మీ దంతాలు బలంగా ఉన్నాయా...? దంతాలకు, గుండె ఆరోగ్యానికి సంబంధం ఉందండి!

05-10-2017 Thu 15:20

మన దేశంలో దాదాపు అధిక శాతం మందికి పంటి (నోటి లోపటి దంతాలు) ఆరోగ్యం పట్ల అస్సలు శ్రద్ధ ఉండదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత పేరుకు బ్రష్ చేసేసే అలవాటే ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఇది మినహా ఎక్కువ శాతం ప్రజలకు పంటి ఆరోగ్యం గురించి పెద్దగా శ్రద్ధ ఉండదు. పంటి సంరక్షణ గురించి అవగాహన కూడా ఉండదు. కానీ, దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. నోటి ఆరోగ్యం, శారీరక ఆరోగ్యంలో దంతాలు కూడా అత్యంత ప్రధానమైనవి. కొందరి దంతాలు తెల్లగా తళతళ మెరుస్తూ ఉంటాయి. కొందరి దంతాలు పాచి పట్టి ఉంటాయి. కొందరిలో రంగు మారిన నల్లటి దంతాలను కూడా గమనించొచ్చు. పళ్లు తెల్లగా మెరుస్తుంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. అదే సమయంలో పళ్లు రంగు మారి ఉంటే అనుమానించాల్సిందే. శరీరంలో ఇతర అవయవాల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటామో దంతాల విషయంలోనూ అది అవసరం. నిర్లక్ష్యం చేస్తే దంత సమస్యలు ఇతర సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో దంత సంరక్షణ గురించి సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...


నలుగురిలో ఉన్నారు. నిండుగా నవ్వాలనుకున్నారు. కానీ, రంగు మారిన దంతాలు నోరు తెరవకుండా చేశాయి. పెదాల కదలికతో నవ్వేశా అని అనిపించుకున్నారు. అందుకే నిండుగా నవ్వాలన్నా, ఆహారం నమిలి తినాలన్నా, మాట్లాడాలన్నా దంతాలు ఉండాలి. అవి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే అందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

బ్రషింగ్
రోజూ ఉదయం, రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేసుకోవడం తప్పనిసరి. మన దేశంలో దీన్ని ఆచరించే వారి సంఖ్య ఐదు శాతం కూడా ఉండదు. విద్యావంతులు కూడా దీన్ని సరిగ్గా ఆచరించడం లేదు. ఎంత సమయం పాటు బ్రషింగ్ చేయాలంటే... కనీసం రెండు నిమిషాల పాటు దంతాలను బ్రషింగ్ చేసుకోవడం తప్పనిసరి అని వైద్యులు చెబుతారు. మూడు నిమిషాల వరకు బ్రష్ చేసుకోవచ్చు. అంతకుమించి అవసరం లేదు. పళ్లపై బలంతో బ్రష్ నొక్కి పెట్టి కాకుండా తక్కువ ఒత్తిడితో ఇంకాస్త సమయం పాటు చేసుకున్నా నష్టమేమీ లేదు. అధిక ఒత్తిడి చూపిస్తే పళ్లపై రక్షణ పొర ఎనామెల్ అరిగిపోతుంది. చిగుర్లకు గాయాలు కూడా కావొచ్చు. ఎనామెల్ అరిగిపోతే వేడి, చల్లటి, పుల్లటి వస్తువులు తీసుకున్న సమయంలో పళ్లు జివ్వున లాగుతుంటాయి. దీన్నే సెన్సిటివిటీగా చెబుతారు. అయితే, ఇక్కడ సమయం కంటే నోటిలోపల దంతాలను పూర్తిగా శుభ్రం చేసుకున్నారా, లేదా? అన్నదే ప్రాధాన్యం అవుతుంది. ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ ను ఉపయోగించడం దంత సంరక్షణకు ఎంతో అవసరం.

బ్రష్ చేయడానికి కూడా ఒక విధానం ఉంది. బ్రష్ పట్టుకుని మూడు వైపులా తిప్పేసి కడిగేసుకోవడం శుభ్రం చేసుకున్నట్టు కాదు. ప్రతీ దంతం ఉపరితలంపై తిష్ట వేసిన బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోవాలి. నామమాత్రంగా, ఓ టెక్నిక్ లేకుండా బ్రష్ చేసుకుంటే బ్యాక్టీరియా నోటిలోనే ఉండిపోతుంది. ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. జింజివైటిస్, పెరియోడాంటిస్ (చిగుళ్లు వాచిపోయి పళ్లకు, చిగుళ్లకు మధ్య గ్యాప్ పెరిగిపోవడం)కు కారణమవుతుంది. పళ్ల మొదట్లో గారలా పేరుకుపోయే దాన్ని ప్లాక్యూ అంటారు. పళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీసేది ఇదే. ఆహారం తీసుకున్న తర్వాత పళ్లపై ప్లాక్యూ ఏర్పడడానికి 4 నుంచి 12 గంటల సమయం పడుతుంది. అందుకే రోజులో రెండు సార్లు 12 గంటలకోసారి బ్రష్ చేసుకోవాలనేది. పళ్లపై ప్లాక్యూ బాగా పేరుకుపోతే అది గుండె ధమనుల్లోనూ ప్లాక్యూ ఏర్పడడానికి కారణమవుతుందని ఇటీవలి కొన్ని అధ్యయనాలు హెచ్చరించాయి.

బ్రషింగ్ ఇలా...
representational imageచిగుళ్లపై బ్రష్ ను 45 డిగ్రీల కోణంలో ఉంచి పట్టుకోవాలి. నోటిలోపల దవడ పళ్లకు బయటి భాగంలో బ్రష్ ను ఉంచి కింది వైపు నుంచి పై వైపునకు వచ్చేలా బ్రష్ చేయాలి. లోపలి వైపు నుంచి చేసే సమయంలోనూ ఇంతే. చిగుళ్ల నుంచి కొసర్లకు వచ్చేలా చేయాలి. అంతే కానీ, పైకీ కిందకీ రెండు దిశల్లోనూ బ్రష్ ను తిప్పరాదు.  ప్రతీ దంతంపై ఇదే మాదిరిగా చేయాలి. ప్రతీ దంతం ముందు భాగంలోనే కాదు, వెనుక భాగంలోనూ ఇదే మాదిరి(టెక్నిక్)గా శుభ్రం చేసుకోవాలి. ప్రతీ దంతం ఉపరితలంలో (చిగురుతో అనుసంధానమై ఉన్న చోట) బ్రష్ చేయాలి. అంటే ప్రతీ పన్ను ముందు, వెనుక, మొదట్లో, చివరి భాగంలో బ్రష్ చేసుకోవడం తప్పనిసరి. అలాగే, నాలుకను కూడా ఓ సారి బ్రష్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా నాలుకపైనే ఎక్కువగా ఉంటుంది. బ్రష్ చేయడం వల్ల అది తొలగిపోతుంది. అలాగే, చిగుర్లను క్లీన్ చేయడం తప్పనిసరి. దంతాలు చర్మంతో అనుసంధానమయ్యే చోటే బ్యాక్టీరియా నిల్వ ఉండే స్థావరం. సాధారణంగా బ్రష్ చేసే సమయంలో బ్రష్ బ్రిస్టల్స్ ఈ ప్రాంతంలోకి వెళ్లవు. ప్రత్యేకంగా మనమే శ్రద్ధతో ఓపికతో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రష్ ను పద్ధతి ప్రకారం ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలని అనుకుంటే అందు కోసం https://youtu.be/LqCpZm6s_dE ఈ లింక్ ను సందర్శించొచ్చు. ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా బ్రష్ చేసుకోవడం సాధ్యం కాకపోతే, తిరిగి బ్రష్  చేసుకునే వరకు నోటిని నీటితో పుక్కిలించి ఆ నీటిని బయటకు వదిలివేయాలి. అలాగే మధ్య మధ్యలో సాల్ట్ వాటర్ తో ఇలా చేయడం మంచిది.

