పోస్టాఫీసు పొదుపు పథకాలపై ఆకర్షణీయ వడ్డీ రేట్లు

27-03-2016 Sun 20:19

పోస్టాఫీసు పొదుపు పథకాలు ఎంతో మంది కష్టజీవులకు నమ్మకమైన సురక్షిత పథకాలు. వ్యక్తుల ఆర్థిక స్తోమతను బట్టి ఎన్నో భిన్నమైన తపాలా పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. 

పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్

భారతీయ పౌరులు ఎవరైనా ఈ ఖాతాను తెరిచి బ్యాంకు ఖాతాలవలే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. చెక్ సదుపాయం లేకుండా అయితే కనీసం 50 రూపాయలు నిల్వ ఉంచితే చాలు. అదే చెక్ సదుపాయం కావాలనుకుంటే ఖాతాలో కనీసం 500 రూపాయలు ఎప్పుడూ నిల్వ ఉంచాలి. 

ఖాతాలో నిల్వలపై 4 శాతం వార్షిక ప్రాతిపదికన వడ్డీ చెల్లిస్తారు. వ్యక్తిగతంగానే కాదు, ఇద్దరు లేదా ముగ్గురు కలసి ఉమ్మడిగానూ ఖాతా ప్రారంభించవచ్చు. మైనర్ల పేరుతోనూ ఖాతా ప్రారంభించవచ్చు. ఖాతాలో నిల్వలపై ఏడాదికి వడ్డీ రూపంలో 10వేల వరకు వచ్చే ఆదాయంపై పన్ను ఉండదు. ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు ఖాతాను సులువుగా బదిలీ చేసుకోవచ్చు. మూడేళ్లలో కనీసం ఓ లావాదేవీ అయినా ఉండాలి. లావాదేవీ లేని ఖాతాలను సైలంట్ ఖాతా కింద పరిగణిస్తారు. అంటే మనుగడలో ఉండదు. ఓ లేఖ ఇవ్వడం ద్వారా తిరిగి దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. 

ఏటీఎం/డెబిట్ కార్డుల సదుపాయం కూడా ఉంది. నామినీ రిజిస్ట్రేషన్  చేయించుకున్నట్లయితే... ఒకవేళ ఖాతాదారులు దురదృష్ట వశాత్తూ మరణానికి గురైతే ఖాతాలోని నగదును నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఖాతాదారు మరణ ధ్రువీకరణ పత్రంతో, వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలతో వెళ్లి నిర్ణీత ఫారాన్ని పూర్తి చేసి ఇవ్వాలి. ఒకవేళ నామినీగా ఎవరినీ సూచించకుంటే... వారసులు ఖాతాదారుని మరణ ధ్రువీకరణ పత్రంతో వెళ్లి ఎస్ బీ 84 పత్రాన్ని పూర్తి చేసి, వారసత్వ ధ్రువీకరణ పత్రాలతో క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

రికరింగ్ డిపాజిట్

ఐదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ ఖాతా ద్వారా నెల నెలా కనీసం 10 రూపాయల మొత్తంతో పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంది. గరిష్ఠ పరిమితి లేదు. 2017 ఏప్రిల్ 1 నుంచి ఈ ఖాతాపై వార్షికంగా 7.2 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నారు. ఈ వడ్డీని మూడు నెలలకోసారి లెక్కించి దాన్ని అసలుకు కలుపుతారు. 7.2శాతం వడ్డీ ప్రకారమైతే నెల నెలా పది రూపాయలను ఐదేళ్ల పాటు పొదుపు చేస్తే చివర్లో 723.14 రూపాయలు వస్తాయి.

