ap7am logo

యూకేలో చదువుకోవాలంటే...!

Tue, Apr 18, 2017, 02:06 PM
Related Image

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యున్నత స్థాయి విద్యను యూకే (ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్) లోని విద్యా సంస్థలు అందిస్తున్నాయి. యూకేలో 161 వరకు ఉన్నత విద్యా సంస్థలు ఉండగా… వీటిలో 70 విద్యా సంస్థలకు ప్రపంచ అత్యున్నత విద్యా సంస్థల జాబితాలో చోటు దక్కింది. వీటిలో ఓ నాలుగు 'వరల్డ్ టాప్ టెన్'లో నిలిచాయి.

ఆర్ట్స్, సోషల్ సైన్స్ కోర్సుల కోసం భారతీయులు ఎక్కువగా యూకేను ఆశ్రయిస్తున్నారు.  విద్య తర్వాత అక్కడే ఉద్యోగం చేసుకోవడానికి కూడా అవకాశాలున్నాయి. విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం కావాల్సిన అర్హతల వివరాలను ఆయా యూనివర్సిటీ వైబ్ సైట్ల నుంచి తెలుసుకోవచ్చు. చదువుతూనే స్వతంత్రంగా పరిశోధనలు చేయడం, ఉపాధి అవకాశాల ద్వారా విద్యకు అయ్యే వ్యయంలో కొంత సమకూర్చుకోవచ్చు. యూకే ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ యూత్ సపోర్ట్ కార్యక్రమంలో భాగస్వామి కావచ్చు. దీని ద్వారా చదువుతోపాటే శిక్షణ, ఉద్యోగ అనుభవాన్ని సైతం సొంతం చేసుకోవచ్చు.  

ఖర్చు ఎక్కువే..

యూకేలో చదువుకోవాలనే అభిలాష ఉంటే గనుక వారు ఆర్థికంగా సంపన్నులై ఉండాల్సిందే. ఎందుకంటే ఇక్కడ విద్యా వ్యయం చాలా ఎక్కువ. బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సు ఫీజు ఏడాదికి  17 వేల డాలర్లు (రూ.8 లక్షలు) ఉంటుంది. అదే పీజీ అయితే, మరో లక్ష రూపాయలు అదనంగా ఉంటుంది. క్లినికల్ డిగ్రీలకు ఇంతకంటే ఎక్కువే. జీవన వ్యయంతో కలుపుకుంటే ఏడాదికి 35వేల అమెరికన్ డాలర్లుగా ఉంటుంది. డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ కు ఇంటర్ పూర్తి చేసి ఉండడంతో పాటు ఐఈఎల్టీఎస్ పరీక్షలో 6 లెవల్ కంటే ఎక్కువ స్కోరు చేసి ఉండాలి. కొన్ని యూనివర్సిటీలు 7లెవల్ అడుగుతున్నాయి.representational image

పేరొందిన విద్యా సంస్థలు

యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, కింగ్స్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ సేంట్ ఆండ్ర్యూస్, యూనివర్సిటీ ఆఫ్ వార్ వార్ విక్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్ టర్ తదితర విద్యా సంస్థలకు మంచి పేరుంది. 

రెండు రకాల వీసాలు

విద్యకు సంబంధించి షార్ట్ టర్మ్ స్టడీ వీసా, టైర్ 4 జనరల్ స్టడీ వీసాలు ఉన్నాయి. టైర్ 4 స్టూడెంట్ వీసా కు దరఖాస్తు చేసుకోవాలంటే 40 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. యూకే వీసా అండ్ ఇమిగ్రేషన్ (యూకేవీఐ) ఆమోదం పొందిన యూనివర్సిటీ నుంచి ప్రవేశ ధ్రువీకరణ (సీఏఎస్) పొందాల్సి ఉంటుంది. దీనికి 30 పాయింట్లు. ఇక, కోర్సు ట్యూషన్ ఫీజులు, అక్కడ ఉండేందుకు అవసరమైన ఖర్చులకు సరిపడా నిధుల లభ్యతకు సంబంధించిన ఆధారాలు చూపాలి. దీనికి 10 పాయింట్లు కేటాయించారు. కోర్సు ప్రారంభానికి మూడు నెలల ముందుగా మాత్రమే ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. చదువుకుంటూనే ఉద్యోగం చేసుకోవచ్చు. టైర్ 4 వీసాకు ఐఈఎల్టీఎస్ లేదా సెక్యూర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ (ఎస్ఈఎల్టీ) పూర్తి చేసి ఉండడం తప్పనిసరి. ఆరు నెలలకు మించిన కోర్సు అయితే టైర్4 వీసా కింద భార్యా, పిల్లలను కూడా వెంట తీసుకెళ్లవచ్చు. ఆరు నెలల వ్యవధికి మించి యూకేలో ఉండేందుకు వచ్చే వారి నుంచి హెల్త్ సర్ చార్జ్ వసూలు చేస్తారు. దీని ద్వారా యూకేలో వైద్య సేవలను ఉచితంగా పొందవచ్చు.

షార్ట్ టర్మ్ స్టడీ వీసా

స్వల్ప కాలిక కోర్సు కోసం వచ్చే వారికి దీన్ని జారీ చేస్తారు. దీని ద్వారా ఇంగ్లిష్ భాషా కోర్సు లేదా శిక్షణ వంటి వాటిని తీసుకోవడానికి వీలుంటుంది. డిగ్రీ కోర్సులో భాగంగా స్వల్ప కాలం పాటు పరిశోధనకు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఉద్యోగం చేసుకోవడానికి, వీసా కాలవ్యవధిని పొడిగించుకోవడానికి అవకాశం లేదు. కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లలేరు. నిధుల సాయం పొందలేరు. ఆరు నెలల నుంచి 11 నెలల వరకే ఈ వీసాతో యూకేలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. యూకే వెళ్లడానికి మూడు నెలల ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy