ap7am logo

వైసీపీ సంస్కారం మరచి మాట్లాడినా మేము ప్రభుత్వ పాలసీలనే ప్రశ్నిస్తాం: పవన్ కల్యాణ్

Wed, Nov 13, 2019, 09:43 AM
Related Image

•జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలా మాట్లాడటం లేదు 

•వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారంటే ఆయన పాలనలో లోపాలున్నట్లే 

•జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడేది లేదు 

•ఉపాధ్యాయులకు ఆంగ్లంలో ప్రావీణ్యం కల్పించకపోతే విద్యార్థులకు నష్టం 

•అటు తెలుగు... ఇటు ఆంగ్లం రాకుండా నష్టపోతారు 

•విజయవాడలో విలేకర్ల సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 

ప్రభుత్వ పాలసీలు, ప్రజా సమస్యలపై తాము మాట్లాడుతుంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమస్యలను పక్కదారి పట్టించడానికి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా సమస్యను తప్పుదోవ పట్టించడానికి వ్యక్తిగత దూషణకు దిగడం సిగ్గుచేటని అన్నారు. జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలా కాకుండా..  వైసీపీ నాయకుడిలా చిల్లరగా మాట్లాడుతున్నారన్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారంటే వారి పాలనలో లోపాలు ఉన్నాయని అర్ధమవుతుందని,  వైసీపీ నాయకులు భాషాసంస్కారాలు మరిచి ఎంత హీనంగా మాట్లాడినా తాము మాత్రం ప్రభుత్వ విధివిధానాలపైనే మాట్లాడతామని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాష్ట్ర ఆర్ధిక ప్రగతిని ప్రభుత్వ ఇసుక విధానం దెబ్బ తీసింది. గత ప్రభుత్వంలో తప్పిదాలు జరిగితే సరిదిద్దుకొని ముందుకెళ్లాలి తప్ప.. నూతన ఇసుక పాలసీ పేరుతో మొత్తానికే ఇసుక సరఫరా నిలిపివేశారు. అవగాహన లేకో.. లేకపోతే వేరే విధంగా లబ్ధి పొందడానికో తెలియదు కానీ నాలుగు నెలలుగా ఇసుక సరఫరా నిలిపివేశారు. దీంతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ కార్మికులు  పనులు లేక  రోడ్డునపడ్డారు. ఈ విషయాన్ని ఈ రోజు రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ గారికి వివరించాం. దాదాపు 50 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. లక్షన్నర మందితో విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేస్తే రూ. 5 లక్షల చొప్పున ఐదుగురికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారు. 

ఇసుక పాలసీ గురించి, తెలుగు భాష గురించి మాట్లాడితే.. సమస్యను పక్కదారి పట్టించడానికి జగన్ రెడ్డి, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా తిడుతున్నారు. నన్ను వ్యక్తిగతంగా దూషించే వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాను.. మీరు తిడితే తెలుగుదేశం పార్టీ నాయకలుపడతారేమో.. జనసేన పార్టీని నేతలు పడరు.  ప్రభుత్వ విధివిధానాల్లో లోపాలు ఉంటే కచ్చితంగా ప్రశ్నిస్తాం. నోటికి వచ్చినట్లు మాట్లాడేవాళ్లం కాదు. ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలు కూడా చేస్తాం. అందులో భాగంగానే ఇవాళ గవర్నర్ గారిని కలిసి ఇసుక పాలసీపై 18 పాయింట్లతో కూడిన నివేదిక అందించాం. పర్యావరణం దెబ్బతినకుండా ఎలా ఇసుక ను సరఫరా చేయాలో నివేదికలో పొందుపరిచాం. 

•జగన్ అందుకే జైల్లో ఉన్నారా?

ప్రభుత్వ పాలసీలపై ఒక వ్యక్తి ప్రశ్నిస్తే.. ఆ వ్యక్తి కులానికి సంబంధించిన వ్యక్తులతో తిట్టించడం వంటి కుటిల రాజకీయాలకు జనసేన పార్టీ విరుద్దం. జగన్ రెడ్డి గారిని తాము ఎప్పుడు ఒక కులంగా చూడలేదు. ఒక వ్యక్తిగానే చూశాం. జగన్ రెడ్డి గారిని ఒక మాట అంటే ఆయన కులస్తులను అన్నట్లు ఎంతమాత్రం కాదు. జగన్ రెడ్డి గారికి విన్నపం ఏంటంటే..  నేను మిమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు కేవలం కాపు కులానికి సంబంధిన వ్యక్తులే నన్ను విమర్శించక్కర్లేదు. మిగతావాళ్ల కూడా విమర్శించవచ్చు. నన్ను విమర్శిస్తే కాపుల ఓట్లు పోతాయని భయం కూడా అవసరం లేదు. తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లి కాపు రిజర్వేషన్ కు వ్యతిరేకం అన్నా మీకు ఓట్లు వేశారు.   ప్రజాసమస్యలపై పోరాటంలో  మా పార్టీ విధివిధానాలు అయితే మారవు. మేము  కచ్చితంగా ప్రశ్నిస్తాం. అవసరమైతే ఘాటుగా విమర్శిస్తాం. 