ఐదేళ్ల తర్వాత ఖాతాను ఏడాదికోసారి చొప్పున మరో ఐదేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. ఖాతాను ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు. ఒక పోస్టాపీసులో ఎన్ని ఖాతాలైనా తెరిచే సౌలభ్యం ఉంది. ఇద్దరు కలసి ఉమ్మడిగానూ తెరవచ్చు. మైనర్ల పేరుతోనూ ప్రారంభించవచ్చు. 15వ తేదీలోపు ఖాతాను ప్రారంభించినట్లయితే నెల నెలా 15వ తేదీలోపు వాయిదా మొత్తాన్ని చెల్లించాలి. 15 తర్వాత ప్రారంభించినట్లయితే నెల నెలా చివరితేదీలోపు వాయిదా మొత్తాన్ని ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. లేకుంటే ప్రతి ఐదు రూపాయలకు ఐదు పైసల చొప్పున జరిమానా విధిస్తారు. ఇలా నాలుగు నెలల పాటు వాయిదా మొత్తాలను చెల్లించడంలో విఫలమైతే ఖాతాను నిలిపివేస్తారు. ఆ తర్వాత రెండు నెలల్లోపు తిరిగి దాన్ని కొనసాగించుకోవడానికి వెసులుబాటు ఉంది. అప్పటికీ స్పందన లేకపోతే ఆ ఖాతాను మూసివేస్తారు. ఆరు నెలల వాయిదాల మొత్తాన్ని ముందు చెల్లించేట్లయితే కొంత రిబేట్ ఉంది. ఏడాది తర్వాత 50 శాతం మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు ఒకసారి అవకాశం ఇస్తారు. 

పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ అకౌంట్

ఇది కూడా డిపాజిట్ పథకమే. కనీసం 200 రూపాయల డిపాజిట్ స్వీకరిస్తారు. ఆ తర్వాత 200 రూపాయల చొప్పున అదనంగా ఎన్ని రెట్లు అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. ఏడాది కాల వ్యవధి టైమ్ డిపాజిట్ పై వడ్డీ రేటు 2017 ఏప్రిల్ 1 నుంచి 6.9 శాతంగా అమలవుతోంది. రెండేళ్ల డిపాజిట్ పై వడ్డీ రేటు 7 శాతం, మూడేళ్ల డిపాజిట్ పై 7.2 శాతానికి, ఐదేళ్ల డిపాజిట్ పై వడ్డీ రేటు 7.7  శాతంగా ఉంది. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల కాల వ్యవధికి డిపాజిట్లు చేసుకోవచ్చు.

ఖాతాను ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు. ఒక పోస్టాపీసులో ఎన్ని ఖాతాలైనా నిర్వహించుకోవచ్చు. ఇద్దరు కలసి కూడా ఖాతా ప్రారంభించవచ్చు. మైనర్ల పేరుతోనూ డిపాజిట్ చేసుకోవచ్చు. ఏడాది లోపే డిపాజిట్ ఖాతాను మూసివేస్తే సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటును మాత్రమే చెల్లిస్తారు. టైమ్ డిపాజిట్లలో పెట్టే పెట్టుబడికి సెక్షన్ 80సీ ప్రకారం ఆదాయపన్ను మినహాయింపు వర్తిస్తుంది. 

నెలసరి ఆదాయ పథకం (మంత్లీ ఇన్ కమ్ అకౌంట్ స్కీమ్)

నెలనెలా ఆదాయం కోరుకునే వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఒకరిపేరుతో గరిష్ఠంగా 4.5 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకోవడానికి పరిమితి ఉంది. జాయింట్ అకౌంట్ అయితే ఈ పరిమితి 9 లక్షల రూపాయలు. 7.6 శాతం వార్షిక వడ్డీని (అంటే 12 నెలలతో భాగించి) నెలనెలా చెల్లిస్తారు. ఏ ఆదాయం లేని వారు ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా నెలనెలా ఆదాయం పొందవచ్చు. లేఖ ఇస్తే నెలనెలా వడ్డీని పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. ఖాతాను ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు. ఎన్ని ఖాతాలైనా ప్రారంభించవచ్చు. కానీ అన్నింటికీ కలిపి 4.5 లక్షల పెట్టుబడి వరకే పరిమితి ఉంటుంది. పది సంవత్సరాల వయసు పైబడిన మైనర్ల పేరుమీద కూడా ప్రారంభించేందుకు అవకాశం ఉంది. ఇద్దరు లేదా ముగ్గురు కూడా కలసి ఖాతా ప్రారంభించవచ్చు. 

