అంచనాలకు మించి దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం: తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్

Related image

  • అదనంగా రూపాయలు వేయి కోట్లు, రెండు కోట్ల గన్నీ సంచులు అవసరం
  • జామ్ ఆప్ ద్వారా బోర్డు సమావేశం, వేయి కోట్ల రూపాయలకు ఆమోదం
  • తక్షణ చర్యలపై సమీక్షించిన పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: యాసంగిలో అంచనాలకు మించి ధాన్యం దిగుబడి అవుతుండడంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు కొనుగోళ్లకు నిధులు, గన్నీ సంచుల సమస్యలు ఎదురుకాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనుకున్నదాని కంటే దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యాన్ని అదనంగా కొనుగోలు చేయాల్సి వస్తోందని, ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి బుధవారంనాడు జూమ్ ఆప్ ద్వారా అత్యవసర బోర్డు సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ తో పాటు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. బ్యాంకుల ద్వారా వేయి కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు బోర్డు అమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంచనాలకు మించి ధాన్యం వచ్చిన కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఏ ఏ జిల్లాల్లో ఎన్ని కొత్తవి, ఎన్ని పాత గన్ని సంచులు ఉన్నాయి. తక్షణం ఏ ఏ జిల్లాలకు ఎంత అవసరం, ఎన్ని కొనుగోలు కేంద్రాలను మూసివేశారు వంటి అంశాలపై బోర్డు సమావేశం అనంతరం ఛైర్మన్‌ అధికారులతో సమీక్షించారు.

80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరా సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాల నుంచి తాజాగా తెప్పించిన నివేధికల ప్రకారం ఇంకా 10 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. అదనంగా వచ్చే ధాన్యం కొనుగోలుకు వేయి కోట్లు రూపాయలు, అలాగే 2 కోట్ల గన్నీ సంచులు అవసరం అవుతుందన్నారు. వేయి కోట్లకు తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులతో తక్షణం ఒప్పందాలు చేసుకోవాలని అధికారులకు సూచించారు. రెండు కోట్ల గన్నీ సంచులను అవసరమైన జిల్లాలకు డిమాండ్ కు అనుగుణంగా కేటాయింపులు జరపాలని, దీనిపై ప్రతిరోజు మానిటరింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎక్కడ కూడా గన్నీ సంచుల కోరత లేకుండా కొనుగోళ్లు పూర్తైన జిల్లాల నుండి అవసరమైన జిల్లాలకు వెంటనే తరలించాలని, ఈ విషయంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నారాయణ పేట, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, మాహబూబ్ నగర్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి జిల్లాల్లో ముందస్తు అంచనాల కంటే ఎక్కువగా ధాన్యం దిగుబడి అవుతుందని, తక్షణం ఆయా జిల్లాలకు అవసరమైన గన్నీ సంచులను కేటాయించాలని, సీనియర్ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ తో పాటు కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు.

More Press Releases