ఆంధ్రప్రదేశ్ క్రాప్ట్ కౌన్సిల్ తో ఆప్కో అవగాహన

Related image

  • చేనేతకు బ్రాండింగ్ పెంపు ధ్యేయంగా కార్యాచరణ
  • యువతను ఆకర్షించేలా నూతన డిజైన్ల రూపకల్పన
  • విస్త్రుత ప్రదర్శనల ఏర్పాటు, అవగాహనా సదస్సులు
విజయవాడ: చేనేత వస్త్రాల బ్రాండింగ్ పెంపే ధ్యేయంగా ప్రభుత్వ రంగ సంస్ధ ఆప్కో, ఆంధ్రప్రదేశ్ క్రాప్ట్ కౌన్సిల్ పరస్పర అవగాహనకు రానున్నాయి. ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు, ఎండి చదలవాడ నాగరాణితో మంగళవారం సంస్ధ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయిన కౌన్సిల్ కార్యదర్శి రంజన, కోశాధికారి జయశ్రీలు ఈ అంశంపై లోతుగా చర్చించి ప్రాధమిక అవగాహనకు వచ్చారు.

ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ భారతదేశంలో వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమ మాత్రమే అతిపెద్ద ఉపాధి రంగంగా ఉందన్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం పని కల్పిస్తూ జీవనోపాధికి తోడ్పడుతుందని, కాని ప్రస్తుత ఆధునిక పరిస్థితుల్లో చేనేతకు తగిన ప్రచారం, యువతలో అవగాహన లేక చేనేత వస్త్రాల వినియోగం తగ్గుతుందన్నారు. ఈ పరిస్థితులను అధికమించే క్రమంలో తమ సంస్ధ ఆంధ్రప్రదేశ్ క్రాప్ట్ కౌన్సిల్ తో కలిసి ముందడుగు వేయాలని నిర్ణయించామన్నారు. కౌన్సిల్ తమ సేవలు అందించేందుకు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చిందన్నారు. చేనేత వస్త్రాల ప్రాముఖ్యత,  వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై విద్యా సంస్ధలతో పాటు అన్ని రకాల ఇతర సంస్థల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసే బాధ్యతను క్రాప్ట్ కౌన్సిల్ తీసుకుంటుందని ఈ సంస్ధ ఎండి నాగరాణి వివరించారు.
 
గత కొంత కాలంగా యువత ఆలోచనలు, ఆకాంక్షలకు అవసరం అయిన వస్త్ర శ్రేణిని చేనేత రంగం అందించలేక పోవటం వల్ల వినియోగం ఆశించిన స్థాయిలో లేదన్నారు. ఇందుకు అవసరం అయిన నూతన డిజైన్లతో కూడిన వెరైటీలు ప్రవేశపెట్టడంలో ఇరు సంస్ధలు కలిసి పనిచేస్తాయని వివరించారు. చేనేత రంగంపై చర్చకు అవకాశం ఇచ్చేలా అవగాహన సదస్సులు, సమూహ చర్చలు, ప్రదర్శనలు నిర్వహించటం వల్ల ఈ రంగానికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.

ముంబై, ఢిల్లీ, కలకత్తా, అహ్మదాబాద్ వంటి మెట్రో నగరాల్లో చేనేత వస్త్ర ఎగ్జిబిషన్లు నిర్వహించటం, శాశ్వత విక్రయశాలలు ఏర్పాటు చేయటం వంటి అంశాలపై కూడా ఈ సమావేశం చర్చించిందని నాగరాణి తెలిపారు. చేనేత రంగం బలోపేతానికి తమ వంతు సహాయం చేస్తామని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రాప్ట్ కౌన్సిల్ ప్రతినిధులు రంజన, జయశ్రీ పేర్కొన్నారు. తాము నిర్వహించే అవగాహన సదస్సులు ద్వారా పురాతన సంప్రదాయబద్ధమైన చేనేత వస్త్రాల విశిష్టత, ప్రాముఖ్యతలను ప్రజలలోకి తీసుకు వెళ్లగలమన్న విశ్వాసం ఉందన్నారు.

సమావేశం అనంతరం కేంద్ర కార్యాలయం అవరణలోని ఆప్కో మెగా షోరూంను సందర్శించిన కౌన్సిల్ సభ్యులు వివిధ రకాల చేనేత వస్త్రాలను తిలకించి స్వల్ప మార్పులతో వాటికి ఏలా ఆధునికతను జోడించవచ్చన్న దానిని గురించి చర్చించారు. 

More Press Releases