ఈ నెల 20న పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్

Related image

హైదరాబాద్: రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో ఈ నెల 20న ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖను ఆధునీకరించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ సమర్థవంతంగా జరిగేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నది.

గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల నిషేధం వంటివి పటిష్టంగా అమలు చేసింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పెచ్చుమీరుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలు నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు సీఎం పోలీస్, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ, ఎక్సైజ్ శాఖల ప్రధాన కార్యదర్శులు, డిజీపి మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు, ఐజిలు, డిఐజిలు, అడీషినల్ డిజి లా అండ్ ఆర్డర్, ఇంటలిజెన్స్ అడీషినల్ డిజి, జిల్లాల ఎస్పీలు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, జిల్లా సూపరింటెండెంట్లు, రాష్ట్ర మాదకద్రవ్యాల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు తదితరులు పాల్గొంటారు. జిల్లా ఎక్సైజ్ శాఖాధికారులు తమ జిల్లాల పరిధిలో నెలకొన్న పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలతో రావాలని సీఎం ఆదేశించారు.
 
రాష్ట్రంలో గుడుంబా, పేకాట నియంత్రణ పటిష్టంగా అమలవుతున్నప్పటికీ అక్కడక్కడా తిరిగి తలెత్తుతున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో తీసుకోవలసిన కఠిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. మాదకద్రవ్యాల బారిన పడి యువత నిర్వీర్యం కాకూడదనే లక్ష్యంతో రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు చేపట్టవలసిన కార్యాచరణను సమావేశం రూపొందిస్తుంది.

గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ: సీఎం కేసీఆర్

గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ జరిపిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పోయిన సీజన్ లో 6,545 ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని యధావిధిగా ఈ సంవత్సరం కూడా ఆ కేంద్రాలన్నింటీ ద్వారా ధాన్య సేకరణ జరపాలని పౌర సరఫరాల శాఖాధికారులను సీఎం ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎంతమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదని సీఎం ప్రకటించారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ శాతం లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సీఎం సూచించారు. మధ్ధతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలుకు కావలసిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదన్నారు.

ఈ రోజు ప్రగతి భవన్ లో ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

More Press Releases