ఫోన్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రోజులు రావాలంటే ఇవి చేయాలి!

నేడు స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించలేం. అరచేతిలో ఒదిగి అన్ని పనులకూ ఇదే కీలకంగా మారిపోయింది. అయితే, ఎక్కువ మంది ఆండ్రాయిడ్ యూజర్లను వేధించే ముఖ్యమైన సమస్య బ్యాటరీ పవర్ వేగంగా డిశ్చార్జ్ అయిపోతుండడం. చార్జింగ్ పెట్టి బ్యాటర్ పవర్ 100 శాతం నిండిన తర్వాత తీసేయగా, కొంత సేపటికే ఖర్చయిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. 


అయితే, ఈ సమస్య అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఎదురయ్యేదే. కనుక ఫోన్ మార్చుకోవడం ఇందుకు పరిష్కారం కానే కాదు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో బ్యాటరీ బ్యాకప్ పెంచుకునేందుకు, అనవసర వృథాను తగ్గించేందుకు కొన్ని చర్యలు తీసుకుంటే సరిపోతుంది. ఇందుకు సంబంధించి మొబైల్ ఇంజనీర్ల సూచనలు తెలుసుకుందాం.


బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్
representational imageమొబైల్ లో గేమ్స్ తరచూ ఆడేవారు కొందరు. ఇంకొందరు వివిధ రకాల యాప్స్ ను తెరిచి క్లోజ్ చేస్తుంటారు. అయితే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే... ఫోన్లో మీరు ఒక యాప్ ను తెరిచి వినియోగం తర్వాత బ్యాక్ బటన్ ఉపయోగిస్తే తిరిగి హోమ్ పేజీకి వెళతారు. దాంతో ఆ యాప్ ముందు భాగంలో క్లోజ్ అవుతుంది. కానీ, బ్యాక్ గ్రౌండ్ లో ఓపెన్ అయి ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి రోజుల్లో ఎన్నో యాప్స్ ను వినియోగిస్తూ ఉంటారు. ఇలా ఎన్నో యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఓపెన్ లోనే ఉంటాయి గనుక అవి కొంత బ్యాటరీ పవర్ ను తీసుకుంటూ ఉంటాయి. కనుక వాటిని బ్యాక్ గ్రౌండ్ లో క్లోజ్ చేయాలి. ఇందు కోసం ఫోన్లో బ్యాక్ బటన్, హోమ్ బటన్ కాకుండా ఉండే మరో బటన్ ను క్లిక్ చేస్తే బ్యాక్ గ్రౌండ్ లో మీరు అప్పటి వరకు ఉపయోగించిన యాప్స్ కనిపిస్తాయి. వాటిని ఒకదాని తర్వాత ఒకటి క్లోజ్ చేసేయాలి.

representational imageఇలా క్లోజ్ చేసినప్పటికీ ఇంకా బ్యాక్ గ్రౌండ్ లో అవి కనిపించకుండా పని చేస్తూనే ఉంటాయి. ఇందుకోసం గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి గ్రీనిఫై అని టైప్ చేస్తే చెట్టు ఆకు గుర్తుతో ఓ యాప్ కనిపిస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి.

ఆ యాప్ ను ఓపెన్ చేస్తే పై భాగంలో కుడివైపున ప్లస్ గుర్తు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఫోన్లో ఉన్న యాప్స్ కనిపిస్తాయి. వాటిని సెలక్ట్ చేసుకుని టిక్ మార్క్ ను ఓకే చేయాలి. కావాల్సిన పర్మిషన్లు ఇవ్వాలి. సెట్టింగ్స్ లో ఆటో హైబర్ నేషన్ ను ఆన్ చేయాలి. అంతే బ్యాక్ గ్రౌండ్ లో ఒక్క యాప్ కూడా లేకుండా అన్నీ క్లోజ్ అవుతాయి. అయితే, ముఖ్యమైన యాప్స్ క్లోజ్ అవకూడదు అని భావిస్తే వాటిని మాత్రం సెలక్ట్ చేసుకోకుండా ఉండాలి. అప్పుడు అవి మాత్రం క్లోజ్ అవకుండా బ్యాక్ గ్రౌండ్ లో మిగిలినవన్నీ క్లోజ్ అయిపోతాయి. దీంతో బ్యాటరీ దుర్వినియోగానికి చెక్ పడుతుంది.

అలాగే, గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి డీప్ స్లీప్ బ్యాటరీ సేవర్ అనే మరొక యాప్ ను కూడా ఇ న్ స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ ను రాత్రి నిద్రించే ముందు ఓపెన్ చేసి అందులో ‘స్లమ్ రర్’ ఆప్షన్ ఆన్ చేస్తే ఫోన్లో అన్నీ ఆఫ్ అయిపోతాయి. కాల్స్, ఎస్ఎంఎస్ లు మాత్రం వస్తాయి. దీనివల్ల కూడా బ్యాటరీ బాగానే ఆదా అవుతుంది. యాపిల్ ఐవోఎస్ లో ఇలాంటివి ఏవీ అవసరం లేదు. యాప్స్ ను ఉపయోగించి తర్వాత వాటంతట అవే క్లోజ్ అవుతాయి. దాంతో బ్యాటరీ డ్రెయినింగ్ సమస్య ఉండదు.

