థ్రిల్ సిటీ థీమ్ పార్క్ ను సందర్శించిన మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్

Related image

హైదరాబాద్: చారిత్రాత్మక నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ అన్ని రంగాలలో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం సాయంత్రం మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజు, చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఎండీ మనోహర్ లతో కలిసి పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్)లో ఇటీవల నూతనంగా ప్రారంభించిన థ్రిల్ సిటీ థీమ్ పార్క్ ను సందర్శించి సందడి చేశారు.

అధునాతన టెక్నాలజీతో నిర్మించిన మాన్ స్టర్ థియేటర్ లో త్రీడి చిత్రాన్ని వీక్షించారు. వివిధ రైడ్ లను పరిశీలించడమే కాకుండా క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగర ప్రతిష్టను మరింతగా పెంచే విధంగా థ్రిల్ సిటీ ని ఏర్పాటు చేసిన నిర్వహకులను అభినందించారు. ఈ థ్రిల్ సిటీ అన్ని వయసుల వారిని ఆహ్లాద పరిచేలా ఉందని తెలిపారు.

ఇలాంటి థీమ్ పార్క్ లు మరిన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సహకరిస్తామని చెప్పారు. పర్యాటక శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ విశ్వనగరం దిశగా అభివృద్ధిలోకి దూసుకుపోతున్న హైదరాబాద్ నగరంలో ఎంతో అద్భుతంగా థ్రిల్ సిటీని నిర్మించినట్లు చెప్పారు.

పిల్లలు, పెద్దలు అందరికి ఆహ్లాదాన్ని అందించే లా నిర్వహకులు ఏర్పాట్లు చేశారని అన్నారు. ఇలాంటి థీమ్ పార్క్ లను ప్రోత్సహించే లా పర్యాటక శాఖ కృషి చేస్తుందని తెలిపారు. వీరి వెంట థ్రిల్ సిటీ డైరెక్టర్ సిద్దంశెట్టి రజనీకాంత్ తదితరులు ఉన్నారు.

More Press Releases