కాల వ్యవధి ఐదేళ్లు. ఏడాది తర్వాత నుంచి మూడేళ్లలోపు డిపాజిట్ ను వెనక్కి తీసుకుంటే మొత్తం డిపాజిట్ విలువలో 2 శాతాన్ని కోత కోసుకుని మిగతా మొత్తం చెల్లిస్తారు. మూడేళ్ల తర్వాత అయితే, డిపాజిట్ విలువలో ఒక శాతాన్ని మినహాయించుకుంటారు. మూలంలో పన్ను కోత లేకపోవడం ఆకర్షణీయం.  

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్

ఈ పెద్దల పొదుపు పథకంపై వడ్డీ రేటు ఆకర్షణీయంగా 8.40 శాతం ఉంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ నెల చివరి తేదీల్లో ఈ వడ్డీని పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలో జమచేస్తారు. 

కనీసం 1000 రూపాయలు... గరిష్ఠంగా 15 లక్షల రూపాయలు ఈ పథకం కింద పెట్టుబడి పెట్టవచ్చు. 60 ఏళ్ల వయసు వారు లేదా ఆపై వయసు వారు ఇందులో పెట్టుబడికి అర్హులు. ముందస్తు పదవీ విరమణ తీసుకున్నవారు 55 ఏళ్ల నుంచి ఇందులో చేరవచ్చు.  పదవీ విమరణ నగదు ప్రయోజనాలు అందుకున్న నెలలోపు ఈ పథకంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కాల వ్యవధి ఐదేళ్లు. 

వ్యక్తిగతంగానూ, జీవిత భాగస్వామితో కలసి కూడా ఒకటి లేదా అంతకుమించిన ఖాతాలను నిర్వహించుకునే సౌలభ్యం ఉంది. అయితే, వ్యక్తిగత గరిష్ఠ పరిమితి 15 లక్షలు అన్నింటికి కలిపి వర్తిస్తుంది. లక్ష రూపాయల వరకు నగదు రూపంలో డిపాజిట్ చేసేందుకు అనుమతిస్తారు. అంతకుమించిన విలువ మొత్తం అయితే చెక్ రూపంలోనే తీసుకుంటారు. ఖాతాను మరో పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు. ఏడాది తర్వాత ముందస్తుగా డిపాజిట్ రద్దు చేసుకోవచ్చు. ఇందుకు 1.5శాతం మొత్తాన్ని డిపాజిట్ నుంచి మినహాయించుకుంటారు. రెండేళ్ల తర్వాత రద్దు చేసుకుంటే కేవలం 1 శాతాన్ని మాత్రమే మినహాయించుకుంటారు. 

సాధారణ కాలావధి ఐదేళ్లు కాగా, ఆ తర్వాత మరో మూడేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. అయితే, ఐదేళ్ల తర్వాత ఎప్పుడు రద్దు చేసుకున్నా ఎటువంటి కోత విధించరు. ఏడాదికి 10వేల రూపాయలకు మించి వడ్డీ ఆదాయం ఉంటే మూలం వద్ద పన్ను కోత ఉంటుంది. అయితే ఈ పథకంలో పెట్టే పెట్టుబడికి సెక్షన్ 80సీ ఆదాయపన్ను మినహాయింపు వర్తిస్తుంది. 

15 ఏళ్ల ప్రజాభవిష్యనిధి (పీపీఎఫ్)

దీర్ఘకాలంలో నిర్ణీత అవసరాల కోసం ఈ పథకం అనువైనది. నెల నెలా కొంత మొత్తం పొదుపు చేయడం ద్వారా 15 ఏళ్ల తర్వాత గరిష్ఠ మొత్తాన్ని అందుకోవచ్చు. 7.9 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఏడాదికోసారి వడ్డీని అసలుకు కలుపుతారు.  

ఏడాదిలో కనీసం 500 రూపాయలు, గరిష్ఠంగా 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఏడాదికోసారి లేదా నెలనెలా ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రతి నెల 5వ తేదీ నుంచి ఆ నెల చివరి తేదీ వరకు ఖాతాలో ఉన్న మొత్తంపైనే వడ్డీ లెక్కిస్తారు. కనుక 5వ తేదీ లోపు డిపాజిట్ చేయడం వల్ల వడ్డీ పొందవచ్చు.  ఇందులో పెట్టుబడికి సెక్షన్ 80సీ ప్రకారం ఆదాయపన్ను మినహాయింపు ఉంది. పెట్టుబడిపై వడ్డీ కూడా పూర్తిగా పన్నురహితం. 