వైబ్రేషన్ ఆఫ్ చేసేయాలి...
స్మార్ట్ ఫోన్ వాడే వారిలో చాలా మంది వాటిలోని సెట్టింగ్స్ పై పెద్దగా దృష్టి పెట్టరు. ఫోన్లో టైప్ చేస్తున్న సమయంలో వైబ్రేషన్ రావడం గమనించే ఉంటారు. అలాగే, మెస్సేజ్ వచ్చినప్పుడు, కాల్ సమయంలో ఫోన్ వైబ్రేట్ అవుతుంటుంది. మీ ఫోన్ కూడా ఇలానే వైబ్రేట్ అవుతుంటే సెట్టింగ్స్ లోకి వెళ్లి వైబ్రేషన్ ను ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వైబ్రేషన్లు బ్యాటరీ శక్తిని ఎక్కువగా గ్రహిస్తుంటాయి. వైబ్రేషన్ కు బదులు రింగ్ టోన్ సెట్ చేసుకోవడం బెటర్.

స్క్రీన్
representational imageమీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ బ్యాటరీ పవర్ వినియోగాన్ని నిర్ణయించగలదు. అమోలెడ్ డిస్ ప్లే అయితే లైట్ కలర్స్ ను రిఫ్లెక్ట్ చేయడానికి ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. నేడు వస్తున్న చాలా వరకు స్మార్ట్ ఫోన్ల డిస్ ప్లేలు బ్యాటరీ బ్యాకప్ ను తినేసేవే. కనుక రంగుల వాల్ పేపర్లు కాకుండా నలుపురంగుతో ఉన్న వాల్ పేపర్ సెట్ చేసుకోవడం ద్వారా బ్యాటరీ బ్యాకప్ ను పెంచుకోవచ్చు.

లొకేషన్
మీ ఫోన్లోని చాలా యాప్స్ మీరు ఏ ప్రదేశంలో ఉన్నారన్న సమాచారం కోసం తరచుగా ట్రాక్ చేస్తూనే ఉంటాయి. దీంతో బ్యాటరీ పవర్ వృథాగా ఖర్చవుతుంటుంది. అందుకే ప్రత్యేకంగా లొకేషన్ అవసరం ఉంటే తప్ప దాన్ని ఎప్పుడూ ఆఫ్ లోనే ఉంచండి.

యాప్స్ అప్ డేట్
యాప్స్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవడం ద్వారా ఫోన్ బ్యాటరీ పవర్ ను ఆదా చేసుకోవచ్చు. డెవలపర్లు మెమొరీ ఆప్టిమైజేషన్ ను మెరుగుపరుస్తూ యాప్స్ ను అప్ డేట్ చేస్తుంటారు గనుక, తాజా వెర్షన్ తో అప్ డేట్ చేసుకోవడం మంచిది.

ఎయిరోప్లేన్ మోడ్
నెట్ వర్క్ సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో తరచూ సిగ్నల్ కోసం సెర్చింగ్ కారణంగా బ్యాటరీ పవర్ వేస్ట్ అవుతుంటుంది. అటువంటప్పుడు ఫోన్లోని ఎయిరోప్లేన్ మోడ్ ఆన్ చేసుకుంటే సరి. సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతంలో ఉన్నంత వరకే ఇది. ఇది ఆన్ చేయడం వల్ల ఎటువంటి కాల్స్, మెస్సేజ్ లు రావు. ఇతరులకు మీ ఫోన్ అందుబాటులో ఉండదు. అందుకే ఇదొక ఆప్షన్ మాత్రమే. అవకాశం ఉన్న సమయాల్లో వినియోగించుకోవచ్చు.

ఆటో సింక్
representational imageఫోన్లో గూగుల్, జీమెయిల్, ట్విట్టర్, కేలండర్ తరచుగా రీఫ్రెష్ అవుతుంటాయి. కారణం తాజా సమాచారాన్ని అందించేందుకే. దీనివల్ల తాజా సమాచారాన్ని మిస్ అవకుండా ఉంటారు. అయితే, ఇలా యాప్స్ రీఫ్రెష్ అయ్యేందుకు ఫోన్లోని యాప్స్ ఆటో సింక్ అవుతుంటాయి. దీంతో బ్యాటరీ పవర్ వృథాగా పోతుంటుంది. కనుక సెట్టింగ్స్ లో గూగుల్ అకౌంట్ లో ఆటో సింక్ ను టర్న్ ఆఫ్ చేస్తే సరి.

జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్ సి
అవసరం లేని సమయాల్లో జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్ సి, మొబైల్ డేటాలను ఆఫ్ చేసేయాలి. అలాగే, చాలా మంది వైఫై కనెక్ట్ చేసుకుని దాన్ని తిరిగి ఆఫ్ చేయడం మర్చిపోతుంటారు. కానీ, ఇక్కడ చెప్పుకున్నవన్నీ బ్యాటరీ బ్యాకప్ ను తినేసేవే. కనుక వీటిని ఆఫ్ చేసుకోవాలి.