ఎటువంటి బ్రష్?
బ్రష్ హార్డ్ గా ఉండరాదు. నోటిలోపల పళ్ల వరుస మూల వరకూ వెళ్లే విధంగా డిజైన్ ఉండాలి. సాఫ్ట్ బ్రిస్టల్స్ (సున్నితమైన పళ్లు) ఉన్న బ్రష్ వాడుకోవాలి. హర్డ్ బ్రష్ అయితే పళ్లను మరింత సమర్థవంతంగా శుభ్రం చేస్తుందనుకుంటారు. కానీ ఇది సరికాదు. సాఫ్ట్ బ్రిస్టల్స్ కూడా ఎఫెక్టివ్ గా దంతాలను శుభ్రం చేస్తాయన్నది వైద్యులు చెప్పే మాట. బ్రిస్టల్స్ రంగు మారినా, వంగిపోయినా, బ్రష్ వాడకం మొదలు పెట్టి మూడు నెలలు దాటిపోయినా బ్రష్ మార్చడం మంచిది.

ఫ్లాసింగ్
representational imageదంత సంరక్షణకు రోజూ బ్రష్  చేసుకోవడం ఎంత అవసరమో ఫ్లాసింగ్ కూడా అంతే. దీన్ని ఆచరించే వారు చాలా చాలా అరుదు. దేశంలో కనీసం ఒక శాతం కూడా ఉండరేమో. ఫ్లాసింగ్ అన్నది దంతాలపై ఏర్పడుతున్న ప్లాక్యూను తొలగించేందుకు. అలాగే, పళ్ల మధ్యలో పేరుకున్న, ఇరుకున్న ఆహార పదార్థాలను కూడా తొలగించడం దీనిలోని ప్రయోజనం. ఫ్లాసింగ్, బ్రషింగ్ రెండింటి ప్రయోజనాలు ఒకటే. టూత్ బ్రష్ అన్నది పళ్ల మూల మూలల్లోకి వెళ్లి అన్ని చోట్ల తిష్టవేసుకున్న పదార్థాలను తొలగించలేదు. ఫ్లాసింగ్ లో అది సాధ్యమవుతుంది. బ్రష్ పళ్లకు ఉపయోగించిన వైరు లాంటిదాన్నే ఫ్లాసింగ్ కు వాడతారు. ఉదాహరణకు కార్పెట్ ను మీరు శుభ్రం చేసేదానికి, వ్యాక్యూమ్ క్లీనర్ శుభ్రం చేసేదానికీ తేడా ఉంటుందని తెలుసు కదా. పళ్లకూ ఇదే వర్తిస్తుంది.

బ్రషింగ్  చేయలేని దాన్ని, మరింత శుభ్రం చేసేదే ఫ్లాసింగ్. ప్రతీ రోజూ రాత్రి నిద్రకు ముందు ఫ్లాసింగ్ చేసుకోవడం ద్వారా పళ్లు, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రాత్రి బ్రష్ చేసుకోవడాని కంటే ముందు ఫ్లాసింగ్ చేసుకుని, ఆ తర్వాత ఓసారి బ్రష్ చేసుకుంటే మంచిది. పెరియోడాంటల్ వ్యాధులు గుండె జబ్బుల రిస్క్ ను పెంచుతాయని పలు పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. నోటిలోపల ఇన్ఫెక్షన్ వస్తే అది రక్తంలో ఇన్ ఫ్లమ్మేటరీ పదార్థాలను పెంచుతుంది. దీంతో రక్తం గడ్డకట్టడం, గుండెకు రక్త సరఫరా నిదానించి గుండె జబ్బులకు దారితీస్తుంది. అలాగే, నోటిలోపల ఇన్ఫెక్షన్ కు కారణమైన బ్యాక్టీరియా తేలిగ్గా రక్తప్రవాహ మార్గంలో కలిసి గుండె, రక్తనాళాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఫ్లాసింగ్ చేసుకోవడం వల్ల పళ్ల మధ్యలో ఉన్న ఆహార పదార్థాలు, చెడు పదార్థాలు తొలగిపోయి, పళ్లు పుచ్చిపోకుండా నివారిస్తుంది. అలాగే, చిగుళ్లు వ్యాధుల ముప్పును కూడా తగ్గిస్తుంది.

ఫ్లాసింగ్ ఎలా చేయాలంటే... ఫ్లాసింగ్ వైరు అని ఫార్మసీ స్టోర్లలో లభిస్తుంది. దాన్ని తీసుకుని వైరును రెండు చేతి మధ్య వేళ్లకు చుట్టుకుని పట్టుకోవాలి. బొటన వేళ్లను ఆధారంగా చేసుకుని వైరును ప్రతీ పన్ను మధ్య భాగంలోకి చిగురు వరకూ వెళ్లేలా చేయాలి. దీంతో ఆ మధ్యలో ఏమున్నా బయటకు వచ్చేస్తాయి. ఫలితంగా ఆహార పదార్థాలు కుళ్లిపోయి అక్కడ బ్యాక్టీరియా ఏర్పడడానికి అవకాశం లేకుండా పోతుంది. రోజులో ఆహారం తీసుకున్న తర్వాత ప్రతిసారి ఫ్లాసింగ్ చేసుకున్నా మంచిదే. సాధారణంగా ఫ్లాసింగ్ చేసుకునే సమయంలో నొప్పి వస్తుందంటూ కొందరు దాన్ని చేయడం ఆపేస్తుంటారు. అయితే, మంచి నాణ్యమైన ఫ్లాసింగ్ వైరు ఉపయోగించకపోవడమే ఇందుకు కారణం. మీ పంటి చిగుళ్లు సెన్సిటివ్ గా ఉన్నాయా లేక ఏ విధంగా ఉన్నాయనే దాని ఆధారంగా ఫ్లాసింగ్ వైరు తీసుకోవాలి. పిల్లలు అయితే, చిన్న వయసు నుంచే ఫ్లాసింగ్ గురించి తెలియజేయడం మంచిది. 5-7 ఏళ్ల మధ్యలో దీన్ని అలవాటు చేయాలి.

ఆహారంతో పంటికి ముప్పు
ఏది తినాలన్నా, ఆస్వాదించాలన్నా అందుకు ఆరోగ్యకరమైన దంతాలు అవసరం. మరి ఇలా తినే వాటిలో కొన్ని దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీసేవీ ఉన్నాయనే విషయం తెలుసా...?  దంతక్షయం (దంతాలు దెబ్బతినడం) అన్నది ఆహారం నుంచే మొదలవుతుంది. మనం తీసుకునే ఆహారం, డ్రింక్స్, పళ్ల రసాల్లో తీపి ఉంటుంది. ఈ తీపి, ప్లాక్యూ కలసి యాసిడ్స్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి పళ్లపై దాడి చేస్తాయి.

దంత క్షయం
పళ్ల ఉపరితలం అరిగిపోవడాన్ని దంతక్షయంగా చెబుతారు. ఆహార పదార్థాల్లోని యాసిడ్స్ వల్ల ఎనామెల్ అరిగిపోతుంది. పీహెచ్ 5.5 స్థాయి కన్నా తక్కువ ఉండే ఆహారం, ద్రవ పదార్థాలతో దంతక్షయం ముప్పు ఎక్కువ. యాపిల్ జ్యూస్ లో 3.3, ద్రాక్ష రసంలో 3.2, ఆరెంజ్ జ్యూస్ లో 3.7, ఫిజ్జీ డ్రింక్స్ లో 2.4-3.2, వైన్ లో 3.7 స్థాయికి పీహెచ్ ఉంటుంది. తీపి (చక్కెరలు) ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తరచుగా తీసుకోవద్దు. చక్కెర, ఫ్యాట్ తక్కువగా ఉన్నవి, ముడి పదార్థాలను తీసుకోవాలి. డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. రోజులో చిరుతిళ్లు, స్నాక్స్ అన్నవి తరచుగా తినడం కాకుండా నిర్ణీత సమయానికి మాత్రమే తీసుకోవడం మంచిది.

