ap7am logo

మిషన్‌ భగీరథ తరహా పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసే ఆలోచన ఉంది: కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

Tue, Nov 12, 2019, 10:53 AM
Related Image తెలంగాణలో ఇంటింటికీ శుద్ధిచేసిన, స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న మిషన్‌ భగీరథ తరహా పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసే ఆలోచన ఉన్నదని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస కర్తవ్యమని. ఆయారాష్ర్టాల భాగస్వామ్యంతో తాగునీటి పథకాలు అమలుచేయాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో దక్షిణాది రాష్ర్టాల సమీక్షా సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి షెకావత్‌.. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా తెంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌, ఇతర అధికారులు మిషన్‌ భగీరథ స్వరూపాన్ని పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. తెలంగాణలో 24వేల ఆవాసాలకు ప్రతిరోజూ ఉపరితలజలాలను అందించేందుకు మిషన్‌ భగీరథ పథకం చేపట్టామని కేసీఆర్‌ తెలిపారు. ‘తెలంగాణలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉండేది. చాలాచోట్ల ప్రజలు ఫ్లోరైడ్‌ సమస్యతో బాధపడుతుండేవారు. మహిళలు నీటికోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. కొన్నిచోట్ల నీళ్లున్నా అపరిశుభ్రంగా ఉండటంతో అనారోగ్యం పాలయ్యేవారు. అందుకే గోదావరి, కృష్ణాజలాలను శుద్ధిచేసి ప్రతిరోజూ ప్రజలకు అందించేందుకు మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టాం. దాదాపుగా పూర్తయింది. ఈ పథకం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉండటంతోపాటు, మహిళలకు నీటి ఇబ్బందులు తప్పాయి. వారి జీవన పరిస్థితులు మెరుగయ్యాయి. రాబోయే 30 ఏండ్ల వరకు పెరిగే జనాభాను అంచనా వేసి అప్పటి అవసరాలు కూడా తీర్చేలా ఈ ప్రాజెక్టుకు డిజైన్‌ చేశాం. ఇలాంటి పథకం దేశమంతా అమలైతే మంచిది. తాగునీరు అందించేందుకు చేపట్టే కార్యక్రమాలను ఆర్థిక కోణంలో చూడొద్దు’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

దేశంలో ప్రజలందరికీ సురక్షిత మంచినీరందించాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నదని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో మిషన్‌ భగీరథ పథకానికి, దాని నిర్వహణకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రమంత్రిని కోరారు. పదకొండో శతాబ్దంలోనే కాకతీయులు వేల చెరువులు తవ్వించారని, సమైక్య పాలనలో అవన్నీ నాశనమయ్యాయని వివరించిన సీఎం కేసీఆర్‌.. మిషన్‌ కాకతీయ ద్వారా ఆ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. 90 శాతం ఆయకట్టు కలిగిన చెరువులను బాగు చేయగలిగామని వెల్లడించారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాల్ని ప్రశంసించిన కేంద్రమంత్రి.. త్వరలో మరోసారి తెలంగాణలో పర్యటించి, క్షేత్రస్థాయిలో ఈ పథకాల అమలును స్వయంగా పరిశీలించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ ఎస్కే జోషి, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి పరమేశ్వరన్‌ అయ్యర్‌ తదితరులు పాల్గొన్నారు
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)