ఎల్ అండ్ టీ మెట్రో రైలు ఆగే స్టేషన్లు... స్టేషన్లలో సమస్త సదుపాయాలు ఇవే...!

22-11-2017 Wed 11:32

భాగ్యనగరంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రాకపోకలను సులభతరం చేస్తూ ఎల్ అండ్ టీ మెట్రో రైళ్లు కూత పెట్టేశాయి. ప్రధాని మోదీ పచ్చజెండా ఊపడంతో మియాపూర్ నుంచి నాగోల్ వరకు ప్రయాణించేందుకు మార్గం అందుబాటులోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో మెట్రో రైలు మార్గాలు, వాటిలో రైలు ఎక్కడెక్కడ ఆగేదీ, ఆయా స్టేషన్లు, సౌకర్యాలు, అత్యాధునిక వ్యవస్థలు, ఇతర విశేషాల సమాహారం ఈ కథనం...


హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మూడు కారిడార్లు. నిడివి 71 కిలోమీటర్లు. మూడు మార్గాల్లో కలిపి 66 అల్ట్రా మోడర్న్ రైల్వే స్టేషన్లు ఉంటాయి.

కారిడార్ 1 : మియాపూర్ నుంచి ఎల్ బీ నగర్ వరకు.
కారిడార్ 2 : జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుంచి ఫలక్ నుమా వరకు
కారిడార్ 3 : నాగోలు నుంచి శిల్పారామం వరకు

representational imageఈ మూడు కారిడార్లలో ప్రతీ కారిడార్ ఒక్క చోట మరో కారిడార్ తో అనుసంధానం అవుతుంది. కారిడార్ 1, 3 ఈ రెండూ కూడా అమీర్ పేట స్టేషన్ వద్ద కలుస్తాయి. కారిడార్ 1, 2 ఎంజీబీఎస్ వద్ద ఏకమవుతాయి. కారిడార్ 2, 3 పరేడ్ గ్రౌండ్స్ స్టేషన్ వద్ద అనుసంధానం అవుతాయి. ఇవి ఇంటర్ చేంజింగ్ స్టేషన్లు. అంటే ఒక కారిడార్ నుంచి వచ్చి వేరే కారిడార్ కు వెళ్లాలనుకుంటే ఇక్కడ రైలు మారాల్సి ఉంటుంది. ఉదాహరణకు మియాపూర్ నుంచి మాదాపూర్ కు వెళ్లాలనుకునే వారు రైల్లో అమీర్ పేట స్టేషన్ కు వచ్చి ఇక్కడి నుంచి కారిడార్ 3లో శిల్పారామం వైపు వెళ్లే రైలు ఎక్కాల్సి ఉంటుంది.

కారిడార్ 1
మియాపూర్ నుంచి ఎల్ బీ నగర్ వరకు 29 కిలోమీటర్ల మార్గంలో స్టేషన్లు 27. మియాపూర్, జేఎన్ టీయూ కాలేజీ, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, బాలానగర్, మూసాపేట్, భరత్ నగర్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ, నాంపల్లి, గాంధీ భవన్, ఉస్మానియా మెడికల్ కాలేజీ, మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్), మలక్ పేట, న్యూ మార్కెట్, మూసారాంబాగ్, దిల్ షుక్ నగర్, చైతన్యపురి, విక్టోరియా మెమోరియల్, ఎల్బీనగర్.

కారిడార్ 2
representational imageజూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుంచి ఫలక్ నుమా వరకు. 15 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 16 స్టేషన్లు ఉంటాయి. జేబీఎస్, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషేర్ గంజ్, జంగమెట్ట, అసెంబ్లీ, నాంపల్లి, గాంధీ భవన్, ఫలక్ నుమా. ఈ మార్గంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు (పాతబస్తీ) 6 కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. రాజకీయ పరమైన కారణాలే ఇందుకు కారణం.

కారిడార్ 3
నాగోల్ నుంచి శిల్పారామం వరకు మార్గం కారిడార్ 3 కింద ఉంటుంది. 28 కిలోమీటర్ల ఈ మార్గంలో 23 స్టేషన్లు ఉంటాయి. నాగోల్, ఉప్పల్, సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, హబ్సిగూడ, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్స్, ప్యారడైజ్, రసూల్ పుర, ప్రకాష్ నగర్, బేగంపేట, అమీర్ పేట, మధురానగర్, యూసఫ్ గూడ, రోడ్డు నంబర్ 5 జూబ్లిహిల్స్, జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మ టెంపుల్, మాధాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ, శిల్పారామం.