ప్రతిదానికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అంటున్నారు, తానేమీ సరదా కోసం మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని, కుదర్లేదు కాబట్టే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను. అయినా నేను ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకు బాధ? మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారన్నారు. నేను మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే మీరు రెండేళ్లు జైల్లో ఉన్నారా?. ఇసుక పాలసీ దగ్గర నుంచి రివర్స్ టెండరింగ్ వరకు పద్దతి పాడు లేకుండా చేశారు. జగన్ రెడ్డి గారి అండ చూసుకొని 150 మంది ఎమ్మెల్యేలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. పాము శివుడి మెడలో ఉన్నంత వరకే గౌరవం. అలాగే ఒక్కసారి జగన్ గారి పరిస్థితి అటుఇటు అయితే మీ అందరి భవిష్యత్తు ఏంటో ఆలోచించి మాట్లాడండి. ఎలా పడితే అలా మాట్లాడితే భరించడానికి తాము తెలుగుదేశం పార్టీ కాదు జనసేన పార్టీ గుర్తు పెట్టకోండి.  జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడేది లేదు. అవసరమైతే విజయవాడ నడిబొడ్డున చూసుకుంటాం. 

•రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతారు 

పొట్టి శ్రీరాములు గారి బలిదానంతో భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి అసలు చరిత్ర తెలుసా?.  2015 – 16 లో తమిళనాడులో బలమైన తెలుగు భాష ఉద్యమం జరిగింది. అక్కడ ఇప్పటికీ తెలుగు మీడియం ఉంది.   ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్. ఎవరూ కాదనలేదు. కానీ ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలోకి మార్చాలంటే హేతుబద్దత ఉండాలి. 90 వేల మంది ఉపాధ్యాయులకు  ట్రైయినింగ్ ఇవ్వకుండా, ఇంగ్లీషులో వారికి ప్రావీణ్యం కల్పించకుండా ఒకేసారి ఇంగ్లీషు మీడియంలోకి మార్చేస్తాను అంటే ఎలా..?. తెలుగు దండగ.. ఇంగ్లీషు పండగా అని మార్చుకుంటూ పోతే.. అటు ఇంగ్లీషు రాక ఇటు తెలుగు సరిగా రాక విద్యార్ధులు రెండింటికి చెడ్డ రేవడిలా తయారవుతారు. వారికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు. అప్పుడు జగన్ రెడ్డి కానీ, 150 మంది ఎమ్మెల్యేలు కానీ ఉండరు. 

•ఉపరాష్ట్రపతి స్థాయికి గౌరవం ఇవ్వరా?

ఇవన్ని దృష్టిలో పెట్టుకొని  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మాట్లాడితే.. కనీసం సిగ్గులేకుండా ఆయన స్థాయికి మర్యాద ఇవ్వకుండా విమర్శిస్తారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇంగ్లీషు ముక్క లేకుండా స్పష్టంగా వారి మాతృభాషల్లో మాట్లాడుతుంటే- మన తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణలో తుర్దు, ఆంధ్రలో టింగ్లీషు మాట్లాడుతున్నాం. ఇప్పటికి కూడా పరిపూర్ణమైన తెలుగు మాట్లాడే పరిస్థితుల్లో మనం లేం. హిందీ భాషను దక్షిణాదిపైన రుద్దాలని కేంద్ర పెద్దలు చూస్తే.. దానిపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో వాళ్లు వెనక్కి తగ్గారు. ఆ స్థాయి వ్యక్తులు ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నామని చెప్పి వెనక్కి తగ్గారు. ప్రజలు నొచ్చుకోకుండా ఎంతో పద్దతిగా మాట్లాడారు. మీరు మాత్రం హేతుబద్దత లేకుండా విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్నారు. మీకు అంతగా ఇంగ్లీషు మీడియంపై ప్రేమ ఉంటే తిరుపతిలో సుప్రభాతం కూడా ఇంగ్లీషులో చదివించండి.  జనసేన పార్టీ కోరుకుంటుంది ఒక్కటే. ముందు అధ్యాపకులను సిద్ధం చేయండి,  పైలెట్ ప్రాజెక్టుగా ఏదో ఒక ప్రాంతంలో అమలు చేసి  ఫలితాలను బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండ”ని సలహా ఇచ్చారు.   

•జనసేన పోరాటం ఇంతటితో ఆగిపోలేదు

రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “భవన నిర్మాణ కార్మికుల తరఫున జనసేన పార్టీ చేస్తున్న పోరాటం ఇంతటితో ఆగిపోదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పార్టీపరంగా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వానికి ఓ గడువు ఇచ్చాం. రెండు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని విశాఖ సభలో అధ్యక్షుల వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ రోజు గవర్నర్ గారిని కలసి జనసేన పార్టీ తరఫున ఓ నివేదిక కూడా అందచేశారు. ఇసుక పాలసీలో లోటుపాట్లపై అధ్యయనం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై పవన్ కళ్యాణ్ అందులో వివరించారు. 15,16 తేదీల్లో డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో భవన నిర్మాణ కార్మికుల కోపం జనసైనికులు, నాయకులు శిభిరాలు ఏర్పాటు చేసి ఆహారం అందించాలని ఇప్పటికే అధ్యక్షుల వారు పిలుపు ఇచ్చారు. ఇది రాజకీయ లబ్ది కోసం చేసే కార్యక్రమం కాదు. ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడాలి, వారికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. ఆత్మహత్యలకు పాల్పడిన అందరికీ పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వం ఇళ్లు కట్టుకునే వారి నుంచి వసూలు చేసిన సెస్ నుంచి పరిహారం అందచేయాలి” అని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ పాల్గొన్నారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)