పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల కాల్చివేత నిర్ణయాన్ని స్వాగతించిన షూటర్లు

  • అటవీ శాఖ అధికారులను కలిసి స్వచ్ఛందంగా పనిచేసేందుకు సుముఖత వ్యక్తం
హైదరాబాద్: రైతుల పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను కాల్చివేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని లైసెన్స్ డ్ షూటర్ల బృందం స్వాగతించింది. ఎలాంటి రుసుము తీసుకోకుండా ఈ కార్యక్రమంలో పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కాల్చివేతకు అనుమతి ఉన్న 30 మంది షూటర్ల ఎంపానెల్ జాబితాను అటవీ శాఖ ఇప్పటికే వ్యవసాయ, హార్టీకల్చర్, పంచాయితీ రాజ్ శాఖలకు పంపింది.

వీరిలో కొంతమంది ఇవాళ అరణ్య భవన్ లో ఉన్నతాధికారులను కలిశారు. రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతున్న అడవి పందుల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని, అటవీ శాఖ ఆదేశాల మేరకు తాము పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలుపుతూ పీసీసీఎఫ్ ఆర్.శోభకు లేఖను అందజేశారు. సాధ్యమైనంత వరకు గ్రామ పంచాయితీల నుంచి అనుమతి వచ్చిన 48 గంటల్లోగా పని చేస్తామని హామీ ఇచ్చారు.

కొద్ది మంది షూటర్లు పందుల కాల్చివేతకు రుసుము డిమాండ్ చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చిందని, మేము అందులో భాగం కాదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా సొంత ఖర్చుతో, స్వచ్చందంగా కాల్చివేతలో పాల్గొంటామని తెలిపారు.

More Press Releases