మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే సమన్వయ కమిటీ ఏర్పాటు: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని మత్స్యకారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసమే సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCR HRD) లో మత్స్యకారుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, గంగపుత్ర జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ దీటి మల్లయ్య, ముదిరాజ్ సంఘం ప్రతినిధి చొప్పరి శంకర్ ఇతర సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మత్స్యకారుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గంగపుత్ర, ముదిరాజ్, తెనుగు, వాడ బలిజ తదితర కుటుంబాలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చొరవతో ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ప్రాజెక్ట్ ల నిర్మాణంతో పెద్ద ఎత్తున నీటి వనరులు అందుబాటులో కి వచ్చాయని, ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్య సంపద కూడా భారీగా పెరిగిందని వివరించారు. ఈ సంవత్సరం 93 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. పెరిగిన మత్స్య సంపదతో మత్స్యకారుల ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని చెప్పారు. మత్స్యకారులు కలిసికట్టుగా ఉండి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని కోరారు. ఎలాంటి అభ్యంతరాలు లేని చోట నూతన సొసైటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు చేపట్టడం జరుగుతుందని మంత్రి వివరించారు.

జిల్లాలలో క్షేత్రస్థాయిలో పర్యటించడం వలన మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, సొసైటీల ఏర్పాటులో ఉన్న అడ్డంకులు తదితర సమస్యల పై అవగాహన కలుగుతుందని, సామరస్య పూర్వక వాతావరణం నెలకొంటుందని అన్నారు. సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన సమన్వయ కమిటీ సభ్యులు కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో పర్యటించి అక్కడ గుర్తించిన, తెలుసుకున్న సమస్యల గురించి సమావేశంలో  వివరించారు. నిబంధనలను అనుగుణంగా ఉన్న సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చొరవ చూపాలని మంత్రి మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్య ను ఆదేశించారు.

మత్స్యకార వృత్తిపై ఆధారపడిన కుటుంబాలు అభివృద్ధి చెందాలనేది ప్రభుత్వ ఆలోచన అని, అందులో భాగంగానే సంపదను సృష్టించి అర్హులకు పంచుతున్నట్లు తెలిపారు. మత్స్యరంగ అభివృద్ధి కి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని చెప్పారు. మత్స్యకారులు ఐక్యత తో ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని, లేకుంటే మీ అనైక్యత ను అవకాశంగా చేసుకొని ఇతరులు లబ్దిపొందే ప్రమాదం ఉందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు. శ్రీశైలం, పులిచింతల, నాగార్జున సాగర్, సుంకేసుల తదితర అంతరాష్ట్ర నీటి ప్రాజెక్ట్ లలో చేపల వేట నిర్వహించే తెలంగాణ ప్రాంత అర్హులైన మత్స్యకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉందని చెప్పారు.

రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగినప్పటికీ  చేపలను మద్య దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోతున్నారని, వారికి మేలు చేసేలా త్వరలోనే మత్స్య ఫెడరేషన్ ద్వారా చేపలను నేరుగా మత్స్య సొసైటీల నుండి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మార్కెటింగ్ సొసైటీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయితీల పరిధిలో ఉన్న చెరువులను మత్స్యాశాఖ కు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం పట్ల సమావేశం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా మున్సిపాలిటీల పరిధిలో ఉన్న నీటి వనరులను కూడా మత్స్యశాఖ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు సమన్వయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన తమ కమిటీ జరిపిన జిల్లాల పర్యటన ఎంతో సంతృప్తి ఇచ్చిందని సమావేశంలో పేర్కొన్నారు.

రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. ఇప్పటి వరకు మనస్పర్ధల తో ఎంతో నష్టపోయామని, ఇక నుండి ఐక్యత తో ఉండి సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా మన భవిష్యత్ తరాలకు మేలు చేసిన వారం అవుతామని అన్నారు. వచ్చే నెల 11 వ తేదీన నిర్వహించే సమన్వయ కమిటీ సమావేశం నాటికి సభ్యులు నిర్మల్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలలో పర్యటించి నివేదికను సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు.

More Press Releases