ఏ పరికరానికి ఎంత విద్యుత్ ఖర్చవుతుందో .. ఇలా లెక్కపెట్టొచ్చు!

ఇంట్లో ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. నెలనెలా విద్యుత్ బిల్లు మాత్రం తడిసి మోపెడవుతూ వుంటుంది. అన్ని పరికరాలనూ అవసరాన్ని బట్టి వాడుతూనే ఉన్నా... ఏ పరికరానికి ఎంత విద్యుత్ ఖర్చవుతుందో తెలియదు. పెద్ద పరికరాలు, ఎక్కువ విద్యుత్ వినియోగించుకునే హీటర్ వంటివే ఎక్కువ విద్యుత్ బిల్లు రావడానికి కారణమని భావిస్తుంటాం. కానీ ఇది పొరపాటు. పరికరాల విద్యుత్ సామర్థ్యమేకాదు, వాటిని వినియోగించే తీరు కూడా మొత్తం విద్యుత్ వినియోగంపై ప్రభావం చూపుతుంది. మరి అసలు ఏ పరికరం ఎంత విద్యుత్ వినియోగించుకుంటుందో తెలుసుకుందాం..

వాట్స్, విద్యుత్ యూనిట్ కొలతలు ఏమిటి?

ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాన్ని కొనుగోలు చేయడానికి వెళితే వాటి విద్యుత్ వినియోగాన్ని వాట్లలో చెబుతుంటారు. మనకేమో విద్యుత్ బిల్లులు యూనిట్ల లెక్కన లెక్కించి వసూలు చేస్తారు. అందువల్ల పరికరాల విద్యుత్ వినియోగం ఎంతో తెలుసుకునే ముందు.. అసలు విద్యుత్ వినియోగాన్ని ఎలా కొలుస్తారో చూద్దాం. సాధారణంగా ప్రతి పరికరం సామర్థ్యాన్ని వాట్ (Watt)లలో కొలుస్తారు. ఉదాహరణకు 20 వాట్ల సీఎఫ్ఎల్ బల్బు, 1,200 వాట్ల (1.2 kW) హీటర్ గా చెబుతుంటారు. అంటే ఈ పరికరాలు పనిచేస్తున్న సమయంలో అంత స్థాయిలో విద్యుత్ ను వినియోగించుకుంటూ ఉంటాయి. ఇలా ఏదైనా పరికరం గంట సేపు ఒక వాట్ విద్యుత్ ను వినియోగించుకుంటే దానిని వాట్ అవర్ (WH) అంటారు, అదే 1,000 వాట్ల విద్యుత్ ను వినియోగించుకుంటే దానిని కిలో వాట్ అవర్ (kWH) గా పేర్కొంటారు.

- ఇక యూనిట్ విద్యుత్ వినియోగం అంటే 1,000 వాట్ల విద్యుత్ ను ఒక గంట సేపు నిర్విరామంగా వినియోగించడం. అంటే ఒక కిలో వాట్ అవర్ విద్యుత్ ఒక యూనిట్ అన్న మాట. ఉదాహరణకు 1,000 వాట్ల సామర్థ్యమున్నవాటర్ హీటర్ ను గంట సేపు వినియోగిస్తే ఒక యూనిట్ విద్యుత్ ఖర్చు అవుతుంది. అదే 20 వాట్ల సీఎఫ్ఎల్ బల్బుకు ఒక యూనిట్ విద్యుత్ ఖర్చు కావాలంటే.. 50 గంటలు పడుతుంది. అంటే ఎంత తక్కువ వాట్ సామర్థ్యం ఉన్న పరికరం అంత తక్కువగా విద్యుత్ ను వినియోగించుకుంటుంది. 

ఇలా లెక్కించవచ్చు..

ఏదైనా పరికరం వాటేజ్ సామర్థ్యం, ఎన్ని గంటల పాటు వినియోగించామనే వివరాలతో దాని విద్యుత్ వినియోగాన్ని లెక్కించవచ్చు. దీనికి ఒక సూత్రం కూడా ఉంది.

విద్యుత్ వినియోగం = పరికరం వాట్ సామర్థ్యం x వినియోగించిన సమయం / 1000

 • ఉదాహరణకు 1,500 వాట్ల సామర్థ్యమున్న వాటర్ హీటర్ ను రెండు గంటల పాటు వినియోగించామనుకుంటే పై సూత్రం ప్రకారం...
 • 1500 x 2 / 1000 = 3. అంటే మూడు యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది.

ఉదాహరణకు 100 వాట్ల సామర్థ్యమున్న టీవీని ఐదు గంటల పాటు వినియోగిస్తే..

 • 100 x 5 /1000 = 0.5. అంటే ఐదు గంటల పాటు టీవీని వినియోగిస్తే అయ్యే విద్యుత్ ఖర్చు కేవలం సగం యూనిట్ మాత్రమే. ఈ లెక్కన దీనిని పది గంటల పాటు వినియోగిస్తే ఒక యూనిట్ విద్యుత్ ఖర్చవుతుంది.
 • మనకు సాధారణంగా విద్యుత్ బిల్లు నెలకోసారి వస్తుంది. అందువల్ల ఒక పరికరానికి రోజుకు ఎంత విద్యుత్ ఖర్చవుతుందో చూసుకుని.. నెల మొత్తంలో ఎన్ని యూనిట్లు వ్యయమవుతుందో తెలుసుకోవచ్చు.

వినియోగాన్ని పరిశీలించండి

 • ఎక్కువ వాటేజ్ సామర్థ్యమున్న పరికరాలే ఎక్కువగా విద్యుత్ ను వినియోగించుకుంటున్నాయని భావించవద్దు. పరికరాల వాటేజ్ సామర్థ్యం కంటే వినియోగించే సమయమే ప్రధానం. సాధారణంగా దేవుళ్ల చిత్రాలు, అలంకరణ బల్బులు వంటి వాటిని నిత్యం ఆన్ లోనే ఉంచుతుంటాం. ఆ బల్బు సామర్థ్యం 15 వాట్ల నుంచి 20 వాట్ల వరకు ఉంటుంది. 20 వాట్ల లెక్కన తీసుకుంటే.. రోజుకు 24 గంటల పాటు కలిపి (20 వాట్లు x 24 = ) 480 వాట్ల విద్యుత్ వినియోగించుకుంటుంది. అంటే పై సూత్రం లెక్కన రోజుకు 0.5 యూనిట్, నెలకు 15 యూనిట్లు విద్యుత్ ఖర్చవుతుంది.
 • మరో ఉదాహరణగా ఒక వాషింగ్ మెషీన్ వినియోగాన్ని తీసుకుందాం. సాధారణంగా 6 కేజీల సామర్థ్యమున్న టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ సామర్థ్యం 350 వాట్లు. ఇది ఒకసారి బట్టలు ఉతకడానికి గంట నుంచి గంటా 10 నిమిషాల సమయం తీసుకుంటుంది. గంట 10 నిమిషాలనే లెక్కలోకి తీసుకుంటే.. ఒకసారి/ఒకరోజు వినియోగానికి 410 వాట్ల (గంటకు 350 వాట్లు + 10 నిమిషాలకు 60 వాట్లు) విద్యుత్ ఖర్చవుతుంది. అంటే రోజుకు 0.4 యూనిట్లు, నెలకు 12 యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగం అవుతుంది.

- ఈ రెండు ఉదాహరణలను పరిశీలించి చూస్తే... మనం పెద్దగా పట్టించుకోని ఒక చిన్న అలంకరణ బల్బు వినియోగం కంటే పెద్ద పరికరంగా భావించే వాషింగ్ మెషీన్ కు అయ్యే విద్యుత్ ఖర్చు తక్కువ. అలంకరణ బల్బులే కాదు మనం సరిగా పట్టించుకోని ఎన్నో చిన్న పరికరాలు మన విద్యుత్ వినియోగాన్ని, బిల్లులను పెంచేస్తాయి.

ఏ పరికరానికి ఎంత విద్యుత్ ఖర్చు

మనం నిత్యం వినియోగించే పరికరాల వాట్ సామర్థ్యం ఆధారంగా ఎంత విద్యుత్ వినియోగించుకుంటాయో, ఒక యూనిట్ విద్యుత్ తో ఆయా పరికరాలు ఎంతసేపు పనిచేస్తాయో ఈ టేబుల్ లో చూడవచ్చు.

పరికరం
వాట్ సామర్థ్యం
ఒక యూనిట్ విద్యుత్ తో
ఎంతసేపు నడుస్తుంది
సీఎఫ్ఎల్ బల్బు 15 వాట్లు1566 గంటలు
సీఎఫ్ఎల్ బల్బు 20 వాట్లు
2050 గంటలు
సీఎఫ్ఎల్ బల్బు 25 వాట్లు
2540 గంటలు
సాధారణ బల్బు (60 వాట్స్)6016.5 గంటలు
సాధారణ బల్బు (100 వాట్స్)10010 గంటలు
ట్యూబ్ లైట్ T124025 గంటలు
ట్యూబ్ లైట్ T8
3628 గంటలు
ట్యూబ్ లైట్ T5
2836 గంటలు
సీలింగ్ ఫ్యాన్ (సాధారణ)75-9013 గంటలు
సీలింగ్ ఫ్యాన్
(సూపర్ ఎఫియెంట్)
30-5524 గంటలు
టేబుల్ ఫ్యాన్150-2006.5 గంటలు
ఏసీ (ఒక టన్ను)1,000-1,500 1 గంట
ఏసీ (1.5 టన్నులు)1,200-1,80045 నిమిషాలు
ఏసీ (3 టన్నులు)2,000-2,50030 నిమిషాలు
టీవీ (సీఆర్ టీ - 21 అంగుళాలు)130-1806.5 గంటలు
టీవీ (ఎల్ సీడీ - 21 అంగుళాలు)
50-7015.3 గంటలు
టీవీ (ప్లాస్మా - 32 అంగుళాలు)250-3004 గంటలు
టీవీ (ఎల్ఈడీ - 21 అంగుళాలు)30-4026 గంటలు
రిఫ్రిజిరేటర్ (190 లీటర్లు)120-15026 గంటలు
రిఫ్రిజిరేటర్ (210 లీటర్లు)130-17024 గంటలు
రిఫ్రిజిరేటర్ (245 లీటర్లు)150-19021 గంటలు
రిఫ్రిజిరేటర్ (300 లీటర్లు)180-25020 గంటలు
రిఫ్రిజిరేటర్ (345 లీటర్లు)210-30018 గంటలు
వాషింగ్ మెషీన్
(టాప్ లోడ్ 6 కేజీ)
350-5002.6 గంటలు
వాషింగ్ మెషీన్
(ఫ్రంట్ లోడ్ 6 కేజీ)
500-600105 నిమిషాలు
క్లాత్ డ్రయ్యర్1,500-2,50035 నిమిషాలు
ఎయిర్ కూలర్250-3004 గంటలు
మిక్సర్ గ్రైండర్700-900గంటా 35 నిమిషాలు
ఇండక్షన్ స్టవ్1,500-2,00045 నిమిషాలు
ఎలక్ట్రిక్ కుక్కర్1,000-1,500గంటా 20 నిమిషాలు
మైక్రోవేవ్ ఓవెన్1,500-2,50045 నిమిషాలు
బ్రెడ్ టోస్టర్800-1,50050 నిమిషాలు
కాఫీ మేకర్800-1,200గంటా 10 నిమిషాలు
డిష్ వాషర్1,200-1,50045 నిమిషాలు
రూమ్ హీటర్1,500-2,00035 నిమిషాలు
గీజర్ (20 లీటర్లు)1,000-1,20045 నిమిషాలు
వాటర్ మోటార్ (1 హెచ్ పీ)800-1,200ఒక గంట
ఐరన్ బాక్స్1,000-1,500ఒక గంట
వాక్యూమ్ క్లీనర్300-5002.3 గంటలు
హెయిర్ డ్రయ్యర్1,000-1,500గంటా 15 నిమిషాలు
హెయిర్ ట్రిమ్మర్150-2505 గంటలు
డెస్క్ టాప్ కంప్యూటర్ 120-1507.5 గంటలు
ల్యాప్ టాప్ కంప్యూటర్50-6018 గంటలు
సీఆర్టీ మానిటర్10012 గంటలు
ఎల్సీడీ మానిటర్4025 గంటలు
ఇంక్ జెట్ ప్రింటర్20-3036 గంటలు
హోం థియేటర్60-10014 గంటలు
సెట్ టాప్ బాక్స్8-10120 గంటలు
సెట్ టాప్ బాక్స్ (రికార్డబుల్)
18-2070 గంటలు
సెల్ ఫోన్ చార్జర్లు5-8150 గంటలు
రూటర్లు, మోడెమ్ లు5-10140 గంటలు

నోట్: రిఫ్రిజిరేటర్ల వాటేజ్ సామర్థ్యం ఎక్కువే అయినా అవి కూల్ అయ్యాక వాటంతట అవే ఆఫ్ అవుతాయి. కూలింగ్ తగ్గగానే తిరిగి ఆన్ అవుతాయి. అందువల్ల వాటి విద్యుత్ వినియోగం తక్కువ. ఇక ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ల విద్యుత్ వినియోగం ఇందులో పేర్కొన్న దానికన్నా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఇచ్చిన పరికరాలన్నీ స్టాండర్డ్ క్వాలిటీకి అనుగుణంగా తీసుకుని విద్యుత్ వినియోగాన్ని లెక్కించినవి. స్టార్ రేటింగ్, టెక్నాలజీ వినియోగం, ఎంతకాలం నుంచి పరికరాన్ని వినియోగిస్తున్నారనే అంశాలపై ఆధారపడి విద్యుత్ వినియోగం మారుతుంది.

