దేశంలోనే తెలంగాణ అన్నింటా అగ్రగామిగా నిలిచింది: హోంమంత్రి

Related image

సంగారెడ్డి: దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆవరణలో బుధవారం నాడు నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాలలో అద్భుత ప్రగతితో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలం అయిందన్నారు. రైతులకు సాగునీరు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ సంతోషంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ వచ్చినప్పుడు లోటు విద్యుత్తుతో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం విద్యుత్తు సర్ ప్లస్ లో ఉందన్నారు. లా అండ్ ఆర్డర్ లో తెలంగాణ పోలీస్ దేశంలో నెంబర్ వన్ గా ఉందన్నారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉందని, రికవరీ రేటు ఎక్కువగా ఉందని తెలిపారు.

పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలను ఏర్పాటు చేయడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పరుగులిడుతుందన్నారు. ప్రజల సంక్షేమానికి సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని మంత్రి అన్నారు.

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. అంతకుముందు పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ సేవలందించిన పోలీస్ శాఖ అధికారులు నలుగురికి సేవా పథకాలను అందించారు.

ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో మంత్రితో పాటు ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి,అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, డి సి ఎం ఎస్ చైర్మన్ శివ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ శాసనసభ్యుడు చింతా ప్రభాకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

More Press Releases