కరోనా మహమ్మారి బారిన పడిన వారికి మెరుగైన వైద్య సేవలు: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: కరోనా మహమ్మారి బారిన పడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీలు నిమ్స్, ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్స్ ను సందర్శించారు.

మొదటగా నిమ్స్ ఆసుపత్రిలోని ట్రామా బిల్డింగ్ లోని కోవిడ్ సెంటర్ లో కరోనా వైద్యసేవలు పొందుతున్న వారిని పరామర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. ప్రతిరోజూ ఇక్కడికి వచ్చే కరోనా బాధితులకు ఆక్సిజన్, వెంటిలేటర్ సదుపాయం తదితర సౌకర్యాలపై వాకబు చేశారు. దాదాపు 250 మందికి వైద్యసేవలు అందిస్తున్నట్లు, అవసరమైన మేరకు బెడ్స్ ను పెంచుకునే సామర్ధ్యం ఉందని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ మంత్రులకు వివరించారు.

కేవలం కోవిడ్ సేవలే కాకుండా ఇతర వైద్యసేవలు కూడా అందిస్తున్నందున ఉన్న సిబ్బందితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. అనంతరం ఎర్రగడ్డ లోని చెస్ట్ హాస్పిటల్ ను సందర్శించారు. ఆయా హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న 17 మంది కరోనా చికిత్స పొందుతున్న వారి వద్దకు మంత్రులు వెళ్ళి చికిత్స అందుతున్న తీరు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రోగులు అందరికి మెరుగైన చికిత్స అందేలా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో అందుతున్న వైద్యసేవల గురించి సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన ఆదేశాలు, సూచనలు చేస్తున్నారని మంత్రులు ఈ సందర్భంగా వివరించారు.

హైదరాబాదు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అవసరమైన మేరకు మందులను, వెంటిలేటర్లు, ఆక్సిజన్ లను సమకూర్చి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవల పట్ల బాధితులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి నిరంతరం సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని మంత్రులు ఈ సందర్భంగా ప్రశంసించారు.

ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ లో CT స్కాన్, అల్ట్రా సౌండ్ పరికరాలు అవసరం ఎంతో ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్ మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే వాటి ఏర్పాటుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. అవసరమైన ప్రతిపాదనలు వెంటనే అందజేయాలని అక్కడే ఉన్న TSMIDC CE రాజేంద్ర కుమార్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు మాట్లాడుతూ కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సత్ఫలితాలు వస్తున్నాయని, కేసుల సంఖ్యా చాలా తగ్గిందని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కరోనా భారిన పడిన వారికి అవసరమైన మందులు, చికిత్సల విషయంలో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. హాస్పిటల్స్ లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలను చేపడుతున్నట్లు చెప్పారు. నిమ్స్ హాస్పిటల్ లో 1060 మంది కోవిడ్ చికిత్సకోసం చేరగా, ప్రస్తుతం 127 మంది చికిత్స పొందుతున్నారని, మిగిలిన వారు కోలుకొని డిశ్చార్జి అయినారని వైద్యులు మంత్రులకు వివరించారు.

అదేవిధంగా  చెస్ట్ హాస్పిటల్ లో 1375 మంది కరోనా చికిత్స కోసం చేరగా, 1000 మందికి పైగా కోలుకొని డిశ్చార్జి అయినట్లు అక్కడి వైద్యులు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవల పట్ల బాధితులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నగరంలో 94 కేంద్రాల ద్వారా 9.10 లక్షల మందికి వ్యాక్సిన్ లు వేయడం జరిగిందని తెలిపారు. ఇందులో మొదటి డోస్ గా 5.91 లక్షల మందికి వేసినట్లు వివరించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేటి నుండి రెండో డోస్ పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోస్ ను జూలై 11 వ తేదీ నుండి ప్రారంభించడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం నూతనంగా సవరించిన ఆదేశాల ప్రకారం 12 వారాల తర్వాత మాత్రమే రెండో డోస్ వేసేలా ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేస్తూ ఈ వ్యాక్సిన్ పొందే ప్రజలు జూలై 11 వరకు వ్యాక్సిన్ కేంద్రాలకు రావద్దని, ఖచ్చితంగా 12 వారాలు దాటిన తర్వాత మాత్రమే రావాలని, సిబ్బందికి సహకరించాలని కోరారు.

కరోనా నియంత్రణ చర్యలలో భాగంగానే ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేస్తుందని, ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుండి బయటకు రావద్దని కోరారు. తప్పని సరిగా మాస్క్ లు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. లాక్ డౌన్ కారణంగా ఆహారం కోసం వివిధ వర్గాల ప్రజలు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 250 అన్నపూర్ణ బోజన కేంద్రాల ద్వారా ప్రతిరోజూ 40 వేల మందికి ఉచితంగా బోజనాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.

నగరంలో మొదటి విడతలో సుమారు 19 లక్షల ఇండ్ల లో ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగిందని, రెండో విడత ఫీవర్ సర్వేను రెండు రోజుల క్రితం ప్రారంభించడం జరిగిందని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు చెప్పారు. మంత్రుల వెంట జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జోనల్ కమిషనర్ ప్రావిణ్య, రవికిరణ్, హైదరాబాదు జిల్లా వైద్యాధికారి వెంకట్, నిమ్స్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, డ్రగ్స్ జాయింట్ డైరెక్టర్ రాం ధన్ తదితరులు ఉన్నారు.

More Press Releases