జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కేటీఆర్

Related image

వరంగల్: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు.

సోమవారంనాడు వరంగల్ తూర్పులో గల దేశాయిపేటలో జర్నలిస్టుల కాలనీ భూమి పూజ చేసిన అనంతరం శిలాఫలకంను మంత్రులు ఎర్రబల్లి దయాకర్, సత్యవతి రాధోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కె.తారక రామారావు మాట్లాడుతూ, వరంగల్ తూర్పు జర్నలిస్టులకు దేశాయిపేటలో 2 బి.హెచ్.కె. ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన భూమి పూజలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశయంలో భాగంగా ప్రతి పేద, బడుగు బలహీనవర్గాలకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ లు అందించాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అందులో రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టుకు సొంతింటి కలను త్వరలోనే నెరవేర్చుతామని మంత్రి తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఓవైపు జర్నలిస్టుల సంక్షేమం, మరోవైపు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా జర్నలిస్టులకు సొంతింటి కల నెరవేర్చడానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే నరేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల కాలనీలో దాదాపు రెండు వందల మంది జర్నలిస్టులకు 10 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో డబుల్ బెడ్ రూంల ఇళ్ళను ప్రభుత్వం పారదర్శకంగా నిర్మిస్తుందని అన్నారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా జర్నలిస్టుల పక్షాన నిలబడి జర్నలిస్టులకు అండగా ఉంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్, టియూడబ్ల్యూజె ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, ప్రెస్ క్లబ్, తూర్పు జర్నలిస్టు పరపతి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

More Press Releases