స్టేషన్, మెట్రో మార్గం
representational imageజంట నగరాల్లో ప్రజలు రవాణాకు ఎక్కువగా వినియోగించుకుంటున్నది బస్సులు, సొంత వాహనాలే. కనుక రోడ్డు మార్గంలో మధ్యలో పిల్లర్ వేసి దానిపైన ట్రాక్, స్టేషన్లు వచ్చేలా కాంటీలీవర్ డిజైన్ విధానంలో రూపకల్పన చేశారు. దీనివల్ల రోడ్డు మార్గంలో యథావిధిగా వాహనాలు వెళుతుంటాయి. పై మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తుంటాయి. దీంతో మెట్రో రైలు దిగిన వెంటనే మరో ప్రాంతానికి బస్సు ద్వారా సులభంగా వెళ్లడం సాధ్యమవుతుంది. రోడ్డు మధ్యలోనే పిల్లర్లు వేసి మెట్రో రైలు నిర్మించే డిజైన్ వెనుక మరో ప్రధాన కారణం భూ సమీకరణ అవసరం లేకపోవడం. చాలా ప్రాంతాల్లో రహదారులు విశాలంగా లేకపోవడంతో 20 మీటర్ల వెడల్పు, 140 మీటర్ల పొడవుతో స్టేషన్ నిర్మాణానికి తుది ప్రణాళిక ఖరారైంది. ఇంటర్ చేంజ్ స్టేషన్లు అయిన అమీర్ పేట, పరేడ్ గ్రౌండ్స్, ఎంజీబీఎస్ వద్ద స్టేషన్లు కాంటీలీవర్ డిజైన్ కాకుండా భిన్నమైన డిజైన్ తో ఉంటాయి. పిల్లర్లపై మెట్రో మార్గంలో రెండు ట్రాక్ లు ఉంటాయి. ఒకటి అప్ లైన్ ఒకటి డౌన్ లైన్. కాకపోతే కింది నుంచి ఒకటే ట్రాక్ ఉన్నట్టు అనిపిస్తుంటుంది.

స్టేషన్ స్వరూపం
representational imageమెట్రో రైలు మార్గంపైన ఇంచుమించుగా ప్రతీ కిలోమీటర్ దూరానికి ఒక స్టేషన్ ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ అత్యాధునికంగా ఉంటుంది. స్టేషన్ రెండు అంతస్తులు (లెవల్స్) ఉంటుంది. రోడ్డు నుంచి 8 మీటర్ల ఎత్తు (26 అడుగులు)లో మొదటి లెవల్ (కన్ కోర్స్ లెవల్). ఇక్కడికి మెట్లు, ఎస్కలేటర్లు, లిఫ్ట్ ల ద్వారా చేరుకోవచ్చు. వృద్ధులు, వికలాంగులు వీల్ చెయిర్ల సాయం తీసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక సిబ్బంది కూడా ఉంటారు. ప్రతీ స్టేషన్ కు రెండు వైపులా రెండు మార్గాలుంటాయి. అలాగే, ఎస్కలేటర్లు, లిఫ్ట్ లు ఉంటాయి. మెదటి లెవల్ రెండు భాగాలుగా ఉంటుంది. ముందు భాగంలో ఉచితంగా సంచరించే ప్రాంతం. ఇక్కడ షాపులు, టికెట్ కౌంటర్లు ఉంటాయి. టికెట్లు తీసుకున్న వారిని లేదా మెట్రో స్మార్ట్ కార్డులను కలిగిన వారినే అక్కడి నుంచి పెయిడ్ ఏరియాకు వెళ్లడానికి అనుమతిస్తారు. అలాగే, అక్కడి నుంచి రెండో లెవల్ (ప్లాట్ ఫామ్ లెవల్) కు వెళ్లొచ్చు. ఇది పూర్తిగా పెయిడ్ ఏరియా. రెండో లెవల్ లో ట్రాక్, ప్లాట్ ఫామ్ ఉంటాయి. రెండో లెవల్ భూమి నుంచి 12 మీటర్ల ఎత్తులో (40 అడుగులు) ఉంటుంది. స్టేషన్ ప్రవేశ మార్గం నుంచి రైలు ఎక్కే రెండో లెవల్ కు చేరుకునేందుకు రెండు నిమిషాల సమయం తీసుకుంటుంది. మెట్రో మార్గంలో ప్రధాన బస్ స్టేషన్ల నుంచి మెట్రో స్టేషన్ లోకి వంతెనలు ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల బస్సు దిగిన ప్రయాణికులు రోడ్డుపైకి వెళ్లే అవసరం లేకుండా నేరుగా మెట్రో స్టేషన్ కు సులభంగా చేరేందుకే ఈ ఏర్పాటు.

