అటవీ నేరాల అదుపుకు రహస్య సమాచార నిధి ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Related image

  • మరింత సమర్ధంతంగా అటవీశాఖ పనితీరు, సిబ్బంది రేషనలైజేషన్
  • పచ్చదనం పెంపు, గ్రీన్ ఫండ్, అన్ని బ్లాకుల పునరుద్దీకరణ, అటవీ నేరాల అదుపు, ఆక్రమణల నివారణకు ప్రొటెక్షన్ కమీటీల ఏర్పాటు
  • అటవీశాఖ కార్యకలాపాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో (MCR HRD) ఒకరోజు వర్క్ షాప్
హైదరాబాద్: మరింత సమర్థవంతంగా అటవీ నేరాల అదుపుకు రహస్య సమాచార నిధి (Secret Service Fund) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం 4.06 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి కేసీఅర్ కేటాయించినట్లు తెలిపారు.

అడవుల రక్షణ కోసం ఆక్రమణ నివారణ, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ అరికట్టడంపై సమాచారం ఇచ్చేవారిని ప్రోత్సహించేందుకు అటవీ శాఖ ఈ నిధిని వాడనుంది. అటవీశాఖ కార్యకలాపాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో (MCR HRD) జరిగిన ఒకరోజు వర్క్ షాప్ లో దీనిపై చర్చించారు. ఫారెస్ట్ డివిజనల్ అధికారి (FDO) నేతృత్వంలో రెండు నుంచి మూడు లక్షలు, జిల్లా అటవీ అధికారి (DFO) కి 3 నుంచి 7 లక్షలు, చీఫ్ కన్జర్వేటర్ కి 5 నుంచి 13 లక్షలు, పీసీసీఎఫ్ 50 లక్షలు ఈ నిధి నుంచి రహస్య సమాచారం విలువ ఆధారంగా ప్రోత్సాహకాలు అందించేలా నిబంధనలు పెట్టారు.

పచ్చదనం పెంపు, పునరుద్ధరణకు సీఎం ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా అట‌వీ అధికారులు, సిబ్బంది బాధ్య‌త మ‌రింత పెరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలకు అనుగుణంగా అటవీ శాఖ అధికారులు ప‌ని చేస్తూ, అడ‌వుల‌ను రక్షించే బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలని మంత్రి తెలిపారు. ములుగు జిల్లాలో పులిని వేటాడిన ఘటన బాధాకరమని, భవిష్యత్ లో ఇలాంటివి జరగకూడదని అన్నారు.

పచ్చదనం పెంపు, గ్రీన్ ఫండ్, అటవీ పునరుద్దరణ, రక్షణ, ఆక్రమణల నివారణ, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ అరికట్టడం, అర్బన్ ఫారెస్ట్ పార్క్ ల వంద శాతం అభివృద్ధి పై వర్క్ షాప్ లో చర్చ జరిగింది. అధికారులు అందరూ ఐదు గ్రూపులుగా ఏర్పడి సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు.

అటవీ ఆక్రమణలను శాశ్వత నివారణ దిశగా సీఎం ఆలోచిస్తున్నారని, పోడు సమస్య పరిష్కారానికి చర్యలు మొదలయ్యాయని, తగిన రక్షణ చర్యలు, సిబ్బంది రేషనలైజేషన్ ద్వారా ఇది సాధ్యం అవుతుందని వర్క్ షాప్ లో పాల్గొన్న సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి అన్నారు. వివిధ అంశాలపై జిల్లా అధికారులు చెప్పిన సమస్యలు, పరిష్కార మార్గాలను ఆయన నోట్ చేసుకున్నారు. అటవీ శాఖ బలోపేతానికి సీఎం సుముఖంగా ఉన్నట్లు తెలిపారు.

ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని మరింత సమర్థవంతంగా పనిచేసి, అటవీ శాఖ అధికారులు ఫలితాలు చూపెట్టాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి కోరారు. అవసరమైతే మరింత మంది సిబ్బంది నియామకానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.

అటవీ శాఖకు సీఎం కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని, దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని ప్రాధాన్యత తెలంగాణలో ప్రభుత్వం ఇస్తోందని పీసీసీఎఫ్ ఆర్. శోభ తెలిపారు. సంబంధిత అన్ని శాఖలు, స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుని ఫలితాలు సాధించాలన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా దేశానికే ఆదర్శవంతంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తున్నామని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు.

అడవుల రక్షణతో పాటు, అర్బన్ ఫారెస్ట్ పార్కులకు కూడా సమీప గ్రామాలు, కాలనీ వాసులతో ప్రొటెక్షన్ కమిటీలను నియమించాలని నిర్ణయించారు. అటవీశాఖ విషయాలపై మంత్రితో పాటు, సీఎంవో ఉన్నతాధికారుల సమక్షంలో సుమారు పది గంటల పాటు మేధో మథనం జరిగింది. క్షేత్ర స్థాయిలో సమస్యలపై జిల్లాల అధికారులు చేసిన సూచనలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఈ వర్క్ షాప్ లో అన్ని అటవీ సర్కిళ్లకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, అన్ని జిల్లాలకు చెందిన అటవీ శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.

More Press Releases