ap7am logo

త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Wed, Sep 11, 2019, 03:39 PM
Related Image
  • త్యాగధనుల స్ఫూర్తితో అడవులను పరిరక్షిద్దాం

  • అట‌వీ అమరవీరుల సంస్మరణ సభలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

అటవీ సంపద పరిరక్షణలో ప్రాణాలర్పించిన అటవీ సిబ్బంది త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావ‌ర‌ణ‌, న్యాయ‌,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నెహ్రు జులాజికల్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ అమరవీరుల దినోత్సవాన్ని బుధ‌వారం ఘనంగా నిర్వహించారు. ఈ సభలో అటవీశాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. వన్య ప్రాణులు, అడవుల రక్షణలో అమరులైన వారికి మంత్రి ఈ సంద‌ర్బంగా నివాళులర్పించారు.

అనంతరం మంత్రి అల్లోల‌ మాట్లాడుతూ.. అటవీ సంపదైన వృక్షాలు, వన్యప్రాణులు ఎంతో విలువైన సంపదని పేర్కొన్నారు. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. రాజస్థాన్‌లో అడవులను రక్షించడంలో 360 మంది తమ ప్రాణాలను సైతం అర్పించారని, వారికి గుర్తుగా దేశంలో సెప్టెంబరు11న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకుంటున్నామ‌న్నారు. రాష్ట్రంలో 1984 నుంచి ఇప్పటివరకు 21 మంది అటవీ సిబ్బంది దుండగుల చేతిలో వీరమరణం పొందారని అన్నారు.

అటవీ సంరక్షణకు తెలంగాణ ప్ర‌భుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యత ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని వెల్లడించారు. హ‌రితహారం కార్యక్రమం ద్వారా 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 174 కోట్ల మొక్కలు నాటామని చెప్పారు. రాష్ట్రంలో 24 శాతం ఉన్న అడ‌వుల‌ను 33 శాతం పెంచాల‌నే ల‌క్ష్యంతో ప‌ని చేస్తున్నామ‌న్నారు.

నూత‌న పంచాయ‌తీ, మున్సిప‌ల్ చ‌ట్టాల ద్వారా నాటిన మొక్క‌ల‌ను సంర‌క్షించుకునేందుకు క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు పొందుప‌రిచామ‌ని వివ‌రించారు. నాటిన మొక్క‌ల్లో 85 శాతం మొక్క‌ల‌ను ఖ‌చ్చితంగా సంర‌క్షించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. అటవీశాఖను బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున ఉద్యోగుల‌ను నియ‌మించామ‌ని తెలిపారు. అంతేకాకుండా అధికారుల‌కు, సిబ్బందికి అవ‌స‌ర‌మైన వాహ‌నాల‌ను, ఇత‌ర సౌక‌ర్యాల‌ను స‌మ‌కూర్చ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రకృతి ప్రసాదించిన‌ వన సంపదను రేపటి మన భవిష్యత్తు, భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మన రాష్ట్ర అటవీ సంపదను సంరక్షించడానికి ఎంతో మంది అటవీశాఖ అధికారులు, సిబ్బంది ధైర్య సాహాసాలు ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగనిరతికి గుర్తుగా అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం అభినందనీయమన్నారు.

ఈ సంద‌ర్బంగా  పీసీసీఎఫ్ ఆర్.శోభ మాట్లాడుతూ.. అడవుల ప‌రిర‌క్ష‌ణ‌కు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నార‌న్నారు. జంగల్ బచావో... జంగల్ బడావో' నినాదంతో అడవుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆదేశించిన నేప‌థ్యంలో అట‌వీశాఖ అధికారులు కృత‌నిశ్చ‌యంతో ప‌ని చేయాల‌న్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారులు, సిబ్బంది సేవలను ఈ సంద‌ర్బంగా ఆమె కొనియాడారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్ ఆర్. శోభ‌, పీసీసీఎఫ్ లు పృథ్వీరాజ్, ర‌ఘువీర్, మునీంద్ర‌, అడిష‌నల్ పీసీసీఎఫ్ లు లోకేష్ జైస్వాల్, డోబ్రియ‌ల్, స్వ‌ర్గం శ్రీనివాస్, పర్గెయిన్,తదిత‌రులు పాల్గొన్నారు. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)