ఉమ్మడి ఖాతా నిర్వహణకు అవకాశం లేదు. ఇప్పటికే పీపీఎఫ్ ఖాతా ఉన్నవారు  మైనర్ పేరుతో విడిగా మరో ఖాతా ప్రారంభించుకోవచ్చు. అయితే, గరిష్ఠ పెట్టుబడి పరిమితి 1.50లక్షలుగానే ఉంటుంది. 15 ఏళ్లకు మెచ్యూరిటీ అవుతుంది. ఆ తర్వాత కావాలంటే మరో ఐదేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. పొడిగించిన కాలానికి చందా చెల్లించాలన్న నిబంధనేమీ లేదు. 15 ఏళ్లకు ముందు ఖాతా మూసివేసే అవకాశం లేదు. ఒక వేళ ఖాతాదారుడు మరణించినట్లయితే నామినీ లేదా వారసులు ఖాతా మూసివేసుకోవచ్చు. 

ఖాతా ప్రారంభించిన ఏడేళ్ల తర్వాత పార్షిక మొత్తంలో ఉపసంహరణకు అవకాశం ఉంది. మూడో ఏడాది చివరి నుంచి కావాలంటే రుణం తీసుకోవచ్చు. పీపీఎఫ్ ఖాతాదారుడు ఎవరికైనా బకాయిపడి ఉంటే... కోర్టులు సైతం వారి పీపీఎఫ్ ఖాతాలోని నగదును అటాచ్ చేయవు. కనుక ఇందులో పెట్టుబడులు పూర్తిగా సురక్షితం. 

ఎన్ఆర్ఐలు ఈ ఖాతా ప్రారంభించేందుకు అవకాశం లేదు. తల్లిదండ్రులు తమ చిన్నారుల పేరుతోనూ ఈ ఖాతా ప్రారంభించుకునే సదుపాయం ఉంది. అయితే దాన్ని తల్లిదండ్రుల ఖాతాగానే పరిగణిస్తారు.  పాస్ పోర్టు సైజు ఫొటో, పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ, నివాసిత ధ్రువీకరణ పత్రం ఖాతా ప్రారంభించేందుకు అవసరం. ఒకరి పేరిట వారి జీవిత కాలంలో ఒక పీపీఎఫ్ ఖాతా మాత్రమే కలిగి ఉండాలి. మరో ఖాతా ఉన్నట్టు బయటపడితే రెండో ఖాతాను మూసివేసి అందులో అసలు మొత్తాన్ని వడ్డీ లేకుండా తిరిగి చెల్లిస్తారు. 

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (జాతీయ పొదుపు పత్రాలు)

దీర్ఘకాలానికి డిపాజిట్ చేసుకునేందుకు ఉద్దేశించినది. 7.9 శాతం వార్షిక వడ్డీ అమల్లో ఉంది. కనీసం 100 రూపాయలు ఆ తర్వాత 100 రూపాయల చొప్పున డిపాజిట్ చేసుకోవచ్చు. తమ పేరిట లేదా చిన్నారుల పేరిట ఈ పత్రాలను కొనుగోలు చేసుకోవచ్చు. ఒక ఏడాదిలో ఈ పథకంలో లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ మొత్తానికి సెక్షన్ 80సీ ప్రకారం ఆదాయపన్ను రాయితీ ఉంది. డిపాజిట్ పత్రాలను కాల వ్యవధిలోపే ఒక్కసారికి మాత్రమే ఇతరుల పేరు మీదకు మారుస్తారు. వడ్డీ ఆదాయంపై మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) లేదు. 

కిసాన్ వికాస పత్ర

బాగా ప్రాచుర్యం పొందిన ఇన్వెస్ట్ మెంట్ సాధనం ఇది. ప్రస్తుతం 7.6 వడ్డీ రేటు అమల్లో ఉంది. కనీస మొత్తం వెయ్యి రూపాయలు. 5వేలు, 10వేలు, 50వేల మొత్తాల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. పెద్దలు తమ పేరు మీద లేదా చిన్నారుల పేరు మీద కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు. అలాగే, ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు. కొనుగోలు చేసిన రెండున్నరేళ్ల తర్వాత కావాలంటే నగదుగా మార్చుకునే సౌలభ్యం ఉంది.