పళ్లు పుచ్చకుండా నివారణ
representational imageపళ్లు పాడవుతున్న క్రమంలో ఏ విధమైన లక్షణాలు బయటపడవు. నొప్పి కూడా ఉండదు. ఓ పన్ను పుచ్చిపోవడానికి చాలా కాలం పడుతుంది. దంతంలో ఏ భాగంలోనైనా ఇది ఏర్పడవచ్చు. పైకి కనిపించకుండా పంటి మొదట్లో కూడా నష్టం జరగొచ్చు. ఒకసారి పిప్పి పన్ను బయపపడి డ్రిల్ చేయించుకుని ఫిల్లింగ్ అయిన తర్వాత... లోపలి నుంచి ఆ పుచ్చు పెరిగిపోవచ్చు. కొన్ని కేసుల్లో సాధారణ ఎక్స్ రే ద్వారా పంటికి సంబంధించిన సమస్యలు బయటపడే అవకాశం ఉంటుంది. సరైన విధంగా బ్రష్ చేసుకోకపోవడం. పళ్ల మధ్య క్లీనింగ్ సరిగా లేకపోవడం. ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడకపోవడం. ఆహార పదార్థాలను చీటికీ మాటికి తింటూ ఉండడం. చక్కెరలు అధికంగా ఉన్న డ్రింక్స్ తీసుకోవడం కారణాలు. పళ్ల చుట్టూ ఆహార పదార్థాలు, వ్యర్థాలు పేరుకుపోవడం, పళ్లలో రంధ్రాలు ఉండడం, పళ్ల రంగు మారడం, చల్లటి, వేడి పదార్థాలు, లిక్విడ్స్ తీసుకున్నప్పుడు పళ్లు లాగినట్టు ఉండడం, నొప్పిగా ఉండడం, నమలలేకపోవడం, పళ్ల నొప్పులు, నోటి నుంచి దుర్వాసన, ముఖంపై వాపు ఇవన్నీ పళ్లు పుచ్చిపోతున్నాయనేందుకు సంకేతాలు. నివారణ కోసం ప్రతి రోజూ ప్లాక్యూ వెళ్లిపోయేలా చక్కగా బ్రష్, ఫ్లాసింగ్ చేసుకోవడం. ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ను వాడడం చేయాలి. ఎందుకంటే ఫ్లోరైడ్ పుచ్చిపోవడాన్ని నిరోధిస్తుంది. తరచూ ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండడం, నిర్ణీత కాలానికోసారి వైద్యులను సంప్రదించడం మేలని వైద్య నిపుణుల సూచన.

చిగుళ్లు దెబ్బతినకుండా...
representational imageపళ్లపై ప్లాక్యూ ఏర్పడడం వల్ల చిగుళ్ల సమస్య ‘పెరియోడాంటిస్’ ఏర్పడుతుంది. ప్లాక్యూలోని బ్యాక్టీరియా చిగుళ్లతోపాటు పంటికి ఆధారంగా ఉన్న ఇతర కణజాలంపై దాడి చేసి దెబ్బతీస్తుంది. చిగుళ్ల వ్యాధిలో పెరియోడాంటిటిస్, జింజివైటిస్ అని రెండు రకాలున్నాయి.జింజివైటిస్ అన్నది స్వల్ప స్థాయిలో వచ్చే చిగుళ్ల సమస్య. నొప్పి లేకపోవడం వల్ల దీన్ని వెంటనే గుర్తించలేరు. కానీ, వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని గుర్తించడంలో ఆలస్యం జరిగితే చిగుళ్లను పూర్తిగా దెబ్బతీసే పెరియోడాంటిటిస్ కు దారితీస్తుంది. పళ్లను సరైన విధంగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల వచ్చేవే ఈ సమస్యలు కూడా. చిగుళ్లు ఎర్రగా ఉండడం, బ్రష్ చేస్తున్న సమయంలో లేదా ఫ్లాసింగ్ చేస్తున్నప్పుడు రక్త స్రావం, దుర్వాసన చిగుళ్ల వ్యాధి ఉందనేందుకు నిదర్శనాలు. రోజూ సరైన విధంగా బ్రషింగ్, ఫ్లాసింగ్ చేసుకోవాలి. ఆరు నెలలకోసారి వైద్యులను సంప్రదించినట్టయితే అవసరాన్ని బట్టి పళ్లపై ఉన్న పాచిని వారు తొలగిస్తారు.

