంబర్ నుంచే ఎంపిన్ ను ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో అక్రమాలకు ఆస్కారం ఉండదని ఎన్ పీసీఐ భావిస్తోంది. ఎందుకంటే ఎన్ పీసీఐ యూపీఐ ప్లాట్ ఫామ్ ద్వారా ఎంపిన్ నమోదు చేసిన తర్వాత ఆ పిన్ నంబర్ సరైనదేనా, నమోదిత మొబైల్ నంబర్ నుంచే వచ్చిందా, సిమ్ కార్డు సరైనదేనా అన్ని వివరాలను చెక్ చేసిన తర్వాతే లావాదేవీ పూర్తి చేస్తుంది. ఈ విధానం ద్వారా ఆన్ లైన్ షాపింగ్ చేసినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుని డెలివరీ సమయంలో నగదుతో పని లేకుండా యూపీఐ ద్వారా పేమెంట్ చేయవచ్చు. గ్యాస్ బిల్లు, విద్యుత్ బిల్లు ఇలా ప్రతీ పేమెంట్ ను యూపీఐ విధానంలో చేసే రోజు త్వరలో రానుంది. ఒక విధంగా నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్యాంకులకు వెళ్లి లావాదేవీలు నిర్వహించుకునే వారి సంఖ్య తగ్గింది. యూపీఐ ద్వారా అన్ని లావాదేవీలకు అవకాశం ఉండడంతో ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లే అవసరం మరింత తగ్గుతుందని బ్యాకింగ్ నిపుణులు అంటున్నారు. 

భవిష్యత్తులో ఆధార్ బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావాలన్నది ఎన్ పీసీఐ ఆలోచన. అంటే ఎంపిన్ బదులు వేలిముద్ర వేయడం ద్వారానే లావాదేవీ పూర్తవుతుంది. వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే విడిగా ప్రతీ బ్యాంకుకు ఒక వర్చువల్ ఐడీని క్రియోట్ చేసుకుని ఎంపిన్ పొంది ఉండాలి. తర్వాత వీటన్నింటినీ కలిపి ఒకటే ఐడీగా మార్చుకోవచ్చు. బ్యాంకులు ప్రస్తుతం తమ యాప్ లను యూపీఐకి అనుగుణంగా అప్ గ్రేడ్ చేసుకుంటున్నాయి. కొన్ని యూపీఐ ఎనేబుల్డ్ యాప్ ను విడుదల చేయనున్నాయి. అప్పుడు యూపీఐ యాప్ తో కాకుండా బ్యాంకు యాప్ ల ద్వారా కూడా యూపీఐ సేవలు పొందవచ్చు.  

‘పేమెంట్ చేయడానికి కార్డులు (క్రెడిట్, డెబిట్) ఉన్నాయి. మొబైల్ మనీ, ఇంటర్నెట్ ఈ వ్యాలెట్లు ఉన్నాయి. కానీ, ప్రత్యక్షంగా మొబైల్ ద్వారా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి నగదును పంపుకునే విధానం ఇప్పటి వరకూ లేదు అని యూపీఐ విధానానికి తన సలహాలు అందించిన యూఐడీఏ మాజీ చైర్మన్ నందన్ నీలేకని యూపీఐ యాప్ లాంచ్ కార్యక్రమం సందర్భంగా (ఏప్రిల్ 12న) అన్నారు. 

జూన్ చివరి నాటికి

సో మొబైల్ ఒక్కటి ఉంటే చాలు ఇతరత్రా ఎలాంటి యంత్రాలు అవసరం లేదు. ఎంపిన్, వర్చువల్ ఐడీ గుర్తుంచుకుంటే చాలు. 29 బ్యాంకులు యూపీఐ విధానాన్ని అమలు చేయడానికి అంగీకరించగా... ప్రస్తుతానికి 19 బ్యాంకులు యూపీఐ విధానంలో చేరాయి. జూన్ చివరి నాటికి ఈ పేమెంట్ విధానం అందుబాటులోకి వస్తుందని ఎన్ పీసీఐ తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏర్పాటు చేసిన సంస్థ. ప్రస్తుతం దేశంల ఐదు కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉండగా... రానున్న ఐదేళ్ల కాలంలో వీరి సంఖ్య 50కోట్లకు చేరుకుంటుందని అంచనా. దీన్ని బట్టి భవిష్యత్తు అంతా మొబైల్ లావాదేవీల మయం కానుందని తెలుస్తోంది. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy