ap7am logo

అటవీ ప్రాంతాలు, వన్యప్రాణుల రక్షణకు తెలంగాణ అటవీ శాఖ వినూత్న ప్రయత్నాలు!

Sat, Jan 04, 2020, 04:51 PM
Related Image
  • సాధారణ ప్రజలు, అటవీ సరిహద్దు గ్రామాల్లో పల్లె ప్రగతి వేదికగా అవగాహన కార్యక్రమాలు

  • ప్రచార సామాగ్రి, సోషల్ మీడియా ద్వారా చైతన్యం తెచ్చే కార్యాచరణ

  • అటవీ శాఖలో ఔత్సాహికులు, కళాకారులను ప్రొత్సహిస్తున్న ఉన్నతాధికారులు


అన్ని గ్రామాల సమగ్రాభివృద్ది, పచ్చదనం- పరిశుభ్రత  పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టిన రెండో విడత పల్లె ప్రగతి కొనసాగుతోంది. దీనిలో తనవంతు పాత్ర పోషించేందుకు అటవీ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పిలుపు నిచ్చిన జంగల్ బచావో, జంగల్ బడావో నినాదాన్ని పల్లె ప్రగతి సందర్భంగా మరింత విసృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.

ఆయా  గ్రామాల అవసరం మేరకు పెద్ద మొక్కలను సరఫరా చేయటం, గతంలో నాటిన మొక్కల్లో చనిపోయిన వాటిని మార్చటంతో పాటు, మొక్కలు నాటడం, నిర్వహణలో  వివిధ రకాలుగా సాంకేతిక సహకారాన్ని కూడా అటవీ శాఖ అందిస్తోంది. అదే సమయంలో అటవీ ప్రాంతాలు, వన్యప్రాణుల రక్షణతో పాటు, అటవీ నేరాల అదుపుపై అటవీ శాఖ ప్రచారాన్ని మొదలు పెట్టింది. సాంప్రదాయ పద్దతులకు తోడు కొత్త తరహా ప్రచార సాధనాలు, సోషల్ మీడియాను కూడా అటవీ రక్షణకు ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు.

ముఖ్యంగా అటవీ సమీప గ్రామాల్లో అటవీ సంపద ప్రాధాన్యతను వివరించటం, ఎలాంటి ఆక్రమణలు, అటవీ ఉల్లంఘనలు, నేరాలు జరగకుండా అటవీ రక్షణను సామాజిక బాధ్యతగా తీసుకునేలా గ్రామ పంచాయితీ విధుల్లో ఈ విషయాన్ని చేర్చేలా అటవీ శాఖ కృషి చేస్తోంది. పల్లె ప్రగతిలో భాగంగా జరుగుతున్న పంచాయితీ సమావేశాలను ఇందుకు వేదికగా వినియోగిస్తున్నారు. ఆయా గ్రామాల సమీపంలో ఎంత అటవీ భూమి ఉంది, అక్కడ ఉన్నటు వంటి వృక్ష, జంతు సంపదలను నమోదు చేయటంతో పాటు, అడవిని కాపాడటం వల్ల సమాజానికి ఒనగూడే ప్రయోజనాలపై అవగాహన కల్పించే ప్రయత్నం అటవీ శాఖ చేస్తోంది. పౌర పర్యవేక్షణ ద్వారా అటవీ రక్షణ బలోపేతం అవుతుందని, అలాగే అటవీ చట్టాలపై అవగాహన తేవటం ద్వారా నేరాలను తగ్గించవచ్చని అటవీ శాఖ భావిస్తోంది. దీనికి తోడు అటవీ ప్రాంతాల్లో గత యేడాది చేపట్టిన వివిధ అభివృద్ది పనులు, రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన పనులను వివరించటంతో పాటు గ్రామ సభ ఆమోదాన్ని కూడా స్థానిక అటవీ అధికారులు తీసుకుంటున్నారు.

దీని ద్వారా అటవీ ప్రయోజనాలపై స్థానికులకు అవగాహనతో పాటు, అటవీ శాఖ చేస్తున్న ప్రాయోజిత పనులపై కూడా ప్రజలందరికీ వాస్తవాలను పారదర్శకంగా వివరించినట్లు అవుతుందని పీసీసీఎఫ్ ఆర్.శోభ వెల్లడించారు. అలాగే అవగాహన, ప్రచారం కోసం వీడియోలు రూపొందించటం, వాయిస్ ఎనౌన్స్ మెంట్లను గ్రామ సభల్లో వినిపించటంతో పాటు, సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలకు చేరేలా అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్ జిల్లాలో డిప్యూటీ రేంజ్ అధికారిగా పనిచేస్తున్న వి. రమేశ్ స్వయంగా రాసి, పాడిన అడవి తల్లి పాటలను ఇటీవల విడుదల చేశారు. అడవి ప్రాధాన్యత, అందరికీ అవగాహన కల్పిచేంలా రమేశ్ చేసిన ప్రయత్నాన్ని ఉన్నతాధికారులు ప్రశంసించారు. వివిధ జిల్లాల్లో స్థానిక అడవుల ప్రాధాన్యత, రక్షణ బాధ్యతపై ప్రజలను చైతన్యవంతం చేసేలా వాయిస్ మెసేజ్ లను కూడా అటవీ శాఖ సిద్దం చేసి ప్రచారంలో పెట్టింది. తెలంగాణకు హరితహారం పేరుతో అటవీ శాఖ ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్ ఎకౌంట్ లను నిర్వహిస్తోంది. శాఖ ద్వారా నిర్వహించే అన్ని కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తోంది.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)