అమీర్ పేట స్టేషన్ దేశంలోనే అతిపెద్దది
నగరంలో మూడు ఇంటర్ చేంజ్ స్టేషన్లలో అమీర్ పేట ఇంటర్ చేంజ్ స్టేషన్ కు ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఇది దేశంలోనే అతిపెద్దది. 40 మీటర్ల వెడల్పు, 142 మీటర్ల పొడువుతో ఉంటుంది. స్టేషన్ కు నలువైపులా 8 లిఫ్ట్ లు, 16 ఎస్కలేటర్లు, మెట్ల మార్గాలున్నాయి. స్టేషన్ ప్రాంగణమంతా పూర్తిగా ఎయిర్ కండీషనింగ్ తో ఉంటుంది. గ్రానైట్ ఫ్లోరింగ్, షాప్ లు, వినోద కేంద్రాలు, మూడు అంతస్తులతో విమానాశ్రయాన్ని తలపిస్తుంది. ఇంటర్ చేంజ్ స్టేషన్లలో ఎక్కువ రద్దీ ఇక్కడే ఉంటుందని అంచనా. దాంతో ఏక కాలంలో 40వేల మంది ప్రయాణికుల రద్దీ తట్టుకునే విధంగా డిజైన్ చేశారు.

టికెటింగ్ వ్యవస్థ
రైలు టికెట్లను స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసిన కౌంటర్ల నుంచి తీసుకోవచ్చు. టికెట్ల కోసం సమయం వృథా కాకుండా వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేశారు. ఈ వెండింగ్ మెషిన్ నుంచి సైతం టికెట్ పొందొచ్చు. దీనికి తోడు ప్రతీ సారి టికెట్ తీసుకోవాల్సిన ఇబ్బంది లేకుండా నిరంతరం ప్రయాణించే వారి సౌకర్యార్థం స్మార్ట్ కార్డులు కూడా ఉంటాయి. ఈ స్మార్ట్ కార్డును రీడ్ చేసే మెషిన్లు ప్రవేశ మార్గం వద్ద ఉంటాయి. గేట్ దగ్గర ఈ కార్డును చూపిస్తే మెషిన్ రీడ్ చేస్తుంది. ఆ తర్వాత గేట్ తెరుచుకుంటుంది. ప్రయాణం ముగిసి తిరిగి బయటకు వెళ్లే సమయంలోనూ కార్డును రీడర్ దగ్గర చూపించాలి. దాంతో మీ ప్రయాణానికి తగిన చార్జీ కార్డు నుంచి డెబిట్ అవుతుంది.  
టికెట్ కొనుగోలు చేస్తే ప్రయాణికుడికి ప్లాస్టిక్ టోకెన్ ను ఇస్తారు. దాన్ని ఆటోమేటిక్ కలెక్షన్ గేట్ దగ్గర రీడర్ పై ఉంచితే వెళ్లేందుకు గేట్ తెరుచుకుంటుంది. తిరిగి ఆ టోకెన్ ను వెంట తీసుకుని వెళ్లాలి. ప్రయాణం ముగిసి తిరిగి స్టేషన్ నుంచి బయటకు వెళ్లాలంటే గేట్ తెరుచుకునేందుకు గాను టోకెన్ ను ఆటోమేటిక్ కలెక్షన్ గేట్ వద్ద బాక్స్ లో వేయాలి. ప్రయాణం ముగిసింది కాబట్టి టోకెన్ బయటకు రాదు. టికెట్ కొనుగోలు చేసిన తర్వాత 29 నిమిషాల్లోపు స్టేషన్ లోకి ప్రవేశించాలి. 29 నిమిషాల సమయం దాటితే ఆ టికెట్ చెల్లుబాటు కాదు. స్టేషన్ లో షాపింగ్ చేసేందుకు వీలుగా దుకాణాలు కూడా ఉంటాయి. స్టేషన్ల ప్రవేశ మార్గం వద్ద బ్యాగులను స్కానింగ్ చేసే యంత్రాలు, స్టేషన్ లోపల, పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు కూడా ఉంటాయి. అగ్ని ప్రమాదం జరిగితే తక్షణమే బయటకు వెళ్లేందుకు అత్యవసర మార్గాలు, అగ్ని నిరోధక యంత్రాలు ఉంటాయి. స్టేషన్ల వద్ద భద్రతగా పోలీసులతోపాటు ఎల్ అండ్ టీ రక్షణ సిబ్బంది కూడా ఉంటారు.

పది నిమిషాలకో రైలు
representational imageమెట్రో రైళ్లన్నీ కూడా పూర్తిగా ఏయిర్ కండిషన్డ్ తో కూడినవే. వేసవిలో ఇబ్బంది లేకుండా ప్రయాణం హాయిగా చేసేయవచ్చు. ప్రారంభంలో ప్రతీ రైలుకు మూడు కోచ్ లు ఉండేలా ప్లాన్ చేశారు. ఒక ట్రిప్ లో 1,000 మంది వరకు ప్రయాణించొచ్చు. కాకపోతే 126 మంది మాత్రమే కూర్చుని ప్రయాణించేందుకు సీిటింగ్ ఉంటుంది. మిగిలిన వారు నించుని ప్రయాణించాల్సి ఉంటుంది. రైలు పట్టాలకు అతుకులు లేకుండా అత్యాధునికంగా ఏర్పాటు చేయడం వల్ల కుదుపులు అంతగా ఉండవు. అలాగే, రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ మాదిరిగా మెట్రో రైళ్లకు అంతరాయాలు ఏమీ ఉండవు. దీంతో ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గిపోతుంది. ఏసీ వసతి ఉండడం వల్ల మెట్రో రైలు కోచ్ ల తలుపులు పూర్తిగా క్లోజ్ అయి ఉంటాయి. స్టేషన్ లో ఆగినప్పుడే తలుపులు తెరుచుకుంటాయి.

రైళ్లు అధిక ఫ్రీక్వెన్సీతో నడుస్తాయి. పెద్దగా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రతీ మార్గంలోనూ ప్రతి 10 నిమిషాలకో రైలు నడుస్తుంటుంది. రద్దీనిబట్టి అవసరమైతే ప్రతీ 5 నిమిషాలకూ సర్వీస్ నడిపే అవకాశం ఉంది. అలాగే, రద్దీ పెరిగితే ప్రతి మూడు నిమిషాలకో రైలు, ప్రతీ రెండు నిమిషాలకో రైలు చొప్పున నడిపేలా ప్రణాళిక ఉంది. అలాగే, ప్రారంభంలో రైలుకు మూడు కోచ్ లే ఉంటాయి. రద్దీ పెరిగితే ప్రతీ రైలుకు గరిష్టంగా ఆరు కోచ్ లు ఏర్పాటు చేస్తారు. ప్రతీ స్టేషన్ లో రైలు 20 సెకన్ల పాటు ఆగుతుంది. ఇంటర్ చేంజ్ స్టేషన్లలో మాత్రం ప్రతీ రైలు రెండు నిమిషాల పాటు ఆగుతుంది. ఆరు కోచ్ లు ఆగేందుకు సరిపడా పొడవుతో స్టేషన్ల నిర్మాణం ఉంటుంది. 140 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు తో ఉంటాయి.  రైలు కోచ్ లను స్టెయిన్ లెస్ స్టీల్, అల్యూమినియంతో తయారు చేయించారు. దీనివల్ల ట్రాక్ లపై, పిల్లర్లపై పెద్ద లోడ్ పడదు. ప్రతీ కోచ్ లోపల ఎల్ సీడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దీనిలో రూట్ మ్యాప్ కనిపిస్తుంటుంది. అలాగే, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రస్తుత స్టేషన్, రాబోయే స్టేషన్ల సమాచారం అనౌన్స్ మెంట్ రూపంలో వినిపిస్తుంటుంది. అంగవైకల్యం కలిగిన వారు ప్రయాణించేలా వారికి ప్రత్యేక స్థలం కేటాయించారు. ప్రతీ రైలునూ రోజూ బ్యాక్టీరియా రహితంగా శుభ్రం చేస్తారు.

అత్యాధునిక టెక్నాలజీల వినియోగం
representational imageహైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో అత్యాధునిక సమాచార ఆధారిత రైలు నియంత్రిత విధానం (సీబీటీసీ) ఏర్పాటు చేశారు. అంటే అత్యాధునిక సిగ్నల్ వ్యవస్థ, సమాచార వ్యవస్థ ఉంటుంది. ఉప్పల్ లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్, రైలు ఆపరేటర్, స్టేషన్ కంట్రోలర్ల మధ్య నిరంతరం సంప్రదింపులు జరుగుతూనే ఉంటాయి. రైలులో ముందూ వెనుక ఇద్దరు ఆపరేటర్లు ఉన్నప్పటికీ వారు పర్యవేక్షణకే పరిమితం అవుతారు. ఎందుకంటే ఆటోమేటిక్ ట్రెయిన్ ఆపరేషన్ (ఏటీఓ) విధానంలో ఉప్పల్ లోని అడ్వాన్స్ డ్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ అన్ని రైళ్లను నియంత్రించడం, పర్యవేక్షించడం జరుగుతుంది.

 రైలులో సాంకేతిక సమస్య ఏర్పడితే ఈ కేంద్రం నుంచే సరిచేసే ఏర్పాట్లు ఉన్నాయి. ట్రాక్ లో సమస్యలు తలెత్తితే మాత్రం సిబ్బంది అక్కడికి వెళ్లి సరిచేస్తారు. అన్ని మార్గాల్లోనూ కంప్యూటర్ బేస్డ్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఉప్పల్ లోని సెంట్రలైజ్డ్ ఆపరేషన్ సెంటర్ అన్ని మార్గాల్లో విద్యుత్ సరఫరా, ట్రాక్షన్ సిస్టమ్ ఎక్విప్ మెంట్ ను ‘సూపర్ వైజరీ కంట్రోల్ అండ్ డేటా ఆక్విజిషన్’ తో పర్యవేక్షణ, నియంత్రిస్తూ ఉంటుంది. అంటే ఈ కేంద్రం నుంచే ఒక్క మీటతో మెట్రో అంతటా ఏదైనా నియంత్రించగలరు. కరెంటు సరఫరా ఉన్నట్టుండి నిలిచిపోతే రైళ్లు ఆగే పనిలేకుండా మెట్రో మార్గంలో పెద్ద పెద్ద జనరేటర్లను ఏర్పాటు చేశారు. అలాగే, ఆటోమేటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఏటీపీ) సురక్షిత రైలు ప్రయాణానికి వీలుగా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ వ్యవస్థలన్నీ మెట్రో రైళ్ల రాకపోకలను దాదాపు ఎటువంటి అంతరాయాలు లేకుండా, జాప్యం జరగకుండా, ప్రమాదాలు లేకుండా చూసేందుకే.

మెట్రో వ్యవస్థకు గుండెవంటిది
ప్రతీ స్టేషన్, పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు రికార్డు చేస్తున్న దృశ్యాలను ఉప్పల్ లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది అనుక్షణం గమనిస్తూ ఉంటారు. సందేహం వస్తే వెంటనే భద్రతా సిబ్బందికి ఆదేశాలు వెళ్లిపోతాయి. ఈ సెంటర్ లో ఏర్పాటు చేసిన అతిపెద్ద తెరపై రైళ్ల కదలికలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. వాటిని గమనిస్తూ ఇక్కడి నుంచే ట్రెయిన్ ఆపరేటర్లకు కావాల్సిన సహకారం, ఆదేశాలు అందిస్తుంటారు. ప్రతీ కారిడార్ కు ఓ రంగు కేటాయించారు. స్క్రీన్ పై ఆయా కారిడార్ కు సంబంధించి ప్రతీ కదలిక కేటాయించిన రంగులో బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ సెంటర్ మెట్రో వ్యవస్థకు గుండెతో సమానమని సిబ్బంది చెబుతుంటారు. మెట్రో రైలుకు ఉప్పల్ లో ప్రధాన డిపో ఏర్పాటు చేశారు. ఇక్కడ రైళ్లకు మరమ్మతులు చేసేందుకు వర్క్ షాపులు కూడా ఉన్నాయి. మరో రెండు డిపోలను ముందస్తు నిర్వహణ వ్యవహారాల కోసం కేటాయించారు.

పర్యావరణ అనుకూల ఏర్పాట్లు
ఎల్ అండ్ టీ మెట్రో రైలుకు మరో విశిష్టత ఉంది. పర్యావరణ పరంగా అత్యంత అనుకూల రవాణా వ్యవస్థ ఇది. విద్యుత్ ను వినియోగించుకుంటూ రైళ్లు నడుస్తాయని తెలిసిందే. ఈ రైళ్ల గమనం నుంచి తిరిగి 41 శాతం విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రైళ్లకు ఎలక్ట్రో డైనమిక్ బ్రేకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో రైళ్లు ప్రతీ స్టేషన్ లో ఆగేందుకు బ్రేక్ వేసినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల మెట్రోకు కావాల్సిన విద్యుత్ లో 41 శాతం తిరిగి ఉత్పత్తి అవుతుంది. దేశంలోని ఇతర మెట్రోలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. దీన్ని విద్యుత్ గ్రిడ్ కు అనుసంధానించి తిరిగి వినియోగిస్తారు. అలాగే, నీటి వినియోగం కూడా తక్కువే. ఇందుకోసం తక్కువ ధార వచ్చేలా ఫిట్టింగ్స్ ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా వర్షపు నీటిని ఒడిసి పట్టే చర్యలు కూడా ఉన్నాయి. స్టేషన్ల పై కప్పు నుంచి పగటి సమయంలో ఎక్కువ వెలుగు వచ్చేలా ప్లాన్ చేశారు. ఎల్ఈడీ లైట్ల వాడకంతో విద్యుత్ వినియోగం తగ్గించే చర్యలూ తీసుకుంటున్నారు. మెట్రో పైకప్పులపై సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా 14 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

ఇంటర్నెట్ ఆధారిత నిఘా
మెట్రోలో ఇంటర్నెట్ ఆధారిత సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ఉంటుంది. ప్రయాణికుల భద్రత కోసం ఈ ఏర్పాటు. మెట్రో అంతటా మొత్తం వెయ్యి సీసీ కెమెరాలు ఉంటాయి. స్టేషన్ బయట, స్టేషన్ లోపట, రైలు ఎక్కే చోట, మహిళల కోచ్ లలో ఇలా అన్ని ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఇవి అధిక రిజల్యూషన్ కలిగిన కెమెరాలు. ఎక్కువ ఏరియాను కవర్ చేసేలా ఉంటాయి. ఈ కెమెరాలు తీస్తున్న వీడియోలను భద్రతా సిబ్బంది అనుక్షణం వీక్షిస్తూ ఉంటారు. అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తారు. అంతేకాదు, సీసీకెమెరాలే అనుమానాస్పద వస్తువుల సమాచారాన్ని తెరపై హైలైట్ చేసి చూపిస్తాయి.

మెట్రో రైలు పిల్లర్లకు యూనిక్ నంబర్లు
representational imageమెట్రో మూడు కారిడార్లలో ఉన్న పిల్లర్లకు ప్రత్యేకంగా నంబర్లను కేటాయించారు. దాని ద్వారా గూగుల్ మ్యాప్స్ కు లింక్ చేశారు. దీంతో ఫలానా మెట్రో పిల్లర్ అని సెర్చ్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లో ఏరియా పేరు తెలిసి పోతుంది. కారిడార్ 1కు ఏ, కారిడార్ 2కు బీ, కారిడార్ 3కు సీ ఆల్ఫాబెట్ ను కేటాయించారు. ఉదాహరణకు కారిడార్ 1 మియాపూర్ వద్ద ప్రారంభమై ఎల్ బీ నగర్ వద్ద ముగుస్తుంది. కనుక ప్రారంభంలో మియాపూర్ వద్దనున్న మొదటి పిల్లర్ కు ఏ1 ఉంటుంది. అమీర్ పేట స్టేషన్ వద్ద పిల్లర్ కు ఏ450 ఉంటుంది. అంటే మియాపూర్ నుంచి అమీర్ పేట వరకు 450 పిల్లర్లు ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అలాగే, మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వద్ద పిల్లర్ కు ఏ769 కేటాయించగా, ఎల్ బీనగర్ లో పిల్లర్ ఏ1108 ఉంటుంది.అలాగే, కారిడార్ 2లో జేబీఎస్ వద్ద బీ1 పిల్లర్ ఉంటుంది. మూషీరాబాద్ స్టేషన్ దగ్గరకు వచ్చే సరికి బీ152 పిల్లర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద పిల్లర్ కు బీ196, ఎంజీబీఎస్ స్టేషన్ వద్ద పిల్లర్ కు బీ356, ఫలక్ నుమా డిపో వద్ద పిల్లర్ కు బీ588 నంబర్లు ఉంటాయి. కారిడార్ సీలో నాగోల్ బ్రిడ్స్ వద్ద పిల్లర్ కు సీ1 కేటాయించగా, మెట్టుగూడ వద్ద సీ 296, అమీర్ పేట వద్ద పిల్లర్ కు సీ623, హైటెక్ సిటీ వద్ద సీ1001, రాయదుర్గం వద్ద పిల్లర్ కు సీ1052 నంబర్ ఇచ్చారు. ప్రస్తుతానికి 2,531 పిల్లర్లు మూడు కారిడార్ల పరిధిలో ఉన్నాయి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు ఓల్డ్ సిటీలో ఉన్న మార్గంలో మెట్రో రైలు నిర్మాణం ఇంకా ప్రారంభించలేదు. భవిష్యత్తులో మెట్రో రైలు మరిన్ని కారిడార్లలో విస్తరిస్తే అప్పుడు డీ, ఈ, ఎఫ్ సీరియల్స్ కేటాయిస్తారు.

వాణిజ్య మంత్రం
representational imageఎల్ అండ్ టీ మెట్రో రైలు మార్గంలో పలుచోట్ల పెద్ద షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. స్టేషన్ల నుంచి నేరుగా వీటిలోకి వెళ్లే ఏర్పాటు ఉంది. కావాల్సినవన్నీ కొనుగోలు చేసుకోవడమే కాకుండా, వినోదాన్ని కూడా ఆస్వాదించి వెళ్లేలా ప్లాన్ చేశారు. దీనికి తోడు మెట్రో స్టేషన్లలో వాణిజ్య ఆదాయం పెంచుకునేందుకు ఫుడ్ సెంటర్లు, గేమింగ్ జోన్స్, షాప్ లు ఏర్పాటు చేస్తున్నారు. భరత్ నగర్ స్టేషన్ వద్ద అన్ని రకాల కూరగాయలు విక్రయించేలా ఓ మండి ఏర్పాటు చేశారు. 150 మంది రైతులు తాము తీసుకొచ్చిన కూరగాయలను విక్రయించుకోవడంతోపాటు వారు విశ్రాంతి తీసుకునేందుకు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఏర్పాట్లున్నాయి. మియాపూర్ స్టేషన్ లో పల్లెవాతావరణం ఉండేలా, నాగోల్ స్టేషన్ ను పిల్లల వినోదానికి వీలుగా తీర్చిదిద్దుతున్నారు.

ఎల్ అండ్ టీ మెట్రో రూ.15,000 కోట్లకు పైగా వ్యయంతో కూడిన ప్రాజెక్టు. రైళ్ల నిర్వహణ, ఇతర వ్యవస్థల నిర్వహణకు భారీ వ్యయం అవుతుంది. ఈ ఖర్చులను ప్రయాణికుల టికెట్ల ద్వారానే రాబట్టుకోవాలంటే చార్జీలు సామాన్యులకు అందుబాటులో ఉండనే ఉండవు. వందల రూపాయల్లో టికెట్ చార్జీని నిర్ణయించాల్సి వస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ మెట్రోకు మూడు కారిడార్ల పరిధిలో 17 చోట్ల వాణిజ్య కార్యకలాపాలకు గాను అదనపు స్థలాలను కేటాయించింది. వీటిలో వాణిజ్య సముదాయాలను నిర్మించడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. చార్జీల ద్వారా 50 శాతం, షాపింగ్ కేంద్రాల నుంచి 45 శాతం, ప్రకటనల రూపంలో 5 శాతం ఆదాయం సమకూర్చుకునే ప్రణాళికకు అనుమతి ఉంది.

మెట్రో మస్కట్
నిజాం వారసత్వానికి గుర్తుగా మెట్రోకు చిహ్నంగా నిజ్ ను కేటాయించారు. ప్రతీ ష్టేషన్ లోనూ నిజ్ బొమ్మ ప్రయాణికులకు ఆహ్వానం పలుకుతూ మార్గం చూపిస్తుంటుంది.

రైలు చార్జీలు
మెట్రో రైలులో ప్రయాణ చార్జీలు 10 రూపాయలతో మొదలై గరిష్టంగా 60 రూపాయల వరకు ఉండేలా ప్రారంభంలో ఖరారు చేశారు. మొదటి రెండు కిలోమీటర్ల ప్రయాణానికి 10 రూపాయలు, 4 కిలోమీటర్ల ప్రయాణానికి 15 రూపాయలు, 6 కిలోమీటర్ల దూరానికి 25 రూపాయలు, 8 కిలోమీటర్లకు 30 రూపాయలు, 10 కిలోమీటర్లకు 35 రూపాయలు, 14 కిలోమీటర్లకు 40 రూపాయలు, 18 కిలోమీటర్లకు 45 రూపాయలు, 22 కిలోమీటర్లకు 50 రూపాయలు, 26 కిలోమీటర్లకు 55 రూపాయలు, 26 కిలోమీటర్లపైన దూరానికి 60 రూపాయలు ప్రయాణ చార్జీగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఓ ప్రయాణికుడు తన వెంట 10కిలోల బరువుగల లగేజీ వరకే ఉచితంగా తీసుకెళ్లగలరు. అంతకు మించితే చార్జీ ఉంటుంది. ఎల్ అండ్ టీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మెట్రో రైలు సంస్థ ఏటా 5 శాతం లేదా అంతకంటే ఎక్కువ మేర ప్రయాణ చార్జీలను పెంచొచ్చు. దీనికి ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, అత్యంత రద్దీ సమయాల్లో టికెట్ చార్జీలు 25 శాతం పెంచే ప్రతిపాదన కూడా ఒకటుంది. ప్రారంభంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రైళ్లను నడుపుతారు. మూడు కారిడార్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు రైళ్లను నడిపే ప్రతిపాదన ఉంది. రద్దీ ఉంటే రైళ్ల ప్రయాణ సమయాలు మరికాస్త ముందే మొదలై, అర్ధరాత్రి తర్వాత కూడా కొనసాగే అవకాశాలు లేకపోలేదు.


More Articles
Advertisement
Telugu News
Srikakulam Police seize 42 Country Made Bombs in Kanchili
శ్రీకాకుళం జిల్లాలో 42 నాటు బాంబులు లభ్యం
9 minutes ago
Advertisement 36
Half of the Hyderabadis dont know that they got corona virus infection
హైదరాబాద్‌లో సగం మందికి తెలియకుండానే వచ్చి పోయిన కరోనా.. 54 శాతం మందిలో యాంటీబాడీలు!
23 minutes ago
Microsoft gives huge cash prize for Indian cyber expert
భారత సైబర్ నిపుణుడికి బంపర్ బొనాంజా అందించిన మైక్రోసాఫ్ట్
8 hours ago
CM KCR visits Yadadri shrine
యాదాద్రి ఆలయంలోకి వస్తే వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలగాలి: అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు
8 hours ago
Huge earthquake hits north island of New Zealand
న్యూజిలాండ్ లో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ
8 hours ago
Sajjala praises YCP culture in comparison with other parties
ఇతర పార్టీల్లో ఉండే అసంతృప్తులు, ఊహాగానాలు మా పార్టీలో కనిపించవు: సజ్జల
9 hours ago
Sledging between India and England players in Ahmedabad test
అహ్మదాబాద్ టెస్టులో కోహ్లీ, స్టోక్స్ మధ్య మాటల యుద్ధం
9 hours ago
Sujith to direct Sudeep
'ఈగ' సుదీప్ తో 'సాహో' దర్శకుడి ప్రాజక్ట్?
9 hours ago
Botsa comments on Chandrababu and Lokesh
ఆస్తి పన్ను పెంచుతామంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది: బొత్స
9 hours ago
KTR fires on Union Government over a RTI query
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరంలేదన్న కేంద్రం... కేటీఆర్ ఆగ్రహం
10 hours ago
Venky Kudumula statement about fraud
ఇలాంటి నష్టం ఇంకెవరికీ జరగకూడదనే ఫిర్యాదు చేశా: దర్శకుడు వెంకీ కుడుముల
10 hours ago
Online registration to obtain corona vaccine in AP
ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కోసం పేర్ల నమోదుకు అవకాశం: వైద్య ఆరోగ్య శాఖ
10 hours ago
Delhi High Court asks SII and Bharat Biotech disclose the vaccine manufacturing capacity
ఇతర దేశాలకు అమ్ముకుంటున్నాం, దానం చేస్తున్నాం తప్ప కరోనా వ్యాక్సిన్ మనకేదీ?: ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి
10 hours ago
CPI Narayana campaigns in Guntur municipal elections
నిర్బంధ ఏకగ్రీవాలా... దమ్ముంటే వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి: సీపీఐ నారాయణ
10 hours ago
Art director Anand Sai tells how friendship strengthen with Pawan Kalyan
ఆ ట్రైన్ కోసం నేనూ, పవన్ ఎదురుచూసేవాళ్లం: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి
11 hours ago
Telangana BJP Chief Bandi Sanjay warns TRS leaders
టీచర్ల చేతుల్లో ఉండే పెన్నులు గన్నులుగా మారతాయి... జాగ్రత్త: బండి సంజయ్
11 hours ago
AP Covid Cases Bulletin
ఏపీలో మరో 102 మందికి కరోనా
12 hours ago
TDP confirms Kesineni Swetha as Vijayawada mayor candidate
విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత... ఖరారు చేసిన టీడీపీ అధినాయకత్వం
12 hours ago
Raghurama Krishnaraju complains to Lok Sabha speaker
నా అరెస్టుకు కుట్ర చేస్తున్నారు: లోక్ సభ స్పీకర్ కు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు
12 hours ago
Chandrababu at Kunrool road show
ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరుతున్నా: కర్నూలు రోడ్ షోలో చంద్రబాబు
12 hours ago