బ్యాక్టీరియా పంటి చిగుళ్ల కింద పెరుగుతూ పోతే ఇది విడుదల చేసే టాక్సిన్లు (విష కారకాలు) చిగుళ్లు ఎర్రబారి వాచిపోయేందుకు కారణమవుతాయి. దీంతో చిగుళ్ల కణజాలాలు తెబ్బతింటాయి. దీన్నే పెరియోడాంటిటిస్ సమస్య గా చెబుతారు. ఈ వ్యాధి తీవ్రతరం అయితే పంటి కింద ఎముక కూడా దెబ్బతింటుంది. దీంతో సంబంధిత పన్ను ఊడిపోవడం జరుగుతుంది. లేదంటే తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది.

సరిగా బ్రషింగ్, ఫ్లాసింగ్ చేసుకోకపోవడం, జింజివైటిస్ కు సకాలంలో చికిత్స తీసుకోకపోవడం కారణాలు. చిగుళ్లు ఎర్రగా మారి, వాచిపోవడం, పళ్లకు చిగుళ్లు దూరంగా జరగడం, పళ్లు వదులు కావడం, చిగుళ్లు, దుర్వాసన, నమిలే సమయంలో పళ్లల్లో కదలికను హెచ్చరిక సంకేతాలుగా భావించాలి. రోజు చక్కగా, బ్రషింగ్, ఫ్లాసింగ్ చేసుకోవడం, వైద్యులతో నిర్ణీత కాలానికోసారి దంతాలను శుభ్రంగా క్లీన్ చేయించుకోవడం, పొగతాగడానికి దూరంగా ఉండడం చేయాలి. పళ్ల నుంచి రక్తం కారుతూ ఉంటే వైద్యులను సంప్రదించాలి. ఆలోపు సెలైన్ వాటర్ లేదా క్లోర్ హెక్సిడిన్ తో నోటిని పుక్కిలించి వేయడం చేయొచ్చు.

పొగతాగే అలవాటును మానుకోవాలి
పొగతాగే అలవాటు చిగుళ్ల వ్యాధులకు పెద్ద రిస్క్. పొగతాగడం వల్ల తాగని వారితో పోలిస్తే పళ్లపై ప్లాక్యూ ఎక్కువగా ఏర్పడుతుంది. చిగుళ్ల వ్యాధి మరింత వేగంగా రావడానికి కారణమవుతుంది. పళ్లపై మరకలు ఏర్పడతాయి. నోటిలో దుర్వాసన, నోటిలో పుళ్లు కూడా వస్తాయి. వెంటనే పొగతాగే అలవాటును మానుకోవడం ద్వారా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

వైద్యుల వద్ద చెకప్
representational imageవయసుతో సంబంధం లేకుండా దంతాలు వచ్చిన చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ప్రతీ ఆరు నెలలకు ఓసారి తప్పకుండా దంత వైద్యుల పరీక్షకు వెళ్లాలి. దీంతో సమస్య ఏదైనా ఉంటే తొలినాళ్లలో గుర్తించడం సాధ్యపడుతుంది. అలాగే, పళ్లలో నొప్పి వేధిస్తున్నా, ముఖం వాచినట్టున్నా, పళ్లలో నొప్పి తీవ్రమవుతున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సాధారణంగా పంటి సమస్యలు చివరి దశలోనే బయటపడతాయి. కారణం నిర్ణీత సమయానికోసారి వైద్యులతో పరీక్షించుకోకపోవడమే. పళ్లు పుచ్చిపోవడం అన్నది దాదాపు నెలల నుంచి సంవత్సరాలు కూడా సమయం పట్టొచ్చు. కానీ, నొప్పి అన్నది చివరి దశలోనే వస్తుంది. కనుక ప్రతీ ఆరు నెలలకు వైద్యుల వద్దకు వెళ్లాలి. దీంతో సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స చేయడం సులభమవుతుంది.