హాట్ వర్డ్ డిటెక్షన్
గూగుల్ అందిస్తున్న ఓకే గూగుల్ వాయిస్ సెర్చింగ్ ఆప్షన్ నిజంగా సౌకర్యమైనది. దీన్ని ఎప్పుడో కానీ ఉపయోగించే అవసరం రాదు. అయతే, ఈ యాప్ ఎక్కువ బ్యాటరీ పవర్ ను తీసుకుంటూ ఉంటుంది. కనుక గూగుల్ సెట్టింగ్స్ లో హాట్ వర్డ్ డిటెక్షను ఆఫ్ చేసుకోవాలి. ఇందుకోసం గూగుల్ సెట్టింగ్స్ కు వెళ్లాలి. గూగుల్ సర్వీసెస్ లో సెర్చ్ అండ్ నౌ, వాయిస్ ఎంచుకోవాలి. ఓకే గూగుల్ డిటెక్షన్ ను ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.

అడాప్టివ్/ఆటో బ్రైట్ నెస్ వద్దు
డిస్ ప్లే సెట్టింగ్స్ లో ఆటో బ్రైట్ నెస్ ఆప్షన్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆన్ లో ఉంటే అవసరమైనదాని కంటే ఎక్కువ బ్రైట్ నెస్ లోనే ఉంచుతుంది. దాంతో అధికంగా బ్యాటరీ పవర్ ను తీసుకుంటుంది. అందుకే ఈ ఆప్షన్ ను ఆఫ్ చేసి ఎంత బ్రైట్ నెస్ కావాలో అంతమేర మీరే మాన్యువల్ గా సెలక్ట్ చేసుకోవడం నయం. ఆటో బ్రైట్ నెస్ చీకటి, వెలుగును బట్టి బ్రైట్ నెస్ పెంచుతుంటుంది. దీనివల్ల ఎక్కువ పవర్ వేస్ట్ అవుతూ ఉంటుంది.

బ్యాటరీ సేవర్
ప్రతీ మొబైల్ లో బ్యాటరీ సెట్టింగ్స్ లోనే పవర్ ను ఆదా చేసే ఆప్షన్లు ఉంటాయి. వీటిని గుర్తించి యాక్టివేట్ చేసుకోవాలి. దీనివల్ల బ్యాటరీ వృధా కాకుండా ఉంటుంది.

మొబైల్ ఫోన్ చార్జింగ్ లో పెట్టి వాడొద్దు
representational imageరాత్రి నిద్రించే ముందు ఫోన్ ను చార్జింగ్ లో పెట్టేసి పడుకోవడం  చాలా మంది చేస్తుంటారు. మొబైల్ బ్యాటరీలో ఓవర్ చార్జింగ్ ప్రొటెక్షన్ కోసం ఓ చిన్న చిప్ ఉంటుంది. కనుక బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయిన తర్వాత అదనంగా విద్యుత్ చేరకుండా ఈ చిప్ అడ్డుకుంటుంది. దాంతో అంత ప్రమాదం ఉండదు. అలా అని ఎప్పుడూ రాత్రి చార్జింగ్ లో పెట్టేసే అలవాటు కొన్ని సందర్భాల్లో ప్రమాదానికి దారి తీయవచ్చు. ఎలా అంటే బ్యాటరీలో చిప్ దెబ్బతింటే ఓవర్ చార్జ్ అయి బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.

మరికొందరు ఫోన్ ను చార్జింగ్ లో పెట్టి కాల్స్ మాట్లాడుతుంటారు. ఇది మరీ ప్రమాదకరం. ఎందుకంటే లిథియం అయాన్ బ్యాటరీ చాలా సున్నితమైందని చెప్పుకున్నాం కదా. ఒకవైపు చార్జింగ్, మరోవైపు పవర్ డిశ్చార్జింగ్ ఏక కాలంలో చేయరాదు. దీనివల్ల బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. బ్యాటరీలో రెండు భాగాలు ఉంటాయి. పాజిటివ్ కాథోడ్, నెగెటివ్ అనోడ్. చార్జింగ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి పాజిటివ్ కాథోడ్ నుంచి నెగెటివ్ అనోడ్ కు వెళ్లి సేవ్ అవుతుంది. తిరిగి వాడేప్పుడు ఇది నెగెటివ్ నుంచి పాజిటివ్ గా మారుతుంది. మరి చార్జింగ్ సమయంలో ఫోన్ ను వినియోగిస్తే ఇవి రెండూ ఒకేసారి జరిగి బ్యాటరీపై భారం పెరిగిపోతుంది. దాంతో ప్రమాదం తలెత్తవచ్చు. అందుకే చార్జింగ్ పెట్టి వాడొద్దు. మొబైల్ కు సందేశాలు వస్తే చూసుకోవచ్చు.


More Articles