ఎస్ బీఐ సేవింగ్స్ ఖాతా బదిలీ ఇకపై ఆన్ లైన్లోనే సులువుగా చేసుకోవచ్చు

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్ బీఐ. ఇది ప్రభుత్వ రంగంలోనిది. దేశ జనాభాలో మూడింట ఒక వంతు మంది ఖాతాలు ఈ బ్యాంకులోనే ఉండడం విశేషం. సుమారు 42 కోట్ల మంది ఖాతాదారులున్నారు. సుమారు 24,000 శాఖలున్నాయి. ఇటీవలి కాలంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ కూడా ఇందులోనే కలసిపోయింది. దీంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్ బీఐ ఖాతాదారుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఎస్ బీఐలో ఖాతా ఉన్న వారు దాన్ని తమకు నచ్చిన మరో ఎస్ బీఐ శాఖకు మార్చుకోవడం ఇప్పుడు సులభతరం అయింది. ఎవరికి వారు ఆన్ లైన్లోనే దీన్ని పూర్తి చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఎలానో చూద్దాం...


అర్హతలు
ఆన్ లైన్ లో ఖాతా బదిలీ అన్నది సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారికే పరిమితం. వీరు దేశవ్యాప్తంగా ఎస్ బీఐకి చెందిన ఏ శాఖకు అయినా తమ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. ఇందుకోసం నెట్ బ్యాంకింగ్ సదుపాయం కలిగి ఉండాలి. ఇప్పటి వరకు నెట్ బ్యాంకింగ్ సేవలు వాడని వారు బ్యాంకు శాఖకు వెళ్లి బదిలీ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్ సదుపాయం పొందిన తర్వాత స్వయంగా చేసుకోవచ్చు. అలాగే, బ్యాంకు ఖాతాకు మొబైల్ నంబర్ రిజిస్టర్ అయి ఉండాలి. ఇప్పటి వరకు చేసుకోకపోతే మొబైల్ నంబర్ ను వెంటనే రిజిస్టర్ చేసుకోండి. అలాగే, కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాలు ఇచ్చి ఉండాలి. ప్రస్తుత బ్రాంచ్ నుంచి ఏ బ్రాంచ్ కు అయితే బదిలీ చేసుకోవాలని కోరుకుంటున్నారో ఆ బ్రాంచ్ కోడ్, పేరు కూడా తెలుసుకుని ఉండాలి.
representational imaheబదిలీ ప్రక్రియ
నెట్ బ్యాంకింగ్ లో లాగిన్ అవ్వాలి. ఇందుకోసం ఆన్ లైన్ ఎస్ బీఐడాట్ కామ్ (onlinesbi.com)కు వెళ్లి పర్సనల్ బ్యాంకింగ్ క్లిక్ చేసి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత పై భాగంలో ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే, అక్కడే ‘ట్రాన్స్ ఫర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్’ ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేయాలి. దాంతో మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అకౌంట్ నంబర్, బ్రాంచ్ పేరు వివరాలు ఉంటాయి. representational imaheఒకటికి మించిన ఖాతాలుంటే ఏ ఖాతాను బదిలీ చేసుకోవాలని అనుకుంటే దాన్ని సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏ బ్రాంచ్ కు అయితే ఖాతాను బదిలీ చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ బ్రాంచ్ కోడ్, పేరు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వివరాలను సరిచూసుకుని కన్ ఫర్మ్ బటన్ క్లిక్ చేయగానే బ్యాంకులో రిజిస్టరై ఉన్న మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. తర్వాతి పేజీలో ఓటీపీ నంబర్ ఇచ్చి కన్ ఫర్మ్ చేయాలి. దాంతో ‘మీ శాఖా మార్పు అభ్యర్థన విజయవంతంగా నమోదైంది’ అనే సందేశం కనిపిస్తుంది. వారం రోజుల వ్యవధిలో ఖాతా బదిలీ అవుతుంది.
representational imaheఇవి గమనించాలి
అన్ని ఖాతాలను బదిలీ చేసుకుంటే మీకు సంబంధించి కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ (సీఐఎఫ్) కొత్త బ్రాంచ్ కు తప్పకుండా బదిలీ అవుతుంది. అలా కాకుండా ఒక శాఖలో ఒకటికి మించిన ఖాతాలుండి అందులో ఒక్కటే బదిలీ చేసుకునేట్టు అయితే సీఐఎఫ్ ఏ శాఖలో కొనసాగించాలనేది ఖాతాదారుని ఇష్టమే. శాఖా  మారినప్పటికీ కస్టమర్ ఖాతా నంబర్, సీఐఎఫ్ నంబర్లలో ఎటువంటి మార్పు జరగదు. శాఖా మారిన తర్వాత కూడా అవే కొనసాగుతాయి. అయితే, ఐఎఫ్ఎస్ సీ కోడ్ ఒక్కటి మాత్రం మారుతుంది. representational imaheఎందుకంటే ఐఎఫ్ఎస్ సీ కోడ్ అన్నది బ్యాంకు శాఖలకు వేర్వేరుగా ఉంటుంది. కనుక ఖాతా మార్చుకున్న వారు ఈ విషయాన్ని గమనించాలి. ఒకవేళ ఇప్పటికే మ్యూచువల్ ఫండ్స్ కు గానీ, రుణాలు తీసుకుని రుణదాతలకు చెక్కులు, ఈసీఎస్ వంటివి ఇచ్చి ఉంటే వెంటనే శాఖ, ఐఎఫ్ఎస్ సీ కోడ్ మార్పు గురించి తెలియజేయడం తప్పనిసరి. వాడుకలో లేని సేవింగ్స్ ఖాతాలను బదిలీ చేసుకునేందుకు అవకాశం ఉండదు. సాధారణ శాఖ నుంచి మరో సాధారణ శాఖకే బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక సేవల కోసం ఏర్పాటైన సీఏజీ, ఎంసీజీ, సీపీసీ శాఖలకు మార్పుకునేందుకు అవకాశం లేదు.


More Articles