వైద్యులు మీ పళ్లను, చిగుళ్లను పరిశీలిస్తారు. పళ్లలో పిప్పి సమస్యను ఎక్స్ రే ద్వారా తేలిగ్గా గుర్తించొచ్చు. పన్ను పుచ్చిపోవడాన్ని ఆపేందుకు డ్రిల్లింగ్ చేసి అక్కడ సిమెంట్ ఫిల్లింగ్ చేస్తారు. పంటిపై పేరుకున్న ప్లాక్యూను, మరకలను తొలగిస్తారు. నిర్లక్ష్యం చేస్తే సమస్య పెద్దదై చికిత్స సమర్థమవంతగా ఉండదు. వ్యయం కూడా పెరుగుతుంది. ఎందుకంటే చిన్న పుచ్చు అయితే సులభంగా తీసేసి ఫ్లిల్లింగ్ చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. పెద్దదై రూట్ (పునాది) వరకూ వెళితే అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ చేయాల్సి వస్తుంది.

మౌత్ వాష్
representational imageమౌత్ వాష్ అంటూ మార్కెట్లో పలు ఉత్పాదనలు ఉన్నాయి. ఉదాహరణకు కోల్గేట్ ప్లాక్స్ మౌత్ వాష్. మెడికేటెడ్ (క్లోర్ హక్సాడిన్) లోషన్ తో కూడినవే ఈ మౌత్ వాష్ ఉత్పత్తులు. ఈ లోషన్ తో ప్రతి రోజు నోటిని పుక్కిలించడం వల్ల దంత సమస్యలు రావంటూ ప్రకటనల్లో కనిపిస్తుంటుంది. నిజానికి మౌత్ వాష్ వల్ల దంత సంరక్షణకు వీలుందని చాలా మంది వైద్యులు చెబుతుండగా, కొందరు మాత్రం కేవలం నోటి దుర్వాసన రాకుండా చేసేందుకే ఇవి ఉపయోగపడతాయని అంటున్నారు.బ్రష్ నోటిలోపల అన్ని భాగాలను చేరుకోలేదని చెప్పుకున్నాం కదా. అందుకే బ్రష్ తో పాటు నిత్యం ఒక్కసారి ఫ్లాసింగ్ చేసుకోవాలి. అయితే ఫ్లాసింగ్ కూడా చివరి పన్ను వరకూ చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో మౌత్ వాష్ చేయడం వల్ల ఆ ద్రవం నోటిలో అన్ని ప్రాంతాలకు వెళుతుంది. కనుక బ్యాక్టీరియాను తొలగిస్తుందని, దాంతో ప్లాక్యూ ఏర్పడకుండా ఉంటుందని వైద్యుల సూచన. ఫ్లాసింగ్ చేసుకునే వారు మౌత్ వాష్ చేయడం తప్పనిసరి కాదు. ఫ్లాసింగ్ అన్నది మెరుగైన విధానమే. ఫ్లాసింగ్ చేసే ఓపిక, తీరిక లేని వారికి మౌత్ వాష్ తో నోటిని క్లీన్ చేసుకోవడం మంచిదే. ఎందుకంటే ఇది పళ్ల మధ్యల్లోకి వెళ్లి బ్యాక్టీరియాను తొలగించడం వల్ల దుర్వాసన కూడా ఆగిపోతుంది. చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే, దంతక్షయానికి దారితీసే బ్యాక్టీరియాను చంపేస్తుంది.

మౌత్ వాష్ లో ఫ్లోరైడ్ ఉన్నవీ వస్తున్నాయి. వీటిని ఉపయోగించినట్టయితే పళ్లు పుచ్చిపోకుండా నివారించుకోవచ్చు. మౌత్ వాష్ పళ్లపై పాచి పేరుకుపోవడాన్ని కూడా నివారిస్తుంది. అంతేకాదు, చిగుళ్ల వ్యాధులు జింజివైటిస్ రాకుండా అడ్డుకుంటుంది. మౌత్ వాష్ ను సొంతంగా కాకుండా వైద్యుల సలహా, సిఫారసు మేరకే వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మౌత్ వాష్ ద్రావకాన్ని మింగరాదు. ప్రతీ నలుగురిలో ఒకరికి మౌత్ వాష్ పరిష్కారం కాదు. అప్పటికే తీవ్రమైన దంతక్షయం, చిగుళ్ల సమస్యలున్నవారు వైద్యుల సూచనలు తీసుకోవాలి.


