పర్యాటక, చారిత్రక నేపథ్యం గల ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించండి: అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశం

Related image

హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో పర్యాటక, హెరిటేజ్ తెలంగాణ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక, చారిత్రక నేపథ్యం గల ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న అలంపూర్ లోని ప్రముఖ శక్తి పీఠం శ్రీ జోగులంబా అమ్మవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి సుమారు 37 కోట్ల రూపాయలను కేటాయించినందుకు అలంపూర్ శాసన సభ్యుడు డా.అబ్రహం మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎం కేసీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

మొదటి దశలో సుమారు 20 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన పనులను ప్రారంభించాలని మంత్రి ని కోరారు. ఆలంపూర్ శాసన సభ్యుుడు డా.అబ్రహం ఆహ్వానం మేరకు మే నెల మొదటి వారంలో పనులను ప్రారంభిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి టూరిజం అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అలంపూర్ శాసన సభ్యుడు డా.అబ్రహం, షాద్ నగర్ శాసన సభ్యుడు అంజయ్య యాదవ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి KS శ్రీనివాస రాజు, టూరిజం MD మనోహర్, ED శంకర్ రెడ్డి, హెరిటేజ్ తెలంగాణ అధికారులు నారాయణ, బుద్ధవనం అధికారులు, టూరిజం అధికారులు పాల్గొన్నారు.

More Press Releases