ఇవి గుర్తుంచుకోండి

 • ఇళ్లలో ఎక్కువ విద్యుత్ వినియోగించుకునే పరికరాలు సీలింగ్/ టేబుల్ ఫ్యాన్లు. ఎందుకంటే వాటిని దాదాపుగా రోజంతా ఉపయోగిస్తుంటాం. సాధారణ సీలింగ్ ఫ్యాన్ల విద్యుత్ వినియోగం 75 నుంచి 90 వాట్లు. అంటే రోజుకు 12 గంటల పాటు వినియోగించినా.. రోజుకు ఒక యూనిట్, నెలకు 30 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. ఈ లెక్కన 3 సీలింగ్ ఫ్యాన్ల వినియోగమే నెలకు 80 నుంచి 100 యూనిట్ల దాకా ఉంటుంది. వీటి స్థానంలో సూపర్ ఎఫిషియెంట్/ స్టార్ రేటెడ్ ఫ్యాన్లను వినియోగించవచ్చు. వీటి విద్యుత్ వినియోగం 30 నుంచి 55 వాట్లు. అంటే సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే విద్యుత్ వినియోగం సగానికిపైగా తగ్గుతుంది.
 • వెలుతురు కోసం ఎల్ఈడీ బల్బులు లేదా టీ5 ట్యూబ్ లైట్లు, సీఎఫ్ఎల్ బల్బులను వినియోగించడం మంచిది. ఖరీదు ఎక్కువైనా ఎల్ఈడీ బల్బుల మన్నిక, విద్యుత్ పొదుపు చాలా ఎక్కువ. అయితే బాత్రూమ్ లు, ఇంటి ఆవరణల్లో ఉండే బల్బుల వినియోగం బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి సీఎఫ్ఎల్ లు సరిపోతాయి.
 • ఇన్వర్టర్ టెక్నాలజీ ఆధారంగా రూపొందిన రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లను  వినియోగించండి. అవి విద్యుత్ ను పెద్ద మొత్తంలో ఆదా చేస్తాయి. 
 • టీవీల్లో ఎల్ సీడీ, ప్లాస్మా తరహాల కంటే ఎల్ఈడీ టీవీలు మేలు.
 • పరికరాల విద్యుత్ వినియోగాన్ని కచ్చితంగా కొలవడానికి ‘కిల్ ఏ వాట్ మీటర్ (కిలో వాట్ మీటర్)’ పేరిట పరికరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ప్లగ్ లో పెట్టి, పరికరాన్ని దానికి అనుసంధానం చేస్తే... పరికరం వాటేజ్ సామర్థ్యం నుంచి విద్యుత్ వినియోగం, పవర్ ఫ్యాక్టర్ దాకా కచ్చితంగా వెల్లడిస్తాయి.

విద్యుత్ ను పొదుపు చేసే చిట్కాలు

 • అవసరం లేని సమయాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా ఆఫ్ చేయడం మంచిది. టీవీల వంటి వాటిని రిమోట్ తో ఆఫ్ చేసినా.. టీవీ లోపలి ఎలక్ట్రానిక్ భాగాలు, సెట్ టాప్ బాక్స్ విద్యుత్ ను వినియోగిస్తూనే ఉంటాయి.
 • సెల్ ఫోన్ చార్జర్లు, చార్జింగ్ లైట్లు వంటి పరికరాలను వినియోగించనప్పుడు పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయడమో, మెయిన్ నుంచి తొలగించడమో చేయాలి.
 • ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయండి. అది కూడా మీ అవసరాలకు మించిన పరిమాణంలో ఉన్న వాటిని తీసుకోవద్దు. దానివల్ల ఖర్చు ఎక్కువ, విద్యుత్ మోత ఎక్కువ.
 • రిఫ్రిజిరేట్లర్లను తప్పనిసరిగా గోడకు కనీసం ఆరు అంగుళాల దూరంలో ఉంచాలి. దాంతో వాటి నుంచి వెలువడే ఉష్ణం త్వరగా విస్తరించి, ఫ్రిజ్ వెనుకభాగం చల్లగా ఉంటుంది. ఫ్రిజ్ విద్యుత్ వినియోగం తగ్గుతుంది.
 • గీజర్లు, వాటర్ హీటర్లు వంటి వాటిని సరైన సమయంలో ఆన్ చేసి వినియోగించుకోండి. ముందే ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల నీళ్లు ఎక్కువగా వేడెక్కి, అటు విద్యుత్ ఇటు నీళ్లు వృథా అవుతాయి.
 • ఏసీలు వినియోగించేవారు తలుపులు, కిటికీలు మూసి ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేకుంటే వేడిగాలి లోపలికి వచ్చేసి.. ఏసీపై మరింత భారం పెంచుతుంది. ఇక ఏసీ ఆన్ చేయగానే వెంటనే చల్లబడుతుందని భావించి ఒక్కసారిగా అతితక్కువ ఉష్ణోగ్రతకు సెట్ చేయవద్దు. అలా సెట్ చేయడం వల్ల చల్లబడేందుకు ఒకటి రెండు నిమిషాలకు మించి తేడా లేకపోగా... విద్యుత్ వినియోగం భారీగా ఉంటుంది.


More Articles