More Articles
Advertisement
Telugu News
Delhi openers smashes Chennai bowling
ఐపీఎల్: ఢిల్లీ ఓపెనర్ల వీరవిహారం... ధావన్, పృథ్వీ షా సెంచరీ భాగస్వామ్యం
2 hours ago
Advertisement 36
Bollywood actor Satish Kaul died of corona
బాలీవుడ్ నటుడ్ని బలిగొన్న కరోనా మహమ్మారి
2 hours ago
NTR movie with Bucchibabu in sports backdrop
స్పోర్ట్స్ నేపథ్యంలో ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా!
2 hours ago
EC supports CISF firing in West Bengal
పశ్చిమ బెంగాల్ లో సీఐఎస్ఎఫ్ కాల్పులను సమర్థించిన ఈసీ
2 hours ago
Vishnu Vardhan Reddy alleges AP Govt playing dirty politics to stop Vakeel Saab
వకీల్ సాబ్ విడుదలను అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడింది: విష్ణువర్ధన్ రెడ్డి
2 hours ago
Delhi Capitals to chase huge target against Chennai Super Kings
రాణించిన రైనా, శామ్ కరన్... చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 7 వికెట్లకు 188 రన్స్
2 hours ago
AP High Court orders do not hike Vakeel Saab ticket rates
వకీల్ సాబ్ టికెట్ల ధరలు పెంచొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం
3 hours ago
Sonu Sood helps a fan and made it possible by a cell tower in remote village
అభిమాని కోరిక మేరకు ఓ గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేసిన సోనూ సూద్
3 hours ago
Cinematic incident in China
తప్పిపోయిన కూతురే కాబోయే కోడలు... పెళ్లింట వింత పరిస్థితి... కానీ క్లైమాక్స్ అదిరింది!
4 hours ago
Chandrabu fires on AP Police during Sullurpet roadshow
సూళ్లూరుపేటలో చంద్రబాబు రోడ్ షో... ఏపీ పోలీసులపై విమర్శనాస్త్రాలు
4 hours ago
Delhi won the toss against Chennai Super Kings
ఐపీఎల్: చెన్నైతో మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ
5 hours ago
Charan movie with Gowtham Thinnanuri is a rumour
చరణ్ తో సినిమా పుకారేనన్నమాట!
5 hours ago
Three thousand above new cases in AP
ఏపీలో 3 వేలకు పైగా కొత్త కేసుల నమోదు... 12 మంది మృతి
5 hours ago
ED searches in Hyderabad
తెలంగాణ మాజీ మంత్రి నాయిని అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు
5 hours ago
Rajanikanth and kamal Haasan movies will be released at Deepavali
రజనీ .. కమల్ ఇద్దరి టార్గెట్ దీపావళినే!
5 hours ago
Fourth phase elections Bengal concludes
పశ్చిమ బెంగాల్ లో ముగిసిన నాలుగో విడత ఎన్నికల పోలింగ్
5 hours ago
Varla Ramaiah complains on CM Jagan and Sajjala Ramakrishnareddy
సీఎం జగన్ పై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్ల రామయ్య ఫిర్యాదు
5 hours ago
PV Prabhakar Rao hopes Union Govt will look into Bharataratna for PV Narasimharao
పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలంటూ తనయుడి ఆకాంక్ష
6 hours ago
China market regulatory imposes huge fine over Alibaba
అలీబాబాపై మరోసారి బుసలు కొట్టిన డ్రాగన్... 2.78 బిలియన్ డాలర్ల జరిమానా!
6 hours ago
Balakrishna latest movie look and title will be released on Ugadi
'ఉగాది'కి డబుల్ ట్రీట్ .. బాలయ్య అఘోరా లుక్!
6 hours ago