సుకన్య సమృద్ధి యోజన

ఆడపిల్లల తల్లిదండ్రులు వారి వివాహం విషయమై ఎంతోకొంత ఆందోళన చెందుతుండడం సహజంగా చూస్తుంటాం. ఏ చిన్న లోటు లేకుండా అమ్మాయి వివాహం ఘనంగా జరిపించి అత్తవారింటికి పంపించాలని ఆశ పడడంలో అత్యాశ ఏమీ లేదు. అలాంటి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందే సుకన్య సమృద్ధి యోజన పథకం. పోస్టాఫీసు లేదా జాతీయ బ్యాంకులు వేటిలోనయినా దీన్ని ప్రారంభించవచ్చు.

ఆడ పిల్లలున్న తల్లిదండ్రులు వారి పేరు మీద పొదుపు చేయడం ద్వారా 21 ఏళ్లు వచ్చే సరికి పెద్ద మొత్తంలో అందుకునేందుకు ఈ పథకం వీలు కల్పిస్తుంది. తొలుత 9.2శాతం వార్షిక వడ్డీ రేటు ఉండగా ప్రభుత్వం దాన్ని 2017 ఏప్రిల్ 1 నుంచి 8.4కు తగ్గించింది. వార్షిక ప్రాతిపదికన వడ్డీరేటును అసలు మొత్తానికి కలుపుతారు. పాప పేరు మీద ఖాతా తెరిచి ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా వెయ్యి రూపాయలు, గరిష్ఠంగా 1.50 లక్షల వరకు ఆ ఖాతాలో జమ చేసుకోవచ్చు. ఒక తండ్రి లేదా గార్డియన్ రెండు ఖాతాలు మాత్రమే తెరిచేందుకు అవకాశం ఉంది. అంటే ఇద్దరు కమార్తెల వరకే ఈ అవకాశం. గరిష్టంగా 10 ఏళ్ల వయసు వచ్చే వరకు బాలికల పేరుమీద ఖాతా ప్రారంభించవచ్చు. పదేళ్లు దాటితే అవకాశం లేదు.

ఒకవేళ ఒక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తం జమ చేయలేకపోతే 50 రూపాయల జరిమానా చెల్లించడం ద్వారా ఆలస్యంగానూ చెల్లించవచ్చు. బాలిక 18 ఏళ్ల వయసుకు రాగానే గరిష్ఠంగా 50 శాతం మొత్తాన్ని ఆమె విద్యావసరాలకు తీసుకునేందుకు అనుమతిస్తారు. ఒకవేళ బాలికకు 18 ఏళ్లకే పెళ్లి కుదిరితే ఖాతా మూసేసి పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. పథకం గడువు 21 ఏళ్లు. 21 ఏళ్ల తర్వాత ఖాతా మూసివేయకుంటే అప్పుడు అమల్లో ఉన్న వడ్డీరేటును చెల్లిస్తారు. 

పాప పుట్టిన తేదీ సర్టిఫికెట్, తల్లిదండ్రుల లేదా సంరక్షకుల నివాస ధ్రువీకరణ పత్రం, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలతో పోస్టాఫీసు లేదా బ్యాంకుకు వెళ్లి నిర్ణీత దరఖాస్తును నింపి మొదటి చందాగా వెయ్యి రూపాయలు చెల్లించినట్టయితే ఖాతా ప్రారంభించి పాస్ బుక్ జారీ చేస్తారు. ఖాతా ప్రారంభించేందుకు బాలికను వెంట తీసుకెళ్లాల్సిన అసవరం లేదు. ప్రతీ సారి వెయ్యి రూపాయలు లేదా ఆ తర్వాత 100 రూపాయల చొప్పున అదనంగా డిపాజిట్ చేసుకోవచ్చు. గడువు తీరిన తర్వాత అసలు, వడ్డీపై ఎలాంటి పన్ను భారం లేదు. ఈ పథకం వివరాలు, గడువు తీరిన తర్వాత ఎంత మొత్తం వస్తుందన్న వివరాలను 

http://www.indiapost.gov.in/SukanyaSamriddhi.aspx, 

http://www.sukanyasamriddhiaccountyojana.in/ssa-ssy-in-post-office/,   

http://moneyexcel.com/9612/sukanya-samriddhi-account-calculator-download వెబ్ సైట్ ల నుంచి తెలుసుకోవచ్చు. 


More Articles
Advertisement 1
Telugu News
Actress Preetika Chauhan found red handed while buying drugs
డ్రగ్స్ కొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన నటి ప్రీతికా చౌహాన్
29 minutes ago
Advertisement 36
Trump has no love or affection for Americans Obama harsh criticism
ట్రంప్ కు అమెరికన్లపై ప్రేమ, అభిమానం లేదు: ఒబామా తీవ్ర విమర్శలు
38 minutes ago
Tension at Mangaligiri police station
అట్రాసిటీ కేసును వెనక్కి తీసుకోలేమన్న పోలీసులు.. మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
52 minutes ago
 Imran Khan angry over French president
ఫ్రాన్స్ అధ్యక్షుడిపై ఇమ్రాన్ ఖాన్ మండిపాటు!
52 minutes ago
Fadnavis now understands how serious the corona condition is Sanjay Routh
కరోనా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఫడ్నవిస్ కు ఇప్పుడు అర్థమై ఉంటుంది: సంజయ్ రౌత్
1 hour ago
CSK wins over RCB in IPL
ఎట్టకేలకు ఐపీఎల్ లో మరో విజయం సాధించిన చెన్నై
1 hour ago
AP High Court Stay on GITAM University Wall Demolish
గీతం యూనివర్శిటీ కట్టడాల కూల్చివేతపై నవంబర్ 30వరకు స్టే
1 hour ago
PM Has Decided When There Will Be War With China and Pak says UP BJP Chief
చైనా, పాకిస్థాన్ తో యుద్ధ ఎప్పుడు చేయాలనేది మోదీ డిసైడ్ చేశారు: యూపీ బీజేపీ చీఫ్
3 hours ago
Mohan Bhagawat knows the truth says Rahul Gandhi
మోహన్ భగవత్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందన
4 hours ago
MLA candidate murdered in Bihar
ప్రచారసభలోనే ఎమ్మెల్యే అభ్యర్థిని హత్య చేసిన దుండగులు
4 hours ago
New Corona cases in AP comes below 3K
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
5 hours ago
kapil discharges from hospital
ఆసుపత్రి నుంచి కపిల్ దేవ్ డిశ్చార్జ్.. ఫొటో పోస్ట్ చేసిన చేతన్ శర్మ
5 hours ago
We will build big Sita maatha temple says Chirag Pashwan
అయోధ్య రామాలయం కంటే పెద్దదైన సీతామాత ఆలయాన్ని నిర్మిస్తాం: చిరాగ్
5 hours ago
akhil comes to bigboss house
బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు డబుల్ కిక్... సమంతతో పాటు అఖిల్.. వీడియో ఇదిగో
5 hours ago
No vendetta in Gitam demolition says Botsa
గీతం కూల్చివేతలో కక్షసాధింపు లేదు.. పోలవరం కట్టి తీరుతాం: బొత్స
5 hours ago
suma wishes with husband
భర్తతో కలిసి వీడియో.. దసరా శుభాకాంక్షలు తెలిపిన యాంకర్ సుమ
5 hours ago
Priety Zinta reaction after her team wins in IPL
విజయానందంలో ప్రీతి జింతా రియాక్షన్.. వైరల్ అవుతున్న ఫొటోలు!
6 hours ago
Ammoru Thalli official Telugu trailer Nayanthara Nov 14
నేనే అమ్మవారిని అంటోన్న నయన్.. మహేశ్ విడుదల చేసిన ‘అమ్మోరు తల్లి’ ట్రైలర్ అదుర్స్!
6 hours ago
Want tension at border to end says Rajnath Singh
సరిహద్దులో ఉద్రిక్తతలు ముగిసిపోవాలని ప్రార్థించా: శస్త్ర పూజ తర్వాత రాజ్ నాథ్ సింగ్
6 hours ago
modi dasara greetings
ప్రముఖుల విజయ దశమి శుభాకాంక్షలు.. మోదీ సందేశం
6 hours ago